ఆమె కథ...
ఆమె కథ...
ఈ కథకి ఒక ప్రత్యేకత ఉంది...
ఇది ముగింపు లేని కథ... ముంగించలేని కథ.
...జాను..., పుట్టింది అచ్చ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో. ఈ ఆధునిక యుగంలో కూడా అమ్మాయిలు ఇలానే ఉండాలి అనే రాజ్యాంగం ఉన్న ఇల్లు అది. చిన్నప్పటి నుంచి అన్ని పనుల్లో ప్రావిన్యురాలిని చేస్తూ పెంచారు. ఒక్కమాటలో చెప్పాలి అంటే జాను అన్నింటిలో నంబర్ 1.
అమ్మ నాన్నలకి, పెద్దలకి ఎదురు చెప్పి ఎరుగదు. చదువులో సరస్వతి, వంటల్లో అన్నపూర్ణ, గుణంలో పార్వతి, నడవడికలో మహాలక్ష్మి. జాను తెలివితేటలకి మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. బంగారం లాంటి భర్త, అన్యోన్య దాంపత్యం, చక్కని పిల్లలు.
'అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనేదానికి... చక్కని ఉదాహరణ జాను. తన మంచి గుణానికి దేవుడు ఇచ్చిన బహుమతి ఈ జీవితం', అని జాను వాళ్ళ అమ్మ నాన్న, బంధువుల సంతోషం.
అంతా బావుంది కదూ!!
ఇదే కథ...జాను చెప్తే...
జాను కి చిన్నప్పటి నుంచి అమ్మ అంటే చాలా ఇష్టం. అమ్మ ఒక మంచి డాన్సర్. ఎవరూ లేనపుడు, జానుకి డాన్స్ నేర్పిస్తూ ఉండేది. అమ్మ ని చూస్తూ పెరగడం వల్లకావచ్చు, జానుకీ డాన్స్ అంటే చాలా ఇష్టం. పెద్ద డాన్సర్ అవ్వాలి అనేది జాను కల. ఆ కల, కలగానే మిగిలిపోయింది.
ఇంజనీర్ అవ్వాలి అని కష్టపడి చదివి, ఫస్టు క్లాస్ లో పాస్ అయ్యింది. గవర్నమెంట్ జాబ్ చేయాలి అనే నాన్న మాటతో, ఆ ఉద్యోగం తెచ్చుకుంది. అదైనా ఒక సంవత్సరం చేయక ముందే, పెళ్లి చేశారు.
తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి అని, ప్రతీ అమ్మాయి లాగే జాను కూడా చాలా కలలు కనింది. కానీ తనకి తెలియకుండానే, వాళ్ళ బావతో పెళ్లి కుదిర్చారు వాళ్ళ నాన్న. బావ మీద, జాను కి ఎలాంటి అభిప్రాయము లేదు. నాన్న మాట కోసం తల వంచి తాలి కట్టించుకుంది. వాళ్ళ బావ కి వేరే అమ్మాయి అంటే ఇష్టం, పెద్దవాళ్ళకి భయపడి పెళ్లి చేసుకున్నాడు.
ఒక ఒప్పందంతో మొదలైన వాళ్ళ కాపురం భాద్యతగా మారింది. సర్దుకుపోయిన
ప్రతీ విషయాన్ని ఆనందంగా మార్చుకుంటూ, అందరినీ ఆనందంగా ఉంచడం జాను గొప్పతనం...అదే ఆడతనం.
ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటే, తనకంటూ ప్రత్యేక గుర్తింపు కానీ, ఆత్మ సంతృప్తి కానీ లేవు జాను జీవితంలో.
తన భాధ ఇది అని కూడా ఎవ్వరికి తెలీదు. తన చిరునవ్వు వెనుక ఉన్న కన్నీరు, తన కన్నులకి మాత్రమే తెలుసు.
తమ కన్నీటిని, పన్నిటిగా మార్చి తమ వారిని సంతోషపు చిరు జల్లులలో తడుపుతున్న ప్రతీ ఒక్క స్త్రీ హృదయానికి అభినందనలు.
