SAI MANOGNA

Inspirational

4.8  

SAI MANOGNA

Inspirational

అమ్మ

అమ్మ

3 mins
827


"వ్యాసరచన పోటీలకు ఆఖరు తేదీ 31, పేర్లు నమోదు చేసిన విద్యార్థులంతా ఆలోపు గా రాసి నాకు ఇవ్వండి. ప్రధమ బహుమతికి ఎంపికైన వ్యాసాన్ని ఈ సంవత్సరం ప్రచురించే మన స్కూల్ వార్షిక సంచికలో ముద్రిస్తారు. గుర్తుంచుకోండి! వ్యాసాన్ని ఎక్కడా కాపీ కొట్టకుండా మీ సొంతంగా రాయాలి." అని చెప్పిన టీచర్ మాటలకు కృష్ణ ఆలోచనలో పడింది.


 మొదటినుంచి కృష్ణకు రచనల పైన ఆసక్తి, కానీ వాటిని ఎలా రాయాలో కథ-కారణం తెలిసే వయస్సు, అనుభవం ఇంకా రాలేదు.


కృష్ణ కి అమ్మ అంటే చాలా ఇష్టం. ఒక మంచి వ్యాసం రాసి తన ఫోటో మరియు వాళ్ళ అమ్మ ఫోటో స్కూల్ వార్షిక సంచికలో చూడాలన్నదే తన కోరిక. ఎలాగైనా రెండు రోజుల్లో పూర్తి చేయాలి! అని హోం వర్క్ ప్రక్కనపెట్టి మరి ట్యూషన్ లో కూర్చుని ఆలోచిస్తుంది. ఏదో ఆలోచన వచ్చింది కాబోలు గబగబా నాలుగు వాక్యాలు రాసి ప్రధమ బహుమతి గెలిచినంత ఆనందంగా పుస్తకం, బ్యాగ్ లో పెట్టి ఇంటికి వచ్చింది. వచ్చి రావటమే అమ్మకు పుస్తకం తెరిచి కవితను చూపించింది. 


'అ' అంటే అమృతం.

'మ' అంటే మమకారం.

అమృతాన్ని చిలికే మమకారమే 'అమ్మ'.


తన స్నేహితుల ద్వారా విన్న కవితే అయినా, దీనితో తన వ్యాసాన్ని ప్రారంభించాలి అనుకుంది. రోజూ నిద్ర పోయేటప్పుడు కథలు వినడం అలవాటు ఉన్న కృష్ణ, అమ్మ కథ చెప్తూ ఉంటే "అమ్మా! వ్యాసాన్ని రాయడానికి నువ్వే సహాయం చేయాలి. 'అమ్మ' మీద ఏదైనా కథలు ఉంటే చెప్పమ్మా" అంటూ తన రెండు చేతులతో అమ్మను గట్టిగా పట్టుకుని అడిగింది.


"వ్యాసరచన పోటీ అంటే నువ్వే సొంతంగా ఆలోచించి నీ మనసులో వచ్చిన ఆలోచనలే రాయాలి కృష్ణ! ఒక పని చేయి... నువ్వు నా గురించి రాయి! నేను ఎలా ఉంటాను? నీకు ఏ ఏ పనులు చేస్తాను? నీకు చెప్పే మంచి విషయాలు, కథలు, మన సంతోషాలు, అన్ని...అన్ని... కలిపి రాయడం మొదలు పెట్టు. మొదలు-ముగింపు నీకే తెలుస్తాయి." 


అమ్మ చెప్పింది వింటూనే నిద్రలోకి జారుకుంది కృష్ణ. తన కూతురికి తనమీద ఉన్న ప్రేమకి ఆనందపడి తన బిడ్డ కోరిక నెరవేరాలని అని కృష్ణ కి ముద్దు పెట్టి తనూ పడుకుంది.


అమ్మ చెప్పినట్టుగానే రాయడం మొదలు పెట్టింది కృష్ణ. మొదటి సారే అయినా అక్షరాలు అందంగా ఒకదానితో ఒకటి జత కట్టాయి. అమ్మ చెప్పిన అంశాలు అన్నీ వివరించడానికి పాఠశాల నిబంధనలు అడ్డుగా అయ్యాయి. కేవలం ఒక పేజీ మాత్రమే రాయాలి అనే నిబంధన.


చిన్నచిన్న అక్షరాలని పదాలుగా కూర్చి, వాక్యాలని కుదించింది కృష్ణ. అమ్మ ప్రేమ ను అమృతంతో పోల్చి మమకారాన్ని కురిపించిన తన వ్యాసాన్నే ప్రథమ బహుమతికి ఎంపిక చేశారు పాఠశాల యాజమాన్యం. తన ఫోటో మరియు వాళ్ళ అమ్మ ఫోటో ఉన్న వార్షిక సంచికను అందుకున్న కృష్ణ కి మనసు నిండే ఆనందం కలగలేదు. తన వ్యాసం అసంపూర్ణంగా అనిపించింది. అమ్మ గురించి ఒక్క పేజీలోనే రాయడం నచ్చలేదు కృష్ణకి. అందుకే ఎప్పటికైనా ఆ వ్యాసాన్ని పూర్తి చేసి, అమ్మకి బహూకరించాలి అని గట్టి పట్టుదలతో తన ఆసక్తిని వ్యక్తం చేసింది.


ఎప్పటికప్పుడు అమ్మ చూపిస్తున్న ప్రేమను నేర్పుతున్న పాఠాలను రచనగా మారుస్తూ వస్తుంది. రాసిన ప్రతి సారి పరిపూర్ణతా భావం కలగలేదు‌ తనకి.

కాలం వేగంగా సంవత్సరాల్లో నుంచి దశాబ్దాల్లో కి మారింది...

. . .


ఒక్కసారిగా కృష్ణ కి 'కేర్'...'కేర్'... అని ఏడుస్తున్న బిడ్డ గొంతు వినిపించింది. వెంటనే తన ఆలోచనల నుండి వర్తమానం లోకి వచ్చిన కృష్ణ, తన మూడు నెలల పసిపాపని ఎత్తుకొని గుండెలకు‌ హత్తుకుంది. చనుబాలు త్రాగించి ఆకలి తీర్చింది. చిరునవ్వులు చిందిస్తున్న బిడ్డను చూసి ఎంతగానో మురిసిపోయింది. తన ఒళ్లో మెదులుతూ ఆకలికి తపించిన బిడ్డ ను చూసిన కృష్ణకి మాతృత్వపు మాధుర్యం అనుభవంలోకి వచ్చింది. తానూ 'అమ్మ' అయిన తరువాత కానీ 'అమ్మ ప్రేమ'ను అనుభవించ లేకపోయింది.


 "అమ్మ గురించి వ్రాయడానికి కావలసింది కథ కాదు కృష్ణ! ప్రేమను పంచే మనసు." అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. 


చాలా రోజుల తరువాత తన చిన్ననాటి పుస్తకం తెరిచి, రాస్తున్న అక్షరాలు ఇవి... 


"జీవితంలో ఎక్కే ప్రతి మెట్టుకు లభించే మొదటి ప్రోత్సాహం అమ్మ. చెప్పే మాటలు, కథలు చిన్నవే అయినా జీవితంలోని ప్రతి అంశంలో అవి పలకరిస్తూనే ఉంటాయి. మంచి-చెడులు నేర్పిస్తూనే ఉంటాయి. అమ్మ ప్రేమకు కొలమానం ఉండదు అందుకేనేమో ఆకాశంతో పోలుస్తారు. అమ్మ పనులకు అసహనం ఉండదు అందుకేనేమో భూమితో పోలుస్తారు. అమ్మ మనసుకు కల్మషం ఉండదు అందుకేనేమో అమృతంతో పోలుస్తారు. అమ్మ అనే భావనకు మరియు అమ్మ ప్రేమకు రెండింటికి ముగింపు ఉండదు. అలాంటిది అమ్మ గురించి వ్రాసే వ్యాసానికి ముగింపు ఎలా ఉంటుంది? 'అమ్మ' అనే రెండు అక్షరాల గురించి వ్రాయడానికి కవితలు, కాగితాలే కాదు! అనుభవం, జీవితం కూడా సరిపోదు. అమ్మ‌ను తిరిగి ప్రేమించటం, పూజించటం తప్ప ఇంకా ఏమి చేసినా తక్కువే." 


ప్రేమతో...

కృష్ణ.


Rate this content
Log in

Similar telugu story from Inspirational