STORYMIRROR

BOMMAKANTI SAI MANOGNA

Classics Others

4  

BOMMAKANTI SAI MANOGNA

Classics Others

జ్ఞాపకాలు

జ్ఞాపకాలు

2 mins
7

మనస్సు..!

సముద్రంలా అన్నింటినీ తనలోనే దాచేసుకున్నా, జ్ఞాపకాలు అనే అలలు ఎగసిపడి.. కన్నీటితో తడుపుతూనే ఉంటాయి. ఈ ఇరవై ఏడేళ్ల జీవితంలో ఎప్పుడూ ఇలా అనిపించలేదు. వాడి పేరు అజయ్, నా అన్నయ్య. పేరుకి అన్నయ్యే కాని ఏ రోజు మేము అన్నా చెల్లెళ్ళా ఉండే వాళ్ళం కాదు. టామ్ అండ్ జెర్రీ సీరీస్ కి అడ్వాన్స్ వెర్షన్ ఏ మేమిద్దరం. అమ్మాయిలు తిరిగి చెడిపోతారు, అబ్బాయిలు తిరగక చెడిపోతారు అనే సామెతని నమ్మేంత అమాయకత్వం అమ్మది. అమ్మాయైనా అబ్బాయైనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్లు ఉన్నతంగా బ్రతకాలి అనే సిద్ధాంతం నాన్నది. ఇదే చేయాలి…అని మమ్మల్ని అమ్మ నాన్న ఎప్పుడూ బలవంతం చేయలేదు. ప్రతి పనిలో విలువలతో పాటు వ్యక్తిత్వాన్ని కూడా నేర్పించారు.


అసలు సమస్య అంతా ఎప్పుడూ అన్నయ్య తోనే, నేనేం చేయాలి, ఎలా చేయాలి అని ఎప్పుడూ చెప్తునే ఉంటాడు. అక్కడికి వెళ్ళద్దు ఇక్కడికి వెళ్ళద్దు అని గొడవ పడుతూనే ఉంటాడు. వాళ్ళ స్నేహితులతో పార్టీలకి తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తాడు, కానీ నన్ను మాత్రం వెళ్లనివ్వడు.


సినిమాల్లో చూపించేంత అందంగా, నిజ జీవితంలో అన్న-చెల్లెళ్ల బంధం ఉండదు. నా జీవితంలో వాడే నాకు పెద్ద శత్రువు. నాకు అన్నయ్య కాకుండా, అక్క ఉండి ఉంటే చాలా బావుండేది ఏమో! ఇద్దరం కలిసి తిరిగే వాళ్ళం ఏమో! అమ్మ చెప్పే పనులన్ని ఒక్క దాన్నే కాకుండా, ఇద్దరం చేసేవాళ్ళం ఏమో! ఛ...!! అనవసరంగా అన్నయ్య ఉన్నాడు...


రేపటికి నాకు పెళ్లయ్యి సరిగ్గా సంవత్సరం. ఇంకా నా కళ్ళ ముందే తిరుగుతున్నట్టు ఉంది నా పెళ్లి హడావిడి అంతా ! నాన్న తెచ్చిన మొదటి సంబంధం ఇది. అబ్బాయి ప్రభుత్వ ఉద్యోగి, చాలా ఆస్తి పాస్తులు, ఒక్కడే అబ్బాయి... మంచివాడు. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా అమ్మా నాన్న ఈ సంబంధం ఒప్పుకున్నారు. నాకు నచ్చనిదే ఒక చిన్న డ్రెస్ కూడా కొనివ్వని నాన్న, ఈ విషయంలో నా ఇష్టాన్ని కూడా చెప్పనివ్వలేదు. నా అంగీకారంతో అవసరమే లేకుండాపోయింది. ఇన్ని రోజులు కన్న కలలు అన్ని ఏమయ్యాయో తెలీలేదు. ఒక్కసారిగా, అంతా మారిపోయినట్టుగా అనిపించింది. నా ఇంట్లో నేనే పరాయి అమ్మాయిని ఐపోయానా అనిపించింది.

 

అప్పుడు వచ్చాడు అన్నయ్య! నా చెయ్యి పట్టుకొని నాకు తోడుగా…నా వైపు నిల్చున్నాడు. నాన్నతో గొడవ పడి మరీ, అబ్బాయి వాళ్ళతో మాట్లాడి చదువు అయ్యాకే పెళ్ళి అని ఒప్పించాడు. మొదటిసారి నా కోసం నాన్న మాటని కాదన్నాడు. నన్ను ఏడిపించి, నేను ఏడుస్తుంటే నవ్వే అన్నయ్యే తెలుసు అప్పటి దాక.! కొత్తగా నాకే తెలియని నా బలంగా ఎప్పుడు మారిపోయాడో తెలీలేదు. అవును! నా బలం, బలగం రెండూ నాకు అన్నయ్యే.


పక్క ఇంటికి పంపించడానికీ పది ప్రశ్నలు అడిగి ఒప్పుకోకపోతే, ఇంట్లోనే ఉంచుతున్నాడు అని తిట్టుకున్నా! నేను లేకపోతే వాడికి ఏమీ తోచదు అని ఆలసంగా తెలుసుకున్నా. వాడి కళ్ళల్లో మొదటి సారి కన్నీళ్లు చూసింది నా పెళ్లి లోనే.! 


ఇంటి పేరు మారిపోతుంది అని నేను మారిపోయానా? లేక ఇళ్లే వదిలి వెళ్తున్నా అని వాడు మారిపోయాడా ? మార్పు మంచిదే అంటారు. కాని ఇప్పుడు వచ్చిన మార్పు నాలోనా? వాడిలోనా? 


ఆడపిల్లకి పెళ్ళికి ముందు నాన్న, పెళైయ్యాక భర్త తోడుగా ఉంటారు… అంటారు, కానీ నిజo ఏమిటంటే అమ్మాయి ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నేనున్నానంటు తోడుగ నిలిచే మరొక ముఖ్యమైన వ్యక్తి అన్నయ్య.! చెల్లెలి కష్ట సుఖాల్లో నేనున్నా అంటూ చివరి వరకూ ఉండే దైర్యమే అన్నయ్య.  


ప్రతి అమ్మాయి చెప్పే విషయం…తన హీరో తన నాన్న అని. కానీ నా జీవితంలో ఇప్పటికి ఎప్పుటికి నా హీరో… నా అన్నయ్యే! 


Love.. you.. అన్నయ్యా! I miss you always !



Rate this content
Log in

Similar telugu story from Classics