స్వాతి సూర్యదేవర

Drama Tragedy Inspirational

5.0  

స్వాతి సూర్యదేవర

Drama Tragedy Inspirational

ఏమని చెప్పాలో...!

ఏమని చెప్పాలో...!

4 mins
581


"ఆమె కన్నీళ్లు దుఃఖాన్ని చెప్పలేకపోతున్నాయి" తన చుట్టూ ఉన్న... తన వాళ్ళంతా అవి నవ్వితే వచ్చే కన్నీళ్ళు అని భ్రమపడితున్నారు .పైగా ఇంకా సంతోషపడుతున్నారు పాపం.కానీ తానొక్కద్దానికే తెలుసు! అవి మనసులో భాధ ముల్లులా గుచ్చుతుంటే వచ్చే కన్నీళ్ళని.

   హిమజ! ఇరవైనాలుగేళ్ల యువతి! మధ్యతరగతి కుటుంబాల గురించి చెప్పేదేముంది.చదువు ఓ కొలిక్కి రాగానే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి భారం ధింపుకుందామా అని చూస్తారు తల్లిదండ్రులు.

అలా! తనకి ఉన్న ఎన్నో కోరికలు,ఆశలు కాలరాస్తు పెళ్లి చేసి అత్తవారింటికి పంపారు హిమజ తల్లిదండ్రులు. భర్త పేరు దినేష్ ! హైదరాబాద్ లో ఉద్యోగం.సంపాదన కూడా బాగానే వుంది.పైగా వేరు కాపురం కూడాను.

       కొన్నాళ్లు కొత్తపెళ్ళాం మురిపెం అన్నట్టు బాగానే గడిచింది.మూడునెలలు మున్నాళ్ళముచ్చటల!ఇక అప్పటి నుండి తన అసలు రూపం బయటపెడుతూ వచ్చాడు దినేష్.

    చిన్న చిన్న వాటికే హిమాజ మీద చేయి చేసుకోవడం,ఎదురుతిరిగి ఒక్క మాటంటేనే తనని అనరానిమాటలతో నిందించడం,అనుమానించడం,అవమానించడం!ఇష్టం ఉన్నా లేకపోయినా హిమాజ పై తన కోర్కెలు తీర్చుకోవడం!తిరస్కరించిన తనపై దాడి చేయడం! అతనికి దినచర్యగా మారింది.

    "ఎందుకలా ప్రవర్తిస్తున్నారు!" అని" కారణం "చెప్పమని బతిమిలాడింది. అయిన దినేష్ నోరువిప్పలేదు కేవలం అతని చేయి సమాధానము చెప్పింది.అయిన ఓర్పు సడలనివ్వకుండా దినేష్ ని మార్చడానికి తన వంతు ప్రయత్నాలు అన్ని చేసింది.ఏవి ఫలించకపోగా ఇంకా తన పరిస్థితి దిగజారిపోయింది. ఇక పెద్దవాళ్ళ జోక్యం ఒక్కటే మిగిలింది.

     అది కూడా చెయ్యాలని అత్తగారితో మాట్లాడింది .కానీ అక్కడినుండి కూడా తనదే తప్పు అన్న మాటలు తిరిగి సమాధానము గా వచ్చాయి...! ఇక మిగిలింది తన తల్లిదండ్రులు..! ఏమని చెప్పగలదు! 'ఇంకా పెళ్లి కావలసిన ఇద్దరు కూతుర్ల గురించి ఆలోచిస్తూ సర్దుకుపొమ్మనే సమాధానం తప్ప నా బిడ్డని ఎందుకు బాధలు పెడుతున్నావు ' అని అడగడం చేయరు అని తనకి బాగా తెలుసు!అందుకే తన జీవితం గురించి చెప్పి భాధపెట్టలేక మిన్నంకుండిపోయింది.ఏ నాటికైన భర్తలో మార్పు రాకపోతుందా అన్న పిచ్చి ఆశతో.

అన్నింటికీ తెగించినట్టు చేస్తున్నాడు ఈ మధ్య దినేష్!వారించినా లాభం లేకుండా పోయింది పైపెచ్చు దెబ్బలు లాంటివి బహుమానాలు అవుతున్నాయి తప్ప ప్రయోజనం ఏమి లేదు! తానూ మనిషే ఎన్నని ఒర్చేది!.

    ఒక్క దెబ్బలైతే కాసేపు ఏడ్చి ఊర్కోనేదేమో...! నాలుగు రోజులు భరించి అలవాటు అన్నట్టు ఉండిపోయేదేమో! కానీ! అతను తన కోరికల పేరు చెప్పి, తన శరీరం మీద చేసే సిగరెట్ల వాతలు,పంటి గాట్లు ఇంకా చెప్పలేని నరకం ఎంతో..! ఒక్కొనాడు అతని అకృత్యాలకు,వికృత చేష్టలకు తనకి మంచం మీద నుండి లేవడానికి కూడా శరీరం సహకరించేది కాదు!అంతలా నరకం చూపించేవాడు.!

       ఇలా తన జీవితం సాగుతుండగానే చెల్లి పెళ్లి అని కబురుతో వచ్చారు హిమజ తండ్రి.వచ్చీరాగానే ఎలా ఉన్నావు అని కూతుర్ని అడగకుండా "అల్లుడు బాగున్నాడా!తనని ఎం ఇబ్బంది పెట్టడంలేదుగా నువ్వు!" అన్న తండ్రి మాటలకి, విరక్తిగా ఒక నవ్వు నవ్వుకొని" చాలా బాగా చూస్కుంటున్నాను నాన్న! మీ అల్లుడు గారిని " అని సమాధానము చెప్పి ఆయనకి మర్యాద చేసి, చెల్లి పెళ్లి శుభలేఖ అందుకొని తండ్రిని, భర్త కంట పడనివ్వకుండానే ఏదో నచ్చచెప్పి పంపేసింది.ఎక్కడ దినేష్ వస్తే తన కాపురం గుట్టు బయటపడుతుందో అని.

        దినేష్ తో పడాల్సిన అవమానాలు అన్ని పడి చివరకు ఒప్పించి చెల్లి పెళ్లికి పుట్టింటికి వచ్చింది.ఇంట్లోకి అడుగుపెడుతున్న కూతురికి ఎదురొస్తూ.."అల్లుడు రాలేదామ్మ " అన్న తల్లి మాటలకి, కూతురు బాగు అడగడం మర్చిపోయి పరాయి అతని గురించి వాళ్లు పడుతున్న తాపత్రయం చూసి, మళ్ళీ అదే విరక్తితో కూడిన నవ్వు నవ్వుకొని," ఆఫీసు పని చాలా ఉందటమ్మ కుదరలేదు " అని సమాధానం ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది.

       హిమజ ని చూసిన చెల్లెల్లు ఇద్దరు పరుగున వచ్చి అక్కని చుట్టేశారు. ఊపిరాడనివ్వకుండా కుశలప్రశ్నలు వేసి వాళ్ళ ప్రేమనంత వాళ్ళ మాటల్లో చూపించారు.కనీసం తోడబుట్టిన వాళ్ళకైనా తన గురించి పట్టినందుకు కాస్త సంతోషపడింది. ఆ క్షణం.

       అక్కని తమ గదిలోకి లాక్కెళ్లి చిన్నప్పటి సంగతులు అన్ని చెప్పుకొని నవ్వుకుంటున్నారు అక్కాచెల్లెళ్లు.మధ్య మధ్యలో అక్కని ఆటపట్టిస్తు బావగారి సరసాలు చెప్పు! అంటూ తన మెడ మీద వున్న గోర్ల గుర్తులని చూపించి చెక్కిలిగింతలు పెడుతూ ఆటపట్టిస్తున్నారు.ఆ గుర్తులని చూసుకొని బాధతో కళ్ళలో నీళ్ళు వస్తుంటే అది బయటకు కనిపించనివ్వకుండా పైకి నవ్వుతున్నట్టు నటిస్తోంది హిమజ.ఆ నవ్వులకి తల్లి, తండ్రి కూడా ఆ గది దాకా వచ్చి పెద్ద కూతురి నవ్వు చూసి మురిసిపోతున్నారు.

       చూసిన వారికి కళ్ళలో నీళ్ళు ,నవ్వితే వచ్చే ఆనందభాష్పాలుగా కనిపిస్తే...హిమజ కి ఒక్కదానికే తెలుసు అవి భాదతో వచ్చే కన్నీళ్ళని! అవి తను దాచేస్తుందని!

        నాలుగు రోజులు ఎంతో సంతోషంగా భర్త ప్రవర్తన,అతను పెట్టె నరకాన్ని మర్చిపోయి చెల్లి పెళ్లి అన్న ఆనందంలో గడిపేసింది.ఉన్నంతలో చెల్లి పెళ్లి చేసి అత్తారింటికి పంపారు.అత్తవారింటికి వెళ్తున్న చెల్లి ని చూసి తను కోరుకున్నదొక్కటే తనలా తన చెల్లెలు జీవితం కాకూడదు అని!.

       తిరుగు ప్రయాణం అవుతున్న కూతురితో "అల్లుడితో బాగా మసులుకో " అని చెప్తున్నా తల్లి మాటలు విని కన్నీళ్ళతో "ఇప్పటికి కూడా నీకు, అల్లుడు నిన్ను బాగా చూస్కుంటున్నాడా అని అడగలనిపించట్లేదా అమ్మా!" అని అడిగింది ఇక భాధ ఓపలేక!

      ప్రతిమలా నిలుచున్న తల్లిని చూసి చిన్నగా నవ్వి తన బ్యాగ్ తీసుకొని బయటకు నడిచింది కన్నీళ్ళతో! మళ్ళీ ఆ నరకాన్ని ఎలా భరించాలా అన్నబాధతో!..

    వెళ్తున్న కూతురిని చూసి " ఎలా ఉన్నావు అని అడిగితే! నువ్వు చెప్పే సమాధానం మమ్మల్ని కుదురుగా బ్రతకనివ్వదు అని నువ్వు వచ్చిన నాడే తెలుసు. కానీ! ఆడపిల్లల తల్లిగా ఏమి మాట్లాడలేని స్థితి నాది మమ్మల్ని క్షమించు తల్లి " అని మౌనంగా రోధించింది హిమజ తల్లి.

   బస్ కిటికీలో నుండి బయటకు చూస్తూ...' మళ్ళీ ఆ నరకంలో ఎలా బ్రతుకు ఈడ్చాలా!' అని మదనపడుతూ ఆలోచనల సుడిగుండంలో కొట్టుకుంటున్న తనకి ఫోన్ మోగిన శబ్దం వినిపించి తీసి చూసింది.ఏదో కొత్త నెంబర్ కావడంతో భయంగా ఫోన్ ఎత్తిన తనకి అవతల చెప్పిన మాటలు విని వరదలా పారుతున్న ఆమె కన్నీళ్లు దుఃఖాన్ని చెప్పట్లేలేదు! ఇకనైనా హాయిగా నీ బ్రతుకు నీవు బ్రతుకు! ఎవరికోసం తల వంచకు అని ఆమెకి ధైర్యాన్ని చెప్తున్నాయి.

     ఇంతకీ ఆ ఫోన్లో నుండి అందిన సందేశం ఏమిటంటే! దినేష్! ఫుల్లుగా తాగి బండి నడుపుతూ ఎదురుగా వస్తున్న బస్ కింద పడి చనిపోయాడు అని! తన ఫోను లో వైఫ్ అన్న నెంబర్ చూసి కాల్ చేశాం అని పోలీసులు అందించిన సమాచారం అది.

       తన ఐదోతనం పోయిందనే భాధ కన్నా! తనకి అతని చెర నుండి విముక్తి లభించింది అన్న సంతోషం మొదట తనలో కలిగింది.అది తప్పో, ఒప్పో, ఏమని చెప్పాలో నిర్ణయించే స్థితిలో లేదు! తను ఆ క్షణం.

          



Rate this content
Log in

Similar telugu story from Drama