స్వాతి సూర్యదేవర

Classics Inspirational Others

4  

స్వాతి సూర్యదేవర

Classics Inspirational Others

మార్పు (మనిషికోమాట)

మార్పు (మనిషికోమాట)

8 mins
315


కాలింగ్ బెల్ మోగడంతో ..ఈ టైం లో ఎవరు అనుకుంటూ వచ్చి డోర్ తీసిన వసుంధరకు, ఎదురుగా తన మేనత్త కూతురు అయిన ప్రమీల కనిపించడంతో ,మొదట ఆశ్చర్యపోయినా... తర్వాత నవ్వుతూ ఇంట్లోకి ఆహ్వానించింది...

"ఏమిటే ప్రమీల సడెన్గా నేను గుర్తొచ్చాను..."అంటూ సోఫా చూపించింది కూర్చోమన్నట్టుగా.

దానికి ప్రమీల చిన్నగా నవ్వి...."ఒక శుభవార్తతో వచ్చాను వదినా" అంటూ ఇల్లంతా పరికించి చూసింది ఒకసారి.

ఇంతలో జ్యుస్ గ్లాస్ తో వస్తూ.."ఏంటే అంత మంచి శుభవార్త " అంటే.. "చెప్తాను" అంటూ ఇచ్చిన జ్యుస్ అందుకుంది...ప్రమీల.

కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నాక తన హాండ్ బాగ్ లో ఉన్న శుభలేఖ తీసి వసుంధర చేతికి ఇస్తూ...."త్వరలో మా కొత్త ఇంటి గృహప్రవేశం వదినా...మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాను అంటూ శుభలేఖ చేతికి ఇచ్చింది...

దానిని అందుకొని..."ఓహ్.మళ్ళీ ఇంకో ఇల్లు కట్టారా ప్రమీల... చాలా సంతోషం ఎంతయ్యిందేమిటి?" అంటూ శుభలేఖ తెరిచి చూసింది.ఏ రోజునో చూడడానికి.

ఆ మాట వినడంతోనే కాస్త దర్పం ఓలకబోస్తూ... "అక్షరాల కోటి రూపాయిలు అయింది వదినా...ఇంకో విశేషం ఏమిటి అంటే మా శ్రవణ్ కి మంచి సంబంధం వచ్చింది .చాలా కలిగిన కుటుంబం కూడాను..! త్వరలో పెళ్లి కూడా చేయబోతున్నాం.ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకి ఒక్కతే అమ్మాయి అవడం వల్ల వాళ్ళు శ్రవణ్ ని వాళ్ళ ఇంటికే పంపమని అడిగారు.ఎంతైనా అంత ఆస్తిని చూసుకునే వాళ్ళు కూడా కావాలిగా.....అందుకు మా శ్రవణ్ తగినవాడని వాళ్లకి అనిపించి వాళ్లే వచ్చి మరి సంబంధం కుదుర్చుకున్నారు తెలుసా..! అందుకే మేము కూడా ఒప్పుకున్నాం..." అని కాస్త పొగరుగా తల ఎగరేస్తూ సమాధానం చెప్పింది ప్రమీల..

స్వతహాగా ప్రమీల బుద్ధి ఎలాంటిదో ,తన మాటలు ఎలా ఉంటాయో తనకి తెలుసు..అసలు ఇంతసేపు ప్రమీల ,తనతో మాములుగా చిన్నబుచ్చకుండా మాట్లాడడమే గొప్ప కాబట్టి చిన్నగా నవ్వి "మంచిది ప్రమీల... " అన్నది.

ప్రమీల ఇల్లంతా మరోసారి పరికించి చూస్తూ..."అవును వదినా..ఇంట్లో ఎవరూ లేరెంటి?కొడుకులు,కోడళ్లు ఎక్కడా?"

"ఇంట్లో ఎవరూ లేరు ప్రమీల ...పెద్దోడు హోస్పిటల్ కి,పెద్ద కోడలు ఆఫీస్ కి ,చిన్నోడు ,చిన్న కోడలు కాలేజ్ కి వెళ్లిపోయారు...పిల్లలు కూడా స్కూల్ కి వెళ్లారు."

"అంతేలే వదినా....రెక్క ఆడితేనే కదా మీకు గడిచేది...పాపం అందరూ ఉద్యోగాలు చేస్తేనే కదా...మీకు ఇల్లు నడిచేది.మాలా మీకు ఆస్తులు లేవుగా పాపం మరి..." అని ప్రమీల సానుభూతి చూపిస్తున్నట్టు అంటున్నా..వెటకారం ,వ్యంగ్యం స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆమె మాటల్లో వసుంధర కి.

ఎం మాట్లాడకుండా కాసేపు అలానే మౌనంగా ఉంది.మళ్ళీ అంతలోనే ప్రమీల అందుకొని..."అవును వదినా...మీరు ఎన్నాళ్ళని ఈ చిన్నఇంట్లో వుంటారు...అసలు ఈ చిన్న ఇల్లు మీకు ఎలా సరిపోతుంది...? పెద్ద ఇల్లు కట్టుకోవచ్చుకదా? అన్నయ్యా గారు పోయినప్పుడు కాస్త డబ్బు వచ్చేవుంటాది కదా...ఎలా గోల కట్టుకోకపోయారా..ఇలా చాలి,చాలని ఇంట్లో ఎన్నాళ్ళని కాలం వెళ్లదీస్తారు...పాపం "

తన మాటలు పట్టించుకొనట్టు చిన్నగా నవ్వి "ఆ డబ్బు లేదు ప్రమీల పెద్దోడు చదువు కోసం ఇంకా వాళ్ళ పెళ్లిళ్లకోసం,నా అనారోగ్యం కోసం చాలా వరకు ఖర్చు ఐపోయింది.మిగిలింది పెద్దోడు క్లినిక్ కోసం ఖర్చు అయింది. ఇక పెద్ద ఇల్లు అంటావా...పిల్లలు ఇష్టం..వాల్లకి ఆ స్థోమత వచ్చినప్పుడు వాళ్లే కొనుకుంటారు."

"అంతేలే....వదినా" అంటూనే... "ఐనా...ఇప్పుడంటే పిల్లలతో ,వాళ్ళకి నీ అవసరం ఉంది కాబట్టి నీ కోడళ్లు నిన్ను చూసుకుంటున్నారు...కొన్నాళ్ళు పోయాక నీ అవసరం తీరాక వాళ్ళు చెరొక దారి చూసుకుంటే పాపం నీ పరిస్థితి ఎం కాను...ఇప్పుడంటే కాలు, చెయ్యి ఆడుతుంది కాబట్టి ఆ పని,ఈ పని అని చేస్తుంటే నీకో ముద్ద పెడుతున్నారు..అదే నువ్వు మంచాన పడితే వాళ్ళు గుక్కెడు నీళ్లు అయిన పోస్తారా..."

ఆ మాటకి వసుంధర మనసులో కలుక్కుమనగా, వెంటనే తేరుకొని "నాకు ఆ పరిస్థితి రాదు అనే అనుకుంటున్నాను ప్రమీల..."

"అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు వదినా"... అన్న ప్రమీల మాటకి...

"నమ్మకం నాకు ,నా పిల్లలమీద,నా పెంపకం మీద వున్న నమ్మకంతోనే ప్రమీల..." అన్నది వసుంధర.

ఆ మాట నచ్చకపోవడంతో "హ.అంతేలే...అలా అనుకోకపోతే ఎలా...లే...దేనికైనా సుఖపడే రాత వుండాలిగా...మన ఇద్దరికి అటూ,ఇటుగా ఒకేసారి పెళ్లిళ్లు అయ్యాయి..ఇద్దరి భర్తలవి ప్రభుత్వ ఉద్యోగాలే.నేను చూడు నలుగురు పని వాళ్ళతో ,రెండు పెద్ద ఇళ్లు కట్టుకొని దర్జాగా కార్లో తిరుగుతున్నాను..కానీ మీరు మాత్రం ఇలా చిన్న ఇంట్లో..చాలి ,చాలకుండా ఉండిపోయారు.దేనికైనా అదృష్టం ఉండాలి..లే.." అని నిష్టురమాడుతున్న ప్రమీల ని చూసి కళ్ళు ఎర్ర చేసింది వసుంధర. ఏదో అందాము అనుకున్నదే..ఇంటికి వచ్చిన వాళ్ళకి అవమానం చేసినట్టు అవుతుంది అని అంతలోనే తమాయించుకొని కాస్త మెత్తగా...

"చాలి, చాలనవి అని నువ్వు అనుకుంటున్నావు ప్రమీల ...నేను కాదు.మేము కావాలి అనుకుంటే ఎప్పుడో నా కొడుకులు పెద్ద ఇంటికి మార్చేవారు...కానీ వాళ్ళకి వాళ్ళ తండ్రి కష్టం మీద వున్న విలువ,నాకు ఈ ఇంటితో ఉన్న అనుబంధం వాళ్లకి తెలుసు కాబట్టి వారి తండ్రి జ్ఞాపకంగా ఉన్న ఈ ఇంటిని ఒక్క ఇటుక కూడా కదపకుండా అలాగే ఉంచేశారు.వాళ్ళ నాన్న కి నచ్చినట్టుగా..కనీసం వాళ్ళకి తగ్గట్టు మార్పులు కూడా చేయకుండా..."

వసుంధర మాట ప్రమీలకి చెంప దెబ్బ పడ్డట్టుగా చిన్న ఉలికిపాటుకి గురిచేసింది.ముఖ్యంగా తన భర్త కష్టం అని నొక్కి చెప్పేసరికి తనను తాను మరిచి తనలో ఉన్న అసూయని మరోమారు బయటపెట్టింది..

"మార్పులు చెయ్యలేక,కనీసం పని వాళ్ళని పెట్టుకొనే స్థోమత కూడా లేక వదిలేశారని నిజం చెప్పొచ్చుగా వదినా...ఇలా మంచి,ప్రేమ అనే ముసుగు మాటలు ఎందుకు.."

"నువ్వు ఎలా అనుకున్న నాకు నష్టం లేదు ప్రమీల..నాకు నీలా డాంబికాలకు పోవలసిన అగత్యం లేదు..నాకు నా భర్త కష్టంతో కట్టిన ఈ ఇల్లు,నా బిడ్డలు ప్రేమగా పిలిచే అమ్మా అన్న పిలుపు,నా మనువలు చెప్పే ఊసులు ఇవి చాలు నాకు...అంతకన్నా నేను ఏమి ఆశించడం లేదు కూడా...."

వసుంధర చెప్పిన సమాధానం విన్న ప్రమీల పెద్దగా నవ్వి, "ఏంటి వదినా...నువ్వు మాట్లాడేది.! ఇవి చాలా...! అసలు నీకు సంతోషంగా బ్రతకడం కూడా తెలిసినట్టు లేదు,ఈ చిన్న ఇంట్లో నువ్వు, నీ వాళ్ళ మధ్య ఇరుకుగా బ్రతుకుతూ సంతోషంగా ఉన్నాను అంటే నన్ను నమ్మమంటావా...!?సంతోషం అంటే ఎంటో ,ఎలా బ్రతకాలో నన్ను చూసి నేర్చుకో..."

ఆ మాటలకి అప్పటిదాకా సహనంగా ఉన్న వసుందరకి ఇక కోపం తారాస్థాయికి చేరడంతో కాస్త గట్టిగానే !

   "అవును... ప్రమీల అన్నయ్యగారు ఉద్యొగం పోయాక అసలు ఎక్కడా.. ఇంతవరకు కనిపించలేదు ఏంటి? అవునూ ఆ లంచం తీసుకున్న కేస్ ఎంతవరకు వచ్చింది? ఎంత శిక్ష పడొచ్చు అంటున్నారు...? అన్నయ్యగారు నిన్ను కాదని ఇంకో ఆవిడతో కూడా సంబంధం పెట్టుకున్నారు అని,ఇప్పుడు అవిడతోనే వుంటున్నారు అని విన్నాను నిజమేనా...?" వరుసగా తనపై ప్రశ్నల బాణాలు వదులుతున్న వసుందరని చూసి ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యింది ప్రమీల.

"అడుగుతుంటే సమాధానం చెప్పవేమే" అన్న వసుంధర మాటకు మొహం నేలకి దించేసింది ప్రమీల...

"సమాధానం చెప్పలేవు కదా ప్రమీల...అందుకే ఎవరిని మన స్థితిని మర్చిపోయి మాటలు అనకూడదు..ఇల్లు కట్టాము అనే సంబరపడుతున్నావు కానీ నువ్వు నీ జీవితాన్నే కోల్పోయిన సంగతి మర్చిపోయావు.ఆస్తులు,కార్లు,బంగళాలు ఇవి నీ దర్పానికి ఆనవాళ్లు అవ్వగలవేమో కానీ,నీ సంతోషానికి కారణం కాలేవు ప్రమీల..

      నువ్వు అన్నావు కదా ఈ ఇరుకింట్లో నీకు సంతోషం ఉందా అని! అవును నా సంతోషం ,నా మధురానుభూతులు,నా భర్త జ్ఞాపకాలు,నా పిల్లల ఎదుగుదలకు సంభందించిన అన్ని జ్ఞాపకాల సమూహం నాకు ఈ ఇంటితో విడదీయరాని బంధాన్ని పెనవేసింది.ఇది నా భర్త నీతి,నిజాయితీలతో కేవలం తన నెల జీతంలో కూడబెట్టిన కొద్ధి మొత్తంతో మేము కట్టుకున్న పొదరిల్లు.ఇక్కడ ఆప్యాయతలకు తప్ప అంతరాలకు తావు లేదు...కేవలం ఆయన జీతంతోనే ఈ ఇల్లు నడిచింది,ఆయన ఒక్కరి కష్టమే నా బిడ్డలకు చదువు చెప్పించి ఈ రోజు సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చింది...ఆ మాటకొస్తే నా పిల్లలు... వాళ్ళ చదువులకు తగ్గట్టు రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎప్పుడో ఎగిరిపోవొచ్చు కానీ వాళ్ళు ఆ రెక్కల బలంతో ఇంకొంత మందికి ఎగరడానికి స్వేచ్ఛ ని ఇవ్వాలి అని ఇక్కడే ఆగిపోయారు...కేవలం మేము నేర్పిన కొద్దిపాటి విలువలను ,వెలకట్టలేని సంస్కారంగా మలుచుకొని నలుగురికి ఉపయోగపడుతూ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు.

డాక్టర్ గా నా పెద్దకొడుకు ఏ పెద్ద కార్పోరేట్ హోస్పిటల్ లో అయిన పని చేసి లక్షల కొద్దీ జీతం గడించ వచ్చు కానీ,వాడు పేదవాళ్ళకి సహాయపడాలి అన్న ఉద్దేశంతో చిన్న క్లినిక్ పెట్టుకొని పదిమందికి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తున్నాడు..ఇక వాడికి చేదోడు వాదోడుగా నా పెద్దకోడలు సరే సరి!.

ఇక నా చిన్నకొడుకు,కోడలు కూడా పెద్ద పెద్ద కాలేజీల్లో ఉద్యోగాలు చేస్తున్న, పేద విద్యార్థులు కోసం వారంతాల్లో ఉచితంగా వారికి చదువు చెప్తున్నారు...నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇక నా విషయానికి వస్తే నాకు ,నా బిడ్డలకి కడుపునిండా కమ్మగా వండి పెట్టి వాళ్ళు తింటుంటే మురుసిపోవడం లో ఉన్న సంతోషం ఇక దేనిలోను లేదు అని నా అభిప్రాయం.అందుకు నాకు పనిమనుషులు అక్కర్లేదు. నా మనవలకు నేను పెట్టె గోరుముద్దలు ,వారి ముద్దు ముద్దు మాటలు వింటూ, నా వయసుని,నా ఒంటరితనాన్ని నేను మర్చిపోయేలా వాళ్ళతో నేను ఆడే ఆటలు,వాళ్ళ అల్లరి ప్రతీది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేదే!. వారికోసం నేను చేసే ప్రతి చిన్న పనిలో ,ఎంత కష్టం ఉన్న అది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.అసలు నా పిల్లలు నా కళ్ళముందు వున్నారు అన్న ఒక విషయం చాలు నేను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పడానికి..నువ్వే అన్నావుగా ప్రమీల! నీ వాళ్ళ మధ్య ఉంటూ సంతోషంగా ఉన్నవా అని.నేను నా వాళ్ళ మద్యే సంతోషంగా లేనప్పుడు స్వర్గంలో ఉన్న అది నాకు నరకంతో సమానమే..

కానీ నీ దగ్గర ఏముంది ప్రమీల!నాతో పోలిస్తే నువ్వు ఆస్తిలో ఐశ్వర్యవంతురాలివేమో కానీ,ఆప్యాయతలలో కాదు.నీ దర్పాలకోసం,నీ హంగులు కోసం నీ భర్తని లంచగొండిని చేసావు. భార్యగా నీ బాధ్యతని గాలికి వదిలి చెడు స్నేహాలకు ,అలవాట్లకు బానిసనను చేసావు..కేవలం డబ్బు ఉంటే చాలు అనుకోని నీ భర్త నీకు ఎంత దూరమవుతున్నాడో కూడా నువ్వు గమనించుకోలేదు..ఆడే,పాడే కొడుకుని తీసుకెళ్లి పనిమనిషి చేతికి ఇచ్చి పెంచమన్నావు.అవసరానికి మించి డబ్బు వాడి చేతికిచ్చి దురలవాట్లకు చేరువ అయ్యేలా చేసావు.సంస్కారం ,విలువలు ,ప్రేమ లేని ఒక రాతి మనిషిలా నీ కొడుకుని నువ్వే మార్చేశావు,నువ్వు కూడా అలానే మారిపోయావు. డబ్బు అని విర్రవేగుతున్నావే...మరి నీ డబ్బుతో కనీసం వాడికి డిగ్రీ పట్టా వచ్చేలా కూడా చదివించలేకపోయావు.ఇంక ఎంత డబ్బు ఉండి ఎం లాభం!? ఇప్పుడు కూడా వాడికి గొప్ప ఇంటి సంబంధం వచ్చింది ,ఆస్తులు పెరుగుతున్నాయి అని సంబరపడుతున్నావే కానీ,కనీసం డిగ్రీ పట్టా కూడా లేని నీ కొడుకుని వాళ్ళు ఎందుకు అంతలా ఇల్లరికం రమ్మంటున్నారో కాస్త కూడా ఆలోచించలేకపోయావు.నీ అంతటా నువ్వే, నీ బిడ్డని ఇంకో ఇంటికి బానిసగా పంపిస్తున్నావు.ఆ సంగతి డబ్బు మైకంలో ఉన్న నీకు అది అర్ధం కావట్లేదు.నీకు నీ భర్తే కాకా,నీ బిడ్డ కూడా శాశ్వతంగా దూరం అయిపోతున్నాడు అని గ్రహించలేకపోతున్నావు.

నా దగ్గర నా చుట్టూరా ప్రేమలు,ఆప్యాయతలు పంచే మనుషులు ఉంటే, నీ దగ్గర కేవలం మర బొమ్మలు లాంటి కార్లు, బంగళాలు మాత్రమే మిగిలాయి.కనీసం తిన్నవా! అని అడిగే మనిషి కూడా లేకుండా ఒంటరిగా మిగిలావు. ఇకనైనా మేలుకొని నీ ఇంటిని నువ్వు చక్కదిద్దుకో...నీ సంసారాన్ని ,నీ కొడుకుని సరైన దారిలో పెట్టుకో..వేళ్ళు ఇక ఎప్పుడు నా ఇంటి గుమ్మం తొక్కకు అని నిక్కచ్చిగా చెప్పేసి తల తిప్పేసింది వసుంధర..

వసుంధర పలికిన ప్రతి మాట నిజం అని ప్రమీలకి కూడా తెలుసు కానీ,అది ఒప్పుకుంటే తన ముందు పలచన ఐపోతానేమో అన్న భయంతో తన బాగ్ తీసూకొని మారు మాట్లాడకుండా బయటకి వచ్చేసింది...

కార్ ఎక్కిన దగ్గరనుండి వసుంధర మాటలే చెవిలో మ్రోగుతుంటే....ఆలోచనలో పడింది."నిజమే వదినా నువ్వు అన్న ప్రతి మాట నిజం,అది నా మనసుకి తెలుస్తున్న ఎక్కడ నువ్వు నన్ను దాటి వెళ్ళిపోయి, నలుగురిలో నేను పలుచన అవుతానో అని ఎప్పుడూ నిన్ను ఏదో ఒకటి అని భాధపెడుతూ ఉండేదాన్ని.కానీ! నిన్ను భాధపెడుతున్న అనుకోని నేనే పాతాళంలోకి జారిపోయాను అని గ్రహించుకోలేకపోయాను.నువ్వు చెప్పింది నిజమే ఇప్పటికైనా నా కంటికి పట్టిన డబ్బు,డాబు అనే పొరలు తొలగించుకోకపోతే ఇక నేను ఎప్పటికి కోలుకోలేను,నా జీవితాన్ని నీలా సంతోషమయం చేసుకోలేను. నేను డబ్బు అని పరుగులుపెడితే నువ్వు విలువలు అని నాకు అందనంత ఎత్తులో నిలబడ్డావు.

       నీ ముందు డాంబికాలు పోవాలని,నిన్ను తక్కువ చేయాలని నీ ఇంటికి పనిగట్టుకొని వచ్చాను. కానీ! నేను చేసిన అన్ని అవమానాలకు కలిపి మంచి సమాధానం చెప్పావు వదినా! నీ మాటలతో కాదు, నీ జీవితాన్ని నాకు చూపించి నా కళ్ళు తెరిపించావు....నీలాంటి "ప్రేమ మూర్తి "ఉంది కాబట్టే ఆ ఇల్లు నందనవనం లా అందంగా ఉంది...మీవి ప్రేమ నిండిన "ప్రేమమనస్సులు" వదినా అవి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మొదటిసారి వసుంధర మంచి కోరుకొని,తన జీవితం చక్కదిద్దుకోవడానికి బయలుదేరింది ప్రమీల!.

         ప్రమీల! వెళ్ళిపోయాక అలానే ఆలోచిస్తూ..తనని ఎక్కువ భాధపెట్టానా అని ఆలోచిస్తుంది వసుంధర.కాసేపటికి తనలో తనే! లేదు! నేను ఇలా మాట్లాడకపోతే..ఇప్పటికే భర్తని దూరం చేసుకుంది.ఇప్పుడు కొడుకుని కూడా దూరం చేసుకుంటుంది పిచ్చిది. ఇపుడు తెలియకపోయిన తర్వాత చాలా భాధపడుతుంది.ఎప్పుడు నన్ను ఎమన్నా ఆ మాటల్లో ఏదో అమాయకత్వం కనిపించేది. కానీ! ఇప్పుడు పొగరు చూసాను ఆ మాటల్లో..!ఎంత నా స్నేహితురాలైన ,నా బంధువైన నా బిడ్డలను అంటే ఈ తల్లి మనసు ఎలా ఊరుకుంటుంది .అందుకే దానికి ఎదురు చెప్పాను. అది కాకా శ్రవణ్! పాపం వాడు.చిన్నపాపటినుండి తల్లిప్రేమ దొరక్క నా దగ్గర అది వెతుక్కొనేవాడు..నాకు దగ్గరవుతున్నాడు అని వాడిని మా నుండి దూరంగా పంపి గెలిచనని సంబరపడింది కానీ! వాడు ఎంత భాధ అనుభవించాడో అర్ధం చేసుకోలేకపోయింది.ఇప్పుడు కూడా మళ్లీ అదే తప్పు చేసింది. ఇప్పుడు శ్రవణ్ ని దూరం చేసుకుంటే ఇక వాడు ఎప్పటికి ప్రమీల ని దగ్గరకి రానివ్వడు.అందుకే కాస్త నొప్పించిన తప్పలేదు.ఇకనైనా తనలో మార్పు వస్తే బాగుండు అనుకుంటూ నిట్టూర్చి తన పనిలో తను ఉండిపోయింది.

                     

       శ్రవణ్ కూడా ఫోన్ చేసి రమ్మని గొడవ చేయడంతో తప్పక, శ్రవణ్ ని నొప్పించలేక ఇష్టం లేకపోయినా గృహప్రవేశనికి వెళ్ళింది వసుంధర.అక్కడికి వెళ్ళగానే నవ్వుతూ ఎదురువచ్చి ఆప్యాయంగా పలకరించిన ప్రమీల దంపతులని చూసి ఆశ్చర్యపోయింది.అంతేకాదు ముఖ్యంగా శ్రవణ్ ని చూసి ఇంకా ఆనందపడింది.ఎంతో బాధ్యతగా అక్కడ వ్యవహారాలు చక్కబెడుతున్నాడు శ్రవణ్! ఇదివరకు శ్రవణ్ అయితే ఈ పాటికి తాగేసి ఏదో ఒక గొడవ చేస్తూ ఉండేవాడు.కానీ తనని అలా చూడడం చాలా సంతోషంగా అనిపించింది వసుంధరకి.ఇంతలో వసుంధరని చూసిన శ్రవణ్ "అత్త" అంటూ వచ్చి హత్తుకొని చక్కగా మాట్లాడుతుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది తనకి!. ముఖ్యంగా శ్రవణ్! మొహంలో తాండవం చేస్తున్న ఆనందం చూస్తుంటే ముచ్చటేసింది.కానీ! ఇదంతా ఎలా సాధ్యమైందో అర్ధం కాలేదు తనకి.ఎందుకంటే ఎప్పుడు గొప్పకోసం ప్రమీల ఎం చేసిన ఇప్పుడు ఉన్నంత ఒద్దికగా ఏ శుభకార్యాలు జరగలేదు ఇప్పటివరకు ప్రమీల ఇంట్లో!.అందుకే అంతలా ఆశ్చర్యపోతుంది.

     ఫంక్షన్ ఐపోయేవరకు వసుంధరని వెళ్ళనివ్వలేదు శ్రవణ్! అంత అయ్యాక వసుంధర దగ్గరికి వచ్చిన ప్రమీల కన్నీళ్ళతో మనస్ఫూర్తిగా తనకి క్షమాపణలు చెప్పింది.

అయోమయంగా చూస్తున్న వసుందరని చూసి చిన్నగా నవ్వి... "ఏంటి వదినా విచిత్రంగా ఉంది కదా! నన్ను చూసి.వుండేవుంటుందిలే...ఎందుకంటే నీ చిన్ననాటి స్నేహితురాలు ప్రమీల మళ్ళీ తిరిగివచ్చింది కదా!.అని వసుంధరని హత్తుకోని.నువ్వు అన్న ప్రతి మాట నిజం వదినా! అవసరం కోసం వాడే వాటిని చూసుకొని ఆప్యాయతలు,ప్రేమలు దూరం చేసుకున్నాను.అదే బ్రతకడం అనుకున్నాను. కానీ! నీ జీవితాన్ని నాకు చూపించి నేను చేసిన తప్పేంటో నాకు చెప్పావు.చెంపదెబ్బ కొట్టుంటే మారకపోదునేమో! కానీ! అరమరికలు లేని నీ జీవితాన్ని ,నీ బిడ్డలని నాకు చూపించి నన్ను మార్చేసావు.అందుకే మీ ఇంటి నుండి రాగానే ముందు శ్రవణ్ కి కుదిర్చిన పెళ్లి రద్దు చేసేసాను.నా భర్తని క్షమాపణలు అడిగి మళ్ళీ నా దగ్గరకు తెచ్చుకున్నాను.మళ్ళీ నా వాళ్ళ ప్రేమకి దగ్గరయ్యాను.కాదు అయ్యేలా నువ్వు బుద్ధి చెప్పి మార్చేసావు.అని తనకి దూరం జరిగి చేతులు పట్టుకొని...

తప్పని తెలిసిన నీ విషయంలో చాలా సార్లు నిన్ను అవమానించాను.నన్ను క్షమించు వదినా! మళ్ళీ నీ ప్రమీ ని దగ్గర తీయవా! నాకు నా వసు వదినకి తిరిగిఇవ్వవ అని కన్నీళ్ళతో చిన్న పిల్లలా అడుగుతున్న ప్రమీల చూసి చిన్నగా నవ్వి!

ఏంటి ప్రమి! ఇది చిన్నపిల్లల అని కళ్ళు తుడిచి..ఇప్పటికైనా జీవితంలో డబ్బు ముఖ్యం కాదు బంధాలు ముఖ్యం అని తెలుసుకున్నావు అది చాలు.ఇక హాయిగా ఇన్నాళ్లు కోల్పోయిన ప్రేమని నువ్వు పొంది, నీ వల్ల నీవాళ్లు కోల్పోయిన ప్రేమని వాళ్ళకి ఇవ్వు అని నవ్వింది.

"మా అమ్మని, అమ్మ ప్రేమని మాకు ఇలా తిరిగి ఇచ్చినందుకు నీ రుణం ఎలా తీర్చుకోను అత్త" అని అడుగుతున్న శ్రవణ్ ని చూసి ప్రేమగా దగ్గరికి తీసుకొని "తొందరగా నీకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని నీ పాతజీవితాన్ని వదిలిపెట్టు శ్రవణ్ అదే చాలు." అని నవ్వి...ఇక బయలుదేరతాను అని సంతోషంగా అందరికి చెప్పి బయలుదేరింది వసుంధర.

       వెళుతున్న వసుంధరని చూస్తూ..మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నారు.ఆ కుటుంబం.

ఇంటికి వచ్చిన వసుంధర అక్కడ జరిగిన సంఘటనలు ఇంట్లో వాళ్లకు చెప్పగానే! ముందు ఆశ్చర్యపోయినా తర్వాత ఆనందపడ్డారు.

                      **********

సమాప్తం.



Rate this content
Log in

Similar telugu story from Classics