స్వాతి సూర్యదేవర

Drama Classics Inspirational

4  

స్వాతి సూర్యదేవర

Drama Classics Inspirational

మన"వరాలు"

మన"వరాలు"

8 mins
749


సత్యవతి.... ఓ...సత్యవతి...."

"హా.వత్తన్న శాంతమ్మ...." అంటూ బయటికి వచ్చిన సత్యవతిని చూసి..."నేను అడిగిన పని ఏమైంది..సగమైన దొరికినియ్యా..." అని కాస్త కంగారుగానే అడిగింది.

"సగమెంది శాంతం పూర్తిగానే వున్నాయి..ఇవిగో!" అంటూ తన చేతిలో డబ్బు శాంతమ్మ కి ఇచ్చింది.

వాటిని అందుకుంటూ .."నీ మేలు ఎన్నటికీ మర్చిపోలేనే సత్యవతి! "

"ఇందులో నేను చేసిన మేలు ఏముందిలే శాంతమ్మ.సమయానికి ఇంట్లో వుండబట్టి ఆ రెండువేలైన సర్దాగాలిగాను కానీ లేకపోతే నా పరిస్థితి మాత్రం నీకు తెలియదనే!"

"అంతేలే సత్యవతి...రెక్కడైతేకాని డొక్కాడని వాళ్ళం.తిండికి తప్ప సరైన గుడ్డకి కూడా నోచుకోని వాళ్ళం ఎలాగోలా వెళ్ళదీస్తున్నాం అనుకుంటే ఇదిగో ఇలాంటి ఖర్చులు వచ్చి మన పేదరికాన్ని వెక్కిరిస్తాయి అప్పుడప్పుడు..." అంటూ చేతిలో డబ్బుని కొంగున మూడేసుకొని నడుముకి కొంగుని దోపుకుంది శాంత.

"సరేలే శాంత...మరి ఎక్కువ రోజులు పోకుండా తొందరగా వచ్చేయి మల్లి పని పొఇద్ధి...మళ్ళీ దానికోసం ఎన్ను పాట్లు పడాలో...." అంటూ ఇంటికి తాళం బిగిస్తోంది సత్యవతి.

"హ..సరే...రేపు మాటెలకే వచ్చేస్తాను." అంటూ శాంత బస్టాండ్ వైపు నడక సారిస్తే ,సత్యవతి తను పనిచేసే ఇళ్ళవైపు పయనం అయింది.

శాంతమ్మ యాభై ఐదేళ్ల వయసులోను చిన్నప్పటినుండీ చేస్తున్న పనివల్ల శరీరం గట్టిపడి ఎంత పనైనా వంటిచేత్తో చేయగల సమర్ధురాలు.భర్త బాధ్యత లేకుండా తాగుడితో సావాసం చేస్తున్న, వంటిచేత్తో ముగ్గురు అడపిల్లలని పెంచి పెళ్లిళ్లు చేసి పంపేసింది.ఉన్న ఒక్క కొడుక్కి పెళ్లిచేస్తే ఇరుకు గుడిసెలో ఇమడలేక వేరుకాపురం పేరుతో ఏకంగా ఊరోదిలి ఎక్కడో కాంట్రకు పనిలో చేరాడు.ఇప్పుడు శాంతమ్మ వెళ్ళేది కూడా, ఆ కొడుక్కి పదిరోజుల కిందట పుట్టిన మనవరాలని చూడడానికే,మొదటిసారి మనవరాలిని చూడడానికి వట్టిచేతులతో వెళ్లలేక ఇలా సత్యవతి దగ్గర అప్పుచేసి మరి డబ్బు తీసుకుంది.

ఆలోచనల మధ్య బస్టాండ్ కి చేరిన శాంతకి బస్ వెంటనే రావడంతో ఎక్కి టికెట్ తీసుకుంది.

"ఏమే శాంత ఎక్కడికి బయల్దేరావు .మనవరాలి దగ్గరకా!?'

"హ.అవును నరసమ్మ..నువ్వేడదాక.?"

"నేను ఆసుపత్రికి పోతున్నలే కాత్త కాళ్ళనొప్పులుగా ఉంటేను..."

"అట్టాగా..."

"అది సర్లే గానీ... చేతిలో కవర్ తప్ప ఎవిలేవెందే మనవరాలకి ఎం తీసకపోతున్నావు"

"నేనేం తీసుకపోతానే ఏదో తోచినంత పిల్ల చేతిలో పెడదాం అని అనుకుంటున్నా"

"డబ్బులు పెడితే ఆటి తీరనే పోతాయి .మంచిగా పట్టగొలుసులు తీసకపో బిడ్డకి నాలుగురోజులు కాళ్ళకి నిండుగా ఉంటాయి."

"మంచి ఆలొచనెనొవ్ నరసమ్మ. నాకు ఈ యోచనే రాలేదు సరే బస్ దిగినంక తీసుకుంటా.." అంటూ నరసమ్మతో మాట్లాడుతుండగానే కండక్టర్ స్టాప్ వచ్చిందని అరవడంతో బస్ దిగింది.

మనవరాలికి వెండి పట్టీలు తీసుకోవడానికి ఒకటికి నాలుగు కొట్లు తిరిగినా తన దగ్గరున్న డబ్బు చాలకపోవడంతో ఎం చెయ్యాలో పాలుపోక ఇక ఊసురుమంటూ తన దగ్గర అంతకుముందున్న మూడొందలు పెట్టి నాలుగు పసిపిల్లల జుబ్బాలు తీసుకొని కొడుకు ఇంటికి నడక సాగించింది.

కొడుకుకి అత్తగారు కట్నం కింద ఇచ్చిన చిన్న గదిలోనే శాంత కొడుకు రాంబాబు,వరలక్ష్మి కాపురం.ఆ గది ముందుకు వచ్చి చూసిన శాంతకి తాళం వేసి ఉండడం చూసి , కొడుకు కూడా అత్తగారింట్లోనే ఉన్నాడేమో అని నాలుగిళ్ళ అవతలకి ఉన్న వియ్యపురాలి ఇంటికి వెళ్ళింది.

"అమ్మాయి వరం" అన్న కేకకి బయటికి వచ్చిన వరలక్ష్మి తల్లి "ఓహ్..వదిన నువ్వా.. ఇప్పుడెనా రావడం."

పట్టిన చెమటను కొంగుతో తుడుసుకుంటు..."హ..అవును..." అని బయటే సాయంకాలం కుర్చోవడానికి అని వేసిన బండ పై కూర్చుంది.

"బయట ఎండగా ఉంది వదిన. లోపలికి రా.." అంటూ చెప్పి "అమ్మాయి వరం మీ అత్త వచ్చిందే" అని కేకేసింది.

"నేనే కాళ్లు కడుక్కొని వస్తా అగు" అని లేచి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళింది శాంతమ్మ.

మనవరాలిని చూసుకొని తృప్తిగా మురుసుకొని "వరం వంట్లో తేలిగ్గా ఉంటుందా...!"

"హ.అత్త బాగానే వుంది ఇప్పుడు..."

"సరే తల్లి బాగా పత్యం చెయ్..మళ్ళీ నాలుగు నెలలు ఆగితే పనికి పోవాలంటే మళ్ళీ చేతకాదు.."

"అట్టానే అత్తా.."

"అబ్బాయి లేడా! వరం తాళం వేసుంది ఆడికి పోతే!"

"లేడు అత్త పనికి పోయాడుగా..నాయనోళ్ళతో పాటుగా..సాయంత్రం అవ్వుది ఒక్క ముక్క ఫోన్ చేసుంటే పోయేదేమో బస్స్టాండ్ నుండి సానాదూరం నడిసొచ్చావు..కనీసం సైకిల్ యేసుకోని వచ్చేవాడు.."

"నడక ఏమన్నా కొత్తటే మనికి...."అని నవ్వి "ఇంతకి వాడు తాగుడు ఏమైనా తగ్గించాడా.అట్టనే అయ్యకి మల్లె తాగుతున్నాడా!?" అంటూ వియ్యపురాలు ఇచ్చిన మంచినీళ్లు అందుకుంది.

"అదేం లేదులే అత్త బాగానే ఉంటున్నాడు...మొత్తానికి మానలేకపోయినా గొడవలు పెట్టుకోట్లేదులే..వళ్ళు పులిసే పనాయే సుక్క పడకపోతే నిద్ర పోలేకపోతున్నాడు అందుకే సూసిసూడనట్టు ఉంటున్న ఇక ఎం చెయ్యను.."

"హుమ్మ్...ఎక్కువ కాకుండా చూసుకో...చాల్లే"

"అవును అత్త ,మామ రాలేదేంది?"

"మీ మామ సారాకొట్టుకాన్నుంచి ఇంటికొచ్చే నాలుగుదినాలైంది.ఇసుగుబుట్టి నేనె ఇట్టా వచ్చిన ఇక ఆన్ని ఎం బతిమిలాడేది రోజూ.." అని కొడలితో సాయంత్రం దాకా ముచ్చట్లు ఆడుకుంటూ కూర్చుంది.సాయంత్రానికి రాంబాబు వచ్చాడు.

"అమ్మ ఎప్పుడొచ్చావు ఎట్టాగున్నవు, అయ్య బాగున్నాడా"

"బాగున్నా0 బిడ్డ" అని కొడుకుని ఆప్యాయంగా పలకరించుకొని,అక్కడే తినేసి పడుకోవడానికి కొడుకు గది దగ్గరికి వచ్చింది.

"ఇంకెందే అమ్మ ఇశేశాలు..అయ్య ఆట్నే తాగుతున్నాడా"

"ఎమున్నాయి రా...అక్కోళ్ళు వత్తామంటూన్నారు సంటిదాన్ని సూడడానికి .ఎప్ప్పుడొస్తారో కాస్త కనుక్కుని కుదిరితే ఆయాల ఇంట్లోనే ఉండు..కాసేపు ఉండి పోతామన్నారులే.."

"సరే అమ్మా.."

"కోడలు బాగా చూస్కుంటుందా రా నిన్ను..మీ అత్తోళ్ళు ఎం లోకువకట్టట్లేదుగా నిన్ను..."

"అదేంది అమ్మ అట్టా అడిగినావు"

"ఎం లేదురా...మీ అయ్య ఎట్టబోయిన నేను మమ్మల్ని ఎవరు చిన్నమాట కూడా అనకుండా పెంచిన అందుకే నా బిడ్డలు ఒకళ్ళకి సులకన కాకుడదన్నదే నా భయం" అంటూ మూలన ఉన్న సాప పరుచుకుంది.

"అట్టాటిదేం లేదమ్మ...ఏదో పురిటికని పోయిందికాని ఆళ్ల ఉసేఎత్తదు అటు పోదు..మా కట్టమే తినాలాంటిది.అసలు వరం నాతో గొడవ పడి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చిందో తెలుసా.. " అని ఎం మాట్లాడకుండా దేనికి అన్నట్టు చూస్తున్న తల్లితో "మేము నీకు భారం కాకూడదని అమ్మ " అని చెప్పాడు రాంబాబు

"మీరు నాకు భారం కావడం ఏందయ్యా...? బిడ్డ ఎప్పుడన్నా తల్లికి భారం అయితదా! ఏం మాట్లాడుతున్నావ్ బిడ్డ!"

"కొడుకు తల్లికి ఎప్పుడూ భారం కాదు నాకు తెలుసమ్మా! కానీ కొడుకు పెళ్లి అయ్యాక కూడా పెళ్ళాం తో పాటుగా తల్లికి భారమైతే ఎట్టాగ మరి"

"నువ్వు అనేది నాకు అర్థం అయితలేదు అయ్యా కాస్త వివరంగా చెప్పు"

"అదే అమ్మ నేను కూడా అయ్యతోపాటు సారాకొట్టు దగ్గర కూర్చొని నీకు ముందే భారం అయ్యాను. పెళ్లి చేస్తే మారతానని వరాన్ని ఇచ్చి పెళ్లి చేసావు కానీ నేను మారకుండా వరం బాధ్యత కూడా నీమీన వదిలేసి సారాకోట్టు దగ్గర ఆగిపోయాను. నాకోసం నువ్వు రెక్కలు ముక్కలు చేసుకోవడం ఆత్మాభిమానం ఉన్న వరానికి నచ్చలేదు. అందుకే నాతో గొడవపెట్టుకొని మరి నన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది. ఇక్కడకి వచ్చాక కూడా కొన్నాళ్లపాటు వరాన్ని తిట్టాను, కొట్టాను. అయినా భరించింది కానీ ఏ రోజు నా పరువు బజారున పెట్టలేదు. నా కోపం అంతా నిన్ను వదిలేసి నేను ఎందుకు ఇక్కడ ఉండాలనే ఆలోచన. కానీ అసలు నన్ను ఇక్కడికి తీసుకు రావడానికి కారణం ఏంటని నేను ఎప్పుడూ అడగలేదు. తాగి తాగి ఆరోగ్యం చెడగొట్టుకున్నాను. మన ఇంటికి వెళ్లిపోవాలని గొడవ చేశాను.

           ఏరోజు నన్ను పల్లెత్తి మాటనని వరం ఆరోజు చాచిపెట్టి కొట్టింది. నిర్ఘాంత పోయాను నాలోని ఆహం ఇంకా నిద్ర లేచింది.దాన్ని వదిలేస్తున్నాను అని చెప్పాను. ఇక్కడనుంచి వెళ్లి పోతాను అన్నాను, అప్పుడు వరం నన్ను ఒకటే మాట అడిగింది అమ్మ..."

"ఇంకా తల్లి మీద తల్లి కట్టం మీద పడి బతికే నువ్వు ఉంటే ఎంత, సస్తే ఎంత? పెళ్ళాన్ని పూటకి ఇంత కూడు పెట్టలేవు,తల్లికి ఇంత గంజిపొయ్యలేవు,పెళ్ళానికి మానం దాసుకోవడానికి ఇంత గుడ్డ కొనలేవు నీ తాగుడు,నీ తిండి, నీసుఖం...ఇలాంటి వాణ్ణి ఏ అభిమానము ఉన్న ఆడపిల్ల మొగుడిగా ఒప్పుకోదు.నేను కూడా నువ్వు నన్ను వదిలేసినందుకు నేనేం భాదపడను."

   "వరం మాటలకి ఆశ్చర్యపోయాను ఎప్పుడూ మాట పడకపోవడం వల్లేమో నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అప్పుడు వరమే ఇలా అంది"

 " నిన్ను మార్చాలని ప్రయత్నించి ప్రయత్నించి నేనే విసిగిపోయాను. అయినా నాకు అర్థం కాని విషయం ఒకటి అడుగుతాను చెప్పు , అసలు మీ అమ్మ ఏం సుఖపడింది. మీ అయ్య కొట్టడం ,తిట్టడం ఓర్చుకుని మీ నలుగురిని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేసింది. మీ అమ్మని చిన్నప్పుడునుంచి చూసిన వాడివి కుదిరితే కూర్చోబెట్టి సాదాలిసింది పోయి నువ్వు భారమైంది కాక, నన్ను కూడా ఆమె మెడకు గుదిబండలా చేశావు. ఒక మనిషి కష్టం, ఎంతమందికి కూడు పెడుతుంది . 40 ఏళ్ల నుంచి కష్టం చేస్తూనే ఉంది.అయిన కూడా నీ మనసు కరగటం లేదా ప్రయోజకుడివై తల్లిని చూసుకోవాలి అనుకోవాలి కానీ, ఆమెని, ఆమె కష్టానికి వదిలేసి కట్టుకున్న దాన్నీలా గాలికి వదిలేసి నీ తాగుడుకు బయలుదేరుతున్నావు. ఏం బతుకు రా...నీది. ఎవరికి ఉపయోగంలేని నువ్వు బ్రతికితే ఎంత పోతే ఎంత. బ్రతికున్నప్పుడు తల్లిని,పెళ్ళాన్ని ఏడిపించే నీలాంటోడు చచ్చాక తల్లి కళ్ళలో కూడా నీళ్లు బయటికిరావు. సివరికి నీది అలాంటి కుక్క బతుకే అవ్వుది. ఎక్కడికి పోతావో పో....నాకున్న ఆధారం ఈ ఒక్క గదే ఇక్కడే ఉండి నా కష్టంతోనే బ్రతుకుతాను. అంతేకానీ నీలా... ఒకరి మీద ఆధారపడి ఎప్పుడూ బ్రతకను. అలా బ్రతికిన్నాడు నేను చచ్చినట్టే లెక్క. ఎక్కడికి పోతావో పో" అని నన్ను బయటకు నెట్టి తలుపేసుకుంది.

      "నన్ను బయటికి నెట్టి తలుపేసుకొనే సరికి కోపం వచ్చి అక్కడినుంచి సారాకొట్టుకే పోయాను.దాని మీద కసితో సంపాలనుకున్న.... గొడ్డలి తీసుకొని వచ్చాను కూడా!! అప్పుడే ఇంట్లో ఆళ్ళమ్మ తో వరం మాట్లాడిన మాటలు విని ఆగిపోయాను." అంటూ ఆపాడు.

కొడుకు చెప్తున్న మాటలకి నివ్వెరపోయి చూసింది శాంతమ్మ. "నీ కొడుకు పెళ్ళాం కొంగు పట్టుకొని పోయాడే శాంతమ్మ" అని అందరు అంటుంటే కొడుకుని తనకి దూరం సెసిందని వరాన్ని తిట్టుకొని రోజంటూ లేదు.కానీ కొడుకు వరం గురించి చెప్తుంటే కోడల్ని తప్పుగా అర్ధం చేసుకున్నందుకు తనలో థానే బాధపడింది శాంతమ్మ.చిన్నగా నోరు పేగుల్చుకొని "ఎం విన్నావు బిడ్డ" అని అడిగింది.

  "ఎందే అల్లున్ని ఇంట్లో నుండి గెంటేశావా? పిచ్చెమన్న ఎక్కిందా ఏమే! మోగున్నీ వదిలేసి ఎం చేద్దామనుకుంటున్నావు హ..."అని అరుస్తుంది వరలక్ష్మి తల్లి.

"ఎం చెయ్యమంటావు అమ్మ...మరి.ఎన్ని రకాలుగా బతిమిలాడినా మాట ఇనక పోతే ఎం సెయ్యను.కొడితే పడ్డాను,తిడితే పడ్డాను,సాయంత్రానికి అన్ని మర్శిపోయి సుఖపెడుతున్న అయిన కూత్త కూడా మడిసికి బ్రతుకు గురించిన ఆలోచన లేకపోతే ఎం చేయమంటావు.కోపంలో అన్న ఒక్కమాట గుర్తుంది కానీ,ఇన్ని దినాలు నేను పంచిన ప్రేమ గుర్తులేదు నా మొగుడికి. అది గుర్తుకొచ్చిననాడు ఆడే వత్తాడు.అప్పటిదాకా ఎదురు చూడగలను.

"ఎక్కడికి వత్తాడే నువ్వు కాకపోతే ఇంకో ఆడదే దొరకదా నీ మొగుడికి.ఆడదానివి మొగుడు ఎట్టా ఉన్న సర్దుకుపోవాలి కానీ,ఇట్టా ఈదిన పడతావా"

"ఈదిలో పడలేదు, గోతిలో పడలేదు. రేపు పొద్దుగాలకి వత్తాడు సూడు.నేను నా మొగుడికి పంచిన పేమలో ఏ లోటు లేనప్పుడు ఆయనకు మాత్రం నామీన పేమ ఉండదా....ఆడిమీద నాకా నమ్మకం ఉంది."

"ఒకవేళ రాకపోతే ఎం జెత్తవే"

"మా అత్తకాడికి పోతా...నీ కాడికి అయితే రాను." అని కోపంగా చూపింది.

"మొగుడొద్దు కానీ,మొగుడితల్లి మాత్రం కావాలా ఎం మీ అత్తతో చెత్తవా కాపురం" అని అరిచింది తల్లి.

"పెళ్లిజెసి పంపాక అన్ని మా అత్తగారిల్లే నాకు.ఆడు బాధ్యత మర్శిపోయాడని నేను కూడా మర్శిపోనా...మా అత్త ఎంత మంచిదో నీకేం ఎరుక.సంవత్సరం పాటు కాలు నోయ్యకుండా సూసింది నన్ను.అమ్మ కంటే ఎక్కువగా...నా మొగుడికి బదులు నేను కొడుకవుతాను నా అత్తకి. అంతే కాని,నీ ఇంటిగుమ్మం మాత్రం తొక్కను.అట్ట అని ఆడితో కాపురం సెయ్యను.మా అత్తకి అండగా మాత్రమే ఉంటాను.

మడిసికోమాట,గొడ్డుకో దెబ్బ అన్నారు.మాట,దెబ్బ రెండు ఐనది. మారి మడిశవుతాడో అలానే గొడ్డులా వూరిమీద పడి ఆంబోతుల తిరుగుతాడో ఆడి ఖర్మ.నా మట్టుకు ఆడంటే నాకు పానం.వాడికోసం పానాలు ఇయ్యగలను,తియ్యగలను.కానీ వాడిలాగా ఉంటే మాత్రం సేరదియ్యలేను.ఆడిని తప్ప మరో మగాన్ని జీవితంలోకి రానియ్యను. ఆడెన్ని అన్నా ,ఆడే నాకు జీవితం.మారసుకోవడానికి ఒక్కోసారి మన మనస్సాచ్చిని సంపాకోవాలిసొత్తది.ఇప్పుడు నేను సెసింది కూడా అదే!!నా బతుకు ఎట్టా రసుంటే అత్తా జరుగుతాధి.ఇక నువు పో..."

"చూద్దాం ఎంతగనం మారుత్తావో..." అని విసురుగా చెప్పి బయటికి వెళ్లిపోయింది వరం తల్లి.

"నీకు నేనేం తక్కువ సేసినా అయ్య...తాగుడు మానమన్నా దానికే ఇంతలా గోస పెడుతున్నావు.మన బిడ్డ కోసం అదికూడా సెయ్యలేవా...."అని కడుపు తడుముకుంటూ...గోడమీదున్న పెళ్లి ఫోటో పట్టుకొని ఏడుస్తుంది వరం.

"వరం కడుపుతో ఉందని అర్ధమవగానే ఎం మాట్లాడాలో తెలియలేదమ్మ...దానికోసం కూడా కాదు నీకోసం మారమంటున్నది.నామేన పానం పెట్టిన పెళ్ళాన్ని సంపబోయిన అది తలుసుకుంటేనే పానం గుజుకుంటుంది నాకు.దాని బాధలో నాయం ఉంది.అందుకె మారాలి అనిపించింది.వెంటనే వరాన్ని నా తప్పు కాయమని అడిగినా, ఎప్పుడు కోట్టనని మాటిచ్చినా అట్లనే ఉంటున్నా...నాకు పని కూడా అదే కుదిరించింది.బాగానే జీతం వత్తది.నీకు డబ్బు పంపియ్యాలి అనుకున్నాను.అదే సెప్తే డబ్బు కాదు,ఇక్కడే ఇంటికి అనుకోని ఇంకో గది కట్టి అత్తోళ్ళని ఇక్కడికి తీసుకొచ్చుకుందాం అన్నది. అందుకే ఇంకా కట్టపడ్డాను.నాతో పాటు అది కూడా....సానావరకి బాగానే కూడబెట్టం అమ్మ..ఇంకో ఆరు నెలలు ఆగితే గది కట్టెత్తం.నువ్వు,అయ్య ఇక్కడే ఉండొచ్చు ఇంకా...."

           ఎప్పుడొచ్చినా అత్తా అంటూ ఎదురొచ్చి నవ్వుతూ పలకరించే కోడలు మొహం గుర్తురాగానే లొలొపలే మురిసిపోయింది శాంతమ్మ.పేరుకు తగ్గితే వరం మాకు దొరకడం మా అదృష్టం.పధికాలాలపాటు సల్లగా ఉండాలని మనసులోనే కోరుకుంది.

"ఎందమ్మ ఎం మాట్లాడవు...."అన్న కొడుకు మాటలకి ఆలోచనలు చెదిరి

"ఎం మాట్లాడమంటావు రా....మాటలు రావట్లేదు.నిజంగా మన"వరాలు" బంగారమే!!దాని మనసు ఎప్పటికి కట్టపెట్టకు బిడ్డా..!! ఇప్పుడిక బాధ్యత పెరిగింది ఇంకా కట్టపడాలే ఇద్దరు.నా మనవరాలు బతుకైన ఈ సాలిసాలని బతులనుండి బయటపడాలి.నా చేతుల్లో సత్తువ వున్నంతవరకి మీకు తోడుగా నేనుంటా....బిడ్డని బాగా సూసుకోండి.వరాన్ని ఇప్పుడప్పుడే పనికి పంపియమాకు....ఒక యేడాది పోయాక పొయ్యిద్ధిలే! జాగ్రతగా కుటుంబాన్ని బాటన పెట్టుకోండి." అని కొడుక్కి హితబోధ చేసింది.

"అట్ఠాగే అమ్మ ఇక పడుకో బాగా పొద్దుపోయింది." అని ముసుగుతన్నాడు రాంబాబు.

తన కోసం కన్నవాళ్ళని కూడా వదులుకుంటానన్న వరం ముందు తను ఎందుకు తూగను అనిపించింది శాంతమ్మ కి.ఆలోచనల నడుమే తెల్లారింది.ఇక ఇంటికి పోవడానికి అని బయలుదేరి వరం దగ్గరికి వచ్చింది .

"ఇక నేను పొయ్యెత్త వరం.ఇక్కడ కూడా ఇరుకుగానే ఉంది..ఇంకో వారం లో నేను వచ్చి తీసుకుపోతాను.తర్వాత మీ ఇంట్లో ఉందువుగాని అని రాంబాబు" అని పిలిసింది.బయటకూర్చోని మామతో మాట్లాడుతున్న రాంబాబు ఇంట్లొకొచ్చాడు.తన చీర కొంగులో ఉన్న డబ్బులు తీసి కోడలు చేతిలో పెట్టి....

"బిడ్డ కోడలు ఇంకో పది రోజుల్లో మీ ఇంటికి వత్తది.ఈ డబ్బుతో మంచం కొను.బాలింతలు కింద పడుకోకూడదు సంటిది కూడా ఎట్టా పడుకుంటాది.గది సంగతి తర్వాత ముందు మీకు మీరు సక్కబడండి.మేము ఇక్కడికొచ్చిన మీ అయ్య మీ పానాలు తోడతాడే కానీ సాయంగా ఉండడు.అందుకె మేము అక్కడే ఉంటాం.మీరు ఇక్కడే ఉండండి.ఏమన్నా అవసరం వత్తె నాకు కబురు సెయ్యండి.నాకు చేయాడినంతకాలం మీకు ఏ భాద రానివ్వను." అని కోడలు చెంప నిమిరి "నా మనవరాలు ఎలా వుండాదో సూద్దాం అని వచ్చాను. మన "వరాలు" మనసెంటో తెలుసుకొని పోతున్నాను. ఇద్దరు సల్లగా ఉండండి." అని కళ్ళనిండా నీళ్లతో దీవించి."నా కొడుకుని ప్రయోజకుణ్ణి సేసినందుకు జీవితాంతం నీకు దాస్యం సేసినా రుణం తీరదే వరాలు " అని కోడల్ని హత్తుకొని వదిలి "ఇక నేను పొయ్యెత్తా" అని మనవరాల్ని ముద్దు సేసి బయటికి నడిచింది.

అత్త మాట్లాడిన మాటలు అర్ధమవక భర్త వైపు చూసిన వరానికి నవ్వుతున్న రాంబాబు కనిపించే సరికి విషయం అర్ధమై అత్త అని పిలిచింది.

వరం పిలుపుకు వెనక్కి తిరిగిన శాంతమ్మ తో...."నేను ఎం గొప్ప పని సెయ్యలేదు అత్త .భార్యగా, నా భర్తని దారిలో పెట్టుకున్నా అంతే! అమ్మ తర్వాత అమ్మగా నిన్ను నా బాధ్యత అనుకున్నాను అంతే! ఈకాత్త దానికే నన్ను గొప్పదాన్నీ సెయ్యకు." అనగానే వరలక్ష్మి తల నిమిరి "ఆరోగ్యం జాగ్రత్త" అని నవ్వుతూ అక్కడినుండి నిష్క్రమించింది.

                       ★★★★★★

సమాప్తం.



Rate this content
Log in

Similar telugu story from Drama