స్వాతి సూర్యదేవర

Classics Inspirational Others

4.2  

స్వాతి సూర్యదేవర

Classics Inspirational Others

కృతజ్ఞత

కృతజ్ఞత

5 mins
786


"మీరు తినేదాంట్లోనే ఒక ముద్ద పెట్టండమ్మ చాలు" అన్నది రంగి.

"అధికాదే రంగి ,ఇప్పడు నాకే కటకటగా ఉంది ఇక నిన్నెం పోషించగలను . జీతం ఎం ఇవ్వగలను నువ్వే చెప్పు" అని వాపోయారు డెబ్భై ఐదేళ్ల సావిత్రమ్మ.

"మీరు అనేది సబబే అమ్మ.కానీ నాకు మిమ్మల్ని వదిలి వెళ్లడం ఇష్టం లేదు అమ్మ."

"ఇష్టం లేదంటే ఎలాగే!పాపం వాడు గంట నుండి నీకోసం ఎదురుచూస్తున్నాడు.పట్నానికి బస్ కి కూడా యేళవుతుంది వేళ్ళు నువ్వు ముందు."

"మీరేన్నయిన సెప్పండి అమ్మగారు.నేను వెల్లనంటే వెళ్ళను" అని మొండికేసింది రంగి

"అక్కడ నీ కొడుకు నీకు రోజు పంచభక్ష్య పరమన్నాలు పెడతా అంటుంటే నాతో పాటు గంజితాగుతా అంటావెంటే" అని ఒక రకమైన భాధ విసుగు కలిపి అన్నారు సావిత్రమ్మ.

"ఆడు ఏట్టే ఏ పరమాన్నాలు నాకొద్దు ఇక మీరేం మాట్లాడకండి నేను ఇక్కడే ఉంటా పిలగాన్ని ఎల్లమని సెప్పోత్త ఆగండి " అని ఇంటికి వెళ్లాడానికని వెనక్కి తిరిగింది.

"రంగి ఆగు..నీకు నా మాటంటే లెక్క లేదా ఏమే!?" అని కోపంగా అరిచారు సావిత్రమ్మ.

ఆ మాటకి వెనక్కితిరిగి కళ్ళెంట నీళ్లు తిప్పుకొని "నేను పుస్తె కట్టించుకొని ఈ ఊరికోచ్చినకాన్నుంచి నాకు అమ్మైనారు.పేరుకి పనిదాన్నే అయిన సొంతబిడ్డ మాదిరి సేరదీసినారు.తాగుబోతు మొగుడితో పడలేక సావబోతున్న నన్ను కాపాడి నా బిడ్డకి సధువు సెప్పించారు.కట్టం అన్న పేతిసారి నేనున్నా అన్నారు.నా మొగుడికి బుద్ధి సెప్పి నా కాపురం సక్కబెట్టారు.ఇయ్యాల నా బిడ్డ పట్నంలో అంత పెద్ద ఉద్యోగం సేత్తన్నడన్నా,ఇయ్యాల నన్ను సూసుకుంటాను అంటన్న అదంతా మీ సలవే అమ్మా.. మరి నాకింత సేసిన మీ మాట కాక ఇంకెవరు మాట ఇంటా అమ్మ" అని కన్నీరు పెట్టుకుంది రంగి.

కర్రపోటుతో రెండడుగులు ముందుకేసి "నేనేం చేసిన అది సాయం మాత్రమే నే రంగి, కానీ ఇలా నీకు అడ్డంకి కావడానికి కాదు" అని కన్నీరు పెట్టుకున్నారు సావిత్రమ్మ. రంగి కూడా ఏడుస్తూ సావిత్రమ్మ ని కావాటేసుకొని "మీ కన్నీళ్లు నేను సూడలేను అమ్మగారు. అలా అని ఈ వయసులో మిమ్మల్ని ఇట్టా అనాధలా వదిలేసి వెళ్లలేను నా మాట ఇనండి అమ్మా." అని బతిమిలాడింది

రంగిని వదిలి నువ్వు "ఉన్న లేకున్నా నేను అనాథనేనే రంగి.కట్టుకున్న వాడు అర్ధాంతరంగా వదిలేసిపోయిన, కన్నబిడ్డల కోసం కడుపు కట్టుకొని , ఈ సంసారాన్ని లాక్కొచ్చాను.వాళ్ళకి సధువులు చెప్పించి, పెళ్లిళ్లు చేసాను.రెక్కలొచ్చాయి, ఎగిరిపోయారు.వాళ్ళ బిడ్డల చదువులు,పెళ్లిళ్లు ,మనవళ్ళు అని ఆ వ్యాపాకంలో పడిపోయారు. ఇక్కడ ఒక అమ్మ ఉన్నదన్న సంగతే మర్చిపోయారు.కాలు, చెయ్యి కాస్తా ఆడుతుంది కాబట్టి వచ్చే ఆ పింఛను డబ్బులతో వెళ్ళదీస్తున్నాను.రెణ్ణెళ్ల నుండి అయ్యి కూడా లేవు.నాకే రేపటి రోజు ఎట్టా అని గుబులుగా ఉంది.ఇక నీకేం పెట్టేదే!? అందుకే నిన్ను పంపడం ఇష్టం లేకపోయినా వెల్లంటున్నాను" అని కళ్లు వత్తుకున్నారు సావిత్రమ్మ.

"అధికాదమ్మగారు..." అని ఏదో సెప్పబోయిన రంగి మాట మొదలవ్వకుండానే "అమ్మా" అన్న పిలుపు వినపడి గుమ్మం వైపు చూసారు.ఇద్దరూ...

లోపలికి వస్తున్న రంగి కొడుకుని చూసి ఆశ్చర్యపోయారు.వీల్లదగ్గరికి వచ్చిన రంగి కొడుకు,సావిత్రమ్మ కాళ్ళకి దండం పెట్టాడు. తల నిమురుతూ "చల్లగా వుండరా బుల్లబ్బాయి" అని దీవించింది సంతోషంగా.

పైకి లేచి నవ్వుతూ..."నా పేరు సూర్య పెద్దామే!...మర్చిపోఇనావా ఏంది?" అని పరిహాసం ఆడాడు సూర్య.

చిన్నగా తలపై మోడుతూ "మర్చిపోలేదులేరా బడుద్దాయి" అని నవ్వింది.ఎప్పుడు బుల్లాబ్బాయి అని పిలిచిన ఇలాగే అనే సూర్య మాట గుర్తుతెచ్చుకొని.

"ఏంది సూర్యం ఇట్టా వచ్చావు.నేనే వస్తా అన్నాను గా" అని కంగారుపడుతూ అన్నది రంగి.ఎక్కడ సావిత్రమ్మ గారిని వదిలి రమ్మంటాడో అన్న భయంతో.

"ఎం లేదులే అమ్మ..నాకు బస్ కి టైం అవుతుంది నేను ఇక బయలుదేరతాను అదే మీకు చెప్దామని" అంటూ తన చేతిలో ఉన్న ట్రంకు పెట్టే తల్లి చేతికి అందించాడు.

అది తీసుకుంటూ..వెళ్ళడానికి మనసొప్పక భాధగా ఉంటే అంతలోనే తను ఒక్కడే వెళ్ళాలి అనడం గుర్తొచ్చి టక్కున కొడుకుకేసి కళ్ళనిండా మెరుపుతో,అంతకంటే ఎక్కువ ఆనందం తో చూసింది.

తల్లి ఉద్దేశ్యం అర్ధమై అవును అన్నట్టు కళ్లార్పి, వాళ్లనే అయోమయంగా చూస్తున్న సావిత్రమ్మ వైపు తిరిగి,"ఇగో పెద్దామే! మా అమ్మని నీకు అప్పచెప్తున్న జాగ్రత్త.నేను మీ ఇద్దరిని చూడడానికి నెలకోసారి వస్తూనే ఉంటాను.జాగ్రత్త" అని చెప్పాడు.

ఆశ్చర్యంగా "అదేందిరా అలా అంటావు.మీ అమ్మని కూడా తీసుకుపోతా అన్నావుగా!? "

"ఇప్పుడు కాదులే పెద్దమే! ,మా అమ్మ బాధ్యత ఇక్కడ ఇంకా ఉంది అది నేనే గుర్తించలేదు" అని నొచ్చుకున్నాడు.

"మీ అమ్మ బాధ్యత! అదేంటి రా...!? మీ నాయనా లేడు,నీకా ఒక కుటుంభం చూపించింది ఇంకేం బాధ్యత ఉంది!?."

సావిత్రమ్మ భుజాలపై చేతులు వేసి "తన బాధ్యత ఇంకా ఉంది బామ్మ.అది ఇదిగో.." అంటూ కళ్ళతోనే నువ్వే అన్నట్టు సావిత్రమ్మ కి సైగ చేసాడు.

కళ్ళలో నీరు చేరగా "సూర్యం" అంటూ ఇంకా మాట్లాడలేక ముగబోయింది సావిత్రమ్మ.

కన్నీరు తుడిచి, "బామ్మ ఎందుకు ఆ కన్నీళ్లు హ. నీకు ఎవరు లేరని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు.నీకు నీ బిడ్డ లాంటి మా అమ్మ,నేను ఉన్నాం ఒకప్పుడు నువ్వు మమ్మల్ని ఆదుకున్నావు.ఇప్పుడు నీ పరిస్తితి బాగలేకపోతే మేము నిన్ను చూస్కోలేమా. నువ్వు మా అమ్మకి ఏ జీతాలు ఇవ్వనక్కర్లేదు.నీకు ఇష్టం ఉండదని ఇన్నాళ్లు తీసుకుంది కానీ,తనకి నీ దగ్గర రూపాయి తీసుకోవడం కూడా ఇష్టం లేదు. మా అమ్మ నీ దగ్గరనుండి తీసుకున్న ప్రతి రూపాయి మా దేవుడి మందిరంలో ఆ శ్రీనివాసుడు పాదాల దగ్గర భద్రంగా ఉంది."అని తనతో తెచ్చిన ఆ డబ్బుని తీసి రంగి చేతికి ఇచ్చాడు.ఆ డబ్బుని తీసుకొని కళ్ళకి అద్దుకుంది రంగి.

"బామ్మ నువ్వు ఎలాంటి మోహమాటనికి పోకు. మా అమ్మని నా బిడ్డ అనుకుంటా అని నాతో చాలాసార్లు అన్నావు గుర్తుందా!?" అవునన్నట్టు తెలుపిన సావిత్రమ్మ ని చూసి నవ్వి..

"హుమ్.. అందుకే నీ బిడ్డ, నీకు ఈ ముదిమి వయసులో నీకు సాయంగా వచ్చింది.కాదనకు.మా అమ్మ అవసరం నీకు ఇప్పుడే కావాలి. ఇలాంటి స్థితిలో నిన్ను వదిలి వెళితే మాకంటే స్వార్ధపరులు ఈ లోకంలోనే వుండరు.మా అమ్మ ఇక ఇక్కడే ఉంటుంది.ఈ ఇంట్లోనే ఉంటుంది.నీకు ఇష్టం లేకపోయినా సరే " అన్నాడు.

అతని మాటలకి ఇంకా ఆలోచనతోనే ఉన్న సావిత్రమ్మ ని చూసి,"మా అమ్మని నువ్వేం ఊరికే ఉంచుకోవద్దులే పెద్దామే!" అని నవ్వి తన జేబులో నుండి ఒక కాగితం తీసి సావిత్రమ్మ చేతిలో పెట్టి "ఇది నీ పెన్షన్ కాగితం బామ్మ రేపు పంచాయితీ గుమ్మస్థ వస్తాడు ఇవ్వు. రేపు నెల నుండి నీకు పేన్షన్ వస్తుంది అప్పటిదాక ఈ డబ్బు వాడుకోండి.మీకు ఏ సమయంలో ఏ అవసరం వచ్చిన నాకు ఒక్క ఫోన్ చెయ్యండి నేను మీకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను".అని చెప్పాడు.

చేతిలో ఉన్న కాగితాన్ని చూసుకుంటూ...ఎప్పుడో చేసిన మాట సాయానికి ఇంత మూల్యమా!! అని ఇద్దరి వైపు ఆరాధనగా చూసింది సావిత్రమ్మ ఏమి మాట్లాడలేక,మాటలు కూడా రాక.

"సరే బామ్మ,అమ్మ నేను వెళ్ళొస్తాను నాకు బస్ టైం అయింది."

ప్రేమగా సూర్యం తల నిమిరి "మళ్ళీ జన్మ అంటూ ఉంటే నీ కడుపునే పుడతానురా సూర్యం" అని ప్రేమగా సూర్యాన్ని హత్తుకుంది.ఆవిడ చుట్టూ చేతులేస్తూ.."సూర్యం కాదు పెద్దామే బుల్లబ్బాయి." అని జీరాబోయిన గొంతుతో అన్నాడు సూర్యం.

వాళ్ళిద్దరిని కళ్ళార్పకుండా చూస్తూనే, కొడుకు మంచి మనసుకి మనసులోనే మురిసిపోయింది రంగి.

సావిత్రమ్మ ని వదిలి "ఇంకోవారం లో నీ బిడ్డలు,మనవళ్ళు,మునివనవళ్ళు అంతా నీ ముందు వుంటారు.ఇక దిగులు పెట్టుకోకు "

"వద్దురా...నా కోసం వాళ్ళ దగ్గర నువ్వు తగ్గడం నాకు ఇష్టం లేదు సూర్యం.నాకు మీరు ,మీ ఆత్మేయత చాలు.పేరుకు తగ్గట్టు పది మందికి ఇలానే మంచి చేస్తూ వుండు నాన్న.ఆ మంచే నిన్ను చల్లగా ఉండేలా చేస్తుంది. జాగ్రత్తగా వెళ్ళిరా.."అని చెప్పింది.

సరే అని తలుపి తల్లికి కూడా చెప్పి వెళ్ళిపోయాడు సూర్యం. కొడుకు వెళ్లిన వైపే చూస్తూ నిలబడ్డ రంగి ని చూసి "ఏంటే రంగి తుమ్మమొద్దులా అలా నిలబడ్డావు వెళ్లి పెరట్లో చెట్లకి నీళ్లు పొయ్యి పో" అని గేదిమింది సావిత్రమ్మ.

సావిత్రమ్మ మాటకి వెనక్కి తిరిగి "ఇదిగో పెద్దమ్మ గారో ఏంటి నోరు పెంచుతున్నారు..ఇలా అంటే నేను పని మానేసి పోత ఏమనుకున్నారో" అని ఇంకా గట్టిగా రెట్టించింది రంగి.

"ఏంటే నన్నే బెదిరిస్తున్నావు నా మనవడికి ఒక్క ఫోన్ చేసాను అంటే నీ ఉద్యోగం ఉడిపోద్ది ఏమనుకున్నావో" అని ఇంకా గట్టిగా అరిచింది సావిత్రమ్మ.

"ఏది చెయ్యండి నేను చూస్తా..." అంటూ మీదకి పోతున్న రంగి, "ఏమే మీ గోల ఎన్నాళ్ళకి అగుద్ది ఏ రోజున ఇదే తగువు నలభై ఏళ్ల నుండి చూసి చూసి విసుగుపుడుతుంది" అని గోడ దగ్గర నిలబడి అరుస్తున్న పక్కింటి కాంతమ్మ మాటలకి ఆగి "మధ్యలో మీకేం నొప్పి అమ్మ మాకు మాకు వందుంటాయి మీకెందుకు? మీరెల్లి ఆ పక్కింటి కామాక్షి అమ్మతో ముచ్చట్లు పెట్టుకో పొండి" అని అరిచి చెప్పి కోపంగా తన వైపే చూస్తున్న సావిత్రమ్మ ని చూసి..చెవి వెనుక గీక్కుంటు హీ..హీ..హీ...అంటూ పిచ్చి నవ్వు నవ్వింది రంగి.

రంగి హావభావాలు చూసి కోపం నటించలేక పెద్దగా నవ్వింది సావిత్రమ్మ.ఆమె నవ్వుని చూసి ,తన నవ్వుని కూడా జత కలిపింది రంగి.

ఎంత సాయం అన్నది కాదు, మంచి మనసు ముఖ్యం దేనికైనా!.

                        ★★★★★★

సమాప్తం*



Rate this content
Log in

Similar telugu story from Classics