స్వాతి సూర్యదేవర

Classics

3.4  

స్వాతి సూర్యదేవర

Classics

అమ్మతనం

అమ్మతనం

2 mins
1.2K


ఒక అమ్మ మొదటి అనుభవం

ఆ క్షణం నన్ను నాకు ఎంతో కొత్తగా పరిచయం చేసింది. చాలా కొత్తగా ఉంది ఈ అనుభూతి. కలువరేకులలాంటి లేలేత చేతులు,కాళ్ళు. ఇంకా రక్తం మరకలు తడారని దేహం, ఉమ్మనీరు తో అప్పటి వరకు నానిన చర్మం తెల్లగా మెరుస్తుంది. ఇంకా కనురెప్పలు కూడా పూర్తిగా తెరవలేదు అయినా,తన చిన్న పిడికిలిలో నా వేలు బంధించింది. "నువ్వేనా నా అమ్మవి" అని అడుగుతున్నట్లు ఉంది ఆ చేతి పట్టు.

    పట్టుకుంటే ఎర్రగా ఐపోతూ పాలు కారుతున్నట్టు ఉంది నా చిట్టి తల్లి మోము. అప్పటివరకు పడిన ప్రసవవేదన క్షణాల్లో మాయమైంది. ఇంతకు మునుపెన్నడూ చవిచూడని ఏదో కొత్త అనుభూతి నన్ను చుట్టేసింది. నా పేగుబంధం, నా నుండి పుట్టిన ఒక జీవి...నా ప్రాణం అయ్యింది ఈ క్షణం అనుకోగానే నా గుండె వేగం హెచ్చుతుంది .కళ్ళల్లో నీరు పేళ్లేవుబుకుతుంది.

  ఎవరి మాటలు ,నవ్వులు నా చెవిని చేరట్లేదు. కేవలం నా చిట్టి తల్లి చిందిస్తున్న బోసినవ్వులు తప్ప.అమ్మని అయ్యాను. అవును అమ్మని అయ్యాను తొమ్మిది నెలలు క్షణక్షణం తన కోసం ఎదురు చూశాను. మౌనంగా మనసు తోనే ఎన్నో ఊసులు చెప్పుకున్నాను.

     ఎన్నో ఆశలు,కలలు కన్నాను. నా కడుపులో ఉన్న రక్తపు ముద్ద కోసం, తన భవిష్యత్తు కోసం ఎన్నో ఆలోచనలు... ప్రతిక్షణం, ప్రతి నిమిషం తన ఆలోచనలే! తన ఊసులే!.ఆరో నెల తగలగానే "ఎలా ఉన్నావ్ అమ్మా" అని పలకరిస్తున్నట్టు తన చిన్ని చిన్ని కాళ్లతో తంతుంటే చెప్పలేని ఆ అనుభూతిని మొదటిసారి కళ్ళు మూసుకుని ఎంతోసేపు అనుభవించాను. కానీ ఇప్పుడు అంతకుమించిన అనుభూతి. సమాజంలో నన్ను ఒక అమ్మగా నిలబెట్టింది నా పాప. చెప్పలేని అనుభూతి కదా! నిజంగా మోయలేనంత హాయిగా ఉంది ఈ అనుభూతి, స్పర్శ!!.

"ఇంకా ఎంతసేపు అలా కళ్లు మూసుకుని ఉంటావే పిల్లకి కాసిని ముర్రుపాలు పట్టు, అవి చాలా బలం" అంటూ అమ్మ కదిపే సరికి కళ్ళు తెరిచాను.

   కానీ పాలు పట్టడం ఎలా లేచి కూర్చునే పరిస్థితి లేదు. అర్థం కాక అమ్మ వైపు చూశాను. అమ్మ కదా అమ్మకు అన్నీ తెలుసు... అందుకే నవ్వుతూ నా ముందుకు వచ్చి ఈ అమ్మ చనుబాలని నా బిడ్డ నోటికి అందించింది.

    చిన్ని చిన్ని చెక్కిలిగింతలు పెడుతున్నట్టు ఉంది నాకు. తల అటూ ఇటూ ఊపుతూ ఏదో గెలిచెయ్యాలి అన్న ఆత్రం తనది. కానీ ఎంత ప్రయత్నం చేసినా వృదా అనుకుంది ఏమో అలిగి అటు తిరిగిపోయింది.

    మళ్లీ అమ్మ మెల్లిగా నా చనుబాలని తన నోటికి అందించింది. ఈసారి తను ఎప్పటినుంచో వెతుకుతున్న అమృతధార నోటికి చిక్కింది .చిన్నగా చప్పరించింది.ఒక్కసారిగా నాలోని అణువణువు పులకరించింది. అమ్మతనం ఏమిటో, దానిలోని మాధుర్యం ఏమిటో తెలిసింది.గట్టిగా కళ్ళు మూసుకుని ఆ అనుభూతిని ఆస్వాదిస్తున్నాను. ఎంతసేపు అలా ఉన్నానో నాకే తెలియదు.కళ్ళలో తడి.

    ఇంతలోనే క్యారమని చిన్న శబ్దం చేసింది. అంతే ఒక్కసారిగా నా మనసు ఉలిక్కి పడింది. ఆ చిన్న శబ్దం కూడా భరించలేక వెంటనే, ఈసారి నేను నా బిడ్డ నోటికి నా స్థన్యం అందించాను. అప్పటివరకు సరిగా కళ్ళు తెరవని నా చిట్టి తల్లి ఒక కంటి తో నా వైపు చూసింది. "థాంక్యూ అమ్మా" అని చెప్పినట్టు ఉంది ఆ చూపు. నాలో నేనే నవ్వుకున్నాను. ఆ క్షణం నుంచి ప్రతిక్షణం నా చిట్టి తల్లి నన్ను నాకు కొత్తగా పరిచయం చేస్తూనే ఉంది ఈ క్షణం వరకు.

ప్రతి అమ్మ కి మధురమైన అనుభవాలలో ఇది ఒకటి!!

జనరల్ టాపిక్



Rate this content
Log in

Similar telugu story from Classics