5. వీడ్కోలు
5. వీడ్కోలు
కన్నీళ్లు ఆగడం లేదు ఆకాష్ కి....వార్తాపత్రికలో ఆ వార్త చదినప్పటినుంచీ...!
మాజీఎమ్మెల్యే రఘుపతిరెడ్డి అస్వస్థతకు గురయ్యారని తెలిసి... మనసంతా దిగులుతో నిండిపోయింది.
ఆకాష్ ముంబాయిలో ఓ ప్రముఖ కంపెనీకి మేనేజర్ పోస్ట్ లో ఉన్నాడంటే కారణం .....ఆయన అండదండలే. అందుకే ఆకాష్ లో అంతగా చోటుచేసుకుంది ఆవేదన.
రఘుపతిరెడ్డి నలభై ఏళ్ళ క్రితం చోడవరం ఎమ్మెల్యేగా చేసాడు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన కృషి అంతా ఇంతా కాదు. తాను రాజకీయాల్లో ఎదగడానికి...తనకున్న ఎకరాలన్నీ అమ్మేశాడు. తన పాలనలో ఆఊరు బాగుపడింది. ప్రజల కష్టాల్ని తనవిగా భావించబట్టే...ఆ ఊరి మహాత్ముడయ్యాడు. ఆపేరు చాలు...అందరి మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోడానికి.
ఆకాష్ కూడా అతనిచ్చిన ఆర్ధిక సహాయంతోనే...పై చదువులు వరకూ చదవగలిగాడు . "నీకు నేనున్నాను... నువ్వెంత వరకూ అయినా చదువుకో" అంటూ భుజం తట్టి మరీ పొరుగూరికి పంపారు అప్పట్లో. తన కారు డ్రైవర్ కొడుకే అయినా...సొంత బిడ్డలా ఆదరించడం కొంతమందికే చెల్లుతుంది.
ఒకప్పుడెంతో మోతుబారి అయిన రఘుపతిరెడ్డి ఇప్పుడు కటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. కూర్చుని తింటే కొండలైనా తరుగుతాయనే సామెత రఘుపతిరెడ్డి గారికి మాత్రం చెల్లదు. ఆనాడు ప్రజల కోసమే ఆస్తుల్ని అర్పించారు కాబట్టి...నేడు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లోనే కాలం చేయడానికి సిద్ధంగా వున్నారు.
ఎనభై ఐదేళ్ల వయసులో ఆయన అస్వస్థతతో అవస్థ పడుతుంటే ఇక వుండలేకపోయాడు ఆకాష్. ఆరోజే బయలుదేరి...రఘుపతి రెడ్డి గారిని హైదరాబాద్ లో ఓ మంచి ఆసుపత్రిలో వైద్యం ఇప్పించాలనుకున్నాడు. అదే విషయం భార్య భూమికతో చెప్పాడు. "ఆయన పూర్తిగా కోలుకునేవరకూ..మనమే దగ్గరుండి చూసుకోవాలి. దీనికి నీ సహాయం ఎంతైనా అవసరం. వెళ్ళగానే..ఆయన పరిస్థితి ఎలా ఉందో ఫోన్ చేసి చెప్తాను." అంటూ బయలుదేరుతుంటే ధైర్యంగా వెళ్ళిరమ్మని సాగనంపింది భూమిక.
ఫ్లైట్ లో కూర్చున్నాడే గానీ...రఘుపతిరెడ్డి గురించే ఆలోచిస్తున్నాడు. ఆయన పదవిలో ఆ ఊరికి చేసిన సేవ తల్చుకుంటుంటే...అప్పటికీ ఇప్పటికీ నాయకుల తీరులో వచ్చిన వ్యత్యాసానికి అంత బాధలోనూ ...ఆ
కాష్ పెదాలపై చిన్నగా నవ్వు మెరిసి మాయమయ్యింది.
ఆనాడు నాయకులు పదవి చేతికొస్తే... ప్రజల అవసరాల కోసం పాటుపడుతూ... ఉన్న ఆస్తుల్ని కూడా ఊడ్చేసుకునేవారు.
నేడు నాయకులు పదవి నడ్డుపెట్టుకుని ప్రజల్ని దోచుకుంటూ ఖాజానాలు నింపుకుంటున్నారు.
ఆకాష్...ఫ్లైట్ దిగి టాక్సీ చేసుకుని...చోడవరం వెళ్ళేసరికి...రఘుపతిరెడ్డి గారింటి ముందు జనం గుమిగూడి వున్నారు. అక్కడి పరిస్థితి ఊహకందింది అప్పటికే...! ఆయన్ని తీసుకునెళ్లి వైద్యం చేయించడానికి...అవకాశం ఇవ్వనేలేదు. నిజమే...ఆ పెద్దమనసుకి ఇవ్వడమే గానీ...ఎవరినీ అర్థించడం చేతకాదు.
ఒకప్పటి మాజీ మంత్రి కావడం వల్లనేమో.... అక్కడకొచ్చిన విలేకర్లకు...ప్రస్తుతం పదవిలో ఉన్న ఎమ్మెల్యే చెప్తున్నాడు....."రఘుపతిరెడ్డి గారు పదవిలో వుండగానే కాదు...ఎప్పుడూ ప్రజల్లో ఓ మంచిమనిషిగానే సేవ చేశారు. ఇలాంటి వారిని ప్రతి నాయకుడూ ఆదర్శంగా తీసుకోవాలి" అంటూ చెప్తుంటే...ఇప్పటి నాయకులందరూ చెప్పడమే గానీ ఆచరించడం రాని మహానటులే. అప్పటి నాయకుల పాలనలో నిజాయితీ ఇప్పటి నాయకుల పాలనలో రావడం కల్లే కదా...వారి మాటలు చెవినపడుతుంటే మనసులో అనుకుంటూ అక్కడ నుంచి ముందుకు కదిలాడు ఆకాష్.
మాజీ ఎమ్మెల్యే రఘుపతిరెడ్డి గారి పార్థివదేహం పై పూలమాలలు సమర్పించి ఉన్నాయి.
ఆయన్నిచూస్తూ...మాటరాక...వీడ్కోలుతో అశ్రు నివాళి అర్పించాడు ఆకాష్.*
*** *** ***