అరాచకం..
అరాచకం..


ఒక చిన్న ఊళ్ళో మంచి అబ్బాయి పల్నాటి వీర్రత్నంకి, చక్కని అమ్మాయి హేమ కుమారికి వైభవంగా కాకపోయినా, పద్దతిగానే పెళ్ళి చేశారు పెద్దలు. అందులో అమ్మాయి కాస్త మందమతి. అబ్బాయి కొద్దిగా కోపిష్ఠి. పెళ్ళైన కొన్ని రోజుల్లోనే అమ్మాయి హేమ గర్భం దాల్చింది. కానీ అబ్బాయి వీర్రత్నం కాస్త అల్లరి చిల్లరిగా తిరుగుతూ.., హేమ గురించి, ఇంటి గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. మీకు తెలియనిదేముంది...భర్త పట్టించుకోని సంసారమెలా ఉంటుందో..! హేమ చూసుకునేవాళ్ళు లేక ఇరుగు పొరుగు వాళ్ళ మీదే ఆధారపడ సాగింది. ఇరుగు పొరుగునున్న వాళ్ళు చూసుకుంటున్నామనే ముసుగులో... హేమను విపరీతమైన ధోరణిలో మోసం చేసేవారు. ఇలా హేమ చాలానే ఛీత్కారాలను, అవమానాలను ఎదుర్కొంది.
చివరికి ఎలాగోలా కడుపులో బిడ్డ బయట పడింది. పడ్డంపడ్డమే..పక్కింట్లో ఉండే నేరాంశ్ కన్ను బిడ్డ మీద పడింది. చూస్కునే వాళ్ళా లేరు. ఎవర్ని పిలిచినా, వాడుకునే వాళ్ళే తప్ప మనస్పూర్తిగా సహాయపడేవారు లేరు. దాంతో అదే అదనుగా... బిడ్డను మొదటి రోజే ఎత్తుకుపోయాడు... ఏం చేశాడన్న విషయం తెలుసుకునే లోపు..., హేమ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.
అలా బిడ్డను దూరం చేసుకుని.., భర్త పట్టించుకోని హేమను అక్షరాలా బానిసగా మార్చేశారు చుట్టూ ఉన్న జనాలు. ఇక బిడ్డ ఏమయ్యాడంటే.., నేరాంశ్ వాడిని వేరే రాష్ఠ్రాల్లో ఉన్న ఒక మాఫియా గ్యాంగ్ కి అమ్మేశాడు. వాళ్ళు వాడి కాళ్ళూ, చేతులు విరిచేసి కుంటివాడిని చేసి భిక్షమెత్తిస్తున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత బిడ్డ జాడ తెలుసుకోలేని హేమ పని చేసీ.., చేసీ.., ఇక చేయలేక మంచాన పడి ఊపిరొదిలేసింది.
అన్ని సంవత్సరాలు పని చేయించుకున్నామన్న కృతజ్ఞత కూడా లేని జనాలు పట్టించుకోకపోవడంతో, మున్సిపల్ వాన్ లో తీసుకెళ్ళి దహనక్రియలు ముగించారు. ఇప్పుడు చెప్పండి మీ అభిప్రాయం..! తీవ్రమైన బాధ కలిగిందా..? లేక ఓ పాత సినిమా కధ మళ్ళీ చెప్పి అభిప్రాయం అంటాడేంటని కోపంగా ఉందా..? ఓ పని చేయండి. ఈ క్రింది విధంగా పాత్రలను మార్చి మళ్ళీ ఒకసారి కధను మననం చేసుకోండి...!
పల్నాటి వీర్రత్నం --- ఆంబోతు, దున్నపోతు (కోడి పుంజు)
హేమ కుమారి --- ఆవు, గేదె (కోడి పెట్ట)
పెద్దలు --- ప్రకృతి
ఇరుగు పొరుగు --- డైరీ ఇండస్ట్రీ (ఫౌల్ట్రీ)
నేరాంశ్ --- మనలో ఉన్న కౄర ప్రవృత్తి
మాఫియా గ్యాంగ్ --- ఈ పాటికి మీకు అర్ధమయ్యే ఉంటుంది... ఇండస్ట్రీ(అనుబంధ)యే
మున్సిపల్ వాన్ --- కబేళా
ఓ అవగాహనకొచ్చారా...?
పశువులు, కోళ్ళు, ఇలా మనిషి ఆహారంగా మార్చుకున్న ప్రతీ జీవీ.. బ్రతికుండగానూ మరియూ చనిపోయేటప్పుడూ.., ప్రత్యక్ష నరకాన్నే అనుభవిస్తోంది.