శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

4.9  

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి

Tragedy

అంతర్మధనం

అంతర్మధనం

4 mins
695


         

    

   నాఒంట్లో నాకేమవుతుందో తెలీడం లేదు.నాలో ఏదో నిస్సత్తువ ఆవరిస్తుంది. ఎప్పటిలా మంచంపై పడుకోలేకపోతున్నా.కూర్చోడానికి ప్రయత్నిస్తున్నా పక్కకి వాలిపోతున్నా. ఊపిరాడక నాలో నేనే సతమతమైపోతుంటే...దేవుడిలా కనిపించాడు నా గది ముందు తచ్చాడుతూ నా కొడుకు.నాలో ఎక్కడలేని ధైర్యమూ వచ్చింది.ఆ తర్వాత నాకేమైందో తెలీదు.


     మత్తుగా కళ్ళు తెరిచేసరికి నేనెక్కడో వున్నాను.నన్ను నేను పరిశీలించుకుంటే...నా వంటినిండా ట్యూబుల్లాంటివి  అమర్చేసి వున్నాయి. ఒక్కక్షణం నాకు అర్థం కాలేదు....నెమ్మదిగా రాత్రి నాలో నేను పడ్డ నాఅంతరంగ స్థితి గుర్తుకొచ్చింది.


      "ఇప్పుడెలా వుంది మామగారూ"నా దగ్గరకొచ్చి నాచేయి నాడి పట్టుకుని చూస్తూ...అడిగిందామె. తెల్లటి బట్టల్లో కనిపిస్తున్న ఆ అమ్మాయి నర్స్ అని తెలిసాకా...నేను ఆసుపత్రిలో ఉన్నానని అర్థం అయింది.


      బ్రతికి బయట పడ్డందుకు ...రిలీఫ్ గా అనిపించింది. "మా అబ్బాయి,కోడలు ఎక్కడ? కనిపించరేం...? గాభరాగా నర్సుని అడిగాను.


      "బయట వెయిట్ చేస్తున్నారు. మీరిప్పుడు ఐసియు లో ఉన్నారు. లోపలకి ఎవరూ రాకూడదు. కొంచెంసేపు ఓపిక పట్టండి కబురు చేస్తాము" అంది.


      ఐసియులో ఉన్నానా? అసలు నాకేమైంది?గాభరాగా చుట్టూ పరికించి చూసాను.నాలాంటి అవస్థే ఇంచుమించుగా పడుతున్నారంతా.ఒకరిద్దరు అయితే... ఈలోకంతో సంబంధం లేనట్టుగా పడివున్నారు. వారినలా చూస్తుంటే... చాలా భయమేసింది.అలాంటి వారి మధ్య నేను కూడా తొడవ్వడాన్ని బట్టి చూస్తే... నాకేదో భయంకరమైన జబ్బే వచ్చిందేమోనని నా అంతరాత్మ కి అనిపించింది. ఆ తలంపుతో నా గుండె జల్లుమనిపించింది.నిజంగా అలాంటిదే అయితే నేను తట్టుకోగలనా...?నా మనసులో గుబులు మొదలైంది.గాభరా వల్లనో ఏమో...కడుపులో కొంచెం కాఫీ చుక్కయినా పడితే బాగుండుననిపించింది.


      నా అవస్థ గమనించిందో ఏమో..."రాఘవమ్మ గారి అటెండెర్స్ని పంపించండి "అంటూ నర్స్ ఫోన్ చేయడం వినిపించింది నాకు. 


      నావాళ్ళ కోసం ఎంతో ఆతృతగా తలుపువైపు చూస్తున్నా.....

     "ఇప్పుడెలా వుందమ్మా...?"ఆ గొంతు విని...ఆ వచ్చింది నా కొడుకే అని గుర్తు పట్టాను గానీ....కోటు లాంటి ఆ పొడవాటి గౌనులోనూ...ముక్కుకి ,నోటికి కట్టుకున్న ఆ మాస్క్ తోనూ దగ్గరకు వచ్చి నిలబడినా పోల్చుకోలేకపోయాను.


      నా కొడుకు సూర్యం వచ్చి.....నా కళ్ళలోకి కళ్ళుపెట్టి " ఇప్పుడెలా వుందమ్మా " అని పలకరించాడు.వాడిని, వాడి గొంతులోని కంగారుని చూసి రాత్రంతా నాకోసం ఎంత బెంబేలెత్తిపోయివుంటాడో కదా అనిపించి...నా కళ్ళు చెమర్చాయి. బానే ఉందని తల ఊపి.."నాక్కొంచెం కాఫీ కావాలి రా" అంటూ అడిగిన నా గొంతులో నాకే బేలతనం తెలిసింది.


     " కాఫీ ఇవ్వొచ్చో లేదో ...కనుక్కుంటాను" అంటూ అక్కడ డ్యూటీ డాక్టరుని అడిగాడు. "లిక్విడ్స్ ఏమీ పట్టకూడదు..పోనీ అడుగుతున్నారు కాబట్టి ఈ మాత్రం కన్నా ఎక్కువ ఇవ్వకండి"అంటూ వేళ్ళతో కొలత చూపించాడు డాక్టర్.


      నా కొడుకు కాఫీ తెస్తానని బయటకి వెళ్ళగానే...దానికోసం ఎదురుచూస్తూ నీరసంగా కళ్లు మూసుకున్నా.


      "అత్తయ్య గారూ " అంటూ తట్టి లేపింది నా కోడలు సంధ్య.ఆ పొడవాటి గౌనులోనూ,ముక్కుకున్న ఆ మాస్క్ లోనూ భలే చిత్రంగా కనిపించింది.అసలు లోపలకి వస్తున్నవాళ్లంతా అవెందుకు ధరిస్తున్నారో...?బహుశా మా జబ్బులు వాళ్లకి అంటుకోకుండా ఆసుపత్రి వాళ్ళు చేసిన ఏర్పాటు కాబోలు అనిపించింది నా బుర్రకి.


      నీరసించిన నా ముఖం లోకి తొంగి చూస్తూ..."కాఫీ కావాలని అడిగారట.లేచి తాగగలరా..?"కోడలు అడిగేసరికి... కాఫీ తాగేయాలన్న ఆత్రంతో లేవడానికి ప్రయత్నించాను గానీ నావల్ల కాలేదు." మీరలా పడుకునే వుండండి.నేను పట్టిస్తా" అంటూ నర్స్ సాయం తీసుకుని...తల దగ్గర మంచాన్ని కొంచెం ఎత్తించి...గ్లాసులో కాఫీని కొంచెం కొంచెంగా నా నోట్లో కి పోసింది.తాగగానే... ప్రాణం లేచివచ్చినట్లైంది.


      నుదిటిపై పడిన నా తలవెంట్రుకలని వెనక్కి లాగి..."ఏమీ ఆలోచించకుండా స్థిమితంగా పడుకోండి.మీకేమీ కాలేదు.ధైర్యంగా వుండండి"అంటూ నాతో నాలుగు మాటలు మాట్లాడి... నాలో కొత్త జీవాన్ని నింపింది.

      నా పనులు నేనే చేసుకోవాలనే ధోరణిలో వుండే కోడలు...ఇలాంటి కష్టసమయాల్లో మాత్రం వెనుకడుగు వేయకుండా .....నాకు సేవ చేయడానికి తన కుడి చేయీ,ఎడమ చేయీ అని ఆలోచించదు.మధ్యాహ్నం భోజనం తీసుకుని మళ్ళీ వస్తానంటూ...వెళ్తూ వెళ్తూ నా ఒంటిమీద బట్టలు సర్ది,నడుము కింద జరిగిన అండర్ పాడ్స్ ని సరిచేసి మరీ వెళ్ళింది.


      ఆ సాయంత్రం చూడటానికి వచ్చిన కొడుకు సూర్యాన్ని అడిగాను.అసలు నన్నెందుకు జాయిన్ చేశారు?నాకేం అయిందని?


      సూర్యం నాకళ్లలోకి చూడలేక ...పొంగిన నా పాదాలను రాస్తూ చెప్పాడు..నాకు షుగర్ ఎక్కువవ్వడం వలన... నా కిడ్నీలు దెబ్బతిన్నాయి అని.అప్పుడప్పుడు డయాలసిస్ చేయించుకుంటూ ఉంటే నయమైపోతుందనీ.


      ఆమాట వినగానే నాఒంట్లో ఏదో పిరికితనం ఆవహించింది. నాకు డయాలసిస్ చేయడానికి ... ఏదో ఆపరేషన్ చేయాలంటూ..థియేటర్ లోకి తీసుకెళ్లి పోయారు.నా మెడ పక్కన చిన్నపాటి గొట్టమేదో పెడుతుంటే... నేను పడ్దబాధ ఎవ్వరికి తెలుస్తుంది?డయాలసిస్ చేయడానికి.. నన్ను ఆ యూనిట్ కి తీసుకెళ్లిపోయారు.అక్కడ చిన్నవాళ్ళ దగ్గరనుంచి నాలాంటి ముసలివాళ్ళ వరకు చాలా మందే ఉన్నారు.డయాలసిస్ చేయించుకోడం పూర్తయిన వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు లేచి నడిచి వెళ్లిపోతుంటే... నేను కూడా అలా లేచి వెళ్లగలననే ధైర్యం వచ్చింది నాలో.

       

      నన్ను ఐసియు నుంచి రూంలోకి మార్చారు.ఇప్పుడు నా బంధుమిత్రులంతా నన్ను చూసి పలరించి వెళ్తున్నారు. నాలో కొత్త ఊపు వచ్చింది.డయాలసిస్ చేసాకా..నా ఒంటి పొంగులు తీసాయని అంటున్నందుకు ఆనందం వేసినా...దాహంతో నా నోరు ఎండిపోతుంది.నీళ్లు కావాలని కోడలిని అడిగితే..నా గొంతులో పోస్తున్న నీటిని చటుక్కున వచ్చి తీసేసుకుంది నర్స్.డయాలసిస్ పేషెంట్ కి నీళ్ళు ఇవ్వకూడదంటూ.ప్రోటీన్స్ వున్న ఆహారమే ఇవ్వాలని నా నోట్లో ఎంతపెడితే ఏం లాభం? గుక్కెడు నీళ్లు తాగగలిగితేనే కదా... గొంతు దిగేది.నోటికేమీ రుచించడం లేదు.నోట్లో మందులు వేసేటప్పుడు వేసే ఆ రెండు చెంచాల నీటికోసం క్షణక్షణం అల్లడిపోతున్నా.


      రెండు మూడు రోజుల్లో ఇంటికి తీసుకెళ్లిపోతారనుకున్నాను. కానీ అక్కడకు వచ్చి నెల్లాళ్ళు దాటిపోయింది.రోజు విడిచి రోజు చేస్తామని చెప్పిన డయాలసిస్ కాస్తా రోజుకి మూడు సార్లు చేస్తున్నారు. కిడ్నీ డాక్టరే కాదు.గుండె ఊపిరి తిత్తులు, బ్రెయిన్, లివరుకు సంబంధించిన రకరకాల డాక్టర్లందరూ వస్తున్నారు...ఎవరికీ వాళ్ళఇంకా ఏవేవో టెస్టులు చేయాలంటూ మందులు రాసుకుపోతున్నారు.వారిని అనుసరిస్తూ...నాలో జబ్బులు ధ్రువీకరణ కోసం నారక్తాన్ని సిరంజీలతో తోడేస్తూ...నా నరాలన్నీ కుళ్ళబొడిచేస్తున్నారు.దానికి తోడు..నేను ఎటూ కదలలేని స్థితిలో ఉన్నానేమో... నా నడ్డికిందంతా గాలి తగలక చురుక్ చురుక్ మంటున్న మంటలు. నన్ను పక్కకి తిప్పి పడుకోపెట్టాలనే  నావాళ్ళ ప్రయత్నానికి నేను సహకరించలేకపోతున్నా!


      ప్రతిరోజూ నాకోసం...పిచ్చోళ్ళా తిరుగుతున్న కొడుకూ, కొడలనీ చూస్తుంటే జాలి వేస్తుంది.నన్ను ఇంటికి తీసుకెళ్లిపోతే బాగుండునని నా మనసుకి అనిపించింది.నోరుపెగలక చెప్పలేకపోయాను.చేతుల సంజ్ఞతో చెప్పాలనిపించింది.నా చేతులు కూడా కదల లేని స్థితిలో వున్నాయి.


     " భీష్ములవారు తన చావుకోసం ఉత్తరాయణంలోని ఏకాదశికై నిరీక్షిస్తూ... అంపశయ్యపై బాధ పడినట్టే వుంది రాఘవమ్మ పరిస్థితి కూడా"నేను నిద్రలో ఉన్నాననుకుని ఎవరో బంధువు అంటున్న మాటలు నాకు వినబడుతూనే వున్నాయి....


     అంటే...నా జీవితం ఇంక ముగింపుకి వచ్చేస్తుందన్నమాట.నాలో బ్రతుకుతానన్న ఆశ పూర్తిగా పోయింది.ఇప్పటికైనా నన్ను ఇంటికి తీసుకెళ్లిపోతే బాగుండును...నా మనసు మూగగా రోధిస్తుంది.


     నాలో ఏమైందో ఏమో...? నన్ను రూమ్ నుంచి ఐసియు కి తీసుకెళ్లాలంటూ హడావిడి పడుతున్నారు.మంచం మీద వున్న నన్ను అటు నలుగురు ఇటు నలుగురు పట్టుకుని మోయలేక మోయలేక స్ట్రేట్చేరు మీద ఎత్తి కుదేశారు.ఆ క్షణం నేను పడిన బాధ ఎవరికెఱుక...?


     ఐసియు అనే నరకకూపానికి మళ్ళీ బదిలీ చేశారు.ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదు.దాహంతో నాలుక పిడచగట్టుకుపోయి గొంతులోకి తోసుకుపోతుంది..చచ్చేటప్పుడైనా గుక్కెడు నీళ్లు గొంతులో పోస్తే బాగుండును. 


     పూర్వం...తన వారికి ప్రాణం పోతుంది అని తెలియాగానే...వారికిష్టమైన వంటకాలన్నీ నోటికి తాకించేవారు.ఆప్తులైన ఆ ఇంటిల్లిపాదీ ఇంటిముంగిట్లో మంచం చుట్టూ చేరి...కడచూపు కోసం తపించేవారు.పోయిన వాళ్ళ ఆత్మ శాంతిచాలని.


     ఇప్పుడు ఈ ఐసియు చావులొచ్చాకా ..నోట్లో గుక్కెడు నీళ్లు కాదు కదా ... వాళ్ళ కెవరూ కనిపించక ఎవరూ లేని అనాధ చావు చావాల్సివస్తుంది.ప్రాణం లేని శరీరాన్ని కూడా ప్రాణం ఉన్నట్టుగా వెంటిలేటర్ల తో బొమ్మలాటలాడిస్తున్న ఆసుపత్రుల వ్యాపారానికి ఎందుకిలా తల వొంచుతున్నారో ...?ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో...?


     ఒరేయ్ సూర్యా... నాకు వచ్చిన జబ్బు ఇంత భయంకరమైనదని తెలిసి కూడా...నాకెందుకింత ఖర్చుపెట్టి వైద్యం చేయించావు? నేను బ్రతికించుకుందామన్న ఆశతోనే కదా! బ్రతకనన్న నిజం తెలిసినప్పుడైనా...నన్ను మనింటికి తీసుకెళ్లిపోయి ఉంటే..బ్రతికిన నాలుగురోజులైనా మీ మధ్య మిమ్మల్ని చూస్తూ ..తృప్తిగా తనువు చాలించేదాన్ని.


    " దేవుడా నువ్వే నాకు దిక్కు.నేననుభవిస్తున్న ఈ నరకం నుంచి స్వర్గానికి తీసుకెళ్లిపో " నాలోఎక్కడో ఇంకా మిణుకు మిణుకు మంటున్న ప్రాణంతో వేడుకుంటున్నా.నా మొర ఆలకించాడేమో....ఆ దేవుడు రారమ్మని పిలుస్తున్నాడు నన్ను.నేను వెళ్ళి పోతున్నా. వెళ్లేముందు మనవాళ్ళందర్నీ కళ్లారా అయినా చూసుకోలేక పోతున్నాను. మీరంతా నాదగ్గర లేకుండా ఎక్కడికి వెళ్లిపోయారు...? కనీసం మీ గొంతైనా చెవులకు సోకుతుందేమో అని చెవులు రిక్కించాను. నా చివరి కోరిక తీరనైనా లేదు. ఈ దేహంలో నేనింకా ఇలాగే ఉంటే నన్ను నేను ఓర్చుకోవడం నాతరం కావడం లేదు.అందుకే నా ఆత్మ దేహాన్ని వదిలి ... దూదిపింజలా అలా అలా తేలిపోతూ వుంది.... మరో జన్మంటూ ఉంటుందో లేదో...? ఉంటే మీలో ఒక్కరిగా మళ్లీ పుడతాను....శెలవా మరి !

    ‎

       *   *  *   *  *   *  *  *   


         

       


      

     


          


Rate this content
Log in

Similar telugu story from Tragedy