మగువ స్థానం ఎక్కడ?
మగువ స్థానం ఎక్కడ?
మగువ స్థానం ఎక్కడ?
రమ్య, అమ్మ రమ్య... ఏంటమ్మా ఇంత పొద్దున్నే నిద్ర లేపుతున్నావ్, ఊహుం నేన్ లేవన్ పో !! ఒసేయ్ లెగవే నిన్ను చూడ్డానికి పెళ్ళివారు వస్తున్నారు, ఈరోజు నీకు నిచ్చితార్థం, లెగు త్వరగా ఇప్పటికే ఆలస్యం అయింది అంటూ రమ్య వాళ్ళ అమ్మ మొదలెట్టింది, రమ్య వాళ్ళది మధ్యతరగతి కుటుంబం, అమ్మాయికి త్వరగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపి చక్కని జీవితాన్ని అందించాలని వాళ్లకు ఉన్నంతలో ఘనంగా వివాహాం చేశారు..రమ్య, చందు ముచ్చటైన జంట, చాలా అన్యోన్యంగ ఉండేవారు, అలకలు, ప్రేమలు, ముచ్చట్లు అన్నట్టు ఎంతో హాయిగా వాళ్ళ సంసారం సాగుతుంది, రమ్య వాళ్ళ తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు, కూతురికి మంచి వివాహాం చేశామని..ఇలా సంవత్సరం గడవనే గడిచింది..గారాల రమ్య, మరో గారాల పాప కి జన్మనిచ్చే శుభ వార్తతో ఇరువురి కుటుంబాలు ఆనందంలో మునిగిపోయారు..
రమ్యకి నెలలు నిండుతున్న కొద్ది ఎన్నో ఆశలు ఎంతో సంతోషం.. 9వ నెల ఒచ్చింది అంత బాగానే ఉంది ఇంకో 10 రోజులలో డెలివరీ అవుతుంది అనగా ఒక రోజు ఉన్నట్టుండి రమ్యకు విపరీతంగా కడుపునొప్పి రావటంతో దగ్గరలోని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళారు..రమ్యని పరీక్షించిన డాక్టర్ పరిస్థితి చేయి దాటుతోంది, కడుపులో పాప కి ప్రమాదం జరిగే అవకాశం ఉంది, త్వరగా పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లండని చెప్పడంతో వెంటనే హైదరాబాద్ లోని పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్లారు..కానీ అప్పటికే ఆలస్యం అవడం చేతనో, సరైన వైద్యం అందకపోవడం వల్లనో కడుపులో బిడ్డ చనిపోయిందని రమ్యకి అబార్షన్ చేస్తారు, ఎన్నో ఆశలతో ఉన్న రమ్య కన్నీరుమున్నీరుగా విలపించింది..ఆ బాధను చూడలేక రమ్య తల్లిదండ్రులు తనని ఇంటికి తీసుకెళ్ళి కొన్ని రోజులు ఆ బాధను దూరం చేయడానికి ప్రయత్నం చేశారు..అలా కొన్ని రోజులు గడిచాక, చందు వచ్చి రమ్యను తీసుకొని వెళ్ళడం, కొంత కాలం గడిచాక రమ్య రెండవసారి ప్రెగ్నన్సీ పొంది, పాపకి జన్మనిచ్చింది..అంత బావుంది అనుకున్న సమయాన, రమ్య మళ్ళీ అనారోగ్యం పాలవడంతో హాస్పిటలో చేరింది, రమ్యను పరీక్షించిన డాక్టర్లు తట్టుకోలేని వార్తను చెప్పారు, రమ్య ప్రాణాంతక కాన్సర్ తో పోరాడుతుంది, ఎక్కువ కాలం బ్రతికే అవకాశం లేదని..ఆ వార్తను విన్న రమ్య తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోయారు, ఎలాగైనా మా కూతురిని మీరే కాపాడాలి అని డాక్టర్ ని వేడుకున్నారు, అక్కడే హాస్పిటల్ లో రమ్యతో పాటు వాళ్ళు ఉన్నారు, పాప జాగ్రత్తలు చూస్త
ూ చందు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండే వాడు..
రమ్య ఆరోగ్యం రోజురోజుకీ క్షీణించింది, చివరి రోజులు అని చెప్పడంతో, రమ్య అమ్మ నాన్న చందు కి విషయం చెప్పారు, ఇంటికి తీసుకువెళదాం, ఇక రమ్య మనకు దక్కదు అని విలపించారు, కానీ చందు మాత్రం తనకు కుదరదని మీరే మీ ఇంటికి తీసుకెళ్లండి అని చెప్పటంతో బరువైన హృదయంతో
ఆమె తల్లిదండులే ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు.
ఇంటికి వెళ్ళాక రమ్య నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు నేను మా ఇంటికి వెళ్తాను నా భర్త, నా పాపను ను చూడాలి అంటుంది. నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్తుంది.. ఆ సమయంలో రమ్యను చూసి ఆమె తల్లితండ్రులు ఆమెకు నిజం చెప్పలేక, మనసులో దాచుకోలేక నలిగిపోయారు..కూతురి బాధను చూడలేక, అప్పుడు రమ్య వాళ్ళ నాన్న చందుకి ఫోన్ చేశాను పాపను తీసుకొని వస్తున్నాడు అని చెప్తాడు.. కాని చందు రాలేదు..తన ప్రాణంగా, భర్త, పాప నే తన భవిష్యత్ గా భావించిన వాళ్ళు రాకపోవడంతో ఎదురుచూసిన రమ్య చివరికి వాళ్ళని చూడకుండానే ప్రాణాలను విడిచింది
రమ్య చనిపోయింది అని తెలిసిన తర్వాత ఆమె భర్త, అత్త, మామలు వస్తారు.. చందు కనీసం ఒక్క చుక్క కన్నీరు కూడా రాల్చలేదు, అంతిమ సంస్కారాల్లో కూడా వెనుకడుగు వేశాడు, ఎంతో దుఃఖం తో
చివరికి రమ్య తండ్రి అంతిమ సంస్కారం చేస్తాడు..చితి కాలిందో లేదో పాపని రమ్య వాళ్ళ అమ్మకి ఇచ్చి చందు వాళ్ళు తిరుగుపయనమయ్యారు..
అన్ని మరిచిన చందు, రమ్య చనిపోయిన రెండు నెలలకే చందు రెండవ వివాహం చేసుకున్నాడు..
రమ్య జీవితం ఎక్కడ మొదలైందో చివరికి అక్కడే ఆగిపోయింది.. మరి మెట్టినింట్లో, భర్త జీవితంలో
ఆమె స్థానం ఎక్కడ..
రమ్య లాంటి భార్యలు, తల్లులు ఎందరో ఈ సమాజంలో కధ వాళ్ళందరికీ వాస్తవాన్ని ఒక కథగా మీ ముందుకు ఇలా....
............
ఒక ఆడది తల్లిగా, చెల్లిగా, స్నేహితురాలిగా, భార్యగా, కూతురుగా తన చివరి శ్వాస వరకు తన వాళ్ళకోసం బ్రతుకుతుంది..
జీవిత ప్రయాణంలో విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది. కుటుంబం సంతోషం తన సంతోషం అని, వాళ్ళ గెలుపే తన గెలుపుని బావిస్తుంది..
మరి నేటి సమాజంలో ఆ మగువ స్థానం ఎక్కడ?
ఆలోచించండి...
శ్రీలత. కె ©️
"హృదయ స్పందన".