ఉదయబాబు కొత్తపల్లి

Drama Classics Inspirational

3  

ఉదయబాబు కొత్తపల్లి

Drama Classics Inspirational

"నాన్నకో బహుమతి (కథ)

"నాన్నకో బహుమతి (కథ)

7 mins
334


‘’నాన్నకో బహుమతి’’(కధ)

తన కోసం ఎవరో వచ్చారని అటెండర్ వచ్చి చెప్పడంతో చేస్తున్న పని మధ్యలో ఆపి విజిటర్స్ రూమ్ లోకి వచ్చాడు శ్రీవాత్సవ.


అతన్ని చూస్తూనే లేచి నిలబడింది ఆమె. కింద నుంచి పైకి ఆపాదమస్తకం ఎప్పుడో పోగొట్టుకున్న విలువైన వస్తువును చూస్తున్నంత సంభ్రమం గా అతని చురుగ్గా పరిశీలించింది ఆమె.


 


‘’ఎవరు మీరు? మీకు ఎవరు కావాలి?’’ అడిగాడు శ్రీవాత్సవ.


‘’ నాకు రాజశేఖరం గారు కావాలి బాబు. ఆయనను ఒక్కసారి చూసి మాట్లాడాలి.’’


‘’ ఆయనకు మీ వయస్సు బంధువులెవరూ నాకు తెలిసి లేరే. ఆయనకు మీరు ఏమవుతారు?’’


‘’ఆయన నాకు తాళి కట్టిన భర్త.’’


‘’ అంటే... మీరు...’’


 


‘’అవును బాబు. నేనే. జయంతిని’’ అంది. ‘’ మీ అమ్మను...’’అనబోయి ఆగిపోయింది.


‘’ ఇన్నేళ్ల తర్వాత కొడుకునైన నేను, , మా నాన్నగారు గుర్తుకు వచ్చామన్నమాట. ఆయన మిమ్మల్ని చూడరు. మీరు చనిపోయారని ఆయన అనుకుంటున్నారు. ఇక నా దృష్టిలో అసహ్యించుకునే పదం ఏదైనా ఉంటే అది ‘అమ్మ’ అనే పదం మాత్రమే. ఆ పేరు పెట్టుకుని ఎదురుగా నిలబడిన మీరు దయచేసి మరొకసారి రావద్దు. మీతో ఇలా మాట్లాడుతున్నానంటే అది నాన్నగారు నాకు నేర్పిన సంస్కారమే. ఇక మీరు వెళ్ళవచ్చు’’ ఎర్రబడిన ముఖంతో అన్నాడు శ్రీవాత్సవ.


ఆమె కళ్ళల్లో సుడులు తిరిగిన నీళ్లు - అవి ప్రయోజకుడైన కొడుకును చూసిన తాలూకు ఆనందాశ్రువులో, గుండెలు చీల్చేలా మాట్లాడిన అతడి మాటలు చేసిన గాయాల వల్ల బయటకొచ్చిన దుఃఖాశ్రువులో తెలీదుగానీ, కొంగుతో తుడుచుకుంది ఆమె.


‘’బాబు పోనీ నాన్నగారితో మాట్లాడను ఒక్కసారి దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను.


ఈ జీవితానికి ఒకే ఒక చివరి కోరిక. ఆయన పాదాలను నా కన్నీళ్లతో కడిగి మౌనంగా నమస్కరించుకుని వెళ్ళిపోతాను. ఈ ఒక్క కోరికా కాదనకు’’ అందామె ప్రాధేయ పడుతున్నట్లుగా.


‘’తల్లిగా మీరు నాకు చేసిన ద్రోహానికి మీకు ఇవ్వకూడని అవకాశం కూడా అది ఒక్కటే. మీరు అవకాశవాదులు. ఎక్కడైనా ఎలాగైనా బ్రతికేయగలరు.మమ్మల్ని జీవశ్చవాలుగా చేసినట్టుగా మరెవరినీ చేయకండి. వెళ్ళండి.’’ అని ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా అక్కడినుంచి నిష్క్రమించాడు శ్రీవాత్సవ.


 


ఆమె ఆశ్చర్యపోలేదు. గుండెలవిసేలా తల చేత్తో పట్టుకొని ఏడుస్తూ కూర్చోలేదు.


చెమరుస్తున్న కళ్ళను మాటిమాటికి ఒత్తుకుంటూ తన చేతి సంచీలోంచి కొన్ని తెల్ల కాగితాలు తీసుకుని అక్కడే కూర్చుని రాయసాగింది. సుమారు గంట తర్వాత రాయడం పూర్తిచసి సంచీలోంచి కవరు తీసి రాసిన కాగితాలు అందులో ఉంచి, జిగురుతో అంటించి, పైన శ్రీవాస్తవ పేరు అడ్రస్సు రాసి ఆ ఆఫీసు పోస్ట్ బాక్స్ లో వేసి అక్కడనుంచి నిర్లిప్తంగా వెళ్ళిపోయిందామె.


************************


 


శ్రీవాత్సవ తన సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. చాలా అసహనంగా ఉందతనకి.’ అమ్మట అమ్మ’ వయసు తిమ్మిరి తీర్చుకోవడానికి పెళ్లి, పిల్లలు. ఇలాంటి వాళ్ళు ‘అమ్మ’ అనే పదానికి అనర్హులు.


 పిచ్చి పిచ్చి ఆలోచనలతో అతని తల పగిలి పోసాగింది. పని మీద ఏకాగ్రత లేకుండా పోయింది. ‘మనసు బాగోలేనప్పుడు చేస్తున్న పనిని ఆపి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా దైవం మీద మనసు లగ్నం చెయ్యి’ అన్న తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి. 


ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకున్నాడు.


‘’బాబు’’ అని పిలుస్తున్నట్లు గా ఆమె రూపమే.


 ‘అమ్మ’!


 \ఎంత కమనీయంగా ఉంది ఆమె రూపం! పండిన తమలపాకులా, అచ్చమైన పార్వతీదేవిలా, నిండు పండు ముత్తైదువలా!


సుమారు నాలుగైదు సార్లు ప్రయత్నం చేశాడు ఆమెను మరిచిపోదామని.


 ప్రతిసారి ఆమె రూపమే.


 ఈసారి మాత్రం ఆమె రూపం రాజరాజేశ్వరీమాత రూపంగా రూపాంతరం చెందడం తో స్వస్థత చేకూరిన మనసుతో తండ్రికి ఫోన్ చేశాడు.


 అవతల నుంచి ‘హలో’ అని వినపడగానే -


‘’నాన్నగారు! నేను వాసుని. భోజనం చేశారా?’’


‘’ ఆ!’’


 “”మందులు వేసుకున్నారా?’’


“ఊ!’’


‘’మీకు ఒక విషయం చెప్పాలి అని ఫోన్ చేశాను’’


‘’ చెప్పు నాన్న!’’


‘’ మీరు కేకలేస్తారని భయంగా ఉంది!’’ అవతల నుంచి గంభీరమైన నవ్వు.


‘’నిన్నా! కేకలు వేయనులే చెప్పు.”


‘’ మీ భార్య బతికే ఉన్నారు.’’ - ఒక్క క్షణం మౌనం.


‘’ వాసు, ఏంట్రా నాన్న నువ్వంటున్నది?జయంతి...జయంతి ... బతికే ఉందా? ఎవరు చెప్పారు నీకు?’’ ఆయన మాటలలో ఉద్వేగం అతన్ని కలవరపరిచింది.


‘’ మీరు ఆవేశపడకండి నాన్న. ప్రశాంతంగా వినండి. ఆమె ఇంతకు ముందే నా ఆఫీసుకు వచ్చారు. చివరిసారిగా మిమ్మల్ని ఒక్కసారి చూడాలని అడిగారు. వీల్లేదు.వెళ్లిపొమ్మన్నాను.  వెళ్లిపోయారు.’’


‘’ బాబు !ఆమె నీ కన్న తల్లి రా!’’ వేదన నిండిన కంఠంతో అన్నారాయన.


‘’ అందుకేనా – నన్ను, మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేసారావిడ? మనం అనుభవించిన క్షోభ ఆమెకు తెలియాలనే అలా మాట్లాడాను. నేను చేసింది తప్పు అంటారా?’’


 ఆయన గొంతు సవరించుకున్నారు.


“ ఉరి శిక్ష వేసిన ఖైదీని కూడా ఊరి తీయబోయే ముందు నీ ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతారు. నువ్వు...నువ్వు తప్పు చేసావు బాబు. అమ్మ... ‘అమ్మ మనసు’ను గాయపరిచావు.  ఆమెను వెళ్లిపొమ్మనక ముందే ఒక్క సారి నాతో ఫోన్ లో మాట్లాదించాల్సింది. అంతా నా దురదృష్టం.” ఆయన బాధాగా నిట్టూర్చి ఫోన్ పెట్టేశారని అర్ధమైంది.


 ఆయనెప్పుడూ అంతే. అతి తక్కువగా సూటిగా మాట్లాడుతారు - అనంత భావాన్ని అల్ప అక్షరాలతో వ్యక్తం చేస్తూ.


 నేను తప్పు చేశాను అన్నమాట. ఒక్కసారి ఆయన్ని ఆమెకు చూపించాల్సింది . బాధతో కనతలు నొక్కుకున్నాడు శ్రీవాస్తవ.


 


సాయంత్రం ఇంటికి వెళ్ళాక, తండ్రి ఆ పరిస్థితి తీసుకు రాకపోవడంతో ఊరట అనిపించినా తప్పు చేసిన భావనతో అతని మనసు మూలుగుతూనే ఉంది.


*********


మర్నాడు తన టేబుల్ మీదకు వచ్చిన కవర్ ను చించి, చూసి అది ‘ఆమె’ రాసింది అని గ్రహించి ముక్కలు చేయబోయాడు శ్రీవాత్సవ.


“ మరణశిక్ష పడ్డ ఖైదీని కూడా...’’ అన్న తండ్రి మాటలు గుర్తుకు వచ్చాయి అతనికి.


ఎందుకో - ఏపని ఆవేశంగా అనాలోచితంగా చేయబోయినా,  తండ్రి చూపుడు వేలుతో హెచ్చరిస్తున్నట్టే అనిపిస్తుంది అతనికి.


ఎంతో జాగ్రత్తగా ఏకాగ్రతతో ఆ ఉత్తరం చదివసాగాడు. అందులో ఇలా ఉంది.


“ చిరంజీవి శ్రీవాత్సవ కి,


 ‘అమ్మ’ మనస్పూర్తిగా ఆశీర్వదిస్తూ వ్రాయునది. ‘ అమ్మ’ అనే పదం పట్ల, పదార్థం పట్ల నువ్వు ఎంతో ఏవగింపు కలిగేలా స్థిరమైన అభిప్రాయం ఏర్పరచుకోవడంలో నాకూ పాత్ర ఉంది బాబు.


నా జీవితాన్ని శాసించిన వాళ్ళందరూ మగవాళ్ళే. వారికి వత్తాసు పలికి, నేనేదో తప్పు చేసిన దానిలా, సాంప్రదాయాలు, కట్టుబాట్లు అంటూ నన్ను బంధించిన నా సాటి ఆడవాళ్ళు ఆ మగ వాళ్ళ చేతుల్లో బానిసలే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ఈనాటి వరకు వందకి 90  కుటుంబాలలో స్త్రీకి స్వేచ్ఛ రాలేదు బాబు.


 ఆనాడు అభం శుభం ఎరుగని ఐదేళ్ల పసిబిడ్డవి నువ్వు. మీ నాన్నగారితో వెళ్ళిపోతూ, వెక్కి వెక్కి ఏడుస్తూ ‘అమ్మా’ అంటూ పరిగెత్తుకు వస్తే, తనివి తీరా నా బిడ్డను అక్కున చేర్చుకోనివ్వని కర్కశ సాంప్రదాయాల కుటుంబంలో నేనొక బందిని. ఇది నీకు అర్థం కావాలంటే నా జీవితంలో కొన్ని ముఖ్య అంశాలు మీకు తెలియాలి.  


నేను మామూలు ఆడపిల్లల మాదిరిగానే డిగ్రీ పూర్తి చేశాను. నేను ఇంటర్ లో ఉండగా మా బావకు ఆర్మీలో ఉద్యోగం వచ్చింది. మూడేళ్ల తర్వాత వచ్చి నన్ను ఇష్టపడ్డాడు. నా నిర్ణయం తెలిపేలోగానే ‘దాని మొహం.... దానికేం తెలుసు?’ లాంటి వ్యాఖ్యలతో నన్ను అతనికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లయి వారం తిరక్కుండానే ఆయన పై అధికారుల నుంచి ‘తక్షణమే బయలుదేరి వచ్చి డ్యూటీ లో చేరాలని’ పిలుపు వచ్చింది.


ఆరోజే మా శోభనం. అది జరగకుండానే ఆయన ఉద్యోగానికి వెళ్లిపోయారు.


మా ఇంట్లో మగ పెద్దలు చెప్పిందే వేదం. తాము చేసేవన్నీ ఒప్పులే అన్నదే వారి అహంకారం. వారి అహంభావం. వాటి సెగల్లో ఇంట్లో స్త్రీలందరూ మాడి మసై పోవాల్సిందే గాని ఎవరు ఎదురు చెప్పడానికి వీలు లేదు. వారి అనుమతి లేనిదే గడప దాటే అవకాశమే లేదు.


రెండేళ్లు గడిచాయి.


పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఆయన మరణించాడనే వార్త వచ్చింది. ఆ వార్త విన్న మా అమ్మ, ఏ అచ్చటా ముచ్చటా తీరక పిల్ల నూరేళ్ల జీవితం నాశనం అయిపోయింది అన్న దిగులుతో నెల రోజుల్లో మరణించింది. దాన్ని తట్టుకోలేకపోయిన మన నాన్నగారు మా మామగారి కాళ్లావేళ్లా పడి బ్రతిమిలాడాడు-‘దానికి ఎలాగైనా మరొక పెళ్లి చేయండి’ అని ఏడ్చారు కూడా.


ఊరి పెద్ద అయిన మా మామగారు, తాను చెప్పినట్లు వింటారు అని మా గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మీ నాన్నగారిని పిలిపించారు. జరిగింది దాచకుండా ఆయనకు చెప్పారు.


విశాల భావాలు గల రాజశేఖరం గారు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించారు. సాదరంగా వారి జీవితంలోకి ఆహ్వానించారు. 


రాయి లాంటి నన్ను తన సాంగత్యంతో అహల్యగా తీర్చిదిద్దారు.


అంతవరకూ జీవితంలో అనుక్షణం ఎన్నోసార్లు నిరాదరణకు గురై, దాదాపు చదువుకున్న దానినై ఉంది కూడా ఆడ బానిసలా, యంత్రంలా పని చేసుకోవడమే తప్ప, ఒక చిన్న కోరిక ను కూడా బయట పెట్టుకోలేని నేను ఆయన ప్రేమ ఆదరణ లలో నన్ను నేనే మర్చిపోయాను. ఆయన చేతుల్లో పిల్లనగ్రోవిని వాలిపోయాను.


 మా అన్యోన్య దాంపత్య ఫలితంగా నువ్వు పుట్టావు. ఐదేళ్లు నీ ఆలనాపాలనతో ఎంతటి అమ్మతనాన్ని అనుభవించానో, ఆయన అనురాగాన్నికూడా ఆంతగానూ పొందాను. వాటి బలం తోటే ఇన్నేళ్లు బతికాను.


 సరిగ్గా ఆ మత్తులో ఉండగా నన్ను, నిన్ను తీసుకుని ఇంటికి రమ్మని మామ గారు మీ నాన్నగారికి కబురు చేశారు. అనుకోని ఈ ఆహ్వానం ఏమిటా అనుకుంటూ వెళ్ళాం. మేము లోపలికి అడుగుపెట్టగానే తలుపులు మూసేశారు.


మామగారి పక్కన ఒక వ్యక్తి గడ్డం మాసిపోయి ఒంటికాలితో నిలబడి ఉన్నాడు. అతను నాకేసి ఎంతో ఆశతో ఆకలితో చూస్తున్నాడు. అతన్ని పరిశీలనగా చూసిన నేను గుర్తుపట్టి భయంగా రెండడుగులు వెనక్కి వేసి మీ నాన్నగారి చాటున దాక్కుని ఆలంబన కోసం ఆయన జబ్బ గట్టిగా ఒక చేత్తోనూ, నిన్ను ఒక చేత్తోను పట్టుకున్నాను.


మా మామ గారు చేసిన సైగ తో ఆయన ఏర్పాటు చేసిన మనుషులు నిన్ను బలవంతంగా తీసుకు పోయి మా అత్త గారికి అప్పగించారు. మా ఆడపడుచు నన్ను బరబరా ఈడ్చుకెళ్లి ఆ కుంటి అతని ముందు పడేసింది.


 అతను ఎవరో కాదు - నా మొదటి భర్త.


“ ఆ కక్కిన కూడు నాకొద్దు నాన్న. నా భార్య నాకు కావాలి” అన్నాడు నా మొదటి భర్త.


 తన తాయిలం ఎవరో ఎత్తుకుపోయినంత క్రోధంగా ఉన్నాయి అతని కళ్ళు. కింద పడిన నేను లేచాను.


మీ నాన్నగారికేసి చూశాను. ఆయన అసహనంగా నాకేసి చూసి తల దించుకున్నారు.అణువు అణువు తమ్మముళ్ళను గుచ్చుతున్నంత బాధ ఆయన ముఖంలో ద్యోతకం అయింది నాకు.


‘’నువ్వు చచ్ఛావని తెలిసిన రోజునే నీతో నా సంబంధం తెగిపోయింది. నాకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడాయన. ఆయన నుంచి నన్ను ఎవరూ విడదీయ లేరు.’’ అనేసి వేగంగా పరిగెత్తుకొచ్చి నా భర్త అయిన మీ నాన్నగారు ముందు నిలబడ్డాను.


“నువ్వు వెళ్లి తీరాలి జయంతి.’’ అన్నారాయన జీవంలేని స్వరంతో.


‘’ ఎందుకండి?’’ అన్నాను సుడులు తిరుగుతున్న కన్నీళ్ళతో.


“ మన వివాహమయ్యాక ఏనాడైనా నీ అదృష్టవశాత్తూ నీ భర్త తిరిగి వస్తే నిన్ను అప్పగించాలన్న ఒప్పందం మీదనే మన పెళ్లి జరిగింది జయంతి.’’ ఆయన ఇంకా ఏదో చెప్పబోయారు.


మా ఆడపడుచు మొగుడు వచ్చి ‘’విన్నావుగా ఇక లోపలికి వెళ్ళు” అన్నాడు హుంకరించి. ‘’నువ్వు ఎవరు నాకు చెప్పడానికి?’’ అన్నాను తీవ్రంగా.


 మా మామగారు నా ముందు రాక్షసుడిగా నిలబడ్డాడు.


“నేను చెబుతున్నాను.వెళ్ళు లోపలకి” అన్నారు.


“నా భర్తను, నా బాబును వదిలి వెళ్ళను’’ అన్నాను నేను.


 ఆయన లాగికొట్టాడు నన్ను.


 అది చూసి ‘’అమ్మా’ అంటూ నా దగ్గరకు రాబోయావు నువ్వు.


 నిన్ను మీ నాన్నకి ఇచ్చి ‘’తక్షణమే ఊరు వదిలి వెళ్ళిపో. ఇదిగో నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్’’ అంటూ మీ నాన్నకి ఆయన ఒక కవర్ అందించాడు.


నేను కొయ్యబారిపోయాను. మీరు నాకు శాశ్వతంగా దూరం అయిపోతున్నారు అన్న బాధతో పెదవి చిట్లి రక్తం కారుతున్నా “ఆయన ఇక్కడి నుంచి పంపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఏవండీ మీరు వెళ్ళకండి’’ అంటూ నన్ను ఉక్కు పిడికిళ్ళ మధ్య బంధించిన మనుషుల్ని గుంజేశాను.


 ఆయన నిస్సహాయంగా  చూసి నా కేసి చేతులు చాచి “అమ్మా” అని ఏడుస్తున్న నిన్ను భుజాల మీద వేసుకుని వెళ్లిపోయారు.


నువ్వు, ఆయన వెళ్లిన వెంటనే తలుపులు మూసుకుపోయాయి.


నేను మళ్లీ మిమ్మల్ని జీవితంలో చూస్తానని అనుకోలేదు.


ఒకనాడు అవకాశం చూసుకుని ఇంట్లోంచి పారిపోయి మీ నాన్నగారు ఉన్న ఊరు చేరాను- కానీ నిన్ను ఆయనను చేరేలోగానే నన్ను బంధించి తీసుకువెళ్లి మామగారి కాళ్ళ ముందు పడేసారు. నా మొదటి భర్త నన్ను ఎంత హింసించాడు అంటే తన మిలట్రీ పద్ధతులన్నీ నా మీద ప్రయోగించాడు. మగవాడు ఆడదాని పట్ల ఇంత రాక్షసుడిలా ప్రదర్శించగలడా! అన్న రీతిలో నాకు నరకం చూపించాడు. ఆడది మగవాడికి సుఖం అందించే యంత్రం మాత్రమే అనే ఒకే ఒక సూత్రంతో బతికాడు. నన్ను బతకనిచ్చాడు.


అతనిని సమర్థించిన పెద్దలందరూ ఒక్కరొక్కరే కాలగర్భంలో కలిసిపోయారు. చివరి దశలో అతనికి పక్షవాతం వచ్చింది. అలాగే వదిలి వచ్చేయాలి అనిపించింది. కానీ రాజశేఖరం గారు నేర్పిన మానవ సేవా దృక్పధంతో అతనికి సేవ చేశాను. చివరికి అతను చనిపోయాడు.


 


బాబు! నాకు అర్థం కానిది ఒకటే. ఆడదంటే మగవాడికి ఎందుకు అంత చులకన?


 


కేవలం లింగ బేధం తప్ప అన్ని విషయాల్లోనూ తనకు సమానమైన స్త్రీని మగవాడు ఎందుకు సాటి మనిషిగా గుర్తించడు? చదువు నేర్పిన సంస్కారం, అనుభవం నేర్పిన విచక్షణ కలిగి ఉండి కూడా ఇతరులకు ఎంత ఉదారత చూపించే మగవాడు, స్త్రీ విషయంలో మాత్రం స్వార్ధంగా ఆలోచిస్తాదు ఎందుకని?


అబలత్వం, నిస్సహాయత తన తప్పులు గా స్త్రీ ని దోషిగా చూడడం ఎంత వరకు సమంజసం? ఇవన్నీ ఆడది ఒక బానిస అన్న భావంతో ఉన్న మగవారికి నేను వేసే ప్రశ్నలు. రాజశేఖరం వంటివారికి కాదు.


నువ్వు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు అని విన్నాను.  ఆడదంటే చులకనా ? లేక ‘అమ్మ’ ఆడదే కాబట్టి రేపు నీ భార్య ‘అమ్మ’ అనిపించుకుంటుంటే వినలేకనా?


నా మీద నీకు కోపం రావడం సహజమే. అందులో నా తప్పు వీసమంత ఉందేమో మీ నాన్నగారి అడుగు. తప్పు లేదు అని తెలిస్తే వెంటనే ఈ కింది చిరునామాకు రా.


నా అనువనువు దేవుడు గానింపుకున్న నేను ఆయనను చూడడానికి నీ అనుమతి అవసరం లేదు నాకు. నీకు అమ్మ అవసరాన్ని గుర్తు చేయడం కోసమే ఈ నా ప్రయత్నమంతా.


 అయినా ఆయనను చూడాలని ఒక్కసారి చూడాలని ఆశ. భగవంతుని దర్శించాలనే సాధారణ భక్తురాలి ఆశ.


మళ్లీ ఈ రోజు నాటికి ఈ అమ్మ నీకు కనిపించకపోవచ్చు. అవకాశం వచ్చినప్పుడు వినియోగించు కోలేకపోవడం మూర్ఖత్వమే అవుతుంది ఎంతటి విజ్ణుడికైనా.


ఈ ఉత్తరంలో ఏ వాక్యం నిన్ను బాధించినా నన్ను మన్నించు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఆరోగ్యంగా ఆనందంగా కలకాలం జీవించాలి. ఇదే ఈ అమ్మ ఆఖరి కోరిక.


 నా దేవునికి నా ప్రణామాలు చెప్పు. ఉంటాను.


నువ్వు అడుగడుగున అసహ్యించుకునే - అమ్మ”


 


ఉత్తరం చదివిన శ్రీవాస్తవ గుండె బరువెక్కింది. ఉత్తరాన్ని రెండోసారి చదివినప్పుడు, ఆమె పరిస్థితి ఊహల్లో వాస్తవ దృశ్యాల్లా మెదిలాకా, బరువెక్కిన గుండె అడుగు పొరలలో కలకలం మొదలైంది. అది అంతరంగాన్ని కుదిపి కుదిపేయడంతో కన్నీటి సంద్రం గా మారింది. ఒక్కోక్క వాక్యం ఒక్కొక్క అలగా మారి అతన్ని నిలువునా కంపింపచేయ సాగింది. కురిసి కురిసి వాన వెలసిన నేలలో ప్రచ్చన్నమైంది అతని మనస్సు ఇప్పుడు.


****************


 


“నాన్న గారు.. మీకో బహుమతి!’’ తన వెనుక దాచిన బహుమతికి అడ్డుతొలగుతూ అన్నాడు శ్రీవాత్సవ.


“జయంతీ” అప్రయత్నంగా ఆయన పదవులు అస్పష్టంగా ఆమె పేరు ఉచ్ఛరించాయి. లేని ఓపిక అంతా ఒంట్లోకి తెచ్చుకుని నిలబడి చేతులు చాచిన రాజశేఖరం గారి హృదయం మీద ఆమె పూలమాలలా ఒదిగిపోయింది.


 ఆ కౌగిలిలో రెండు సముద్రాలు సంగమించినంత ప్రశాంతత!


ఆకాశం భూమి ఒక్కటైన భావన!


ఎన్నెన్నో మాట్లాడేసుకోవాలని, ఒక్క మాట కూడా పెగలని మౌన పోరాటం!


మళ్లీ ఎవరు ఎప్పుడూ తమను విడదీయ కూడదు అన్నంత ఆరాటం.


వారిని వదిలేసి తన గదిలోకి వచ్చాడు శ్రీవాత్సవ .


ఇంతకాలం “అమ్మ” అన్న పదం అసహ్యంగా అనిపించింది. అమ్మ మనసు చదివాక, అమ్మకు అర్థం తెలుసాక ఈ ప్రపంచంలో ఏ అమృతం సరి రాని, సరిపోలని వ్యక్తి అమ్మ అనిపిస్తోంది.  ‘సృష్టి చేసి చేసి అలసిపోయి, తాను విశ్రాంతి తీసుకోవడం కోసం అమ్మ ఒడి ని సృష్టించాడు దేవుడు’ అని ఎక్కడో చదివిన వాక్యాలు - అమ్మ తనను తనివితీరా నిమిరి, నుదుట ముద్దాడి క్షమించినప్పటినుంచి ‘సువర్ణ అక్షరాలై’ మనసులో ముద్రించబడ్డాయి.


 


అమ్మ తప్ప ఎవరు ఈ ప్రపంచంలో తప్పు చేసిన వారిని మన్నించగలరు, క్షమించగలరు?


అమ్మ విలువ తెలుసుకోమనీ అమ్మని నిరసించే ప్రతి మగవాడికి, ఆడదంటే చులకనగా చూసే ప్రతి మద మృగానికి,  ఆడదాని గొప్పతనాన్ని ఛాటి చెప్పాలన్న ఆరాటంగా ఉంది అతనకి. 


 


గంగాజలంతో అభిషేకాలు చేసిన శివ లింగ పీఠంలా ప్రశాంతంగా పవిత్రంగా ఉంది అతని అంతరంగం ఇప్పుడు.


 


సమాప్తం



Rate this content
Log in

Similar telugu story from Drama