కలుసుకుందాం రా
కలుసుకుందాం రా


రచయిత: గాదిరాజు మధుసూదన రాజు
.........................................................
"కలుసుకుందాం రా"
అంటూ వనజకుమారి నుండి పిలుపు.
ఫోన్ పెట్టేయగానే
క్షణాలతేడాతో ...దాదాపు యాభైపిలుపులు!!
ఆనందంతో ఉబ్బితబ్బిబ్చయ్యాడు దాసు .
ఆ కలయిక దాదాపు ఇరవైరోజుల తరవాత అని నిశ్చయ మయ్యాక .........
గడియారాలు చెడిపోయినట్లు..
అదనపుజీతభత్యాలకు ఆశపడి ఆ
సూర్యుడు తనడ్యూటీటైంలో వోవర్ డ్యూటీ చేస్తున్నట్లూ..
చీకటిరాత్రి..వేకువఝాములు ..టీవీసీరియల్ లలా సాగిసాగి గుండెల్ని తొలుస్తున్నట్లూ అనిపిస్తోంది దాసు మనస్సుకి.
*** *** *** ***
కలుసుకోవలసిన వారిని తలుచుకుంటూ తీపిజ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ..
ఇరవైరోజుల్లో దాదాపు పదిదాకా నిదురలేని రాత్రుల్ని భరించాడు దాసు.
నత్తలా నడుస్తున్న కాలపు నిర్లక్ష్యపువైఖరిపై..
మనస్సులోనే దుమ్మెత్తిపోసుకుంటూ ..
బీ పీ పెంచుకుంటూ ...మాత్రలతో కంట్రోల్ చేసుకుంటూ తల్లడిల్లిపోయాడు ఉత్కంఠతో.
** ** **
ఎలాగైతేనేం.....
అర్ధరాత్రికీ అర్ధరాత్రే ఇంగ్లీష్ డేట్ మారటంతోపాటే....
సెల్ ఫోన్ లో అతను సెట్ చేసుకున్న అలారం మ్రోగటంతో ..
ఆ రోజు రానే వఛ్చింది దాసు గుండెల్లోకి!!
ఏమాత్రం ...అతని ప్రమేయం లేకుండా అనియంత్రితంగా అతని మనసుతో పనిలేకుండా...
ఊపిరితిత్తుల్లో ఉచ్ఛ్వాసనిశ్వాసలు నడుస్తున్నాయ్ ..
గుండెలో హృదయస్పందనలు కలుగుతున్నాయ్
ఐతే..
అతని మనస్సు మాత్రం ..
ఉదయం జరుగబోయే కలయికల కార్యక్రమం గురించి ఆలోచించటంలో తన శరీరాన్నే తాను మరచిపోయింది.
కానీ ......
కాలకృత్యాలను మాత్రం అతనిశరీరం....యాదృచ్ఛికంగా అనియంత్రితంగా తీర్చుకుంటోంది.
సమయం
ఉదయం ఏడు గంటలైంది.
టిఫిను అయిందనిపించుకొని..కాఫీ తాగేసి గడపదాటి బయటికి అడుగులేశాడు.
షెడ్డులో వున్నకారుని బయటకు తీసి,
మెదడులోంచి ప్రవహిస్తున్న జ్ఞాపకాల ప్రవాహాలవేగంతో దీటుగా కారువేగాన్ని సరిచెేస్తూ
సంగయ్యపేట నుండి సాయిబాబాకాలనీ మీదుగా..
తన కాలేజీ ..గాంధీమెమోరియల్ గవర్ణమెంట్ కళాశాల వైపుగా నడిపించాడు హుషారుగా.
*** ** ****
అప్పటికే చాలా మంది పూర్వవిద్యార్థులు విద్యార్థినులు అక్కడికి చేరుకొని ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు.
అది ..
పంతొమ్మిదివందలడెబ్బది ఏడు డెబ్బది ఎనిమిది సంవత్సరాలకు చెందిన ఇంటర్మీడియట్ పూర్వవిద్యార్థుల అపూర్వ సంగమ సంరంభం.
నలభయ్యేళ్ళ తర్వాత కలుసుకుంటున్న మనసున్న మనుషుల స్నేహానుబంధాల ఔన్నత్య మహోత్సవం.
వైద్యులు ,న్యాయవాదులు,విద్యాబోధకులు,పోలీసులు,అన్నదాతలు,ప్రజానేతలు, ఆదర్శగృహిణులు,సంపన్నులు, అపూర్వ వ్యక్తులు ..వ్యాపారవేత్తలు ,ఆధ్యాత్మిక జ్ఞానసంపన్నులు.ప్రతిభల్లో అన్నింటిలోనూ మిన్నగా నిలిచిన వాళ్ళు అక్కడ ఒక్కటయ్యారు.
తమ పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
తమతమ జీవితానుభవాలను పరస్పరం పంచుకున్నారు.
అట్లే భవిష్యత్తులో కూడా స్నేహానుబంధాలను
నిలుపుకోవాలని నిర్ణయించుకున్నారు.
మనస్ఫూర్తిగా ఒకరికి ఒకరు అన్నట్లుగా మాటల్లో మునిగిపోయారు
అలా.. అలా..
"ప్రక్కప్రక్క ఇళ్ళల్లో వుంటూ చదువుకున్నా..అన్నా చెల్లెళ్ళలా ఏడేళ్ళు కలిసిమెలిసి కాలం గడిపాం కదూ దాసూ "
"అవును పార్వతీ"
"మరీ..కనీసం..నా పెళ్ళికైనా రాలేకపోయావ్ "
" అప్పుడు నేను ముంబాయ్ లో ట్రైనింగులో వున్నాను. అందుకే రాలేక పోయాను. సారీ"
"ఛిఛీ సారీ ఎందుకు? లీవిట్ "
"అప్పటికి ఇప్పటికీ నీవు ఎప్పుడూ కరుణామయివే ..సులభంగా క్షమించేస్తావ్ "
" మరి నా కూతురు పెళ్ళికైనా వచ్చావా?
అప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యిందినాకు.అందుకే రాలేక పోయాను సారీ"
" కాళ్ళు రెండూ ఫ్రాక్చరటకదా..మీ డాడీ మా డాడీకి చెప్పాడట.పాపం!"
" జాలి చూపటం లో నా చెల్లి పార్వతి దేవతేమరి"
" రేపు నెలలో నా మనవరాలి నామకరణం వుంది .వస్తావుగా దాసన్నా?"
"తప్పకుండా బంగారూ"
** ** **
"గెట్ టుగెదర్ లో మనం కలుసుకొని రెండేళ్ళయింది కదూ దాసన్నయ్యా"
" ఔను బంగారు చెల్లీ"
"మొన్న నా మనవడి బర్త్ డేకి రాలేదు"
అంటూ బుంగమూతి పెట్టిందిపార్వతి.
"నేను ఆ రోజు చెన్నై కాన్ఫరెన్సులో ఇరుక్కుపోయా. సారీ"
"పర్లేదులే దానూ.. మా నాన్న గుండెఆపరేషన్ జరిగినప్పుడు ..హాస్పిటల్ లో రోజులతరబడి కాపలాగావున్నావ్ .ఎన్నో విధాల ఆదుకున్నావ్ ..కదా మరి"
"నా చెల్లి బంగారు కదూ అన్న ప్రేమను అర్థంచేసుకుంటుంది"
"నా కోడలు డెలివరీ అయినప్పుడు ..నీవు రాలేదు కదూ దానూ"
"వస్తూంటే..కారు రిపేరు కొచ్చింది..బెంగుళూరులోనే ఆగిపోయాను. సారీ"
" చెట్టుకు గుద్దేశావని అన్నారే? అబద్ధాలుకూడా చెప్పడం నేర్చుకున్నావ్ నీ చెల్లి పార్వతితోనే"
"నీవు బాధపడతావని అబద్ధంచెప్పాను బంగారూ"
"కారు మాత్రమే పాడైందట కదా! నీకేం కాలేదని చెప్పారు.మా నాన్నగారితో మీ నాన్నగారు.లీవిట్ దేవుడు మా అన్నయ్య ను చల్లగా కాపాడాడు"
"నా బంగారు చెల్లివి నీవు.నీవెప్పుడూ నా మేలే కోరతావు.
అందుకే బంగారూ!ఈ రోజు మా అబ్బాయి ఈ టైం లో ఇటలీకి వెళ్ళేందుకు ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ఎక్కబోతున్నాడు.
అయినా నీ మనవరాలి బర్త్ డే అంటే వచ్చాను"
"దాసన్నా !నీవు తెచ్చిన బంగారు గొలుసు కన్నా.. బంగారంలాంటి నీ మనసే మిన్న! మా ఆయన రిటైర్మెంటప్పుడు నీవు ఇచ్చిన బంగారు ఉంగరం కూడా చాలా బావుంది!"
***** *** **** ***** ......
"హల్లో హెరాల్డుగారూ "
"చేయివిరిగినా ఏ మాత్రం హుషారు తగ్గలేదు దాసూ"
"ఏడుస్తూ కూర్చోటాన్కి నేనేమైనా చిన్న పిల్లాడినా?
అరవైయ్యేళ్ళయోధుణ్ణిమరి !!"
అంటూ విరక్కుండా పదిలంగావున్న కుడిచేతిపిడికిలి బిగించి పైకిలేపిచూపాడు దాసు .
" అబ్బో!గెట్ టుగెదర్ లో కలిసిన మిత్రులంతా వచ్చివెళ్ళినట్లున్నారు"
అన్నాడు బాలాజీ బెడ్ ప్రక్కన పెరిగిన బొకేలగుట్టల్ని నిండిన పండ్లబుట్టల్ని చూస్తూ .
"అంతా ఆనాటి అన్నలూ తమ్ముళ్ళే వచ్చారన్నయ్యా..
అలనాటి అక్కలూచెల్లెళ్ళెవరూ రాలేదు"
అంటూ నవ్వుతూ ఫ్లాస్కులోంచి కాఫీలు వంచి అందించింది దాసుగారి సతీమణి వచ్చిన మిత్రులిద్దరికీ.
"పాపం!పార్వతికి షుగరెక్కువై ఇబ్బందిగా వుందట !ఆమె కూతురు ఫోన్ చెసింది"
అంటున్న దాసు మాటలు పూర్తి కాక ముందే...
"బంగారుచెల్లిపార్వతికి షుగరు,ముద్దులచెల్లి కనకదుర్గ కి విరేచనాలు, చిట్టి చెల్లి వసుంధరకి వాంతులు..పది మంది సోదరీమణులకి పదిరకాల ఇబ్బందులట"
చిరునవ్వులోనే నిరసనలు తొణికిసలాడిస్తూ వివరించింది దాసు గారి శ్రీమతి,హాజరైన అన్నయ్యలిద్దరికీ.
"అయ్యో పాపం వాళ్ళ పరిస్థితిని అర్థంచేసుకోవే!"
అంటున్న శ్రీవారి వైపు జాలిచూపులు చూసి..
"చాల్లేండి మీ మమతానురాగాలు, ఆ చెయ్యికాస్తావిరక్కుండావుంటే..పావం నా చెల్లెళ్ళకు షుగరువిరేచనాలంట అంటూ ఈ పాటికి వాళ్ళున్న హాస్పెటళ్ళకి పరుగెత్తే వారేమీరు"
అంటూ తలక్రింది దిండుసవరించింది నెమ్మదిగా.
"మీకూ ఆ మహాచెళ్ళెమ్మలు క్లాస్ మేట్లేకదా? మీరూ
గెట్ టుగెదర్ లో కలుసుకున్నారుకదా! మీరూ మా ఆయనలా ఆపద్బాంధవుల అవతారాలెత్తుతున్నారా
పిచ్చోళ్ళలా?"
అంటూ హెరాల్డు బాలాజీ లవైపు దృష్థిసారించిందామె.
"ఏమీ తీసిపోడు వదినా మా ఆయన గారు! ..ఆపదలట్లుంచి.. గెట్ టుగెదర్ చెల్లెళ్ళ ఇంట్లో కుక్కపిల్లలబర్తుడేలు జరిగినా పరిగెత్తి హాజరైపోతారు...ఇంట్లో పండగున్నా పట్టించుకోకుండా!!"
అంటూ హాస్చిటల్ గదిలో అడుగుపెట్టింది హెరాల్డుగారి సతీమణి ఆకస్మికంగా.
"మా ఆయన మరీనూ ..ఇంట్లోఫంక్షన్లున్నా పాతస్నేహితురాళ్ళఫంక్షన్లకే పరుగులు"
రాగాలు తీసింది అక్కడే నిలుచున్న బాలాజీగారి శ్రీమతి. శ్రీమతిహెరాల్డుగారి మాటలకి సృతికలుపుతూ.
పతులకూపిచ్చాపాటీ మాట్లాడుకునేందుకు స్వేచ్ఛనిస్తూ.. వారిని గదిలో వదిలేసి
అలా నడుస్తూ వసారాలోకి వచ్చారు ముగ్గురుశ్రీమతులూ సరదాగామాట్లాడుకుంటూ.
"మన మగ మహారాజులు.. మా క్లాసుమేట్లంటూ పిలిచినా పిలవకపోయినా ఆపదలకు శుభకార్యాలకు వెళుతున్నారుకానీ...వాళ్ళు మన ఫంక్షన్లకు రావటంచూసిందేలేదు"
"అవునువదినా! వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారని మన పురుషోత్తములకు అర్థంకావట్లేదు"
"అవును వదినా! అందరం చదువుకున్నవాళ్ళం! ఈ యాభయ్యేళ్ళప్రాయంలో పాత స్నేహాలు కలుపుకోవటం తప్పనలేము.
ఏమిటో ఈ మగబుద్ధులు ?పరోపకారంలో హీరోయిజం ఫీలవుతూ వెంపర్లాటలు!!"
" పరోపకారం చేసే మంచి స్నేహితులుండటం ఆనందదాయకమే కానీ...ఆ మంచి వారు మన వారైతే మాత్రం ఇబ్బందికరమే!"
" అన్నట్లు నేనూ గెట్ టుగెదర్ కెళ్ళా మా టెన్త్ క్లాస్ వాళ్ళు మా ఊర్లో పెట్టారు"
"మా డిగ్రీకాలేజీ బ్యాచ్ వాళ్ళూ పెట్టారు. వెళ్ళాను నేనుకూడా.. వెళ్ళకుంటే బావుండదని"
" మా హైస్కూల్ మేట్స్ పిలిస్తే నేనూ వెళ్ళాను వదినా"
"నా టెన్త్ క్లాస్ అన్నయ్యలందరూ మనసున్నమనుషులు వదినా మా ఆయనకి చెయ్యివిరిగిందని తెలియగానే అందరూ వచ్చారు.
అక్కలూచెల్లెళ్ళేరాలేదు.ఎంతఅహంభావమోవాళ్ళకి"
"మా నాన్నకి గుండెనొప్పి వచ్చినప్పుడు నా డిగ్రీబ్యాచ్ బ్రదర్సూ అంతే! అందరూ వచ్చి సాయమందించారు. స్నేహం విలువలు తెలిసిన ధర్మమూర్తులువాళ్ళు.సిస్టర్ కొలీగ్సే ఒక్కరూ రాలేదు..ఛి..ఛీ"
"మా హైస్కూల్ సోదరులుకూడా బంగారు కొండలే వదినా..మంచికీ చెడుకీ దేవదూతల్లా ప్రత్యక్షమౌతారు, సొంతఅన్నదమ్ముళ్ళకన్నా ముందుగానేవచ్చి,నాకూ మా ఆయనకూ అండగా నిలబడతారు"
***** ****** ****
"ఊరినుంచి అమ్మాయి వచ్చే టైం అయ్యింది.షెడ్డులోంచి కారుతీసి రైల్వేస్టెషన్ కి బయలు దేరండి"
ఆజ్ఞాపించింది ఓ సగటు ఇల్లాలు కారుతాళాలు శ్రీవారికి అందిస్తూ....
ఇంతలోనే ఫోన్ రావటంతో..
" హల్లో..
అయ్యో! కాళ్ళువిరిగాయా? ఆపరేషన్ చేశారా?
అపోలో హాస్పిటల్లోనా"
అంటూ కంగారుపడుతున్న ఇల్లాలి చేతిలోని ఫోన్ అందుకుని స్విచ్ ఆఫ్ చేశాడు సగటు భర్త గోవర్దన్ .
"అయ్యో! పాపం రవి అన్నయ్యకి యాక్సిడెంటయిందటండీ! మాట్లాడనీయండీ!"
ఏడుస్తూచేయిచాచింది.
"ఎవడో నీ క్లాస్ మేట్ గెట్ టుగెదర్ లో కలిసితగలడ్డాడు. అంతేకదా"
"మీ నాన్నకు గుండె ఆపరేషన్ జరిగినప్పుడు మీక్కూడా అన్నివిధాలా సాయపడ్డాడు కదండీ."
"ఔను..మన ఇంట్లోప్రతిఫంక్షనుకీ వచ్చి అన్నిట్లో తలదూర్చాడు కూడా ...లేదు ..కాదు అనటంలేదు.
అంతమాత్రాన వున్నఫళంగా పరుగెత్తుకెళ్ళటానికి నీవేమైనా విష్ణుమూర్తివా?
కొంచెం ఆలోచించు..
కాసేపట్లో నీ కూతురు అల్లుడు మనవళ్ళు వస్తున్నారు. ఇది ముఖ్యమా? ..ఆ దౌర్భాగ్యున్ని పరామర్శించటం ముఖ్యమా? ఏది ముఖ్యం నీకు?"
అంటూ కారును రివర్స్ చేసి రైల్వేస్టెషన్ వైపు దూసుకెళ్ళాడు గోవర్దన్ నిర్దాక్షిణ్యంగా
సానుభూతికి ఆత్మీయతకు వశమైన ఆడమనసు...అన్నయ్య ఆరోగ్యంగూర్చి ఆరాటపడుతూంటే.....
కడుపుతీపి మమకారానికి అధీనమై అల్లకల్లోలమైన
అమ్మమనసుమాత్రం.....సందిగ్ధంలో పడి.. ఆవేదనతో అల్లాడిపోయి..చివరకు అక్కడే నిస్సహాయంగానిలిచిపోయింది అలవాటైన మౌనరోదనతో గుండెనుపిండుకుంటూ.
** *** *** ***
"చూడటానికి రాలేదని మా చెల్లెమ్మలను అపార్ధం చేసుకోవద్దు శ్రీమతిగారూ
వాళ్ళూ నీలాంటి బాధ్యతలున్న ఇల్లాళ్ళే కదా! ఎటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారో ?....
స్త్రీ హృదయం పరిధుల్లేని జలధిలాంటిది.
ఆ తత్త్వం అంచనాలకు అందనిది.
అర్థంచేసుకోవాలంటే వేలాదిసార్లు మళ్ళీమళ్ళీ ఆమె కడుపున పుడుతూపుడుతూ జస్మకో అధ్యయనం చేసుకోల్సిందే!!"
అంటూ ఆసుపత్రి గదిలో రుసరుసలాడుతున్న సగటు ఇల్లాలిని శాంతపరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఆపద్బాంధవుడైన సగటు అన్నయ్య అలవాటైన మాటలతో...
---
****** *** *** **** ****
రచయిత: గాదిరాజు మధుసూదన రాజు