ఉదయబాబు కొత్తపల్లి

Drama Romance Inspirational

4  

ఉదయబాబు కొత్తపల్లి

Drama Romance Inspirational

"ముద్దబంతి నవ్వులో...!"(కథ)

"ముద్దబంతి నవ్వులో...!"(కథ)

8 mins
455


ముద్దబంతి నవ్వులో... (సరసమైన కథ)

 

రాంబాబు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక చూస్తూ ఉండిపోయారు ఆ గదిలోని బాలికలు.

‘’రెండు పరమాణువులు ఎందుకు సంయోగం చెందుతాయి?’’ రాంబాబు మళ్లీ ప్రశ్నించాడు. 

అసలు వారికి ఆ ప్రశ్న వినిపిస్తే కదా! పాలమీగడతో తేనె రంగరించి అందులో పరిపూర్ణ పురుషత్వాన్ని, పున్నమినాగు బుసల సెగలని కలిపి తీర్చిదిద్దిన రాకుమారూడిలా, చామంతి రంగు దేహశ్చాయతో షార్ట్ పై గుండీలోంచి తొంగిచూస్తున్న రోమాల దొంతర వెక్కిరిస్తుంటే, ముట్టుకుంటే కందిపోయే చెక్కిలతో రక్తం చిమ్ముతూ, ఎర్రని దొండపండు రంగు పెదవుల మీద లేలేత నూనూగు మీసంతో తన వృత్తిలో లీనమై అంకితభావంతో పాఠం మొదలు పెట్టిన అతనిని అలాగే చూస్తూ ఉండిపోయారు.

‘’అదేమిటమ్మా? నా మొహాన్ని ఏమైనా ఉన్నాయా కోతులాడుతున్నాయా? నా ప్రశ్నకు ఒక్కరూ సమాధానం చెప్పరేం? తెలియక పోతే కనీసం ‘తెలీదు ‘ అనైనా సమాధానం చెప్పచ్చు కదా’’ అన్నాడు రాంబాబు.

‘’లెగవే... లే... నువ్వు చెప్పు’’ అంటూ నలుగురైదుగురు ఓ పుష్కలేశ్వరిని ముందుకు తోయడంతో ఆమె సిగ్గుపడుతూ లేవలేక లేచి నిలబడింది.

‘’నిజంగా తెలియదు సార్.” సిగ్గు దొంతరలలో పీలగా అనేసి కూర్చో బోతుంటే, రాంబాబు అన్నాడు.

‘’కూర్చోకు. నువ్వు నచ్చావ్ అమ్మాయి. ఇంత మందిలో ధైర్యంగా ‘తెలీదు’ అని చెప్పడానికైనా లేచావు . ఇంతకీ నీ పేరు?’’

‘’ కామాక్షి సార్ !’’ చెప్పింది ఆ అమ్మాయి.

‘’వెరీ గుడ్. స్కూల్ లో ఎన్నో ఏళ్ల నుంచి చదువుతున్నావు?’’

‘’ఎనిమిదో తరగతి నుండి సార్’’

‘’ మరి 9వ తరగతి రసాయన శాస్త్రంలోనే మీకు పరమాణు నిర్మాణం, రసాయన బంధం గురించి తెలిసి ఉండాలే’’ అని అడిగాడు రాంబాబు.

‘’ మాకు రెండేళ్ల నుంచి సైన్సు మాస్టారు లేరు సార్. అందుకేగా మిమ్మల్ని వేశారు’’ అంది ఎవరో అమ్మాయి. రాంబాబు చటుక్కున నాలిక్కరుచుకున్నాడు.

‘’ సరే అయితే! నా శక్తిమేరకు మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రపంచంలో ప్రతి పదార్థము పరమాణు నిర్మితం- మన శరీరంలో రక్త కణాల మాదిరిగా. అయితే మనవి జీవకణాలు. పదార్థం పరమాణువులతో ఏర్పడుతుంది. పరమాణువులుగా ఉన్నప్పుడు వాటికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఎక్కువగా ఉన్న శక్తిని తగ్గించుకుని స్థిరత్వం పొందడం కోసం ఒక పరమాణువు మరొక పరమాణువుతో సంయోగం చెందుతుంది. అర్థం అయిందా?’’

వాళ్లు అవే దిష్టి చూపులు చూడసాగారు,తెల్ల మొహం వేసుకుని.

‘’దీనిని నిత్య జీవితానికి ఆన్వయించి చెప్పుకుందాం’’ రాంబాబు కొనసాగించాడు

‘’మీ ఇంట్లో మీ అన్నయ్య ఏదైనా ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం. అతనికి ఇంకా పెళ్లి కాలేదు అనుకోండి. చేతుల్లో ఉన్న డబ్బులతో ఫ్రెండ్స్ అందరితో తిరిగి తిరిగి ఏ రాత్రికో ఇంటికి చేరుకుంటున్నాడు అనుకోండి. అప్పుడు మీ అమ్మగారు మీ నాన్న గారికి ఓ సలహా ఇచ్చారు అనుకుందాం. ‘ఒక్కడే కదా అని ఇష్టం వచ్చినట్లు గాలికి తిరుగుళ్ళు తిరుగుతున్నాడండి. వీడి మెడకు ఓ గుదిబండ తగిలిస్తే గాని దారిలోకి రాడు అని’. అప్పుడు మీ నాన్నగారు వాడికో సంబంధం చూసి, అంటే - మరో పరమాణువులాంటి కోడల్ని చూసి కట్టబెట్టారు అనుకుందాం. రోజు అర్ధరాత్రి గాని ఇంటికి రాని మీ అన్నగారు సాయంత్రం ఆరు గంటలకే వివాహమయ్యాక పువ్వులతో తయారై పోతాడు . అంటే పరమాణువుగా ఉండగా ఎక్కువ శక్తితో తిరిగిన వాడు తన శక్తిని తగ్గించుకుని స్థిరత్వం పొందడం కోసం మరో పేరు పరమాణువైన తన భార్యతో సంయోగం చెంది సంబంధం ఏర్పరచుకుంటాడు అన్నమాట.’’ అతను చెప్పడం పూర్తి చేయకముందే చప్పట్లతో ఆ గదంతా మారుమ్రోగిపోయింది.

 కామాక్షి లేచి నిలబడింది ‘’చాలా థాంక్స్ సార్. చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు సార్. ఇంత బాగా సైన్స్ పాఠం చెప్పిన మాష్టారిని నేను ఇంతవరకూ చూడలేదు సార్. మీరు రోజూ ఇలాగే పాఠాలు చెప్పాలి సార్. థాంక్యూ సార్’’

అంతలోనే గణగణమని బెల్ మోగడం తో బయటకు వెళ్ళబోతూ అన్నాడు రాంబాబు ‘’చూడండమ్మా !మీ అందరికీ పాఠం అర్థమయ్యేలా చెప్పడం నా బాధ్యత. దానిని సద్వినియోగం చేసుకుని మీరందరూ కష్టపడి చదువుకుంటేనే నేను చెప్పిన ఈ విద్యకు అర్థం. ఇప్పుడే కాదు ఏ విషయంలోనైనా మీకు సందేహం వస్తే మా ఇంటికి వచ్చి అడిగినా మీ సందేహం తీర్చే పూచీ నాది. సరేనా?’’

‘’సార్! మీ ఇల్లు ఎక్కడ?’’ ఓ అమ్మాయి అడిగింది.

‘’మా ఇంటి పక్క డాబా మీద వాటాలోకి నిన్న సాయంత్రమే వచ్చారే.?’’

 రాంబాబు స్టాఫ్ రూమ్ లోకి వెళ్లడం తో కామాక్షి మాటలు అతనికి వినపడలేదు.

**********

‘’ ఏవండీ! మీ కోసం ఎవరో వచ్చారు?’’భార్య చాతుర్య అన్న మాటలకు టీచింగ్ నోట్స్ రాసుకుంటున్న రాంబాబు లేచి బయటకి వచ్చాడు.

 ఎదురుగా ఓ నడివయసు ఆవిడ.

‘’ చెప్పండమ్మా? ఎవరు మీరు? ఏం కావాలి?’’

సమాధానంగా ఆమె వెనుకనుంచి ప్రసిద్ధ దర్శకుడు తన చిత్రంలో హీరోయిన్ ప్రవేశంలా, కారుమబ్బు తొలగిన చంద్రునిలా, ముగ్ధమనోహరంగా... చక్రాలు లాంటి కళ్ళతో పక్కకు వచ్చి తలవంచుకుని నిలబడింది కామాక్షి . మంచి మందులతో ఏపుగా ఎదిగి కోతకు వచ్చి పెరిగిన మొక్కజొన్న కండెలా నిగనిగలాడుతున్న అల్లనేరేడు పండులా, చక్కగా తంపట వేసిన లావు తేగలా, ఒక గేదె ఒబ్బిడిగా వేసిన పేడ కడిలా, నిండుగా పుష్టిగా ఉన్న కామాక్షిని చూస్తూనే తెల్లబోయాడు రాంబాబు.

పాఠశాలలో యూనిఫారంలో కనిపించిన ఆ కామాక్షికి, విరిసిన ముద్దబంతి పువ్వులా, ముద్ద మందారపు పూవులా చక్కని అవయవ పొందికతో, వయసు బింకం తో, రక్తపు బిగితో, పంట ఏపుగా ఎదిగి కోతకు వచ్చిన పచ్చని పైరులా పరికిణీ, ఓణీలలో ఉన్న ఈ కామాక్షికి  అసలు పోలికే లేదు. బలవంతంగా ఆమె మీద నుంచి చూపు తిప్పుకుంటూ అడిగాడు రాంబాబు.

‘’చెప్పండమ్మా... ఏం కావాలి? నాతో ఏమైనా పని ఉందా?’’

‘’అవును బాబు గారు. మీరు ఈయాల ఏదో పాటం సెప్పారంట. దానికి సాలా బాగా అర్థం అయిందంట. ఇల్లు పక్కనే కదా. అంతమందిలో సెప్పించుకునే దానికన్నా మీరు ఇక్కడ దానికి మీ ఇంట్లోనే సెబితే, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చుకుంటాను. దానికి ఓ అక్షరం ముక్క అబ్బితే మాకు ఆనందం బాబూ. మీ పున్నెం ఊరికే పోదు’’ అంది ఆమె.

 

‘’చూడండమ్మా నేను ఎవరికీ ప్రైవేటు చెప్పను. ప్రభుత్వం వారు ఇచ్చే జీతం నాకు నా భార్యకు సరిపోతుంది.  పైగా మేం బాగా ఉన్నవాళ్లమే. పది మందికి విజ్ఞానం పంచి ఇచ్చే ఉపాధ్యాయ వృత్తి అంటే నాకు ప్రాణం. ఇకపోతే తనకు ఏమైనా సందేహాలు ఉంటే పంపండి తీరుస్తాను. అంతేగాని ప్రైవేటు అని పేరు పెట్టి డబ్బు తీసుకుని చదువు చెప్పే పద్ధతి నాకు నచ్చదు. ఏమీ అనుకోకండి’’ అన్నాడు.

 ‘’ఇన్నావుగా ఆ బాబు గారి మంచి మాటలు . నీకు అర్ధం కానియ్యి ఆయన్ని అడుగు ‘’అంది కామాక్షి వాళ్ళమ్మ.

‘’ సార్ !నాకు పరమాణు నిర్మాణం, రసాయన బంధం పాఠాలు పూర్తి గా అర్థమయ్యేలా చెప్పగలరా?’’

‘’ రేపు క్లాసులో చెబుతానుగా”

‘’ అది కాదు సార్ ! ఇక్కడ ఒకసారి విని , అక్కడ కూడా వింటే బాగా అర్థం అవుతుంది కదా అని’’ నసుగుతూ అంది కామాక్షి

‘’సరే. ఇంటికి వెళ్లి పుస్తకాలు తీచ్చుకో’’ అన్నాడు రాంబాబు.

 ఆమె తన చేతిలోని పుస్తకాలు ముందుకు చాచింది.

‘’ ఓ రెడీగానే వచ్చావన్నమాట. అమ్మా... మీరు మరో గంటలో మీరు వచ్చినా సరే, లేదా పాఠం పూర్తయ్యాక నేను తీసుకువచ్చి దిగబెడతాను.’’ అన్నాడు రాంబాబు.

కామాక్షి వాళ్ళమ్మ చేతులు జోడించి ‘’గంట తర్వాత వత్తాను. బాగా ఇని ఒంటపట్టించుకో.నీడసలే మొద్దు బుర్ర. ఇంటికొచ్చి మళ్ళీ నా పానం తీత్తావ్.’’ అనేసి వెళ్ళిపోయింది.

‘’లోపలికి రా’’ రాంబాబు తన డైనింగ్ రూమ్ లోకి నడిచాడు.

 స్వప్న మందిరంలోకి అడుగుపెడుతున్న అంత అపురూపంగా లోపలికి అడుగుపెట్టింది కామాక్షి.

 ‘’చూడు. అమ్మగారికి ఒంట్లో బాలేదు. టాబ్లెట్లు వేసి కాఫీ ఇచ్చి వస్తాను. ఇంతలో నీకు ఎక్కడ సందేహమో చూసుకుంటూ ఉండు’’ అనేసి లోపలికి వెళ్లిపోయాడు రాంబాబు.

అతను అలా వెళ్లిన వెంటనే కామాక్షి జాకెట్టు స్టెప్స్ పెట్టుకున్న పిన్నీసు తీసేసింది. లోపలనుంచి యవ్వనపు ఆచ్ఛాదనలన్నీ స్వచ్ఛంగా కనిపించేలా ఓణీ ఒంటి పొరన వేసుకుంది. ఓణీ కింద నుంచి చెయ్యి పోనిచ్చి జాకెట్టు పై హుక్కు , కింది చివరి హుక్కు తీసేసింది. జాకెట్టు అడుగుభాగం కోసలు పట్టి కిందకు బలంగా సర్దుకుంది. ‘మిమ్మల్ని దాచడం నావల్ల కాదు’ అన్నట్టు జాకెట్టు కక్కేసినట్టుగా బయటకు చూస్తున్న తొంగి చూస్తున్న యవ్వన మద చిహ్నాలు స్పష్టంగా కనబడేలా సర్దుకుని ఏమీ ఎరగనట్టు బాసిం మఠం వేసుకుని నేల మీద కూర్చుని పుస్తకం తీసింది.

రాంబాబు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. కామాక్షి టెక్స్ట్ పుస్తకం ఇచ్చింది అమాయకంగా.

సరిగ్గా అప్పుడు చూసాడు ఆమెను. ఆకలిగొన్న పులికి ఎదురుగా జింకపిల్ల కనిపించినట్లుగా. అన్నార్తుడి ముందు ఉంచబడిన పంచభక్ష్య పరమాన్నంలా, నడిసంద్రంలో ఉన్న అభాగ్యుడికి చుక్కానిలా తోచింది ఆమె అతని కళ్ళకు.

అతడు కుర్చీని ఆమెకు దగ్గరగా లాక్కుని ‘’ చూడు. చదువుకోడానికి వచ్చినప్పుడు పద్ధతిగా కూర్చోవాలి’’ అన్నాడు.

 ఆమె అప్పుడే గ్రహించిన దానిలా మొత్తం పమిటనంతా లుంగలా చుట్టి వేసుకుని ‘’చెప్పండి సార్ ‘’అంది. ఇప్పుడు ఆమె పల్చని పొట్ట, లోతైన నాభి, వక్షం లో సగభాగం ఎటువంటి ఆచ్చాదన లేకుండా కనిపిస్తున్నాయి . ఏదైనా అంటే మళ్ళీ సర్దుకుంటుందేమో అని భయం తో రాంబాబు పాఠం మొదలు పెట్టాడు ‘’ప్రతిపదార్థం పరమాణు నిర్మితం అని చెప్పాను కదా. పరమాణువులో ముఖ్యంగా మూడు మౌలిక కణాలు ఉంటాయి. వాటిని ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అంటారు. మన నిత్య జీవితంలో తండ్రి లేని కుటుంబాన్ని తీసుకుందాం. ప్రొటాన్ అంటే కొడుకు అన్నమాట. న్యూట్రాన్ అంటే తల్లి, ఎలక్ట్రాన్ అంటే కోడలు. పరమాణు నమూనా ప్రకారం ప్రొటాను ధనావేశం, ఎలక్ట్రాన్ ఋణావేశం కలిగి ఉంతాయి. ఆవేశాలలో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు సమాన విలువలు కలిగి ఉండి పరస్పరం వ్యతిరేకంగా ఉంటాయి. అంటే ఒకే కుటుంబంలో భర్తకు, భార్యకు అన్ని విషయాలలో సమాన హక్కులు ఉన్నట్టు.

 ఇకపోతే పరమాణువు మధ్యలో దాని భారమంతా కేంద్రీకృతమై ఉంటుంది. పరమాణు కేంద్రకంలో ధనావేశం గల ప్రొటాను, ఏ ఆవేశం లేని న్యూట్రానులు ఉంటాయి. అంటే తల్లీ, కొడుకులు కేంద్ర భాగంగా ఉన్న కుటుంబం లా. ఋణావేశం గల ఎలక్రాను కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. అంటే కోడలు, ఆ తల్లీ కొడుకుల మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటుంది అన్నమాట. ఏమైనా అర్థం అయిందా?’’ అడిగాడు రాంబాబు.

అతని పాదాల దగ్గర కూర్చుని అతను చెప్పేది శ్రద్ధగా వింటూ అప్పుడప్పుడు సిగ్గుపడుతూ, తలవంచుకుని లుంగి కొసలు తొలగిన అతని కాళ్ళ పై కోడెవయసు రోమాలను పరిశీలిస్తున్న కామాక్షి వెంటనే అడిగింది

‘’సార్ ! ఆవేశం అంటే?’’

 రాంబాబు ఒక్కక్షణం తరబడి పోయాడు. తమాయించుకుని అన్నాడు

‘’ఆవేశం అంటే విద్యుదావేశం.’’

‘’ అర్థం కాలేదు సార్ !’’అన్నది కామాక్షి.

‘’ చూడు. ఉదాహరణకి నువ్వు సినిమాలో ఒక సీరియస్ ఫైటింగ్ సీన్ చూస్తున్నావనుకో. అక్కడ తెరమీద హీరో ఫైట్ చేస్తుంటే నీకు కూడా ఉత్తేజం వచ్చి పక్క సీటు వాళ్ళతో ఫైట్ చేసేయాలని అనిపిస్తుంది కదా... అలాంటి ఉత్తేజిత శక్తి అన్నమాట.’’

‘’ నేను పైటింగ్ సినిమాలు చూడను సార్. ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారివి తప్ప ‘’అన్నది కామాక్షి.

రాంబాబు ఆమెకేసి సూటిగా చూస్తూ చిరునవ్వుతో ‘’ జిల్ జిల్ జిల్ మంటూ మ్రోగింది... ఎదలోయలలో కాంభోజిరాగం ...ఆ పాట నాకు పూర్తిగా రాదు. కానీ ఆ పాటలో సౌందర్య ఎంతో సంతోషంతో డాన్స్ చేసింది కదా. అది చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది?’’ అడిగాడు.

‘’ నాకు అలా చెట్టు, చేమలు, వాగులు, వంకలు తిరుగుతూ డాన్స్ చేయాలనిపిస్తుంది సర్.’’

 ‘’ఎస్. ఆ ఉత్తేజిత శక్తినే మనం విద్యుదావేశం అనవచ్చు.’’

 

‘’మరి రెండు పరమాణువుల మధ్య బంధం ఎప్పుడు ఎలా ఏర్పడుతుంది సార్?’’ అడిగింది కామాక్షి.

‘మంచి ప్రశ్న. రెండు పరమాణువుల మధ్య బంధం రెండు రకాలుగా ఏర్పడుతుంది. ప్రధానంగా ఒకటి అయానిక బంధం, రెండోది సమయోజనీయ బంధం. అయానిక బంధం రెండు పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ బదలాయింపు వల్ల ఏర్పడుతుంది. అంటే రేపు నీకు పెళ్లి అయింది అనుకో. నీ కుటుంబం నుంచి ఎలక్ట్రానిక్ అయిన నువ్వు పెర్మనెంట్ గా మరో కుటుంబం లోకి వెళ్ళిపోతున్నావు అన్నమాట. అందువల్ల మీ రెండు కుటుంబాల మధ్య బంధం ఏర్పడుతుంది. ఆ బంధాన్ని అయానిక బంధం అనవచ్చు. అదే రెండు పరమాణువులు ఒక ఎలక్ట్రాన్ జంటను సమిష్టిగా పంచుకోవడం వల్ల సమయోజనీయ బంధం ఏర్పడుతుంది.  అంటే పిల్లల తాలూకు బాధ్యతల్ని భార్యాభర్తలు పంచుకుంటారు చూడు. అలాగ.

‘’అంటే ఒక ఆడ మగ కష్టసుఖాలను సమానంగా పంచుకునే లాగానా సార్?’’ ‘సుఖాలను’ అన్న పదం దగ్గర ఒత్తి పలుకుతూ అంది కామాక్షి. 

‘’అవును. బాగానే అర్థం చేసుకున్నావు. మరి ఏక బంధం, ద్వి బంధం, త్రీ బంధం ఎలా ఏర్పడతాయి సార్?’’ ‘’రెండు పరమాణువుల మధ్య ఒక ఎలక్ట్రాన్ జంట పంచుకోబడితే ఏక బంధం, రెండు ఎలక్ట్రాన్ జంటలు పంచుకోబడితే ద్వి బంధం, మూడు ఎలక్ట్రాన్ జంటలు పంచుకోబడితే త్రీ బంధం ఏర్పడతాయి.’’ చెప్పాడు రాంబాబు.

‘’అంటే... మా అమ్మ నాన్నలకు పెద్దన్నయ్య పుట్టినప్పుడు ఏక బంధం, రెండో అన్నయ్య పుట్టినప్పుడు ద్విబంధం, నేను పుట్టినప్పుడు త్రీ బంధం ఏర్పడింది అన్నమాట. మాది త్రీ బంధం కుటుంబం కదా సార్’’ అంది కామాక్షి.

‘’సబ్జెక్టు పట్ల ఇంత అవగాహన ఉన్న దానివి ...మరి నీకు ఇంక వేరే ప్రైవేట్ ఎందుకు?’’ అని నవ్వుతూ అడిగాడు రాంబాబు.

‘’అవగాహన ఉన్నంతగా అనుభవం లేదు కదా సర్. అనుభవమైతే అది ఆజన్మాంతం ఉంటుంది కదా.  మీకు అభ్యంతరం లేకపోతే ఆయానిక బంధం లా మీ ఇంట్లో ప్రవేశించి, సమయోజనీయ బంధం మిమ్మల్ని పంచుకొని, కనీసం త్రీ బంధం వరకూ ఏర్పరుచుకోవాలని ఆశగా ఉంది సార్. ఏమంటారు?’’ జారిపోయిన పమిటను ఏమాత్రం పట్టించుకోకుండా మత్తుగా సిల్క్ స్మిత చూపులు చూస్తూ అంటున్న ఆమె మాటలకు రాంబాబు ఒక్కసారిగా నిరుత్తరుడైపోయాడు.

‘’ సార్ నా జీవితంలో ఎంతో మంది మాస్టర్లు పాఠాలు చెప్పగా విన్నాను . అసలు అర్థం కాని, కంటితో చూడని పాఠాలను జీవితాలకు అన్వయించి చెప్పిన మీలాంటి వారిని నేను ఎక్కడ చూడలేదు. అంతే కాదు ఇంత అందమైన పర్సనాలిటీని  ఇంత దగ్గరగా కూర్చుని చూసే అదృష్టం కూడా నాకు ఇంతవరకు దక్కలేదు...’’ అంటూ అర మూసిన కన్నులతో ఏవేవో పిచ్చి పిచ్చి గా మాట్లాడ సాగింది. 

రాంబాబుకు నిలువెల్ల చెమటలు పట్టేసాయి. 

అదే సమయంలో భగవత్సాక్షాత్కారం అయినట్టుగా ‘’ అయిపోయిందా బాబు?’’ అంటూ కామాక్షి తల్లి మెట్లు ఎక్కుతూనే అనడంతో, వెంటనే పమిట సర్దుకుని పుస్తకాలు తీసుకొని ‘’వస్తాను సార్ ‘’అనేసి వెళ్ళిపోయింది కామాక్షి.

రాంబాబు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు.

 

******************

ఆ గదిలో నిశ్శబ్దాన్ని చీలుస్తూ అన్నాడు రాంబాబు.

‘’అమ్మా... 20 సంవత్సరాల వయస్సు నిండిన అమ్మాయిని కాలక్షేపం పేరుతో పాఠశాలకు పంపిస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ అమ్మాయి పదవ తరగతి పరీక్ష ఎందుకు తప్పింది కారణాన్ని అన్వేషించే లేకపోయారు. తను నా పాఠం వైపు ఆకర్షితురాలైంది అనుకున్నానేగానీ నా వైపు ఆకర్షితురాలైంది అని ఆమె రాసిన ఉత్తరం చూశాకనే తెలిసింది.

వయసు వచ్చిన ఆడపిల్లలు కొట్టి, కాసీడీరా తిట్టి, మీ బాధ్యతను కప్పిపుచ్చుకునే కంటే ఇప్పటికైనా మేల్కొని ఆమెకు తగిన వరుడుకిచ్చి ఎంత తొందరగా వివాహం చేస్తే అంత మంచిది. మీ అమ్మాయి చెడ్డ పిల్ల కాదు. అసాధారణ తెలివితేటలు గలది. నేను చెప్పిన పాఠాలు అర్థం కాక ఎంతోమంది బట్టీలు వేస్తారు.  అయితే అంత బాగా అర్థం చేసుకుని కూడా దారి తప్పుతోంది అంటే - టీవీల ప్రభావం, సినిమాల ప్రభావం 90% ఉండటమే. 

 

తనే కాదు. తనలా ఎంతో బాగా చదివే పిల్లలు కూడా ఈ వేళ గాడి తప్పి తమ జీవితాలను చేజేతులా పాడు చేసుకుంటున్నారు. పెళ్లికి ముందే అన్నీ అనుభవించేయాలి అనే వెర్రి వ్యామోహంలో ఉన్న వారే తప్ప దాంపత్య జీవితం లభించే నాటికీ తామెంత నిర్వీర్యమై పోతున్నారో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎవరు ఏలాంటి మాట మాట్లాడినా దాన్ని స్త్రీ పురుష సంబంధాలకు అన్వయించుకుని అదేదో తెలిసేసుకోవాలని ఆరాటపడుతున్నారేగాని నిజమైన జీవితవిలువలు తెలుసుకోలేకపోతున్నారు.

 

కామాక్షి తన సంసారాన్ని ఎంతో చక్కగా తీర్చిదిడ్డుకోగలిగిన నైపుణ్యం గల అమ్మాయి అనిపించింది నాకు. వెంటనే ఆమె అవసరాలను గుర్తించి మీరు ఆమెకు వివాహం చేయడం మంచిది. ఆమెకు చదువు ఏ రకంగానూ అబ్బదు. ఇది ఉపాధ్యాయుడిగా నా అభిప్రాయం.’’

 

‘’బాబుగారు. అవకాశం వస్తే ఆడ పిల్లల జీవితాలతో ఆడుకొని, నాశనం చేసే వాళ్ల గురించి పేపర్లలో చూస్తున్నాం. టీవీలో ఇంటున్నాము. అట్టాంటిది మీరు... మీరు మా కళ్ళు తెరిపించారు. మా బాధ్యత గుర్తు సేశారు. ఇంత చిన్న వయసులో ఉన్న మీరు మా కళ్ళకు దేవుడిగా కనిపిత్తన్నారు. ఇలాంటి తప్పుడు    కూతుర్ని ఇక ఇంట్లో ఉంచుకోం బాబూ...’’ఆవేశంగా అంటున్న కామాక్షి తల్లి మాటలకు రాంబాబు అడ్డు తగిలాడు.

‘’తప్పమ్మా. మీరు అలా అనకూడదు. మీ కూతురు తప్పుడు కూతురు కాదు. తప్పటడుగు వేయబోయింది. తల్లిగా ఆమె జీవితం బాగుండాలని దీవించాలి గానీ ఆమె అలా ఉత్తరం రాసింది అని పదిమందికి తెలిసేలా మీ అమ్మాయిని కొట్టుకుని తిట్టుకుంటే పరువు పోతుంది తప్ప సమస్య పరిష్కారం కాదు.

 నాకు అందమైన భార్య వుంది. మా ఇద్దరి మధ్య అరమరికలు లేని అనురాగం ఉంది. ఆమె అందమైన నవ్వులో జీవిటాంటాం నేను హాయిగా బ్రతికేయగలను. మళ్లీ అంత అందమైన నవ్వు మీ అమ్మాయి లో చూశాను. ఆమె మనసును అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి . నా మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా మీరు కామాక్షి అని ఏమీ అనవద్దు. ఏమైనా అంటే అవి నాకు తగులుతాయి అని గుర్తు పెట్టుకుంటే చాలు. వస్తాను.’’ కామాక్షి తనకు రాసిన ప్రేమలేఖను వారు ముందే ముక్కలు చేసి బయటకు నడవబోయాడు రాంబాబు.

అదే సమయంలో లోపల్నుంచి రివ్వున వచ్చి అతని కళ్ళముందు వాలి పోయింది కామాక్షి.

‘’ సార్! నన్ను... నన్ను క్షమించండి సార్! నేను నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాను. తండ్రిగా, మార్గదర్శిగా చూడాల్సిన మిమ్మల్ని అందరిలాంటి వారే అనుకున్నాను కానీ, ఇలా నా తప్పు నేనే తెరచుకొనేలా చేసి నన్ను.... నన్ను క్షమిస్తారని ఊహించలేదు సార్! సార్ నన్ను క్షమించండి’’ పశ్చాత్తాపం కన్నీళ్ల రూపంలో గంగై ప్రవహించినప్పుడు ఏ వ్యక్తి అయినా గంగ అంత పవిత్రుడే. 

ఇంత జరుగుతున్నా ఆ గదిలో కామాక్షి తండ్రి, అన్నలిద్దరూ ... ఒక్కరు కూడా కోపాన్ని ప్రదర్శించటం గానీ నోరు మెదపకపోవడం గాని రాంబాబుకు ఆశ్చర్యమనిపించింది. ఆ ఇంటి వాతావరణాన్ని ఆ విధంగా శాసించగలిగిన కామాక్షి తల్లికి మనసులో మరోమారు కృతజ్ఞతలు చెప్పుకుంటూ బయటికి వచ్చేశాడు రాంబాబు.

****************

సుమారు నెల రోజుల తర్వాత కామాక్షి వివాహానికి హాజరయ్యారు రాంబాబు భార్యతో సహా.

కామాక్షి తల్లి నూతన దంపతుల చేత రాంబాబు దంపతులకు నమస్కరింప చేసింది.

అక్షతలు వేసి ఆశీర్వదిస్తూ రాంబాబు ఇలా అన్నాడు

‘’అత్తవారింటికి ఆయానిక బంధమై, భర్త కష్టసుఖాలలో సమయోజనీయ బంధమై, వచ్చే మూడేళ్లలో ఏక, ద్వి, త్రీ బంధాలతో నీ కాపురం కోటి వీణల రాగం తో సాగే పాట గా మారాలని కోరుకుంటున్నాను కామాక్షీ,’’

 

కన్నీటి కృతజ్ఞతాభివందనాలతో అభివాదం చేసింది కామాక్షి అరవిరిసిన ముద్దబంతిలా నవ్వుతూ.

 

ఆ నవ్వులో మూగ బాసలేమిటో రాంబాబుకి మాత్రమే తెలుసు!!!

 

సమాప్తం


కొత్తపల్లి ఉదయబాబు

సికింద్రాబాద్

 

 

 



Rate this content
Log in

Similar telugu story from Drama