ఉదయబాబు కొత్తపల్లి

Classics Inspirational Others

4  

ఉదయబాబు కొత్తపల్లి

Classics Inspirational Others

అమ్మతనం సాక్షిగా!!!(కథ)

అమ్మతనం సాక్షిగా!!!(కథ)

7 mins
424


అమ్మతనం సాక్షిగా...!!!

ఉగాది ఉత్సవాలలో భాగంగా ఆ ఊరి గ్రామపు నడి బొడ్డున వారం వారం సంత జరిగే స్థలానికి ఆనుకుని - రోడ్డుకు ఆవల ఉన్న "పుంతలో ముసలమ్మ" అమ్మవారి దేవాలయ ప్రాంగణం అంతా విద్ద్యుద్దీపాలకాంతితో మిరిమిట్లు గొలుపుతూ ప్రకాశిస్తోంది.

అమ్మవారి గుడి ప్రహారీకి వెలుపల ఉత్తరభాగాన  ప్రత్యేకంగా నిర్మించబడిన విశాలమైన ఎత్తైన వేదిక శాశ్వత ప్రాతిపదికపైన రేకుల షెడ్ గా నిర్మించబడింది. వేదికకు ముందు వెనుక సిల్కు తెరలు, వాటికి రకరకాల బెలూన్ లు , రంగు రంగుల కాగితాలతో అమర్చిన విధానం కళాకారుల నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోంది. కుడి ఎడమ పక్కల బంతిపూలు, టెంకీస్ పూలు, మల్లె పూల దండలతో వేదిక సువాసనలు వెదజల్లుతోంది.

సరికొత్త సినిమాల్లోని పాటలన్నీ ఒక్కొక్కటిగా మైక్ లోంచి వినిపిస్తుంటే వేదిక ముందు చేరిన టీనేజ్ లోపు కుర్రకారంతా వాటికితగ్గ నాట్యవిన్యాసాన్ని ఎవరికి వారు ప్రదర్శిస్తున్నారు.వేదిక నెక్కి పాడుచేయకుండా నిర్వాహకులు జమాజెట్టీల్లాంటి కుర్రాళ్లను అక్కడ కాపలా ఉంచడంతో ఎవరూ వేదికనెక్కే సాహసం చేయడంలేదు.

రాత్రి తొమ్మిది గంటలు కావొస్తోంది. 

''ఒరేయ్. సర్పంచ్ గారు వొచ్చేస్తే మనం కార్యక్రమం ప్రారంభం చేసేయచ్చు ఎక్కడున్నారో కనుక్కోరా..'' అన్నాడు కార్యక్రమ నిర్వాహకుడు.

''అట్టాగే అన్నా...'' అని ఫోన్ చేసి సమాచారం తెలుసుకున్న అనుచరుడు

'' బయల్దేరారంట అన్నా...మరో పదినిముషాల్లో ఇక్కడుంటారట'' అన్నాడు.

వెంటనే బాజీరావు తన అనుచర గణాన్ని దగ్గరగా పిలిచాడు.'' కుర్చీల్లో కూర్చున్న పిలకాయలందరినీ కింద బరకాలమీద కూసోపెట్టండి. పెద్దోళ్లందరిని కుర్చీల్లో కూసోబెట్టండి. ఒకరిద్దరు దండలతో రెడీగా ఉండండి. మన పోలీసన్నలందరికీ పహారా బాగా కాయాలని గుర్తు చేయండి. సర్పంచిగారిచేత కూడా వాళ్ళకి ఓ మాట చెప్పిస్తే ఆల్లు అటెన్షన్ లో ఉంటారు. మన కార్యకర్తలందరూ క్రమశిక్షణతో ఉండి బాగా నిర్వహించాల.'' అని అందరినీ ఉత్సాహపరచడంతో అందరూ తమ తమ పనులలో బిజీ ఆయారు.

మన స్వేచ్చా భారతంలో తమ పద్ధతులు, సాంప్రదాయాలు పండగలకే పరిమితం చేస్తూ ఆధునిక సాంకేతికత, నగరాలు దిగుమతి చేసుకున్నా పాశ్చాత్య నాగరికతను సామంత రాజ్యాల్లా యధేశ్చగా అనుసరిస్తున్న పల్లెలలో అది ఒక పచ్చని పల్లె.

ఒకనాడు ''పచ్చని పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు'' అనిపించుకున్న వేలాది గ్రామాలు ఈనాడు తమ సహజమైన పదహారేళ్ళ పరువాలకు కృత్రిమ రంగులంటించుకుని అసహజ వస్త్రాలంకరణతో ప్లాస్టిక్ పువ్వుల్లా కాంతులీనుతున్న సంస్కృతి ఈ గ్రామానికి వ్యాపించిందనడానికి సందేహం లేనేలేదు.విటులను ఆకర్షించడానికి పచ్చి వ్యభిచారి పూసుకున్న సెంటు వాసనను అక్కడి వాతావరణంలోకి ప్రవహింపచేస్తూ పరిమళిస్తున్న సర్పంచ్ ఫణిభూషణరావు కారులోంచి దిగగానే ఆయన అనుచర గణమంతా ఆయనను దండలతో ముంచెత్తి హర్షధ్వానాలు చేస్తూ ఆయనను ప్రత్యేక ఆసనం దగ్గరకు తోడ్కొని వచ్చారు. ఆయన ఆసీనుడు కాగానే  -                                                    ఆ  ప్రాంగణమంతా శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది. ఆయన క్రమశిక్షణ అలాంటిది మరి. అందుకే గత పది సంవత్సరాలుగా ఏకగ్రీవ నాయకునిగా ఆ గ్రామాన్ని ఏలుతున్నాడాయన. అత్యాధునిక ధ్వని పరికరాలతో చీమ చిటుక్కుమన్న స్పష్టంగా వినిపించే మైక్ అందుకుని బాజీరావు కార్యక్రమాన్ని ప్రకటించాడు.

.'' ముందుగా గౌరవ సర్పంచి గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సాదర ప్రణామాలు. ఈ ఉగాది ఉత్సవాలు గత పది సంవత్సరాలుగా ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మొదట్లో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే హరికధలు, బుర్రకధలు, పౌరాణిక నాటకాలు ఏర్పాటుచేసుకున్నాం. కాలానుగుణంగా సమాజ సమస్యలను ప్రతిబింబించే సాంఘిక నాటకాలు నిర్వహించాము. ఈనాటి కుర్రకారుని విపరీతంగా వెర్రెక్కిస్తున్న డాన్స్ బేబీ డాన్స్, ఢీ కార్యక్రమాలు కూడా మనవేదికమీద నిర్వహించుకున్నాం. అయితే ఈరోజు మనగ్రామ చరిత్రలో ఇప్పటివరకు కనీవినీఎరుగని ''తెలుగు హాట్ రికార్డింగ్ డాన్స్ ''ను ఏర్పాటుచేశామ్. చక్కగా చూసి ఆనందించడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటుచేయబడింది. హద్దుమీరి ఎవరు ప్రవర్తించినా మనచుట్టూ ఉన్న పోలీసు సిబ్బంది వారిని తక్షణమే అదుపులోకి తెలుసుకుంటారు. ఈవిషయంలో ఎటువంటి మొహమాటం, అనుమానం ఉండదు. మీరంతా సహకరిస్తే మళ్లీ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటుచేస్తాం. దీనంతటికి సంపూర్ణ సహకారం అందించిన మన ప్రియతమ నాయకులు ఫణిభూషణరావుగారికి నా హృదయ పూర్వక దన్యవాదాలు. అందరూ సంతోషంగా ఆనందిస్తూ సహకరించండి.సెలవ్.''అనేసి వచ్చి సర్పంచిగారి పాదాలకు నమస్కరించి ఆయన పక్కన ఆసీనుడయ్యాడు బాజీరావు.

లేటెస్ట్ సినిమాలోని 'పచ్చి ' అయిటెమ్ సాంగ్ ప్రారంభమవగానే వేదికమీద నియాన్ దీపాలు ఒక్కసారిగా వెలిగి తెర లేచీలేవగానే అప్పటికే వేదికమీద అర్ధ నగ్నంగా నిలబడిన డాన్సర్ల మిలమిలలాడే దుస్తులపై పడి వారి అందాన్ని స్పష్టం చేస్తూ మరింత ద్విగుణీకృతం చేసాయి.

ఆ బృందంలో మధ్యలో ఉన్న అమ్మాయి దివినుంచి భువికి వచ్చిన గంధర్వకాంతలా అత్యంత ఆకర్షణీయంగా ఉంది. పాటకు తగ్గట్టు ముందుగా నడుము వూపుతో ప్రారంభమయిన ఆమె నృత్యంతో పాటు ప్రతీ భంగిమ ప్రేక్షకుల మనోఫలకాల్లో ముద్రించుకుపోయి ఏదో అందుకోవాలన్న ఆత్రం వారిలో మొదలయ్యేలా చేయసాగాయి.పద్మినీజాత్రి స్త్రీ కొలతల సౌందర్యాన్ని కలిగిఉన్న ఆమె దేహం శృంగార వాటికకు ప్రతిరూపమై , అవసరమైన చోట మన్మధుని చెరకు వింటిలా శరీరాన్ని వంచుతూ, విరుస్తూ, వక్ష, జఘాన భాగాల్ని వూపుతూ నాట్యం చేస్తున్న విధానానికి కుర్రకారు ఫిదా అయిపోయారు.

నడివయసునుంచి వృద్ధులవరకూ రెప్పలార్చడం మాని ఖాళీ నోళ్లతో గుటకలు వేయసాగారు. పరువానికి వచ్చిన బంగినపల్లి గున్నమావి చెట్టులా ఉన్న ఆమె భంగిమలన్నీ కుర్రకారులో కోరికల తేనెతుట్టమీద విసిరిన రాళ్లయ్యాయి.వూరిలోని ఆడవారికి అక్కడ ప్రవేశం లేకపోయడంతో దూరంగా ఉన్న భవనాల కిటికీలలోంచి వందలాది స్త్రీ మూర్తుల కళ్ళు దూరంగా బొమ్మల మాదిరి కనిపిస్తున్న ఆ నృత్య దృశ్యాలకు మనసు చెదిరి , కలలు అదిరి మదనవిరహంతో తపించసాగారు.

సుమారు మూడుగంటలపాటు మనోహర దృశ్యమానంగా, ఉల్లాసంగా నిర్వహింపబడిన కార్యక్రమం రసవత్తరంగా ముగిసింది. ఎవరికి వారు తమ వూహా లోకాల్లో ఉండిపోవడం వల్ల కాబోలు, పోలీసులు ఆ కాసేపు తమ ఉద్యోగ బాధ్యతను మరిచి ప్రేక్షకుల్లా మారిపోయారు. అక్కడకు చేరిన ప్రతీ రసికహృదయం ఒక అద్భుత అనుభూతిని స్వంతం చేసుకుని ఇంటిదారి పట్టడం చూసి బాజీరావు కార్యక్రమ విజయవంతానికి సహకరించినందులకు ప్రజలందరికీ కృతజ్నతలు చెప్పి కార్యక్రమం ముగించాడు.

.బాజీరావును దగ్గరగా పిలిచి అతని చెవిలో 'ఏదో' చెప్పి కోరికతో కాగిపోతున్న మత్తు కళ్ళతో కారెక్కెశాడు సర్పంచి ఫణి భూషణరావు.

********

సరిగ్గా మరో గంట తర్వాత - ఆ బృందంలోని ప్రధాన నాట్యకారిణి ఫణి భూషణరావు ఏకాంత మందిరంలోకి అడుగుపెట్టింది.ఆమె వెనుకగా బాజీరావు.''అవసరమైన వెంటనే పిలుస్తాను. ఆఫీస్ రూంలో వెయిట్ చెయ్యి'' అన్న ఫణిభూషణరావు మాటలకు బాజీరావు అక్కడనుంచి నిష్క్రమించాడు.

ఎదురుగా సోఫాలో ఫణిభూషణరావు అపుడే మద్యం సేవించినట్టుగా టీపాయ్ మీద ఖరీదైన విదేశీ మద్యం సీసాలు, స్టెమ్డ్ నోసింగ్ కోపిట్ విస్కీ గ్లాస్ తనలాగే నిస్సహాయంగా నిర్మలంగా నిలబడి ఉన్నాయి.ఆమె అక్కడి వాతావరణం చూసి బెదిరిపోలేదు. కనీసం కంగారు పడలేదు. ఏంజరిగినా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది.

అసలు ఆమె గంట క్రితం వేదికమీద చూసిన అమ్మాయిలా లేనే లేదు.ఈమె ఆమేనా? అంటే ఏమాత్రం నమ్మశక్యం కానీ విధంగా అఛ్చతెనుగు సంస్కృతీ సంప్రదాయాలు అణువణువునా నిండిన పవిత్ర భారత వివాహ వ్యవస్థకు అచ్చమైన ప్రతీకలా గృహిణిలా ఉంది.కాళ్లకు వెండి మెట్టెలు, పట్టీలు, మెడలో ఒంటిపేట బంగారు మంగళ సూత్రాలు, మెడచుట్టూ శివుని మెడలో నాగేంద్రుని తలపిస్తున్నట్లు రెండుపేటల గుంటనల్లపూసలు, విశాలమైన తెల్లని కళ్ళను మరింత విశాలం చేస్తున్న నల్లని కాటుక, నిండైన ముఖంలో పూర్ణచంద్రబింబాన్ని తలపిస్తున్న రక్తసింధూరపు బొట్టు, తలలో విరిసిన సన్నజాజులతో పాలమీగడతో స్నానంచేసిన బంగారు వర్ణ దేహంతో ఉన్న ఆమె సాక్షాతూ పాలకడలిలో లక్ష్మీదేవిలా ఉంది.

అతని చూపులు శరీరంలో అణువణువునా గుచ్చుకున్న ఆమె అంపశయ్యమీద భీష్ముడిలా ఫీల్ అయింది ఒక్క నిముషం. నిదానంగా విశాలంగా ఊపిరి పీల్చుకుని తన భుజం చుట్టూ కప్పుకున్న పమిటని మరింతగా బిగించి పట్టుకుంది.ఫణిభూషణరావు లేచి వఛ్చి ఆమె చుట్టూ ఒకసారి తిరిగి ఆమె తలలోని పువ్వులను ఆఘ్రాణిస్తూ ఒక్కసారిగా శ్వాస లోపలి పీల్చాడు.

అతని ముక్కుపుటాలను ఆమె శరీరపు గంధపు పరిమళం సోకింది.ఆమె అనుకుంది తనలో...'' అతను పులిస్థానంలో...తాను తల్లి ఆవు స్థానంలో...''ఆమె పెదవులు మొదటి రేకు విచ్చుకున్న విరజాజిపువ్వులా కొద్దిగా విచ్చుకున్నాయి.నెమ్మదిగా వెళ్లి సోఫాలో కూర్చుంటూ అడిగాడు.

 ''నీపేరు...''

''మల్లీశ్వరి. మల్లిక అంటారు అందరూ...''

''నీ అంత సౌందర్యరాశిని నేను ఎపుడూ చూడలేదు. నువ్వు నా ఆకలి తీర్చాలి. తీరుస్తూనే ఉండాలి. ఉహు. నా దగ్గరే ఉండిపోవాలి.'' ఆమె ఒక్కక్షణం కళ్ళుమూసుకుంది.

రెండో నిముషంలో స్థిరంగా అంది.''తప్పకుండా. అయితే నిజాయితీగా నాది ఒక విన్నపం''.

'' ఏమిటది?'

''' ఈవేదిక మొదటిసారి ఎక్కినప్పుడే ఇలాంటి పరిస్థితి ఏదోఒక రోజు వస్తుందని నాకు తెలుసు. నాకు ఒక బిడ్డ ఉన్నాడు. వాడిని మరొకరి సంరక్షణలో ఉంచి వస్తాను. అందుకు మీరు అనుమతించాలి.''

''ఒక బిడ్డకు తల్లివై ఉండి నీ ఒంటిమీద బట్టలన్నీ నువ్వే ఒలుచుకుని అసలు అవయవాలు ఉన్నాయో ఊడిపోతాయో అన్న ఆలోచన లేనంతగా డాన్స్ చేసావే...ఇదంతా నీ ఒళ్ళు 'తీపరం;' కాదా ?'' క్రూరంగా చూస్తూ అన్న అతని మాటలు పదునైన కత్తుల్లా ఉన్నాయి.

"మిమ్మల్ని ఒక్క ప్రశ్న సూటిగా అడగవచ్చా సర్?కోపం తెచ్చుకోకూడదు" పదునుగా అడిగింది ఆమె.

"ఇది కోపం తెచ్చుకునే సమయం కాదులే.అడుగు."అన్నాడు.

ఆమె విరక్తిగా నవ్వింది.''ఒక గ్రామానికి సర్వ అధికారాలు ఉన్న ఒక రాజువంటివారే మీరు.ఆడది తన ఒంటిమీద బట్టలు తానే ఒలుచుకుంటుంటే స్త్రీని కాపాడాల్సిన మీరే ఊరు ఊరు అంతా చూసేలా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదే స్థానంలో మీ కుటుంబసభ్యులు ఒక్కరున్నా మీరు అలా చేస్తారా? చెయ్యరు సర్.

ఎందుకంటే మరో మన కన్న ఆడది ఎలా పోయినా మీకు అవసరం లేదు.

స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా స్త్రీకి మనసుంటుందని, ఆమె కూడా సాటి మనిషి అని ఆమె స్వేచ్ఛ కోసం ఎందరో సంఘ సంస్కర్తలు పోరాడి గడపలోపల ఉండిపోయిన స్త్రీని సమాజంలోకి రప్పించి ఆమెకొక ప్రత్యేక స్థానం , విలువ ఇచ్చారు.

కానీ మా దురదృష్టం. ఎక్కువశాతం మంది ఈనాటికి స్త్రీని ఆటబొమ్మగానే చూస్తున్నారు.

నేను వారిలో ఒకదాన్నే. అమ్మగా నా బిడ్డకు బ్రతుకునిచ్చి , నా కడుపుతీపిని బ్రతికించుకోవడం కోసమే ఈ తాపత్రయమంతా. మీరు పెద్దవారు.డబ్బున్న నాయకులు.

మరోలా అనుకోనంటే ఒక మాట. మన పవిత్ర భారత దేశంలో ఒక బిడ్డతల్లి తన అమ్మతనం సాక్షిగా ఒంటరిగా వేలాదిమంది మగవారిమధ్య వారిలో వికృతభావాలు రెచ్చగొడుతూ తన వస్త్రాలను తానె ఒలుచుకునే అంగడిబొమ్మగా మారిందంటే దానికి కారణాలు రెండే సార్.

ఒకటి. ఒక మగవాడి మోసం. రెండు కన్నబిడ్డకోసం.

ఆడదాన్ని ఎలా చూడాలని మగవాడు అనుకుంటాడో అలా నా అందాన్ని చూపించానే తప్ప నేను చెడిపోయినదాన్ని కాదు సర్. నన్ను నేను పవిత్రంగా ఉంచుకుంటూ నాబిడ్డను కాపాడుకోవడం కోసం నేను ఎన్నుకున్న వృత్తి ఇది. అలా అని ఒప్పంద పత్రం రాసి రిజిస్టర్ చేసుకున్నాకానీ బాజీరావుగారు నన్ను తన ట్రూప్ లోకి నన్ను తీసుకున్నారు.అలా మానం అమ్ముకోకుండా సాధ్యమైనంతవరకు నన్ను నేను పవిత్రంగా ఉంచుకోవాలన్నదే నా ప్రయత్నం. కానీ ఆబాలను, ఒంటరి ఆడదాన్ని అయినా నన్ను అలా బతకనివ్వరు అని అర్ధమైంది సర్. అందుకే ఈలోగానే నా బిడ్డకు ఒక నమ్మకమైన ఆశ్రయం కల్పించాలని నా కోరిక. నేను నమ్ముకున్న అమ్మలాంటి ఈ వృత్తిమీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను బాబుని నా స్నేహితురాలికి అప్పగించి తిరిగి వచ్చేస్తాను. మీకు అనుమానంగా ఉంటె నాకు తోడుగా బాజీరావుగారిని పంపండి.''అందామె తొణక్కుండా.

.''హు. మగాడితో ఒంటి బలుపు తీర్చుకుని, నేరమంతా మగాడిదే అన్నట్టు వాడిమీద తోసేసి ..ఇంకో మగాడు నమ్మేలా ఎన్ని కల్లబొల్లి కబుర్లైనా చెప్పగలరు మీ ఆడోళ్లు. సరే. వెళ్ళు. ఒక వేళా తిరిగి రాలేదనుకో.నిన్నెలా రప్పించుకోవాలో నాకు తెలుసు.'' అని చప్పట్లు కొట్టాడు ఫణిభూషణరావు.

మరో అయిదు నిముషాల్లో ఆమె తన బిడ్డతో ఎక్కినా కారు బాజీరావు నడుపుతుండగా ఆమె కోరిన దిశగా ప్రయాణించసాగింది.

అయితే ఆమె మాటల ఈటెలు అతనిలో మరిచిపోయిన మానవత్వపు గాయాన్ని కెలుకుతూనే ఉన్నాయి ఆమె రాకకోసం ఎదురు చూస్తూ.

******************

బాబుకు పాలిచ్చి తనివితీరా ముద్దాడి స్నేహితురాలు 'పారిజాత'కు అందించింది మల్లిక.

''ఏమిటే ఈ పిచ్చిపని? బతకాలంటే మార్గాలులేవా? ఇంతకాలం స్వాభిమానంతో బతికిన నువ్వు కోరి వెళ్లి ఆ 'రొంపి'లోకి దిగుతావా.వద్దు మల్లికా.నా మాట విను.'' అంది పారిజాత కన్నీళ్లతో.

''నీకు వీడు భారం అనిపించినప్పుడు విషం పెట్టి నిర్దాక్షిణ్యంగా చంపెయ్యి.అంతేగాని ఎట్టి పరిస్థితులలోను మగవాడిని నమ్మకే.ఇది నా ప్రార్ధన. మరొకమాట. నేను బూతు డాన్సులు చేస్తూ పవిత్రంగా ఉన్నానంటే ఎవరూ నమ్మరు. కానీ నేనంటూ వ్యభిచారిగా మారాకా ఏమో ఎంతకాలం బతుకుతానో. ఆడబ్బుతో మాత్రం వాడిని పెంచలేకే నీకు అప్పగిస్తున్నాను. నన్ను మన్నించు.'' అని గిరుక్కున వెనక్కుతిరిగి బాజీరావును అనుసరించింది మల్లిక.

****************

 తెల్లవారు ఝామున నాలుగు గంటల సమయం.వెళ్ళేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో అంతే ప్రశాంతంగా తిరిగివచ్చిన మల్లికను చూసి అంత మత్తులోను ఆశ్చర్యపోయాడు ఫణి భూషణరావు.బాజీరావును తన ఆఫీసు గదిలోకి తీసుకువఛ్చి మల్లిక గురించి విచారించాడు. 

ఏడాది క్రిందట తనను వెతుక్కుంటూ వచ్చిందని, తనకు డాన్స్ తప్ప ఏదీ రాదనీ, ఒక డాన్సమాస్టర్ ని నమ్మి మోసపోయానని, తానూ కావలసిన వారు తనకు ఎవరూ లేరని, తన బిడ్డ పోషణార్ధం మాత్రమే డాన్స్ చేస్తాను తప్ప మరే ఇతర 'తప్పుడు ' పనికి తానూ అంగీకరించను అని ఒక ఒప్పందపత్రం రాయించుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, ఆమె చాలా మంచి డాన్సర్ అని, ఆమెవల్ల ఎన్నో ఎక్కువ అవకాశాలు వచ్చి తన ట్రూప్ లో ప్రతీ ఒక్కరు ఆర్ధికంగా నిలదొక్కుకుని మూడుపూటలా అన్నం తింటున్నామని, ఆమె అంటే తామందరకూ వల్లమాలిన గౌరవమని చెప్పాడు బాజీరావు. 

అన్నీ విన్నాక మల్లిక ఉన్న తన గదిలోకి వచ్చి తన స్థానంలో కూలబడ్డాడు ఫణిభూషణరావు.

అతనికి తాగిన మత్తంతా వదిలి తానూ చిన్నప్పుడు చదువుకున్న ''ఆవు - పులి ' కధ గుర్తుకు వచ్చింది. ఆమె తననుంచి ఎన్ని రకాలుగా అయినా తప్పించుకుని పారిపోవచ్చూ. అయినా ఆమె నిజాయితీగా తన దగ్గరకు వచ్చింది.అయినా ఆమె అడిగాడు.

.''నానుంచి తప్పించుకునే అవకాశం ఉండికూడా ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు?"

''మనిషికి నిజాయితీకి మించిన ఆభరణం లేదు సర్. బాబుని నా స్నేహితురాలికి అప్పగించాకా గదిలోకి వెళ్లి ఫ్యానుకు ఉరేసుకుని చచ్చిపోదామనుకున్నాను. ఆపనివల్ల నా బిడ్డ దిక్కులేనివాడు అయిపోవడమే కాదు. నన్ను నమ్ముకున్న ట్రూప్ వాళ్ళు చెట్టుకొకరుగా అయిపోతారు. తండ్రివయసున్న మీరు మీ ఆకలి తీర్చమని కోరారు. అందుకే నిజాయితీగా మీదగ్గరకు వచ్చేసాను. మీరు నన్ను చూసి జాలిపడవలసిన పనికూడా ఏమీలేదు. నేను అనుకున్నదానికంటే ముందే వచ్చింది.'' అందామె బలిపీఠం మీద నిలబడిన వ్యక్తిలా నిర్లిప్తంగా.

ఫణిభూషణరావు ఒక్కసారిగా లేచి వచ్చి ఆమె ఎదురుగా నిలబడ్డాడు. అతని కళ్ళనిండా నీళ్లు...చేతులు జోడించి వణుకుతున్న కంఠంతో అన్నాడు.''అమ్మా. మల్లికా. నన్ను నన్ను క్షమించు. నాలోని రాక్షస ప్రవృత్తిని నీ క్షమాగుణంతో తుడిచిపెట్టేసావు. నీకు, నీ బిడ్డకేకాదు...ఈ ప్రపంచంలోని కొందరు అనాధల జీవితాలనైనా నిలబెట్టే అవకాశం నాకు కల్పించుతల్లీ. దానికి నువ్వే సర్వవిధాలా అర్హురాలవు. నన్ను కన్నతల్లి సాక్షిగా మీకు చేయూతగా ఉంటాను. ఈ కార్యక్రమంలో నాకు సహకరించు తల్లీ...అలా అని నాకు మాట ఇవ్వు."

.'మల్లిక విస్తుబోయింది అతని మాటలకి. సరిగ్గా అప్పుడు ఆమె కళ్ళల్లోకి చివ్వున నీళ్లు కమ్ముకొచ్చాయి. ''బాబుగారూ...'' అంది నమ్మలేనట్లుగా సంతోషాతిరేకంతో...

*************

పరిహారం : సరిగ్గా వారం రోజుల్లో ఆ గ్రామంలో ఒక శుభముహూర్తాన '' అమ్మా అనాధశరణాలయం '' మల్లిక మేనేజింగ్ ట్రస్టీగా సర్పంచి ఫణిభూషణరావు చేతులమీదుగా ప్రారంభించబడింది. అనంతరం పారిజాత చేతుల్లోంచి అందుకున్న కేరింతలు కొడుతున్న బాబు నవ్వులా ప్రచ్ఛన్నంగా ఉంది ఫణిభూషణరావు మనసిప్పుడు.బాబు ముద్దుమురిపాల్లో మునిగి తేలుతున్నాదిప్పుడు.

సమాప్తము  Rate this content
Log in

Similar telugu story from Classics