Phanikiran AK

Drama Inspirational

4.6  

Phanikiran AK

Drama Inspirational

ధరణి

ధరణి

7 mins
474



ధరణీ! వచ్చావా! బాగా అలసిపోయినట్టున్నావు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా. నేను వేడిగా కాఫీ పెట్టి తీసుకొస్తాను” చెప్పి కిచెన్లోకి వెళుతున్న తన మేనత్త కామాలను ఆఫీస్ నుండి అప్పుడే వచ్చిన ధరణి ఆశ్చర్యంగా చూసింది.

హాల్లో ఉన్న మావయ్య, మావయ్య అన్న కొడుకు లోకేష్లను చూసి, వాళ్ళెందుకు వచ్చారా అని ఆలోచిస్తూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది.

తన చేతిలో కాఫీ కప్పు పెట్టిన అత్తని, హాల్లో ఉన్న కుటుంబ సభ్య్లని సాలోచనగా చూస్తూ సోఫాలో కూర్చుని కాఫీ తాగడం పూర్తీ చేసింది. తన గదికి వెళదామని లేచింది.

“ఆ ధరణీ!”

కమల పిలుపుకి అత్త వైపు చూసింది.

“నీతో మాట్లాడాలిరా. కూర్చో.” చాలా ఆప్యాయతను ఒలకబోస్తూ అంది.

 ఓసారి అందరి వైపు చూసి తిరిగి కూర్చుంది.

“ధరణీ! నీకు బాగా తెలుసు. మా అన్నయ్య అదే మీ నాన్న అంటే నాకెంత ఇష్టమో, గౌరవమో.” ఉపోద్ఘాతంగా అంది కమల.

మౌనంగా వింది ధరణి.

“ఏం లేదురా. నీకు లోకేష్ బావ తెలుసుగా!”

లోకేష్ వైపు చూసింది.

పలకరింపుగా నవ్వాడు.

“పేరుకు మావయ్యకు అన్న కొడుకే గానీ, బావగారు అక్క యాక్సిడెంట్లో పోయినప్పటి నుండీ లోకేష్ మా ఇంట్లో మా కొడుకుగానే పెరిగాడు. లోకేష్ , ప్రవీణ్లు ఇద్దరూ అన్నదమ్ములుగానే ఉన్నారు. ఆ విషయం నీకూ తెలుసు. చిన్నప్పటినుండీ చూస్తూనే ఉన్నావు. చక్కగా ఎం.టెక్ చేశాడు. మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ రెండేళ్ళ క్రితం ఆస్ట్రేలియాలో జాబు వచ్చి అక్కడికి వెళ్ళాడు. నీకూ తెలుసుగా!”ధరణి ఏమంటుందా అని ఆగింది కమల.

“తెలుసు. అయితే ఏంటి అన్నట్టు” చూసింది ధరణి.

“ఏం లేదురా. లోకేష్, నువ్వూ ఇద్దరూ చూడచక్కగా ఉంటారు. మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నాము.”

భ్రుకుటి ముడిచి తన వాళ్ళ వైపు చూసింది ధరణి నిజమా అన్నట్టు. 

తల్లీదండ్రీ ఇద్దరూ చిరునవ్వు నవ్వారు తమకు అంగీకారమే అన్నట్టు. ధరణి దృష్టి అక్కడే ఉన్న కొత్త పెళ్ళికూతురు, తన చెల్లి రమణిపై పడింది.

రమణి కళ్ళు అక్కని ఒప్పుకోవద్దు అన్నట్టుగా చూశాయి.

“నువ్వూ మంచి ఉద్యోగం చేస్తున్నావు. చక్కగా సంపాదిన్చుకు౦టున్నావు. ఇపుడు నువ్వు చేస్తున్న కంపెనీ ఆస్ట్రేలియాలో కూడా ఉంది. రేపో మాపో నీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఇద్దరూ కలిసి ఆస్ట్రేలియాలోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు. నువ్వు మా ఇంటి కోడలు కావాలని మా ఆశ. ఏమంటావు ధరణీ?”

కమల ప్రశ్నకి కొద్దిక్షణాలు. మౌన౦గా ఉండిపోయింది ధరణి. నోరు తెరిచి సమాధానం చెప్పేలోపే,

“ఆ... కంగారు లేదు ధరణీ. రాత్రంతా బాగా ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు. అది ఏదైనా పర్వాలేదు కానీ నీ నిర్ణయం అందరూ సంతోషించేదే అవ్వాలని కోరుకుంటున్నా” చెప్పింది కమల.

ఓసారి అందరి వైపు చూసి, లేచి నెమ్మదిగా తన గదికి వెళ్ళింది ధరణి.

                                             ********%%%%%%%********

“నాన్నా! నేను ఎం.బిఏ చేయాలనుకుంటున్నా. ఏమంటారు?”

“నన్నఅడిగేదేముందిరా. నీ ఇష్టం. నీకు ఏది, ఎంత చదవాలనిపిస్తే అంత చదువు. ఫీజు ఎప్పుడూ, ఎంత కట్టాలో చెప్పు. ఏ పుస్తకాలు కావాలో రాసి ఇవ్వు చాలు”అన్నాడు శివరావు.

“థాంక్స్ నాన్నా” సంతోషంగా చెప్పి,

“చెల్లాయ్, నాన్న నేను ఎం.బిఏ చేయడానికి ఓకే అన్నారు” చెల్లికి వినిపించేలా అరుస్తూ లోపలి వెళ్ళింది.

“అదేంటండీ. అది అడిగితే అలాగే అన్నారు. ఇంక చదివింది చాలు. పెళ్లి చేస్తే బాగుంటుంది.” భర్తతో అంది సులోచన.

“పెల్లిదేముంది. అదే అవుతుంది. చదువు అందరికీ వచ్చేది కాదు. మీవాళ్ళల్లో గానీ, నావాళ్ళల్లో గానీ, మన బంధువుల్లో గానీ పెద్ద చదువులు చదివిన ఆడపిల్లలు ఉన్నారా? నా కూతుళ్ళు ఇద్దరూ చదువుల సరస్వతులు. చదువుకోనీ.” కించిత్ గర్వంగా అన్నాడు శివరావు.

“వాళ్ళు పెద్ద చదువులు చదివితే సంబంధాలు ఎలాగండీ? ఇప్పటికే మనలో కట్నాలు ఎక్కువ. ఇక వీళ్ళు పెద్ద చదువులు చదివితే కట్నాలు ఇచ్చుకోగాలమా?” కొంత భయం, కొంత సందేహంతో అడిగింది సులోచన.

“నా పిల్లలు బంగారు బొమ్మలు. వాళ్ళని కోరి చేసుకుంటారు ఎవరైనా. ఇక కట్నాల౦టావా. నా బంగారు బొమ్మలకు కట్నాలు ఇచ్చే అవసరం రాదులే. నువ్వు భయపడకు.” చిన్నగా నవ్వుతూ అన్నాడు శివరావు.

“ఏంటో మీరూ, మీ నమ్మకం. నాకేం అర్ధం కావటం లేదు.”

“నువ్వే చూస్తావుగా. అప్పుడు అర్ధం అవుతుందిలే. నేనలా బజారుకు వెళ్ళి వస్తాను” చెప్పి శివరావు స౦చీ తీసుకుని బయటకు వెళ్ళాడు.

భర్త మాటలకి ఓ నిట్టూర్పు విడిచి వంటింట్లోకి నడిచింది సులోచన.

                                          *******%%%%%%******

పెద్ద కూతురి ఎంబియే మొదటి సంవత్సరం పూర్తి రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టిన వారం రోజులకి ఇంటికొచ్చిన చెల్లెలు కమల, బావగారు ఆనంద్, మేనల్లుడు ప్రవీణ్లను సాదరంగా ఆహ్వానించాడు శివరావు.

భోజనాలు అవీ పూర్తయ్యాక తాను వచ్చిన విషయాన్ని మెల్లగా బయటపెట్టింది కమల.

విన్న శివరావు దంపతులు సంతోషించారు.

“దీనికేం అభ్యంతరం ఉంటుంది. కాకపోతే చిన్నదానిది కూడా కుదిరాక ఇద్దరివీ కలిపి చేస్తే బాగుంటుందని” అన్నాడు.

“అయ్యో అన్నయ్య. నేను ప్రవీణ్కు చేసుకుంటానన్నది చిన్నదాన్నే”.

ఆ మాటకి అవాక్కయ్యారు శివరావు దంపతులు.

తేరుకున్న శివరావు,

“అదేంటమ్మా. ముందునుంచీ అనుక్కున్నది పెద్దదాన్నే కదా!” తాను విన్నది. నిజం కాదేమో అన్న నమ్మకంతో అన్నాడు.

“నిజమేననుకో అన్నయ్యా. ఇద్దరూ నా మేనకోడళ్ళుయే. కాదనను.కానీ చూస్తూ చూస్తూ పెద్దదాన్ని ఎలా చేస్కుంటాను. ఏమో, రేపు పుట్టే పిల్లలకు దాని పోలికలు వస్తే. ఆ అహ అంటే వస్తాయని కాదు. ఒకవేళ వస్తే అని. అందుకే అన్నయ్యా. చిన్నదాన్ని అడుగుతున్నాను” అన్న చెల్లెలు కమలకు ఏం జావబివ్వాలో అర్ధంకాలేదు శివరావు దంపతులకు.

తన బావగారు, ప్రవీణ్ల వైపు చూశాడు. వాళ్ళు కూడా తన చెల్లెలి మాటలకి విస్తుపోయినట్టుగా కనపడడంతో వాళ్లకి కూడా ఈ విషయం ఇప్పుడే తెలిసిందని అర్ధం అయ్యింది.

పెద్దకూతురి వైపు చూశాడు.

ఆ కళ్ళల్లోని కన్నీళ్ళల్లో ఇలా ఉండడం తన తప్పా అన్న ప్రశ్న కనపడింది.

చిన్నకూతురు వైపు చూశాడు.

“ఒప్పుకోవద్దన్న” అభ్యర్ధన కనపడింది ఆ కూతురు కళ్ళల్లో.

“అదికాదు కమలా,,,”

అన్నగారి మాటలను మధ్యలోనే అడ్డుకుంది కమల.

“అన్నయ్యా, నువ్వేం ఆలోచిచున్నావో నేను ఊహించగలను. నువ్వంటే నాకెంత అభిమానమో, ప్రేమో నీకూ తెలుసు. ఆ ప్రేమతోనే బయట సంబంధాలకు వెళ్ళకుండా నీ దగ్గరకు వచ్చింది. చిన్నదాన్ని చేసుకుంటే మనమధ్య బంధం, బంధుత్వం రెండూ మరింతగా బలపడతాయని, నువ్వు కాదనవన్న ధీమా నమ్మకంతోనే నీ గుమ్మంలో అడుగుపెట్టాను. ఒక్కసారి ఆలోచించు అన్నయ్యా. నేను ఇప్పుడే పెళ్లి చేయమనను. పెద్దదాని పెళ్ళి అయ్యాకే చిన్నదాన్ని నా కోడలుగా చేసుకుంటాను” ఎంతో ప్రేమగా, అభిమానంగా అన్న చెల్లెలి మాటలకి ఆలోచనలో పడ్డాడు శివరావు.

కొంతసేపు మౌనం రాజ్యమేలింది.

“కమలా! నువ్వు ఇంత ప్రేమగా అడిగితే నేను కాదనగలనా” శివరావు నోటినుండి వచ్చిన ఆ మాటలకి శరాఘాతం తగిలినదానిలా చూసింది పెద్ద కూతురు.

“నాన్నా! ఏం మాట్లాడుతున్నారు. మీ కూతురిని అంత మాట అంటే అది మీకు పెద్ద విషయంలా అనిపించలేదా. ఇప్పుడే ఇలా అన్నారంటే రేపు ఇంకెన్ని మాటలు అంటారో.”

“నా చెల్లు అన్నదాన్లో తప్పేం ఉంది. ఉన్నమాటేగా అంది. అయినా కూడా అది నామీద ప్రేమతో సంబంధం కులుపుకోడానికి వచ్చింది. ఆ ప్రేమ కనబడట్లేదా?” పెద్దకూతురుతో అన్నాడు శివరావు.

“నాన్నా! అంటే మీకూతుర్ని హేళన చేస్తున్నా మీకు బాధ కలగలేదా?” దెబ్బతిన్నదానిలా అడిగింది.

“నువ్వు ఏమిటో అదేగా అంది. అందులో కళ్ళెదురుగా కనబడే నిజముందిగా.”

తండ్రి మాటలకి కన్నీళ్లు జలజలా రాలాయి.

“అంటే మీరు కూడా నన్ను అంటున్నారా?” అడగలేక అడిగింది.

“ఉన్నదే అన్నాను. అనవసరంగా మాట్లాడి నీచెల్లెలి జీవితం నాశనం చేయకు” కాస్త కఠిన౦గా అన్నాడు శివరావు.

చేష్టలు దక్కి చూస్తున్నారు మిగిలినవాళ్ళు.

ఇన్నాళ్ళు ఎవరేమన్నా పట్టించుకోలేదు తను, తండ్రి అండగా ఉండడంతో. ఎవరైనా మాట్లాడినా తనకంటే ముందే తండ్రి ఘాటుగా జవాబిచ్చేవాడు. కానీ ఈరోజు తండ్రే అంటుంటే తట్టుకోలేకపోతోంది.

“నాన్నా. చెల్లికైనా వద్దు నాన్నా. ఈరోజు ఇలా మాట మార్చిన వాళ్ళు రేపు చెల్లి విషయంలో మాత్రం సరిగ్గా ఉంటారా. రేపు చెల్లిని కూడా ఏదో ఒకటి అనరని నమ్మకం ఏంటి?” గొంతు పెగల్చుకుని అంది.

“అనరు. ఎందుకంటె అది నా చెల్లెలు. అయినా నిన్ను కాదన్నారనేగా చెల్లికి చెడగొట్టాలని చూస్తున్నావు. నీ బుద్ది చూపించావు. ఇన్నాళ్ళు నీ చెల్లంటే నీకు ప్రేమని కబుర్లు చెప్పావు. ఈరోజు దానికి మంచిగా సంబంధం ఖాయం చేస్తుంటే అసూయతో ఒద్దంటున్నావు” కోపంగా అన్నాడు శివరావు.

“ఏం మాట్లాడుతున్నారు నాన్నా. చెల్లెలంటే నాకెందుకు ఆసూయ నాన్నా. నేను అన్నది ఈ సంబంధం ఒద్దని. ఈరోజు ఇలా మాట్లాడినవాళ్ళు...” మాట పూర్తి కాలేదు.

“అంటే నాచెల్లెలితో నాకున్న బంధాన్ని వదులుకోమంటావా? తోడబుట్టిన దానితో తగువు పెట్టుకోమంటావా? నాచెల్లెలితో బంధుత్వం ఒద్దని చెప్పటానికి నువ్వెవరు?” ఆగ్రహంతో ఊగిపోతూ అరిచాడు.

“నాన్నా. నేను మీ కూతుర్ని నాన్నా. నాకు చెప్పే ....” 

మాట పూర్తికాలేదు చెంప చెళ్ళుమంది.

బుగ్గమీద చేయి పెట్టుకుని కన్నీళ్ళతో బిత్తరపోయి చూసింది. ఏనాడూ తనని చిన్నమాట అనని తండ్రి, ఎవరినీ అననీయని తండ్రి ఈరోజు తనమీద చేయి చేసుకోవడం అదీ కన్న కూతురు కంటే తోడబుట్టినదే ఎక్కువ అంటూ జీర్ణించుకోలేకపోయింది. కన్నీళ్ళతో మౌనంగా తన గదికి దారి తీసింది.

జరిగిన సంఘటన ఎవ్వరికీ జీర్ణంకాలేదు. అందరూ చేష్టలు దక్కి నిలబడ్డారు.

                                       ******%%%%%******

ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ధరణి. అప్రయత్నంగా చేయి చెంపను తడిమింది. నెమ్మదిగా లేచి గది కిటికీ వద్దకు వెళ్ళి నుంచని, బయట వెన్నెల స్నానం చేస్తున్న పరిసరాలను దీర్ఘంగా చూస్తూ ఆనాటి సంఘటనని గుర్తుచేసుకుంది.

ఏం చెప్పారో, ఎలా చెప్పారో మొత్తానికి అటు రమణిని, ఇటు ప్రవీణ్ ని పెళ్ళికి ఒప్పించారు. తన మనసుకు అయిన గాయం నుండి త్వరగానే కోలుకుని చదువుపై దృష్టి పెట్టింది. సంవత్సరం పూర్తి అవుతుండగానే పేరున్న కంపెనీలో ఉద్యోగం వచ్చింది. చేరి సంవత్సరం తిరక్కుండానే తన పని నచ్చి తనని బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అధిపతిని చేశారు. ఈరోజు తను ఉన్న స్థాయిని చూసి ఎంతో మంది వచ్చారు చేసుకుంటామని. తాను ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఈరోజు తన మేనత్త రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తే, అదే సమయంలో డబ్బు, హోదా ఎలాంటి వారినైనా మారుస్తాయి అని అర్ధం అయ్యింది. కొద్దిసేపు అక్కడే నుంచుని ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా దీర్ఘశ్వాస తీసుకుని వదిలి వచ్చి మ౦చంపై వాలి కళ్ళుమూసుకుంది.

                                        ******%%%%%%%******

ఆరోజు భోగి పండుగ కావడంతో తలారా స్నానం చేసి అలవాటు ప్రకారం గుడికి వెళ్ళి వచ్చింది ధరణి. పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి, అందరికీ కప్పుల్లో పోసి ఇస్తుంటే,

“ధరణీ! ఇది నువ్వు చెప్పే శుభవార్త కోసం అనుకోవచ్చా” నర్మగర్భంగా అడిగింది కమల.

చిన్నగా నవ్వింది ధరణి.

“నిజంగా శుభవార్తే అత్తయ్యా.”

“అయితే త్వరగా చెప్పు. వినాలని తహతహగా ఉంది” ఉత్సాహంగా అంది కమల.

“చూడబోతూ కంగారెందుకు అత్తయ్యా. ఒక్క పావుగంట. ఈలోగా నేను రెడీ అయ్యి వస్తాను” చెప్పి తన గదికి వెళ్ళింది ధరణి.

ధరణి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి ఓకారు గేటు ముందు ఆగింది. అందులోంచి దిగిన యువకుడు సరాసరి లోపలికి వచ్చాడు.

గదిలోంచి వచ్చిన ధరణి సంశయంగా నిలబడ్డ యువకుడిని చూసి,

“”కేశవ్. లోపలకు రా. అక్కడే ఆగిపోయావే” నవ్వుతూ ఆహ్వానించింది.

చిరునవ్వు నవ్వాడు కేశవ్.

“కేశవ్. మానాన్నగారు, అమ్మ, నానమ్మ, తాతయ్య, అత్తయ్య, మావయ్య “ పరిచయం చేసింది.

చేతులు జోడించి నమస్కరించాడు.

“తను నా చెల్లెలు రమణి, తన భర్త ప్రవీణ్. తను లోకేష్ .”

పలకరింపుగా నవ్వాడు కేశవ్.

“ఇంతకీ అతనెవరు ధరణీ?’

తాతయ్య ప్రశ్నకు అందరివైపు చూసి, కేశవ్ని చూసి చిన్నగా నవ్వింది.

తన నవ్వుతోనే అంగీకారం తెలిపాడు కేశవ్.

“తను కేశవ్. ఈ ధరణిని చేపట్టబోయే ధరణీశుడు.”

ఆమాటకు అందరూ అవాక్కయారు.

తేరుకున్న కమల,

“అదేంటి ధరణీ. నిన్ను మాకోడలుగా చేసుకోవాలని అనుకున్నాము అని చెప్పానుగా”

“మీకోడలుగానా!? పోలియో నాకాలుకి అవిటితనం ఇచ్చిందే కానీ నా మనసుకు కాదు. ఆనాడు కోడలుగా పనికిరాని నేను ఈనాడు ఎలా పనికొచ్చాను అత్తయ్యా? ఆనాడూ అదే నేను. ఈనాడూ అదే నేను. నాడు లేని అర్హత నేడు ఎలా వచ్చింది ?” సూటిగా ప్రశ్నించింది ధరణి.

ధరణి ప్రశ్నకి సమాధానం చెప్పలేక తలదించుకుంది కమల.

లోకేష్ ప్రసంశగా చూశాడు.

“అయితే మాత్రం ఇలా బరితెగించి నువ్వే నిర్ణయించుకుంటావా. తల్లిదండ్రులుగా మాకు గౌరవం ఇవ్వవా?” ఆగ్రహంగా ఆడిగాడు శివరావు.

“బరితెగించే దాన్నే అయితే కేశవ్ని ఇంటికి పిలిచి పరిచయం చేసేదాన్నే కాదు.”

“ఏముందని అతన్ని చేసుకుంటావు?”

“నన్ను నన్నుగా చూసే వ్యక్తిత్వం ఉంది. లోపాన్ని ఎత్తి చూపించి కించపరిచి మనసును గాయపరచని సంస్కారం ఉంది. నా హోదాని కాక నన్నుగా ప్రేమి౦చే మనసు ఉంది. అన్నింటికీ మించి ప్రాణం పోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే మనస్తత్వం ఉంది. ఇది చాలదా నాన్నా ఓ వ్యక్తిని ఓ ఆడపిల్ల కోరుకోవడానికి?” చాలా స్పష్టంగా అంది ధరణి.

“మాటలు బాగా నేర్చావు. నువ్వు చెప్పిన ఒక్కటీ ఉంటె సరిపోదు. బ్రతకడానికి డబ్బు కూడా కావాలి. కారులో వచ్చిన౦త మాత్రాన నిన్ను జీవితా౦తం చూసేస్తాడా?” వెటకారంగా అన్నాడు.

“నాన్నా! బ్రతకడానికి డబ్బే అవసరం అయితే అందుకు మీరు బెంగపడక్కరలేదు. మా భవిష్యత్తుకు ఏ ప్రమాదము లేదు.”

“అంటే ఏంటే. కారు ఒక్కటీ చూసుకుని బ్రతకకగలననే ధీమాయా?”

“ఇలాంటి కారులు ఓ ఐదు, అవి పెట్టుకునే౦దుకు ఓ విశాలమైన భవ౦తి, దాన్ని చూడడానికి, మెయి౦టైన్ చెయ్యడానికి పనివాళ్ళు, ప్రేమగా పలకరించి అప్యాతానురాగాలను కురిపించడానికి కుటుంబం, వేలమందిని పోషించే వ్యాపారం, వ్యాపార రంగంలో హోదా, పరపతి. ఇవి చాలనుకుంటా కదా నాన్నా. నువ్వు చెప్పినట్టు జీవించడానికి.”

“అంటే నీ ఈ కుంటితనానికి...” శివరావు మాట పూర్తికాలేదు.

“ఒక్కనిమిషం. మీరు మాట్లాడేది మీ కన్నబిడ్డతో అన్న విషయాన్ని మరువకండి” చాలా స్పష్టంగా వచ్చింది కేశవ్ నోటినుండి.

“నేనిలా కఠినంగా మాట్లాడుతున్నానని మరోలా భావించకండి. తన శారీరక స్థితికి తను కాదు కారణం. తోబుట్టువు బంధాన్ని ఎవరూ కాదనరు. కానీ కన్న రక్తాన్ని ఓ బంధం కోసం అవమానించడం సరికాదు. మీ అమ్మాయి వ్యక్తిత్వానికి, మనసుకి మీరు విలువ ఇవ్వలేదు. తన స్థితిని ఎవ్వరు హేళన చేసినా తట్టుకుంది. అందుక్కారణం తండ్రిగా మీరు అండగా ఉన్నారని. అలాంటి తండ్రే తనని అవమానించిన క్షణం తను మానసికంగా చచ్చిపోయింది. తనని చేసుకుంటామని ఎందరు వచ్చినా, నేను కోరి అడిగినా తన మనసు అంగీకరించలేదు. కారణం కన్నతండ్రిగా మీరే తన స్థితిని ఎత్తి చూపించారు. అలాంటిది తనను చేసుకునే వాళ్ళు తనని అంగీకరించరన్న నమ్మకం. ఈనాటికి తను నా మనసుని, ప్రేమని అంగీకరించింది. అంకుల్, మీరు అంగీకరిస్తే పద్దతిగా జరగవలసినవి జరిగి తనని మాఇంటి కోడలిగా తీసుకువేళతా. లేదంటే ఈ క్షణమే తనని నా భార్యగా తీసుకువెళతాను. నిర్ణయం మీచేతులలో ఉంది” చాలా సూటిగా చెప్పాడు కేశవ్.

మౌన౦గా ఉండిపోయాడు కేశవరావు.

తల్లీ చెల్లెలు, ప్రవీణ్,లోకేష్ ల కళ్ళల్లో ప్రశంసాపూర్వకమైన అంగీకారం కనబడితే, ధరణి తాతయ్య, నానమ్మ, మావయ్యల చేతులు అప్రయత్నంగా పైకి లేచి ఆశీసులు అందించాయి.

“మీ మౌనాన్ని అంగీకారం అనుకోవచ్చా అంకుల్.”

ఆ ప్రశ్నకి మొఖం తిప్పుకున్నాడు శివరావు.

శివరావు అభిప్రాయం అర్ధమైన కేశవ్ ,

“ధరణీ. వెళదామా” అడిగాడు.

“ఒక్కనిమిషం “ చెప్పి లోపలికి వెళ్ళి తన హ్యాండ్ బాగ్, ఫోన్ తీసుకుని వచ్చి చేయి జాపిన కేశవ్ చేతిని అందుకుంది.

“నా భార్యగా తనని తీసుకు వెళుతున్నా. త్వరలోనే మీకు సుముహూర్తం ఎప్పుడో తెలియచేస్తాము. మనసు మారితే వచ్చి ఆశీర్వదించండి” చెప్పి ధరణి భుజం చుట్టూ చేయి వేసి బయటకు నడిచాడు కేశవ్.

కేశవ్తో కలిసి తనని తానుగా స్వీకరించే, ప్రేమతో నిండిన భవిష్యత్తులోకి అడుగులు వేసింది ధరణి.

                                    ******%%%%%*******

ఫణికిరణ్@కిరణ్మయిAK 


Rate this content
Log in

Similar telugu story from Drama