అక్కా మాట్లాడవూ!!!
అక్కా మాట్లాడవూ!!!


బయట పెద్ద వర్షం పడేలా నల్లగా మబ్బులతో మూసేసింది.. పెద్దనాన్న వాళ్ళింటికి వెళ్ళారు నాన్న.. అక్కను మాఇంటికి తీసుకుని వచ్చేయడానికి..పెద్దమ్మ ఆరునెలల క్రితం చనిపోయింది..
పదిహేను రోజుల క్రితం పెద్దనాన్న మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు... ఆ కొత్తామెకు అక్క అక్కడ ఉండడం ఇష్టం లేదని పెద్దనాన్న అక్కని ఎక్కడో హాస్టల్ లో జాయిన్ చేస్తా అన్నారు..
ఆ విషయం నాన్న అమ్మకి చెప్తే ,అమ్మ అక్కని హాస్టల్ లో ఉంచటానికి ఇష్టపడలేదు.. మనింటికే తీసుకొచ్చేయండి ,మనకు మొదటి బిడ్డగా చూసుకుందాం అంది..
అమ్మ మాటలకు నాన్న కళ్ళల్లో ఏదో వెలుగు కనిపించింది..దానికి అర్థం ఏంటో నాకు తెలియదు కానీ ,చూడటానికి చాలా బాగుంది.
అప్పటినుంచి అన్నయ్యా ,నేను అక్క ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్..
ఇదిగో ఈరోజు నాన్న అక్కని తీసుకుని వస్తున్నారు..అందుకే ఇంత ఆరాటం..ఎప్పుడూ పిల్లీఎలుకల్లా పోట్లాడుకునే నేనూ , అన్నయ్యా ఒకటై కలిసిపోయి అక్కతో ఏమేం మాట్లాడాలో చెప్పుకుంటున్నాం..పనిలో పనిగా బయట వాతావరణాన్ని ,ఆ నల్లటి మబ్బులను కూడా బాగా తిట్టుకున్నాం.. పెద్ద వర్షం వస్తే అక్క రావడం లేటవుతుంది కదా అందుకే...
అటుగా వచ్చిన అమ్మ , మా మాటలు విని " మీ అన్నాతమ్ముళ్ళకి మరీ అక్క ధ్యాస ఎక్కువైపోయిందిరా " అంటూ ముద్దుగా విసుక్కుంది..
ఇంకో గంటకి నాన్న వచ్చేశారు.. నాన్నతో పాటు అక్క కూడా..
మా ఇద్దరి సంతోషానికి అవధులు లేవు..అక్కతో మాట్లాడడం మాకేం కొత్త కాదు , కానీ ఇప్పుడు అక్క ఎప్పటికీ మాతోనే ఉండిపోతుంది.. అది మా సంతోషం..
ఇకనుంచి అక్క మా స్వంతం అనే ఫీలింగ్..
అక్క ఇంట్లో అడుగుపెట్టగానే " అక్కా , లోపలికి రా " అంటూ నేనూ ,అన్నయ్యా అక్కకు చెరో పక్క పట్టుకుని తీసుకుని వచ్చాం..
మా సంతోషానికి తగ్గట్లుగా అక్క స్పందించలేదు..కానీ అదంతా మేము పట్టించుకోలేదు..
"రా దీపా ,బాగున్నావామ్మా " అంటూ అమ్మ అక్కని లోపలికి తీసుకుని వెళ్ళింది..
తర్వాత అందరం భోజనాలు చేశాం..
"అమ్మా ,ఈరోజు మేమిద్దరం అక్క దగ్గరే పడుకుంటాం " అంటూ మారాం మొదలుపెట్టాం..
అమ్మ చిన్నగా నవ్వుతూ మీ ఇష్టం అంది...
ఇంతలో అక్క..
"నా దగ్గర ఎవరూ పడుకోవడం నాకిష్టం ఉండదు ,ఏమనుకోవద్దు " అంటూ లోపలికి వెళ్ళిపోయింది..
మేమంతా షాకయ్యాం..అన్నయ్యా ,నేను ఏడుపు మొహాలు పెట్టాం..
పాపం అమ్మ ,మమ్మల్ని సముదాయించడానికి ఎంత కష్టపడిందో..
అక్క స్వభావం ఎప్పుడూ ఇంతే ,ఇంతకుముందు కూడా..
అక్క ప్రవర్తన చూసి "దీనికి అన్నీ వాళ్ళ నాన్న బుద్దులే వచ్చాయి ,ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు..
ప్రేమించేవారికి విలువ ఇవ్వదు " అంటూ బాధపడేది పెద్దమ్మ..
కానీ ఎందుకో తెలియదు ,తను ఏం అన్నా ,,ఎలా ఉన్నా ఎప్పుడూ తనంటే మాకందరికీ చాలా ఇష్టం..
కాలం చాలా తొందరగా ముందుకు వెళ్ళిపోతుంది..
అక్క మాతో కలిసిపోయింది కానీ ,తన చుట్టూ తాను ఒక గిరిగీసుకుని అందులోకి మమ్మల్ని రానిచ్చేది కాదు..
అమ్మ చాలా ప్రయత్నించింది ఆ గీత చెరపడానికి ,కానీ కుదరలేదు..
ఏది ఏమైనా ,తను ఎలా ఫీల్ అయినా మేమందరం మా కుటుంబంలో ఒకరిగానే అనుకున్నాం..
నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ,అన్నయ్య థర్డ్ ఇయర్ కి వచ్చాం..
అక్క కూడా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది.. పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు..
ఒక సంబంధం వచ్చింది.. చాలా ఉన్నవాళ్ళు..సిరిసంపదలు పుష్కలంగా ఉన్నాయి వాళ్ళకి..
అబ్బాయి గలవారు అక్క ఫోటో చూసి చాలా నచ్చి కావాలని వచ్చారు...
అక్కకు అబ్బాయి ఫోటో చూపించారు, నచ్చాడంది..
నీ వాళ్ళకి మనం తూగగలమా అని వెనకా ముందు చూస్తున్నారు...
వాళ్ళ మాటలు విన్న అక్క ,అమ్మానాన్నల దగ్గరకు వచ్చి
" ఎందుకు తూగలేం పిన్ని ,వాళ్ళే కావాలని వచ్చారు కదా..ఇప్పుడు వెనకడుగు వేస్తే అదృష్టం మళ్ళీ రమ్మన్నా రాదు..నా పేరు మీద ఉన్న అమ్మ పొలం నాలుగెకరాలు అమ్మేయండి కావాలంటే...తక్కువంటే కోటిరూపాయలు అన్నా వస్తుంది ఆ పొలానికి..
మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు..అందుకే అక్కడ ధరలు ఎలా ఉన్నాయో అతని ద్వారా తెలుసుకున్నా...
మీరు మొన్న ఈ సంబంధం గురించి చెప్పినప్పుడే అనిపించింది నాకు , ఈ అబ్బాయినే పెళ్ళి చేసుకోవాలని..
అందుకే ఎటువంటి ఆటంకం కలగకుండా అన్నీ జరిగేలా చూడండి.. ఆ పొలాన్ని అమ్మేయండి " అని టకటకా చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది.
తనెప్పుడూ అంతే ,చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతుంది..
ఆ మాటలకు అందరం షాక్ అయ్యాం..అమ్మ అయితే చాలా బాధపడింది. కళ్ళవెంట నీళ్ళు కూడా వచ్చేసాయి..అన్నయ్యా ,నేను చాలాసేపు ఓదారిస్తే కానీ మామూలు కాలేదు..
" కరుణా , దీప చేసిన దానిలో తప్పేం ఉంది..ఆ అమ్మాయి జీవితం ఎలా ఉండాలో తనే ప్లాన్ చేసుకుంటోంది..దానికి అవసరమైన ఏర్పాట్లు చేయమని మనకి దిగులు లేకుండా చేసింది.." అన్నారు నాన్న..
"నిజమే ,కానీ ఇలా ఆర్డర్ లా చెప్పడం ఎందుకో తట్టుకోలేకపోయానండీ, సరే తనిష్ట ప్రకారమే కానిద్దాం..అంతకంటే ఏం చేయలేము కదా " అంది అమ్మ..
చూడు కరుణ , ఒక కడుపున పుట్టిన నేను ,మా అన్నయ్యే ఒకలా లేము ఏ విషయంలో... రూపంలో కానీ ,గుణంలో కానీ ,ప్రవర్తన లో కానీ.. అటువంటిది మన కడుపున పుట్టని ఆ అమ్మాయిని తప్పు పటట్టలేం కదా..
మనం మన తప్పు లేకుండా ప్రతీదీ చేద్దాం.. అది మన బాధ్యత అంతే..
ప్రతీదీ మనసుకు తీసుకుని బాధపడితే సమస్య పరిష్కారం కాదు..మరిన్ని కొత్త సమస్యలు వస్తాయి అనారోగ్యం రూపంలో..
ఏదైనా మనం మార్చగలం అంటే దాని గురించి ఆలోచించాలి , మార్చలేము అనేవాటిని వదిలేయాలి ఏ విషయమైనా ,ఎవరినైనా ....
అర్థం అయ్యిందా ....అంతా నేను చూసుకుంటాను ,నువ్వు సంతోషంగా ఉంటే చాలు నాకు." అన్నారు నాన్న..
అమ్మ కళ్ళు తుడుచుకుంటూ నాన్న వైపు చూసి నవ్వింది..
అక్క పెళ్ళి తను కోరుకున్నట్లుగానే ఘనంగా జరిగింది.. పెద్దనాన్న అతిథిలా వచ్చి వెళ్ళిపోయారు..
పెళ్ళి తర్వాత జరగవలసిన తంతులన్నీ ఏ లోటూ లేకుండా జరిపించారు నాన్న..
అక్క బెంగళూరుకు వెళ్ళిపోయింది అత్తవారింటికి..
రోజూ మాట్లాడే కాల్స్ అప్పుడప్పుడు ,ఆ అప్పుడప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి అన్నట్లు అయిపోయాయి అక్క ముభావం వల్ల..
మరికొన్ని రోజులకు అక్కా వాళ్ళు బెంగళూరు నుండి ముంబయి షిఫ్ట్ అవుతున్నామని ఫోన్ చేసింది..
"ఈ నెంబర్ కాకుండా కొత్త నెంబర్ తీసుకుంటా అక్కడ ,అప్పుడు ఆ నెంబర్ ఇస్తా" అంది..
"ఒక్కసారి వచ్చి వెళ్ళమ్మా ,మళ్ళీ ఎప్పుడు వస్తారో" అంది అమ్మ ..
"లేదు పిన్ని ఇద్దరం బిజీ ఉన్నాం , ఒకవేళ మీరే వచ్చిన కూడా మీతో గడిపే సమయం కూడా లేదు నాకు..ఏమనుకోకండీ పిన్ని " అంటూ ఫోన్ పెట్టేసింది..
ఈసారి అందరం చాలా బాధపడ్డాం..మమ్మల్ని మేమే ఓదార్చుకుని మామూలయ్యాం కొన్నాళ్ళకు..
అక్కా వాళ్ళు ముంబయి వెళ్ళి ఐదుసంవత్సరాలయింది..ఇప్పటి వరకు కాల్ కూడా లేదు..
తెలిసిన వారి ద్వారా అక్క అక్కడ సంతోషంగా ఉందని తెలుసుకుంటున్నాం..
ఆ విషయంలో మా అందరికీ నిశ్చింత..
తన ఫోన్ నెంబర్ కనుక్కుని కాల్ చేయడం పెద్ద సమస్య కాదు ,కానీ వద్దు అనుకున్నవారివెంట పడాలంటే ఆత్మాభిమానం అడ్డువస్తుంది..
అన్నయ్యా ,నేనూ మా జీవితాల్లో సెటిల్ అయ్యాం..
మా కుటుంబానికి ఏ లోటూ లేదు అక్క మాకు దూరంగా (మానసికంగా) ఉండడం తప్ప..
అక్కా ,ఇప్పటికీ నువ్వంటే మాకు ఇష్టమే...ఒక్కసారి మాట్లాడవూ!!!!..
అయిపోయింది.