Surekha Devalla

Drama

5  

Surekha Devalla

Drama

తోడు

తోడు

3 mins
596


తోడు


"ఏమిటీ ఆలోచనలు, భయమేస్తోంది కొత్త జీవితం లోకి అడుగు పెట్టాలంటే.. ఇప్పటివరకూ నేను నా తల్లిదండ్రుల అల్లరి పిల్లని, ఏ విధమైన బంధనాలు లేని స్వేచ్ఛాజీవిని...


ఇప్పుడు పెళ్ళికూతురినై మరో ఇంట అడుగు పెట్టబోతున్నా...నాకేం తెలుసు అసలు సంసారం గురించి?


కానీ, ఇప్పుడు ఒక ఇంటి బాధ్యతంతా నా మీదే ఉంటుంది.. ఎవరికీ ఏ లోటూ లేకుండా అందర్నీ సరిగ్గా చూసుకోగలనా...పొరపాటున ఎప్పుడైనా తెలిసో, తెలియకో ఎవరినైనా నొప్పిస్తే?? " 


"ఏం కాదు బంగారం... ప్రతీ ఆడపిల్లా ఎదుర్కొనే సంఘర్షణే ఇది...మెట్టినింటికి తగ్గట్లుగా తనను తాను మలుచుకుంటుంది ప్రతీ స్త్రీ.."


"కానీ, నాన్నా! నాకసలు ఏమీ తెలియదు..ఇంటిని ఎలా చక్కబెట్టాలో, ఎవరితో ఎలా నడుచుకోవాలో?"" దానికేమీ స్పెషల్ ట్రైనింగ్ అవసరం లేదు రా...

బంధాలకు విలువ ఇస్తూ తోటి మనుషుల పట్ల నమ్మకంతో, ప్రేమతో మసిలితే చాలు..అవే నీకు జీవితం అంటే ఏమిటో చూపిస్తాయి...


నీ మనసునెప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకో..అదే నీకు దారి చూపిస్తుంది ఎటువంటి విషమ పరిస్థితులు ఎదురయినా.."


"సరే నాన్నా! నావల్ల పొరపాటున ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు ఎలా తీసుకుంటారో...భయంగా ఉంది"


"నా కూతురెప్పుడూ తప్పు చేయదు రా...నాకా నమ్మకం ఉంది...మంచిచెడుల గురించి వివరించి చెప్తూ పెంచాను నిన్ను.. నా పెంపకం గురించి నాకు తెలుసు రా...పొరపాటున తప్పు చేసినా, దానిని ఒప్పుకుని క్షమను కోరే సంస్కారం కూడా నేర్పించాను.."


"నాన్నా! నాపై ఎందుకంత నమ్మకం నీకు?"


" నా బిడ్డ మీద నాకు నమ్మకం లేకపోతే ఎలా?"


"నేను చాలా అదృష్టవంతురాలిని కదా నాన్నా...అందుకే నీ కూతురిగా పుట్టాను...కానీ, నిన్ను వ..ది..లి వె..ళ్ళా..లం..టే..."


"ఏడవకమ్మా! ఇది తప్పనిసరి పరిస్థితి కదా...నేను నిన్నెప్పుడూ ఏమీ అడగలేదు కదా...ఇప్పుడు ఒకటి అడుగుతాను..కాదనవుగా.."


"అడుగు నాన్నా! కాదనను"


"అప్పగింతల సమయంలో, నీ మెట్టినింటికి వెళ్ళేటప్పుడు నువ్వు కంటతడి పెట్టకూడదు.. నా చిన్నారి తల్లి నవ్వుతూ తన కొత్త జీవితానికి స్వాగతం పలకాలి..సరేనా.."


"నా..న్నా...! నాకు ఎందుకో ఇప్పుడే దుఃఖం ఆగడం లేదు..ఇక అప్పుడు, ఆ సమయంలో సాధ్యమా?"


"ఎందుకు సాధ్యం కాదు రా...చిన్నప్పుడు చిన్న దెబ్బ తగిలితేనే రెండు రోజులు ఏడ్చి గోలచేసేదానివి...కానీ వయసుకొచ్చాక ప్రతీనెలా వచ్చే విపరీతమైన నొప్పిని భరిస్తూ వద్దన్నా వినకుండా క్లాసులు పోతాయంటూ స్కూలుకు వెళ్ళిపోయేదానివి...


ఎక్కడ నుండి వచ్చింది ఆ తట్టుకునే శక్తి... ఇక అది నీ జీవితంలో భాగం అని నీకు అర్థం అయ్యింది కనుక..


అలాగే ప్రతీ ఇబ్బందిని, కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నావు.. ఇప్పుడూ అంతే కొత్త బంధాల మధ్య నీ స్థానాన్ని చక్కగా నిలబెట్టుకో...దేనికైనా నీ ప్రవర్తనే కారణం అవుతుంది.. దానిని మంచిగా, బంధాలకు అనుగుణంగా మలుచుకో ఎప్పటికప్పుడు..అంతేరా"


"నువ్వు చెప్తుంటే ధైర్యంగా అనిపిస్తుంది... నువ్వూ నాతో వచ్చేయవా నాన్నా, నాకు తోడుగా.."


"నా తోడు, నా సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది.. ఒక బంధం దూరమై మరో అనుబంధం దగ్గర అవ్వబోతోంది...నేను నీకు తోడుని మాత్రమే రా...


కానీ, నీ భర్త నీకు తోడూనీడా కూడా..నిన్ను నాకన్నా మంచిగా చూసుకుంటాడు...అర్థం చేసుకుంటాడు...ఎప్పుడూ నీ చెయ్యి వదలడు.."


"థాంక్యూ నాన్నా!"


"నా చిన్నారి తల్లి ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి... మరి మాట ఇచ్చినట్లే కదా..."


"ఇచ్చినట్లే..." 


"తపనా! ఏం చేస్తున్నావు? అంతా రెడీ అయినట్లే కదా? కళ్ళేంటి అలా ఉన్నాయి...?" 


"కంగారుపడకమ్మా! నాన్నతో మాట్లాడుతూ ఉన్నా...ఇప్పటివరకు భయంగా ఉండేది పెళ్ళంటే...ఇప్పుడు నాన్న మాటలతో ధైర్యం వచ్చింది.."


నిస్సహాయంగా చూసింది జానకి.


"చూడు, తపనా! నాన్న ఇక్కడికి ఎలా వస్తారు? ఒక డాక్టర్ గా  తన వృత్తికి న్యాయం చేయాలని ఓ ప్రాణాన్ని కాపాడటానికి వెళ్ళి కరోనా బారిన పడ్డారు.


ఆయన చనిపోయి ఆరునెలలైంది..తన వృత్తికి న్యాయం చేశారు కానీ మనకు అన్యాయం చేశారు మీ నాన్న"దుఃఖంతో గొంతు పూడుకుపోతుండగా అంది.


"అమ్మా"అంటూ తల్లిని కౌగిలించుకుంది కన్నీళ్ళతో..


ఓర్చుకో తల్లీ...సంతోషంగా ఉండవలసిన సమయం ఇది... కష్టం అయినా సరే నిజాన్ని అంగీకరించాల్సిందే.." అంది ఓదార్పుగా వెన్ను నిమురుతూ.


"అమ్మా! నేను వెళ్ళిపోతే నువ్వు ఒక్కదానివే ఎలా ఉంటావు ఇక్కడ? నాతోనే వచ్చెయ్"


"లేదు కన్నా! ఈ ఇంట్లో మీ నాన్న జ్ఞాపకాలు ఉన్నాయి.. అవే నాకు తోడు.. 


నేను నీ దగ్గరకు వచ్చేస్తే నీకు పుట్టిల్లు అనేది ఉండదు రా! ప్రతి ఆడపిల్లకు పుట్టిల్లు అనేది చాలా అవసరం..అత్తింట్లో ఎన్నో బాధ్యతలతో అలసిపోయిన మనసు పుట్టింట్లో సేదతీరాలి..


తను చిన్నపిల్లై అల్లరి చేస్తూ ,కబుర్లు చెప్పే ఆ సమయాలే కన్నవాళ్ళ మనసులకు ఆలంబన..మళ్ళీ కూతురు పుట్టింటికి వచ్చేవరకు ఆ జ్ఞాపకాలే వారి సంతోషానికి ఊపిరి పోస్తాయి."


"పెళ్ళికూతురిని తీసుకుని రండి.." పిలిచారెవరో..


నేను నీకు దగ్గరగా ఉండకపోవచ్చు కానీ నీకు తోడుగా ఉంటాను రా ఎప్పుడూ... నాన్న మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఆయన ఆత్మ మన చుట్టూనే ఉంటుంది.. మన సంతోషంలో ఆయన బ్రతికే ఉంటారు ఎప్పటికీ. 


ఏ ఆలోచనలు పెట్టుకోకుండా మనస్పూర్తిగా నీ బంధాన్ని ఆహ్వానించు" 


"సరేనమ్మా"అంటూ కళ్ళు తుడుచుకుంది తపన.


కూతురి మొహంలో వచ్చిన తేటదనం చూసి సంతృప్తిగా అనిపించింది.


భర్త ఫోటో వైపు చూసింది నేనున్నాగా నీకు తోడుగా అన్న భరోసా ఇస్తున్నట్లుగా నవ్వుతూ ఉన్న ఆయన రూపం చూసి చిన్నగా నవ్వింది..


' అవును ,మీరెప్పుడూ నాకు తోడుగా ఉంటారు నాకు తెలుసు 'అనుకుంది జానకి.


అయిపోయిందిRate this content
Log in

Similar telugu story from Drama