Surekha Devalla

Drama Inspirational

4  

Surekha Devalla

Drama Inspirational

ఒక్కసారి...

ఒక్కసారి...

3 mins
534


"ఒక్కసారి తనతన స్థానంలో ఉండి ఆలోచించు" తీవ్రంగా అంది సంజన.

"అలా ఆలోచించవలసిన అవసరం నాకు లేదు. అయినా ఎవరి అభిప్రాయాలు వారివి..తను ఉదయాన్నే నా కళ్ళకు కనిపించడం నాకు నచ్చడం లేదు..అదే చెప్పాను తనతో.." విసురుగా అంది శ్రేయ.

"ఎందుకు నచ్చడం లేదు..ప్రణవి ఏం తప్పు చేసిందనీ?" సూటిగా చూస్తూ అడిగింది సంజన.

"నీకు తెలియదా?" ప్రశ్నించింది శ్రేయ.

"పెళ్ళయిన నాలుగు నెలలకే భర్తను కోల్పోవడం ప్రణవి తప్పు కాదుగా.. దానికి ఆమెను ఎందుకు నిందించడం?" కోపంగా అంది సంజన.

"ఆమె దురదృష్టం వల్లే అలా అయ్యింది... నాలుగు సంవత్సరాలుగా జాబ్ చేస్తున్నా.. ఎంత ట్రాఫిక్ లో అయినా ఏ చిన్న ఆక్సిడెంట్ జరగకుండా డ్రైవ్ చేయగలను నేను..ఈ నాలుగు సంవత్సరాల్లో ఒక్క చిన్న పొరపాటు కూడా జరగలేదు నా డ్రైవింగ్ లో.. నీకు తెలుసు కదా!" అనడిగింది శ్రేయ.

"అవును.. అయితే..?" ఆమె భావం అర్థం అవుతున్నా,ఆమె మనసులో మాటలు ఆమె చేతే చెప్పించాలని అనుకుంటూ అంది సంజన.

"హ్మ్... నేను వారం రోజుల క్రితం బయల్దేరబోతుంటే ప్రణవి అనుకోకుండా ఎదురువచ్చింది..ఆరోజే మొదటిసారి ఆక్సిడెంట్ చేశాను.. బోలెడన్ని డబ్బులు వదిలాయి, బోనస్ గా తిట్లు కూడా..మా నాన్నమ్మా, అమ్మా ఎప్పుడూ చెబుతూనే ఉంటారు 'మంచి ఎదురు చూసుకుని బయల్దేరాలి.. లేకుంటే ఏదో ఒక అనర్థం జరుగుతుంది' అని.. నేనే సరిగ్గా పట్టించుకోలేదు ఎప్పుడూ... ఇప్పుడు అర్థం అయింది వాళ్ళెందుకు అలా చెప్పారో.." గుక్క తిప్పుకోకుండా తన ఆక్రోశం అంతా వెళ్ళగక్కి, సంజనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చరచరా బయటకు వెళ్ళిపోయింది శ్రేయ.

స్నేహితురాలి మనస్థత్వం గురించి తెలిసినా కూడా, మరీ ఇంత మూర్ఖంగా ప్రవర్తించడం సహించలేకపోయింది సంజన..

శ్రేయా కు బుద్ధి వచ్చే సందర్భం రాకపోదు ఏదోక సమయాన అని వేచి చూస్తోంది సంజన.

                   ******

"నీతో కొంచెం మాట్లాడాలి శ్రేయా!" గంభీరమైన స్వరంతో అన్నాడు ఆనందరావు.

"రండి అంకుల్, కూర్చోండి!" లోపలికి ఆహ్వానించింది శ్రేయ.

'ఎప్పుడూ సరదాగా ఉండే అంకుల్ ఈరోజెందుకు ఇంత సీరియస్ గా ఉన్నారు?' అనుకుంది మనసులో.

"చెప్పండి అంకుల్" అంది ఆలోచిస్తూనే.

"నీ మీద కోర్ట్ లో కేసు వేద్దామనుకుంటున్నా!" అదే గంభీర స్వరంతో అన్నాడు ఆనందరావు.

అదిరిపడింది శ్రేయ.

"నే..నే...నేనేం తప్పు చేశానంకుల్?" తడబడుతూ ప్రశ్నించింది.

"రెండు సంవత్సరాల నుంచి మా ఆస్తి కేసు ఒకటి కోర్టులో ఉంది..అది మేమే గెలుస్తామని అన్నారు మా లాయర్ గారు పోయిన వాయిదా సమయంలో.. కానీ ఈరోజు ఓడిపోయాము.. అంతా నీవల్లే" కోపంగా చూస్తూ అన్నాడు ఆనందరావు.

"మీరు ఓడిపోవడానికీ, నా మీద కేసు వేయడానికీ సంబంధం ఏంటండీ?" అయోమయంగా చూస్తూ అడిగింది శ్రేయ.

"ఎందుకు ఓడిపోయామని మా లాయర్ని అడిగితే ఆయనొక మాట అన్నారు"

"ఏమన్నారు?"

" 'కచ్చితంగా మీరే నెగ్గాలి.. కానీ అతి చిన్న పొరపాటు వల్ల ఓడిపోయారు.. మీరు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశారో ఇలా ఓడిపోవాల్సి వచ్చింది' అన్నాడు.. అంటే దీనికంతటికీ కారణం నువ్వే" కోపంగా అన్నాడు ఆనందరావు.

శ్రేయాకు ఏడుపు వచ్చేసింది..

ఉదయం జరిగింది గుర్తు తెచ్చుకుంది.

రాత్రి తన స్కూటీ పంచర్ అవ్వడంతో ఉదయాన్నే కూరగాయలు తెచ్చుకోవడం కోసమని అతని స్కూటీ అడగడానికి వెళ్ళింది, అప్పుడప్పుడూ అలా అడగడం అలవాటే..

అంకుల్ నిద్ర కళ్ళతో తలుపు తీసి అప్పుడే కళ్ళు తెరిచి తనని చూడడం గుర్తు వచ్చింది..

ఏడుస్తూ కూర్చున్న శ్రేయాను చూస్తూ "రెండు రోజుల్లో నీకు కోర్టు నోటీసు వస్తుంది.. రెడీగా ఉండు" అని చెప్పేసి వెళ్ళిపోయాడు.

సమయానికి సంజన కూడా ఇంట్లో లేకపోవడంతో ఏవేవో ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది.

సంజనకు మెసేజ్ చేసింది, తొందరగా ఇంటికి రమ్మని..

'ముఖ్యమైన మీటింగ్ ఉంది.. కొంచెం ఆలస్యం అవుతుంది' అని మెసేజ్ చేసింది సంజన.

అది చూసి నిట్టూర్చింది శ్రేయ.ఎవరితోనూ ఈ సమస్య గురించి చెప్పాలనీ, చర్చించాలని అనిపించలేదు..

సంజన ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూనే ఉంది.

ఆరు అవుతుండగా వచ్చింది సంజన. విషయం చెప్పింది శ్రేయా. మౌనంగా ఉండిపోయింది సంజన.

"ఏంటీ, ఏం మాట్లాడవు? వెళ్ళి ఆ అంకుల్ ని నాలుగు దులిపి రా..! అలా ఎలా కేసు వేయడానికి వస్తుంది? ఇటువంటి రూల్ నేనెప్పుడూ విననేలేదు.. అయినా ఆయన ఖర్మ బాగుండక కేసు ఓడిపోతే నన్ను బాధ్యురాలిని చేస్తున్నాడేంటి?" ఆవేశంగా అంది శ్రేయా.

"ఆయన అన్నదానిలో తప్పేం ఉంది.. నీమీద కేసు వేయడానికి వస్తుందో,రాదో నాకు తెలియదు.. కానీ, ఆయన పరిస్థితికి నువ్వే కారణం అనడంలో సందేహం ఏం ఉంది?" శాంతంగా అంది సంజన.

తనవైపు మాట్లాడుతుంది అనుకున్న స్నేహితురాలు అలా అనేసరికి పిచ్చికోపం వచ్చేసింది శ్రేయకు.

"లేవగానే నన్ను చూసినంత మాత్రాన జరిగేది జరక్కుండా ఆగిపోతుందా?" అంది రోషంగా.

"నువ్వు బయటకు వెళుతున్నప్పుడు ప్రణవి ఎదురు వచ్చినంత మాత్రాన ఆక్సిడెంట్ అవుతుందా? అందులో ఆమె తప్పు ఉంది అన్నప్పుడు, ఈ విషయంలో నీ తప్పు ఉండడం న్యాయమే కదా!" అంది సంజన.

మౌనంగా ఉండిపోయింది శ్రేయా.

"జరిగేది ఎప్పుడూ జరగక మానదు.. ఒకరు ఎదురు వస్తేనో, మరొకరిని చూస్తేనో మనకు చెడు జరగదు.. ఎవరినైనా మనం ఒక్క మాట అనేటప్పుడు ఎదుటివారి స్థానంలో మనం నిలబడి ఆలోచించగలిగితే ఆ బాధ ఏమిటో తెలుస్తుంది. ఒకరిని బాధపెట్టడం ఎంతసేపు...,చిటికెలో పని.. కానీ, ఆ బాధ పొగొట్టడం అంత సులువు కాదు" అంది సంజన.

కొద్దిసేపటికి "ఐ యామ్ సారీ!" నెమ్మదిగా అంది శ్రేయ.

"అది చెప్పవలసింది నాకు కాదనుకుంట" అంది సంజన.

అవునన్నట్లుగా తలూపింది.

"నేను అంకుల్ తో మాట్లాడి వస్తాను.. భయపడకు, ఎక్కువ ఆలోచించకు" అని అక్కడినుండి వెళ్ళిపోయింది సంజన.

"ఏమ్మా! నువ్వు అనుకున్నది జరిగిందా?" అడిగాడు ఆనందరావు నవ్వుతూ.

"మార్పు వచ్చింది అనే అనుకుంటున్నా అంకుల్!! చూద్దాం ఏమవుతుందో!!" చిరునవ్వుతో అంది సంజన.

కొద్దిసేపు ఆగి తమ ఇంటికి బయల్దేరింది సంజన.

ప్రణవి ఇంటి వైపు వెళ్తున్న శ్రేయాను చూసి తృప్తిగా నవ్వుకుంది సంజన.

అయిపోయింది.

సురేఖ దేవళ్ళ.



Rate this content
Log in

Similar telugu story from Drama