Surekha Devalla

Tragedy

3  

Surekha Devalla

Tragedy

విడదీయలేని బంధం

విడదీయలేని బంధం

5 mins
383


విడదీయలేని బంధం.


"వెళ్ళక తప్పదా ?" అప్పటివరకు అణిచిపెట్టిన బాధ తన అనుమతి లేకుండానే కన్నీటి రూపంలో బయటికి వచ్చేస్తోంది అవినాష్ కి.


"తప్పదు అవినాష్ ! నా వృత్తి అటువంటిది నీకు తెలుసు కదా ! నా వృత్తిపై నాకెంత గౌరవమో నీకు తెలియనిది కాదు.." అంది ఆశయ గద్గద స్వరంతో..


"తెలుసు...కానీ ఇటువంటి సమయంలో వద్దు ఆశయా! నీకు బదులుగా ఆ పని చేయడానికి చాలామంది ఉన్నారు... 


కానీ నాకు నీ తోడు కావాలి...అక్కడ నీకు జరగరానిది జరిగితే తట్టుకునే శక్తి నాకు లేదురా..! అర్థం చేసుకో " ఆవేదనగా అన్నాడు అవినాష్.


"అవినాష్! నా చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు..అమ్మ చాలా కష్టపడి పెంచింది. పద్దెనిమిదేళ్ళు నిండేసరికి అనారోగ్యంతో అమ్మ చనిపోయింది.


ఆ తర్వాత నా పరిస్థితి అగమ్యగోచరం అయ్యింది... నా అనేవారు లేరు..అప్పటివరకు మంచిగా ఉన్నవారందరూ అమ్మ చనిపోగానే దూరమయ్యారు.. కొంతమంది మృగాళ్ళు కాటేయడానికి చూశారు..


అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నారు డాక్టర్ స్రవంతి. నర్స్ ట్రైనింగ్ ఇప్పించి నా కాళ్ళమీద నేను నిలబడేటట్లు చేశారు.


ఒకరికింద చెయ్యి చాచకుండా నాకన్నం పెట్టింది ఈ వృత్తి... నాకు చేతనయినంత సేవ చేయాలని ఆనాడే అనుకున్నాను...


ప్రాణాలను కాపాడే డాక్టర్ ని కాకపోవచ్చు , కానీ మరణవాయువు సమీపిస్తున్న వేళ రెపరెపలాడే జీవనజ్యోతికి నా చేతులు అడ్డుపెట్టి మరికొన్ని నిమిషాలయినా వారి ఆయువును నిలపగలిగితే చాలు..." అంది కళ్ళల్లో నీరు తుడుచుకుంటూ..


"రోజూ చేస్తూనే ఉన్నావు కదా ,సేవ..ఇప్పుడు నీ ఆరోగ్యం గురించి చూసుకో ప్లీజ్.." ఆమెనెలా అయినా ఒప్పించి,ఈ కరోనా సమయంలో ఇంట్లోనే ఉండేలా చేయాలని అతని ప్రయత్నం..


"రోజూ నేను నా డ్యూటీ చేస్తున్న ,అంతే.. అప్పుడు అది బాధ్యత ,ఇప్పుడు చేసేదే సేవ...


అన్నీ బాగున్నప్పుడు చేయడం కాదు , ఎవరైనా సరే దగ్గరకు రావడానికి కూడా భయపడే ఈ పరిస్థితుల్లో అక్కడ హాస్పిటల్ లో నా అవసరం ఉంది..


ఇవన్నీ కాదు అసలు ,నేనో మనిషిని.. అందులోనూ నర్స్ ని...ఓ ప్రాణం కాపాడే పనికి ఎప్పుడూ వెనకాడను..ఇక అడ్డుచెప్పకు అవినాష్.." అంటూ బ్యాగ్ తీసుకుని బయటికి నడిచింది.


స్కూటీ స్టార్ట్ చేస్తూ వెనక్కి తిరిగి చూసింది..


మళ్ళీ భార్యను చూడగలనో లేదోనని అలాగే కళ్ళార్పకుండా చూస్తున్నాడు.


ఆమె ఒక్కసారిగా అతని దగ్గరకు పరిగెత్తుకుని వచ్చి...


" ఐ లవ్ యూ అవినాష్.. "అంటూ అతని నుదుటిపై ముద్దు పెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని వదలలేక వదిలి వెళ్ళింది..


ఆమె స్పర్శ ఏదో తెలియని ధైర్యాన్నిచ్చింది..కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని ప్రేమ ,ధైర్యం ఓ చిన్ని ఆత్మీయస్పర్శ చెప్తుంది.. అనుభవించే వారికి మాత్రమే ఆ మౌనభాష అర్థమవుతుంది.


నవ్వుతూ చెయ్యి ఊపాడు టాటా అన్నట్లు..


అతని నవ్వు చూసిన ఆమెకు కొండంత భరోసా లభించింది.. మరింత ధైర్యంగా ముందుకు కదిలింది..


            *****

"ఆశయా ! తొందరగా రా...అక్కడ చాలామంది పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు " అంటూ వడివడిగా నడిచింది డాక్టర్ స్రవంతి..


"సరే డాక్టర్ .." అంటూ ఆమె వెనకే దారితీసింది ఆశయ.


రోజులు గడుస్తూన్నాయి...కానీ పేషెంట్ల సంఖ్య తగ్గలేదు సరికదా ,మరింత పెరిగింది.. ఈ కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది...


ఎక్కడ చూసినా కరోనా చావులే , దాని బారిన పడిన వారే హాస్పిటల్ నిండా..


           *******


ఆశయ ఇంటికి వెళ్ళి నెల రోజులయ్యింది...కనీసం ఫోన్ మాట్లాడే అవకాశం కూడా ఉండట్లేదు..అంత బిజీ అయిపోయింది..నిద్ర కూడా సరిగ్గా ఉండట్లేదు...


అప్పుడే లంచ్ తిందామని కూర్చుంది తనతోపాటు పనిచేసే లక్ష్మితో పాటు..


దూరంగా కూర్చున్నారిద్దరూ..


అన్నం తింటూంటే ఓ దగ్గుతెర అడ్డుపడింది..


"ఏమైంది?" అనుమానంగా అడిగింది లక్ష్మీ..


ఇప్పుడు మనుషుల్ని భయపడటానికి బాంబులు ,యాసిడ్ దాడులు అవసరం లేదు..ఓసారి దగ్గితే చాలు, యమధర్మరాజు ని లైవ్లో చూసినట్లు బెదిరిపోతున్నారు..


"ఏం లేదు..పొలమారింది అంతే" అంటూ నిదానించి తింటోంది..


"మీ ఆయన నీ నామజపం చేస్తున్నాడేమో ,అందుకే ఇక్కడ నీకిలా పొలమారింది" అంది ఆటపట్టిస్తూ..


చిన్నగా నవ్వి ఊరుకుంది ఆశయ.

         

       **********


'హాస్పిటల్ కి వెళ్ళి నెలరోజులయ్యింది..మాట్లాడి వారం అయ్యింది... అప్పుడో ఇప్పుడో మెసేజెస్ తప్ప కాల్ చేయడమే లేదు ఈ పిల్ల...పనిలో పడితే ఏదీ గుర్తు రాదు.. ఎలా ఉందో ఏంటో' ప్రేమగా భార్యను మనసులోనే విసుక్కుంటున్నాడు అవినాష్..


సరిగ్గా ఆ సమయంలోనే మెసేజ్ వచ్చిన శబ్దం వినిపించింది..


ఆత్రంగా ఓపెన్ చేశాడు... ఆశయ దగ్గర నుండే మెసేజ్...


పున్నమినాటి చందమామలా వెలిగిపోయింది అతని మొహం..


ఛాటింగ్ మొదలయ్యింది..


"ఏం చేస్తున్నావ్ రా?" 


"నిన్నే తలుచుకుంటున్నా...కాదు కాదు తిట్టుకుంటున్నా " అంటూ బుంగమూతి ఉన్న స్మైలీని పంపించాడు..


"హహహ..నాకు తెలుసులే శ్రీవారూ...బహుశా మరో రెండు రోజుల్లో నీ దగ్గర ఉంటా.." లవ్ సింబల్ ఉన్న స్మైలీని కూడా జతచేసింది..


"వావ్...అవునా....! నిన్ను చూసి ఎన్నో సంవత్సరాలు అయినట్లు ఉంది తెలుసా...తొందరగా వచ్చేయ్ బంగారం" అంటూ కొన్ని హార్ట్ సింబల్స్ , కొన్ని ముద్దులు పంపించాడు...


అది చూసి నవ్వుకుంది ఆశయ..


"నేను వచ్చాకా నీకో సర్ప్రైజ్ ఉంది" ఊరిస్తూ చెప్పింది..


"అవునా ! ఏంటో చెప్పు" ఆత్రంగా అడిగాడు..


"అబ్బా! ఛా..!! సర్ప్రైజ్ అనేది ముందుగా చెప్పి ఇవ్వరు బంగారం...వెయిట్ చేయండి సర్ ,రెండు రోజులు.."


"తప్పదుగా! అయినా నీ రాకే నాకో పేద్ద సర్ప్రైజ్... దాని తర్వాతే మిగతావి.." 


"సరే బై..మళ్ళీ చేస్తా..పిలుస్తున్నారు మావాళ్ళు.." అంటూ సెల్ ఆఫ్ చేసింది.


అతని చిలిపిచేష్టలు ,అల్లరి , ఇంట్లో ఉంటే చిన్నపిల్లాడిలా తన చుట్టూ తిరుగుతూ అతను చెప్పే కబుర్లు అన్ని గుర్తొచ్చి మురిపెంగా నవ్వుకుంది..


            ౦౦౦౦౦

"అబ్బా ! కొంచెం తలనొప్పిగా ఉందే..ఉదయం నుండి జలుబు..ఓ టీ తెప్పించవా" లక్ష్మీ ని అడిగింది ఆశయ..


సరేనంటూ తెప్పించింది.. 


టీ తాగుతుండగా దగ్గు వచ్చి టీ కొంచెం మీద పడింది..


అయ్యో అనుకుంటూ బట్టలు క్లీన్ చేసుకుంటోంది కానీ దగ్గు అప్పుడప్పుడు వస్తూనే ఉంది ఆశయకు..


లక్ష్మీ కి భయం వేసి డాక్టర్ ని పిలుచుకుని రావడానికి వెళ్ళింది..


ఆశయ తన మొబైల్ తీసుకుని అవినాష్ కి ఒక మెసేజ్ సెండ్ చేసి మళ్ళీ మొబైల్ అక్కడే పెట్టేసింది..


డాక్టర్ వచ్చి చెక్ చేసింది..


సడెన్ గా జ్వరం కూడా రావడంతో అనుమానం వచ్చి డాక్టర్ కరోనా టెస్ట్ చేశారు... కరోనా పాజిటివ్ అని వచ్చింది..


"ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ పేషెంట్ల నుండి కరోనా సోకుతూనే ఉంది...నాలుగు రోజుల క్రితం ఇద్దరు డాక్టర్లకు , ఈరోజు ఆశయకు.." అంటూ బాధపడింది స్రవంతి..


"ఆమె భర్తకు తెలియచేయండి ఈ వార్త .."అంది స్రవంతి..


ఆశయను ఐసొలేషన్ లో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు..


            ********

అప్పుడే స్నానం చేసి వచ్చి మొబైల్ చెక్ చేసుకుంటున్నాడు అవినాష్..


ఆశయ మెసేజ్ వచ్చింది... ఈ టైంలో చేసిందేంటా అనుకుంటూ ఓపెన్ చేశాడు..


" ఐ లవ్ యూ అవినాష్.. ఐ లవ్ యూ సో మచ్... ఎన్ని జన్మలకైనా నువ్వే నా భర్తవు కావాలి..రేపు ఉదయం నా లాకర్ ఓపెన్ చెయ్..అందులో నీకోసం ఒకటి ఎదురుచూస్తోంది... మర్చిపోకుండా చూడండి శ్రీవారూ...ముందుగా ఓపెన్ చేయవద్దు.. రేపే చూడాలి..సరేనా..బై బంగారం.. లవ్యూ"


ఎందుకింత ఎమోషనల్ అయ్యింది? రేపు ఏదైనా స్పెషల్ డే నా? గుర్తు రావడంలేదే...ఇన్ని రోజులు దూరంగా ఉంది కదా..ఎక్కువ గుర్తొచ్చి ఉంటాను..పిచ్చిది..ఏదైనా గిఫ్ట్ పెట్టి వెళ్ళిందేమో....ప్రశ్నలు సమాధానాలు తనే చెప్పేసుకున్నాడు...


           *************

ఉదయమే లేచి ఫ్రెష్ అయ్యి ఆశయ చెప్పినట్లుగా లాకర్ ఓపెన్ చేసి చూశాడు..


అందులో ఓ గిఫ్ట్ బాక్స్ ,ఓ లెటర్ ఉన్నాయి...


ముందుగా లెటర్ చదువుదామని తీసేసరికి దానిపై ముందు గిఫ్ట్ ఓపెన్ చెయ్ అని ఉంది. చిన్నగా నవ్వుకుంటూ ఓపెన్ చేశాడు..


ఓ అందమైన కప్.. దానిమీద అందమైన పాప బొమ్మ వేసి ఉంది..పైన "త్వరలో రాబోతుంది" అనే అక్షరాలు కనిపించాయి.. అవినాష్ ఆనందానికి అంతులేదు...పట్టరాని సంతోషంతో ఎగిరి గెంతేశాడు...


లెటర్ లో ఏముందోనని ఆత్రుతగా తెరిచాడు..అందులో 


"ప్రియమైన శ్రీవారికి , మీకీపాటికే విషయం తెలిసింది కదా...నీతో నేరుగా చెబుదామనుకున్న ,కానీ అనుకోని ఎడబాటు మనమధ్య రాబోతోంది.. అదే అందరినీ వణికిస్తున్న కరోనా...దానివల్ల మనం కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి రావొచ్చు...


ఆ దూరం కొన్ని రోజులే అయితే ఫర్వాలేదు ,ఒకవేళ శాశ్వతమైతే....అలా ఏడవకు రా...ఏదైనా ధైర్యంగా స్వీకరించు...ఎంత జాగ్రత్తగా ఉన్నా దాని బారిన పడవచ్చు, చెప్పలేం..


కానీ ,నువ్వు నాకో మాట ఇస్తావా... ఒకవేళ చనిపోతే ,మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా భర్తవ్వాలి..ఈ జన్మలో మిస్ అయిన ప్రేమంతా మరుజన్మలో నాకందించాలి..


ఎందుకో నిన్ను వదిలి హాస్పిటల్ కు వెళ్ళాలంటే దిగులుగా ఉంది రా...ఇక మళ్ళీ మనం కలవమేమో అనిపిస్తుంది... అన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు కదా..


ఏమిటో మనసు పదేపదే హెచ్చరిస్తోంది ,ఏదో జరుగబోతోందని...నువ్వు జాగ్రత్త... నీ నవ్వు చాలా బాగుంటుంది అచ్చం నాలాగే...అందుకే ఎప్పుడూ దానిని వదిలిపెట్టకు..సరేనా...



ఏంటీ పిచ్చి లేఖ అనుకోకు...నా మనసు గందరగోళంగా ఉంది కన్నా..ఏం రాస్తున్నానో కూడా అర్థం కావడంలేదు..


ఇక ఉంటాను మరి..

ఇట్లు

నీ 

ప్రేమదాసి."


ఆ లేఖ చదివి ఒక్కపెట్టున ఏడ్చేశాడు... 'నీకేం కాదు కన్నా.., నేను బ్రతికి ఉన్నంతవరకు నీకేమి కానివ్వను" అనుకున్నాడు మనసులో...


             ******

"ఆశయ పరిస్థితి క్రిటికల్ గా ఉంది...నయం అవ్వడం కష్టం.." అంది డాక్టర్ స్రవంతి ఏడుస్తూ... ఆశయతో ఆత్మీయబంధం ఉండడంతో ఆమె మరణవిషయాన్ని తట్టుకోలేకపోతుంది ఆమె..


"అయ్యో...మనమేం చేయలేకపోతున్నాం కదా డాక్టర్... వాళ్ళాయనకు ఈ విషయం చెప్తారా" అంది లక్ష్మీ..


"చెప్పాలి ,తప్పదు..." అంటూ అవినాష్ కి ఫోన్ చేసింది స్రవంతి.


"హలో డాక్టర్ ,చెప్పండి.."


"అవినాష్, నేను చెప్పేది విని ధైర్యంగా ఉండు...ఆశయకు కరోనా పాజిటివ్ వచ్చింది.. పరిస్థితి కూడా కొంచెం క్రిటికల్ గా ఉంది..." అంది గద్గదమైన స్వరంతో..


ఆమె చెప్పే విధానంలోనే తెలిసిపోతుంది ఆశయ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో...


కొద్దిసేపటికి దుఃఖంతో మూసుకుపోయిన గొంతు పెగల్చుకుని "సరే డాక్టర్" అని ఫోన్ పెట్టేశాడు..


'ఆశయా...! నువ్వు లేని ఈ లోకంలో నేనుండలేను...నీ మరణం గురించి విని తట్టుకునే శక్తి నాకు లేదు... ఇలా చేయడం తప్పే అయినా తప్పడంలేదు... నీకు ఆహ్వానం పలకడానికి ఆ లోకంలో నీకోసం ఎదురుచూస్తూ ఉంటాను...' అని మనసులోనే అనుకుని తనువు చాలించాడు.


అవినాష్ చనిపోయిన గంటకు హాస్పిటల్ లో నరకయాతన అనుభవిస్తున్న ఆశయ ప్రాణం వదిలేసింది.


అయిపోయింది.



Rate this content
Log in

Similar telugu story from Tragedy