హౌస్ వైఫ్ కష్టాలు
హౌస్ వైఫ్ కష్టాలు
హలో అండీ , నా పేరు సిరి. మీతో నా ఫీలింగ్స్ కొన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. ప్రతి మనిషి తను చేసే పనిలో గుర్తింపు కోరుకుంటారు. అది చిన్నదైనా ,పెద్దదైన. అలానే ఆ గుర్తింపు కోరుకోవడంలో వయసు తారతమ్యం లేదు. అప్పుడే నడక నేర్చుకుంటున్న చిన్నారి నుండి పళ్ళు ఊడిపోయి మరోసారి బోసినోరు అయిన పండు ముసలివారు వరకు ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
ప్రతి ప్రొఫెషన్ కి విలువ ఉంది ,అలానే హౌస్ వైఫ్ గా ఉండడం కూడా ఒక ప్రొఫెషనే. దేని విలువ దానిదే. కానీ మిగతా వారిని గుర్తించినట్లు హౌస్ వైఫ్ లకి గుర్తింపు ఉండదు. సంపాదన లేని నిరంతర చాకిరీ వాళ్ళది.
చాకిరీ అని ఎందుకు అనుకోవాలి ,మనవాళ్ళ కోసం మనం శ్రమ పడితే చాకిరీ అవుతుందా అనొచ్చు మీరు. నిజమే మనవాళ్ళ కోసం ఎంతైనా కష్టపడగలం. కానీ మనం చేసే ఏ పనినీ గుర్తించకుండా మనల్ని తీసిపారేసినట్లు మాట్లాడితే ఖచ్చితంగా మనకి చాకిరీ చేస్తున్నాం అనే ఫీలింగే వస్తుంది.
కొంతమంది ఒప్పుకోకపోయినా ఇదే నిజం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి.... కాదు కాదు చదవండి..
ఒకరోజు కొంచెం నీరసంగా ఉండి ఇల్లు సర్దలేదు. ఆరోజే మావారు తొందరగా ఇంటికి వచ్చేసారు. ఇంటిని చూసి చిరాకు పడుతూ ఎలా ఇల్లు సర్దాలి , ఎంత ఫాస్ట్ గా చేసుకోవాలి అని ఒక గంట క్లాస్ తీసుకున్నారు. ఈలోపు ఎప్పుడో కానీ రాని బంధువులు ఆరోజే వచ్చారు. అదేమిటోనండీ ఎప్పుడూ ఇల్లు తళతళ మెరిసేలా నీట్ గా పెట్టి ఎప్పుడో ఒకసారి మనం ఇంటిని పట్టించుకోకుండా వదిలేస్తాం కదా , అదేరోజున వస్తారండీ ఈ చుట్టాలందరూ. అదేమిటో నాకెప్పుడూ అర్థం కాదు సుమండీ.
"ఎప్పుడూ మొబైల్ తోనే ఉంటావు , అది పక్కన పడేసి ఈ పని చేసుకోవచ్చు కదా" అంటూ కోప్పడ్డారు. రోజు మొత్తం పనిచేసి ఒక గంటో , అర గంటో రిలాక్సేషన్ కోసం ఫోన్ పట్టుకుంటాం. వీళ్ళకి ఇదే కనిపిస్తుంది కానీ రోజంతా చేసిన పని ఎందుకు కనిపించదండీ.....
వీళ్ళేం పొగడక్కరలేదు ప్రేమగా రెండు మాటలు మాట్లాడితే చాలు కదా. అది మాత్రం అర్ధం కాదు.
మేము ఒకసారి మావారి ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్ళాం . మేము వెళ్ళేటప్పటికి ఆవిడ కూర్చున్నారు హాల్ లో. వాళ్ళాయన కిచెన్ లో యుద్ధం చేస్తున్నారు వంట చేయడం కోసం. మేము వచ్చినా ఆవిడ వంటగదిలోకి వెళ్ళలేదు. ఒక గంట తర్వాత ఆయన వంటగది నుండి బయటికి వచ్చారు. ఆవిడ జాబ్ చేస్తారు అంట. అన్ని పనుల్లోనూ ఆయన సాయం చేస్తారంట. ఎంత మంచివారో కదా. అలా సాయం చేసుకోకపోతే ఆవిడకి ఎంత ఇబ్బంది పాపం. పనిమనిషి ఉంది కాబట్టి చాలా వరకు ప్రాబ్లమ్ లేదంట. వంటపని ఇద్దరూ కలిసి చేసుకుంటారు అంట. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అతను వంట చేశారని కాదండీ , ఇద్దరూ కలిసి పని చేస్తున్నందుకు.
తిరిగి వచ్చేటప్పుడు మా ఆయనతో అదే అన్నా....ఆయన సమాధానం ఊహించండి చూద్దాం...
ఆవిడ జాబ్ చేస్తోంది కాబట్టి సాయం చేస్తున్నారు అంట అతను. అయితే నేను జాబ్ చేయనా అన్నా. కుదరదు అన్నారు. ఇంటిని చక్కగా చూసుకుంటే చాలంట....
దేవుడా ఏం మనుషులో...వాళ్ళే జాబ్ చేసేవాళ్ళని పొగుడుతారు..అంతలోనే మనం చేస్తామంటే వద్దంటారు..ఏమిటో మరి..
ఇప్పటికే ఎక్కువ చెప్పేసాను ,ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఉన్నాయి. అవన్నీ చదివితే మీకు బోర్ వచ్చేస్తుందేమో....అందుకే ముగించేస్తున్నాను.
(ఇంతకీ అసలు విషయం ఏమిటంటే మా శ్రీవారు వచ్చే వేళయింది. ఆయనకిష్టమైన చక్కెర పొంగలి చేయాలి. ఇప్పటిదాకా ఇన్ని చెప్పి మళ్ళీ మొగుడికోసం అంటోందేంటా అనుకుంటున్నారా... ఏం చేస్తాం , ఈ మాయదారి మనసు ఊరుకోదండీ ...ఎంతైనా మనవాళ్ళే కదా).