Surekha Devalla

Tragedy

4.5  

Surekha Devalla

Tragedy

కన్నీటి అప్పగింతలు

కన్నీటి అప్పగింతలు

2 mins
676


నిజమా మహీ నువ్వు చెప్తోంది, నేను నమ్మలేకపోతున్నాను" అంది రమ్య.

" అవునే , నేను స్వయంగా తనని కలిసి వచ్చా కదా...అది ప్రణీత్ అనే అబ్బాయిని పెళ్ళి చేసుకుంటుంది అంట..వాళ్ళాయన పోయి రెండు సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే మళ్ళీ పెళ్ళికి రెడీ అయిపోయింది.." అంది నిష్ఠూరంగా పావని.

"ఛఛా , అలా నిష్ఠూరంగా మాట్లాడకే..అది ఈ పెళ్ళికి ఒప్పుకుందంటే ఏదో బలమైన కారణం ఉందనిపిస్తుంది..అదీ ,వాళ్ళాయన ఎంత అన్యోన్యంగా ఉండేవారో మనకి తెలియనిది కాదు.. అంతెందుకు ఆరునెలల క్రితం దానిని కలిసినప్పుడు కూడా కన్నీరుమున్నీరుగా ఏడ్చింది చనిపోయిన భర్తని తలుచుకుని..

అయినా పెళ్ళి చేసుకుంటే మంచిదే ,దాని జీవితం మళ్ళీ చిగురిస్తుంది..ఈ రెండేళ్ళలో బయటికి వచ్చిందే చాలా చాలా తక్కువ.  జీవశ్చవంలా బ్రతికింది..ఈవిధంగా అయినా దానికి మంచి జరుగుతుంది.. చాలా సంతోషంగా ఉంది , ఇంతమంచి వార్త చెప్పినందుకు నీ నోట్లో లడ్డూ పెట్టాలి " అంది..

"హా ,సరిసరే....ఎవరో వచ్చినట్లున్నారు ,మళ్ళీ ఫోన్ చేస్తా" అంటూ కాల్ కట్ చేసింది పావని.

పావని స్వభావం తెలిసిన రమ్య తనలోతనే నవ్వుకుంది..

                     ౦౦౦౦౦౦౦

కాలింగ్ బెల్ సౌండ్ కి డోర్ తెరిచిన రమ్య , ఎదురుగా కనిపించిన వారిని చూసి షాకయ్యి తర్వాత సంతోషంగా కౌగిలించుకుంది తన ఫ్రెండ్ సౌమ్య ని...

"ఏంటే వసు , మాటమాత్రమైన చెప్పకుండా ఈ సర్ప్రైజ్ ఏంటి.... ఫస్ట్ లోపలికి రా " అంటూ సంతోషంగా లోపలికి ఆహ్వానించింది..

కుశలప్రశ్నలు అయ్యాకా " ఇంకో వారంలో నా పెళ్ళి..నువ్వు తప్పకుండా రావాలి.." అంది సౌమ్య..

"తప్పకుండా వస్తా ,కానీ నిజం చెప్పు ...నువ్వు సడెన్ గా పెళ్ళికి ఒప్పుకోవడమేంటి...ఏదో జరిగిందని అర్థం అయ్యింది.. అదేంటో చెప్పు సౌమ్యా...నీ మొహం ఆనందంగా ఉన్నట్లు నటిస్తున్నా , జీవంలేని నీ కళ్ళు నిజాన్ని చూపిస్తున్నాయి..ఏమైందసలు ..." అడిగింది రమ్య..

ఇక గుండెల్లో దాగనంటున్న దుఃఖాన్ని కళ్ళనుండి బయటికి పంపించింది సౌమ్య..

కొద్దిసేపు తనను అలానే ఏడవనిచ్చి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది..

కొంచెం సర్దుకున్న సౌమ్య " ఆ దేవుడు నా జీవితంతో ఎందుకిలా ఆడుకున్నాడు..నన్ను ప్రాణంగా ప్రేమించిన నా భర్తని నాకు కాకుండా చేశాడు ..డెంగ్యూ జ్వరంతో ఆయన చనిపోయిన తర్వాత జీవితం మీద ఆశ చచ్చిపోయింది..

పసివాడైన నా కొడుకును చూసుకుంటూ ఎలానో బ్రతుకుదాం అనుకుంటే ఐదునెలల క్రితం తెలిసిన నిజం ,నాకు క్యాన్సర్ అని" అంటూ వస్తున్న ఏడుపుని కంట్రోల్ చేసుకుంది..

"ఏంటే నువ్వు చెప్పేది ,ఇది నిజం అయ్యి ఉండదు..మరోచోట చూపిద్దాం " అంది రమ్య ఏడుస్తూ..

"లేదు రమ్యా ,అన్ని ప్రయత్నాలు అయిపోయాయి..అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉందంట.. డాక్టర్లు కన్ఫార్మ్ చేసేశారు.. నా బాధ నేను పోతున్నందుకు కాదు , నా బిడ్డ భవిష్యత్తు గురించి.. లోకం ఎరుగని పసివాడిని ఏం చేయాలో అర్థం కాలేదు.. చుట్టాలందరూ ఆస్థి కోసం చూసేవారే తప్ప బిడ్డ మీద ప్రేమతో కాదు.. పోనీ నీకప్పగిద్దాం అంటే నీ భర్త ,అత్తమామల పర్మిషన్ కావాలిగా...మనస్పూర్తిగా స్వీకరిస్తారో లేదో వాళ్ళందరూ అనే సందేహం..

అందుకే నీతో అనలేకపోయాను..ఆలోచనలతో సతమతమవుతున్న సమయంలో నా జీవితంలోకి వచ్చాడు ప్రేమ్..

ఒకప్పుడు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి , తన మౌనప్రేమను తనలోనే దాచుకుని నాకు పెళ్ళయిపోయినా కూడా నన్నే తలుచుకుంటూ పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయాడు..

నాలుగు నెలల క్రితం కలిసాడు.. పెళ్ళి చేసుకుంటానన్నాడు..నా గురించి మొత్తం చెప్పాను..తెలుసన్నాడు...నా గురించి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటున్నాడంట..

నువ్వు లేకపోయినా నీ బాబుని నా బాబుగా చూసుకుంటాను ,కాదనవద్దు అంటూ ఎన్నోరకాలుగా నచ్చచెప్పి ఒప్పించాడు.. నాకూ తను చెప్పింది సబబుగానే అనిపించింది ,ఇందులో నాస్వార్థమే ఎక్కువ ఉంది కానీ తప్పలేదు..

పెళ్ళి మొదట సింపుల్ గా రిజిస్ట్రార్ ఆఫీసులో చేసుకుందాం అనుకున్నాం కానీ ,ఈ బంధువులు అనబడే రాబంధులు నేను పోయాకా వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వరేమోనని ఆలోచన మార్చుకున్నాం " అంది..

అంతా విన్న రమ్య ప్రేమ్ నిజం ప్రేమమూర్తి అంది..

అవును అంది సౌమ్య.

                   ******

పెళ్ళి సజావుగా ,ప్రశాంతంగా జరిగింది..

రెండు నెలల తర్వాత సౌమ్యకి సీరియస్ గా ఉందని ఫోనొస్తే హుటాహుటిన వెళ్ళింది హాస్పిటల్ కి..అక్కడి దృశ్యం చూసి మనసు నీరయిపోయింది..

తన బిడ్డను ప్రేమ్ చేతిలో పెట్టి అప్పగింతలు పెడుతుంది..వాళ్ళిద్దరి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు కనుక్కుంటూ ఉండమని వాళ్ళ చేతులను రమ్య చేతిలో వేసి అప్పగింతలు పెట్టి కన్నుమూసింది సౌమ్య.


             Rate this content
Log in

Similar telugu story from Tragedy