Kanthi Sekhar

Drama

3.9  

Kanthi Sekhar

Drama

శ్రీ వారికి ఒక లేఖ

శ్రీ వారికి ఒక లేఖ

3 mins
601


ప్రియమైన శ్రీవారికి,

కొత్తగా ఉందా ఈ పిలుపు...నువ్వు అనేదానివి కదా అంటారా...మనుషులు కొత్తగా మారుతుంటే మాటలు పిలుపులు కూడా మారాలి మరి.

ఏం మారాను...కొత్త ఏమన్నానా...మన పరిచయం వయసు పదేళ్లు పైనేగా అంటావా...పరిచయం వయసు ఎక్కువే కానీ పరిణయం వయసు అయిదేళ్లకి కొంత ఎక్కువ.

ఈ లెక్కలేమిటి బాబు...పొద్దున్నే...పని మానేసి మరీ...అంటారా...

ఇదిగో ఇక్కడికే వస్తున్నా...పని మానేసి...పని మానేసి అన్నప్పుడల్లా నన్ను పని మనిషి...పని మనిషి అన్నట్టు అనిపిస్తుంది. నీ మొగుడికి, నీ పిల్లలకి చేస్తే పని మనిషి అవుతావా...చాలా మంది నాలిక మీద ఉండే మాట ఇది...

నేను పని మానేస్తే ఎలా ఉంటుందో నాకు రెండ్రోజులు జ్వరం వస్తే తెలుస్తుంది...ఇది ఫ్రస్ట్రేషన్ అనుకోండి పొగరు అనుకోండి...గృహిణి బాధ్యత అనేది లోకంలో అసలు ఏ జీతము లేని, ఏ గుర్తింపు లేని, కృతజ్ఞతను నోచుకోని పని.

మళ్లీ మొదటికి వచ్చావా అంటారా...మొదటికే వస్తున్నా...గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్...అని నన్నయ్య గారు రాసినట్టు...పెళ్లికి ముందు చిన్న జలుబు చేసినా వంద ఫోన్లు, వెయ్యి జాగర్తలు చెప్పే మనిషి...ఇప్పుడు నాలుగు రోజులుగా జ్వరం ఉన్నా వంటి మీద చెయ్యి వేసి మాట్లాడుతూ కూడా తెలుసుకోకుండా ఉంటే...నా స్థానంలో ఉండి తెలుసుకోండి...మార్పు ఎవరిలో...

మార్పులు ఉన్నాయి...నేను స్నేహితురాలి నుంచి భార్య,కోడలు, తల్లి గా మారితే...మీరు స్నేహితుడి స్థానం నుంచి భర్తగా, అల్లుడిగా, తండ్రిగా మారారు. మీరు అంటున్నా అని కొరకొరా చూడకండి...మనసులు దూరం అవుతుంటే పిలుపులో దూరం మంచిది.

దానికీ దీనికీ సంబంధం ఏమిటి అంటారా...మీతో నేను మీఅమ్మానాన్నలను...క్షమించాలి..అత్తమ్మ...మామగారిని పొరపాటున మీ అమ్మగారు...మీ నాన్నగారు... అంటేనే మీ మొహంలో రంగులు మారతాయి...కోపంలో నా మీద నీ...అంటే...నా మనసు ముక్కలు కాదా...

మీ మీద ఆధారపడ్డా అని లోకువా...నీది నాది అంటావేంటి అంటారా... నాదంటూ చదువు ఉద్యోగం ఉన్నప్పుడు నేను చేసే చిన్న సరదాలు...పిల్లల బాధ్యత కోసం నేను ఉద్యోగం మానేసాక మీకు నా దుబారా ఖర్చుగా కనిపిస్తున్నాయి మరి...

కోపంలో అన్నా...మనసులో పెట్టుకోకు అంటారా... కోపంలోనే మనసులో అసలైన విషయాలు బయట పడతాయి మరి.

ప్రేమించుకున్న రోజుల్లో నా గురించి తెలీదా అంటారా...అప్పుడు మీరు నాతో మాట్లాడటానికి ఫోన్ చేస్తే...ఇప్పుడు నన్ను తిట్టటానికే ఫోన్ చేస్తున్నారు...నిన్నటిలా ఇవాళా ఇవాల్టిలా రేపూ ఉండవు అంటారా...ఒప్పుకుంటాను...కానీ నేనేమన్నా గొంతెమ్మ కోరికలు కోరానా... ఇన్నేళ్ళల్లో నాకంటూ చీర, గ్రాము బంగారం అయినా కొన్నానా...

చీరలు నగలు భర్త కంటే ముఖ్యమా అంటావా...మీకు భార్య కంటే మీ ఫ్రెండ్స్...పార్టీలు ముఖ్యం అని నేను అంటే తట్టుకోగలరా...సంపాదిస్తున్నాను...నా కోసం సరదా వద్దంటావా అని మీకు అనిపించచ్చు... నాకూ కొన్ని సరదాలు ఉన్నాయి...ఎవరి అనుమతి లేకుండా మీతో కలిసి గుడికి వెళ్ళాలి...ఎవరి ఆంక్షలు ఎత్తి పొడుపు లేకుండా మీతో కలిసి నవ్వుతూ హాల్లో కూర్చుని టీవీ చూడాలి...వాటికి అయ్యే ఖర్చు మీరు మీ అమ్మా నాన్నలకి నచ్చజెప్పటం.

ఇరవయ్యేళ్ళ వరకు అన్నీ స్వతంత్రంగా చేసి పెళ్లయ్యాక ఒకరిని నమ్మి జీవితం వారి చేతిలో పెట్టడం ఎలాంటిది...నేను త్యాగం చేసా అనట్లేదు...నాకంటూ ఒక వెసులుబాటు కావాలి అంటాను.

భార్య అంటే పది మందికి వండాలి, అందరి అవసరాలు చూసుకోవాలి అనేది ఇదివరకు అంచనా...ఆ రోజులే మెరుగు...సంపాదించే బాధ్యత లేదు...జిడ్డు ఓడుతో వంటింట్లో వేలాడే నా మొహం తప్ప మీ డైయట్ కోసం నా నోరు కట్టేసుకున్నా అనే ప్రయత్నం మీకు కనపడదు...బ్యూటీ పార్లర్ కోసం ఖర్చు చేయవు అంటారు తప్ప నా మనసు చచ్చిపోయాక మొహం ఎంత మెరిసినా ఒకటే అనే నా వేదన మీకు పట్టదు.

నీలో లోపాలు లేవా...అంటే...పెళ్లికి ముందు చేసిన అల్లరి అందం ఐతే పెళ్ళయాక నా కబుర్లు కువకువలు మీకు సోదిలా కనిపించాయి... ఖర్మ అనుకుంటాను...పిల్లలను దృష్టిలో పెట్టుకుని సర్దుకుంటాను...

మీకు నా బాధ పట్టదు. మిత్రులతో నా బాధ చెప్పుకుని మిమ్మల్ని తక్కువ చేయలేను...తల్లి దండ్రుల ముందు చెప్పినా ఏరి కోరి చేసుకున్నావు...అనుభవించు అంటారు...నా సాంత్వన కోసం నేను రాసుకునే రాతలు మీకు పనికిరాని పనులు. కానీ వాటిపై వచ్చే ఆదాయం మీద కూడా మీ ప్లానింగ్...నేను తప్పు పట్టడం లేదు...ప్రోత్సాహం ఉన్నా లేకున్నా చులకన చేస్తే బాధ సహజం.

పెళ్లికి ముందు నా దేవత నువ్వే అన్నారు...దేవతలా కాకున్నా ప్రాణం ఆలోచన ఉన్న మనిషిని అని అర్థం చేసుకుంటే చాలు. గౌరవించాలని కోరను...తీసి పారేస్తే తట్టుకోలేను.

ఎప్పటికీ

మీలో సగం...

(ఎన్ని జరిగినా మీరే నా జీవితం)

ఉత్తర లేఖనం: ఇది మీరు చదివినా విరిగిన నా మనసు అతకదు అని తెలుసు...వేదన అనే అగ్నిలో నా మనసు కాలినట్టే...పొయ్యిలో ఈ లేఖ కాలిపోతుంది అని దానికి తెలీదు పాపం.Rate this content
Log in

Similar telugu story from Drama