Kanthi Sekhar

Drama

4  

Kanthi Sekhar

Drama

అమ్మకు ఒక ఉత్తరం

అమ్మకు ఒక ఉత్తరం

2 mins
429


అమ్మా...


డియర్ అని రాసినా ప్రియమైన అని రాసినా నీ కన్నా ప్రేమకి గొప్ప మాట నాకు దొరకలేదమ్మా. స్కూల్ లో మమ్మీ అని పిలవాలని చెప్పారు కానీ చిన్నప్పుడు నువ్వు అమ్మా అని నేర్పావు అదే బాగుంటుంది నాకు. ఏ, బి, సి కూడా లైన్ మీద రాయటం రాదు అప్పుడే ఉత్తరం ఏమిటా ఈ పిల్ల అనుకుంటున్నావా... పెద్దయ్యాక రాద్దాం అని మాటలు పోగు చేసుకుంటున్నా మనసులో. చిన్న పిల్లని కదా నాకేం తెలుసులే అనుకుంటున్నావా... నీ కడుపులో ఉన్నప్పటినుంచి నీ మాటలు నీ మనసు చదవటం తెలుసుకున్నా. ఇంట్లో అందరూ నేను పుట్టటం ఇష్టం లేదు అన్నట్టు మాట్లాడినా నా రూపంలో నీ పోలికలకి నన్ను ముద్దులాడుతూ నువ్వెంత మురిసిపోయావో మాటలు రాకపోయినా

నీ వెచ్చటి స్పర్శకి నా వేళ్ళతో నీ బుగ్గలు నిమిరి చెప్పేదాన్ని. అలసట వల్లనో పనుల హడావుడి వల్లనో నీకు తెలిసేది కాదు అంతే.


అర్ధరాత్రి అపరాత్రి అయినా నేను కుయ్యిమనగానే ఏం కావాలో చూసుకునేదానివి కదా... కానీ నీ ఆకలి, నీ నిద్ర నువ్వు పట్టించుకునేదానివి కాదు. మాట్లాడటం రాకపోయినా నీ చేతులు వణకటం అప్పుడప్పుడు నీ కళ్ళల్లో నీళ్లు తిరగటం నాకు తెలిసేవి అమ్మా.


నేను పుట్టకముందు, అంటే కడుపులో ఉన్నప్పుడు నీ పెద్ద కళ్ళు, జడ ఎంతో బాగుండేవి అని నాన్న అంటుంటే ఆనందంతో నీ బొజ్జ ని కాళ్లతో తన్నేదాన్ని మా అమ్మ ఇంత బాగుంటుంది అని చెప్పటం రాక. నేను పుట్టాక మాత్రం నువ్వు మాసిన బట్టలు, చెదిరిన జుట్టు, నిద్రలేక కమిలిన కళ్ళతోనే ఎక్కువ కన్పడేదానివి. అయినా నేను చూసినా, ఏడ్చినా ,నవ్వినా, వింతగా చూస్తూ నాన్నతో, నానమ్మతో, అమ్మమ్మతో తెగ ముచ్చట్లు చెప్పేదానివి...మెరిసే కళ్ళతో...కానీ నువ్వు ఎప్పటిలా చక్కగా ఉంటేనే నాకు బాగుంటుంది అమ్మా.


బుడి బుడి అడుగులు వేసుకుంటూ మధ్యలో కింద పడితే ఏమి కాలేదురా కన్నా అని దగ్గరకి తీస్కుని మళ్ళీ నడిపించేదానివి. నువ్వు మాత్రం వంటలో ఏమైనా మర్చిపోతేనో ఏదైనా పని ఆలస్యం అయితేనో ఎందుకమ్మా రోజంతా అదోలా ఉంటావు. నేను అల్లరి చేసినా నన్ను ఏమనవ్ కదా... అలాగే... నిన్ను నువ్వు క్షమించేసుకో అమ్మా... నువ్వు డల్ గా ఉంటే నాకు ఇష్టం ఉండదు.


నీలా ఉంటా అని నేనంటే నీకు ఇష్టం కదా... నీతో మొట్టికాయలు తిన్నా కాసేపట్లో మర్చిపోయి నవ్వేస్తా... చాక్లెట్ కొనలేదని అలిగి ఏడ్చినా తర్వాత కొంటానమ్మా అంటే మళ్ళీ నవ్వేసి ఆటల్లో పడిపోతా... ఆటల్లో కింద పడినా లేచి మళ్ళీ ఆడుకుంటా... చిన్నప్పుడు నువ్వు అంతే అంట. అమ్మమ్మ చెప్పింది. మళ్ళీ అలా మారిపోవా ప్లీజ్... నాతో కబుర్లు చెప్తూ, ఆడుకుంటూ ఉంటావు... కానీ ఏమి చేసినా ఏదో డల్ గా ఉంటావు ఎప్పుడూ మరి. నేను మట్టి పూసుకున్నా ముద్దుగా విసుక్కుని నన్ను మళ్ళీ తయారు చేస్తావుగా... అలాగే పనులు అయ్యాక ఆ చిరాకు వదిలేసి నువ్వు నవ్వేయచ్చుగా...


నా ప్రతి మంత్లీ బర్త్డే కి నాన్నతో పోట్లాడి అయినా నాకు కొత్త డ్రెస్సులు కొనేదానివంట. నాకు ఇష్టమైనవన్నీ దాచిపెట్టి తర్వాత తీసి ఇచ్చి నా నవ్వులో నీ నవ్వు కలిపేస్తావుగా.. అలాగే నీకు ఏదన్నా ఇష్టమైతే నాన్నని నానమ్మని ఎందుకు అడగవ్...నీలో దాచుకున్న నవ్వు కూడా మళ్ళీ తీసి నాకు ఇచ్చెయ్యవా... నేను నీలాగే పెద్దయ్యాక ఎక్కడికో వెళ్ళాలంట...నానమ్మ చెప్పింది. తానూ అలాగే మనింటికి వచ్చిందంట. మరి నేను నీతో ఉన్న కొన్నాళ్ళు నాతో నాలాగే ఉంటావా... ప్లీజ్ అమ్మా... ఐ లవ్ యు.


నీ బంగారు తల్లి.



Rate this content
Log in

Similar telugu story from Drama