Kanthi Sekhar

Drama

4.4  

Kanthi Sekhar

Drama

ఇంకో రోజు

ఇంకో రోజు

2 mins
469


" ఇవాళ సినిమా కి వెళదాం అండీ... నాకు తొందరగా వర్క్ ఐపోతుంది ఆఫీస్ లో... పిల్లలు పదిహేను రోజుల నుంచీ అడుగుతున్నారు..." ఇరవై ఏళ్ళ క్రితం తన భార్య గోముగా అడగటం గుర్తొచ్చింది రవి కి. "ఇంకో రోజు చూద్దాం... పెదనాన్న వాళ్ళు పెళ్ళికి వరంగల్ వెళుతూ సాయంత్రం చూసి వెళ్తామని ఆఫీస్ కి ఫోన్ చేసారు... పెదనాన్నకి షుగర్ కదా... చపాతీ చేసి ఉంచు. పెద్దమ్మ కి రోటి పచ్చడి తప్పనిసరి...మళ్ళీ లేకపోతే అలుగుతారు... కొంచెం రుచీ పచీ ఉండేట్టు చెయ్యి... మీ పుట్టింటోళ్ళు నాకు పెట్టినట్టు చేయకు..." మూడేళ్ళ కూతురి పేచీ, నెలల కొడుకు ఏడుపు పట్టించుకోకుండా లిస్ట్ చెప్పేసి చుట్టాల కోసం స్టేషన్ కి వెళ్ళిపోవటం, భార్య సరుకులు తెచ్చుకుని వంట ఏర్పాట్లు మర్యాదలు అన్నీ చక్కగా చేయటం, ఏడేళ్ల పెద్ద కూతురు మాత్రం అంత సేపు తనని ఒక బూచిలా చూడటం ఆలోచిస్తుంటే ఇప్పుడు అనిపిస్తోంది... తాను కాబట్టి చేసింది ఈ కాలం ఆడపిల్లలైతేనా...

కాలం తో ఏమి పని... ఆడపిల్ల పరిస్థితుల్లో పెద్ద మార్పులేమీ లేవు... తన ఇద్దరు కూతుళ్ళని చూస్తున్నాడు కదా...ఇంజనీరింగ్ చదివే కొడుకుని కూడా...కూతుళ్లిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా అత్తవారింట్లో ఇబ్బందులు మామూలే... అల్లుళ్ళు చెడ్డవాళ్ళేమి కాదు... తాను చెడ్డవాడు కాదుగా... భార్యలకు అన్నీ అమర్చి పెడితే ఆ మాత్రం ఇల్లు చూసుకోలేకపోతే ఎందుకు...అనే మనస్తత్వం తప్ప తిట్టాడా కొట్టాడా ఏమైనా...

తిండి తినకుండా ఆరోగ్యం చూసుకోకుండా తనకి తాను చావును తెచ్చుకుంది. కాదు కాదు తాను చంపుకున్నాడు.ఇంటి చాకిరీ చేసి ఉద్యోగానికి వెళ్లినా తనకి ఒక్క పనిలో కూడా సాయం చేయలేదు... ఆడంగి పనులు అంటారని...పని మనిషి ఉన్నా గిన్నెలు తోమటం తప్ప ఇంకే పనికి పెట్టుకోలేదు. ముగ్గురు పిల్లలతో ఎంత అవస్థ పడేదో... జీతమంతా తనకే ఇచ్చేసేది నాకేం ఖర్చులుంటాయి అని... తానూ ప్రతి పండగకీ బంగారం చీర కొనేవాడులే... ప్రేమ లేకపోతే చేయడుగా... ఇరవై ఏళ్ళకి ముగ్గురు పిల్లలు... మా అమ్మ అమ్మమ్మలు కనలేదా అనుకున్నాడు కానీ ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఒకరికొకరు సాయం పైగా ఆడవాళ్ళకి చదువు అవగాహన లేని కాలం... మగపిల్లాడి కోసం ఇద్దరు కూతుళ్ళ తర్వాత ఆశపడటంలో తప్పు లేదు అనుకున్నాడు కానీ పదిహేడు పద్దెనిమిదేళ్ళకి అమ్మ అయిన అమ్మాయి ఆరోగ్యం ఏమవుతుందో చదువుకున్న తాను కూడా ఆలోచించలేదు. తన తల్లీ తండ్రీ ఆలోచించనివ్వలేదు. తాను చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నా ఇంటి పనులలో మునిగిపోయినా తన ఇంటి కోసమే కదా అనుకున్నాడు కానీ ఇరవయ్యేళ్ళ పిల్లకి పుట్టింటి మీద ఆశ ఉంటుంది చిన్న చిన్న సరదాలు ఉంటాయి అని తెలిసినా ఆ మాట ఎత్తలేదు...ఇంటి బాధ్యతలు కొంత... మగాడినన్న అహం కొంత.

 తాను నిలబడ బట్టి ఇల్లు పిల్లల పెళ్లిళ్లు చక్కగా కుదిరాయి కానీ ఎదిరించే మనిషి ఐతే సంసారం ఏమయ్యేదో. అయినా తనేమి తాగి తందనాలాడి బాధ పెట్టాడా... ఇద్దరూ ఉద్యోగాలు చేస్తేనే ఇల్లు గడుస్తుందని తాను అంటేనే కదా సరే అన్నాడు. రాత్రులు అలిసిపోయి నిద్రపోతుంటే ఎన్ని సార్లు ఇంకా దగ్గరగా తనని పొదువుకునేవాడో...కానీ ఈ చీర బావుందనో వంట బావుందనో బొబ్బట్లు నీ కోసం కూడా ఉంచానని సరదాగా తనకి తినిపించటమో ఎందుకు చేయలేదు... ఇంకో రోజు చేద్దాం అనుకునేవాడు... కానీ సముద్రంలో అలలు ఆగాక స్నానం చేస్తా అనేవాడిలాగా తాను మూర్ఖుడిని అని తెలుసుకునేలోపే కాన్సర్ తో తాను వెళ్ళిపోయింది... నలభైలకే అంత తొందర... నా కోసం ఒక రోజు ఉండచ్చుగా... కనీసం తనని హత్తుకుని కరువు తీరా ఏడ్చేసేవాడు...మగాడినని మర్చిపోయి...Rate this content
Log in

Similar telugu story from Drama