Kanthi Sekhar

Drama

4  

Kanthi Sekhar

Drama

అమ్మా...వెళ్ళొస్తా

అమ్మా...వెళ్ళొస్తా

3 mins
550


అమ్మా...


పెళ్ళైన పదేళ్లకు ఇలా రాస్తున్నా. ఇన్నేళ్ళల్లో నిన్ను అసలు నోరారా అమ్మా అని పిలవని నా అహాన్ని నువ్వు క్షమిస్తావేమో... నేను నిలువునా కాలిపోయినా నా పాపానికి పరిహారం లేదమ్మా. నీ మనసులో మాత్రం నేను ఏ పాపమూ ఎరుగని నీ పాపనే. నోర్ముయ్...గుంట కానా...ఏమిటా మాటలు అంటావు నేను ఇదే మాట అంటే...ఇన్నాళ్ళ నా మౌనం నీకు నేను కడుపులో ఉన్నప్పటి కాలాన్ని, పుట్టాక కొన్ని నెలలు ఏడుపు తప్ప మరో భాష లేకుండా నీతో ఊడిగం చేయించుకున్న రోజుల్ని గుర్తు చేసిందేమో. 


నాకు మాత్రం నువ్వు నాన్న పోయిన క్షణాన కూడా...దాన్ని పాలు అయినా తాగమని చెప్పు కావ్య...ఆకలికి ఆగలేదు అది...అని చిన్నత్త తో అంటుంటే...ఇన్నేళ్ల నా మొండితనం తో ఇంత బాధ పెట్టినా...నా కడుపు ఆకలే చూసిన నువ్వు...నలుగురు నిన్ను దయ్యంలా చూస్తున్నా పట్టించుకోకపోవటం...తల ఎక్కడ పెట్టుకోవాలి...అర్థం కాలేదు...నీ గుండెల్లో మొహం దాచుకుని ఏడ్చేసా... అప్పుడు నోరారా అమ్మా అనలేని దుఃఖం నా గొంతుని గడ్డ కట్టించేసింది.


వంద రకాల డిజైన్లు, పది రకాల మేకప్లు వేసుకుని ప్రతి క్షణం అందం మీదే నీ ధ్యాస అని నానమ్మ సతాయించినా... పని చేస్తున్నా క్లాస్ గా ఉంటావు అని నాన్న ముచ్చట పడినా...అన్నీ నేను పుట్టేదాకే...పసి కందుగా ఆకలికి నేను కేర్ మని ఏడిస్తే...అందం...అభిమానం అన్నీ వదిలేసి నన్ను ఎన్నిసార్లు పదిమందిలో అయినా రొమ్ములకు అదుముకున్నావో...


పెళ్లికి ముందు పరిచయం...ప్రేమ అనుకుని నీ మాటలు పెడ చెవిని పెట్టా...నాన్న నాకే వత్తాసు...పెళ్లి పీటల దాకా వచ్చా. నాన్న పరిస్థితి అంతంత మాత్రం. చదువు, ఉద్యోగం అండ చూసుకుని పెళ్లితో నరకం నుండి స్వర్గం చేరుతున్నట్టు అనుకున్నా. అప్పగింతలు పెట్టేటప్పుడు నాన్న నువ్వు కన్నీరు మున్నీరు చేసుకున్నా నేను మాత్రం బింకంగా అప్పుడప్పుడూ వస్తాను ఏడవకు అనేసి ఊరుకున్నా. మీకు నా పొగరు కూడా ప్రేమలా కనపడింది.


మొదట్లో కొన్నాళ్ళు బానే ఉన్నా తర్వాత డబ్బు కష్టాలు మనుషుల అసలు రూపాలు బయట పడ్డాయి. అమ్మకి కొడుకుగా, భార్యకి భర్తగా ఎటూ తేల్చుకోలేక తను మౌన మంత్రం చదివే వారు. నాన్న, నువ్వు, చెల్లెలు, తమ్ముడి చదువు, పెళ్లి బాధ్యతలు ఉన్నా అన్నీ సర్దుబాటు చేసి మాకు పెట్టి పోతలు బానే చేసినా మా అత్తగారు పంతం పడితే సర్దుకోలేక నీ మీదే అలిగేదాన్ని. చిలికి చిలికి గాలి వాన చేసి మాటలు తగ్గించాను నీతో నాన్నతో. 


మొదటి కానుపుకి నీ దగ్గరకు వచ్చి నాన్న అనారోగ్యం వల్ల నీకు పని ఎక్కువైనా నా కోసం ఏది చేయలేదు అని మూతి ముడుచుకుని ఉండేదాన్ని. పాప పుట్టింది...నాన్న మంచాన పడ్డారు...నా బిడ్డకు ఆ వాతావరణం పడదు అని నెల లోపునే నా అత్తారింటికి వెళ్ళిపోయా.నువ్వు, నాన్న ఎంత నొచ్చుకుని ఉంటారో... మిసమిస లాడే నీ రంగు, కళ కళ లాడే నీ రూపం చాకిరీ తో మసి పట్టేస్తే...ముసలి కంపు అంటూ నా పిల్లల్ని నీకు దూరం చేసా...శుభ్రత, జాగర్త అంటూ...ఏళ్ల తరబడి నా అశుద్ధాన్ని ఎత్తి పోసిన చేతులు నీవి అని మరిచిపోయి.


కన్నతల్లిని ఇలా చేసి...అత్తగారిని మరిది ఇంట్లో శాశ్వతంగా ఉండేలా చేసా...నాకంటూ గుర్తింపు ఉద్యోగం వద్దా అని పోట్లాడి... ఆ ఉద్యోగ పరమపద సోపాన పటం...ఏదో అర్థం లేని పరుగు పందెం...డబ్బుల నిచ్చెనలు ఎక్కించి...జబ్బుల పాములతో కరిపించింది. నువ్వు ఇచ్చిన బంగారు రంగు...కీమో థెరపీ తో మసకబారిన క్షణం...నా మహాపాపం నాకు కనిపించింది. తేనె పలుకులు రావాలని నువ్వు ఉగ్గులో తేనె పోస్తే...నా కటువు మాటలతో నిన్ను నొప్పించిన పాపానికి...నా గొంతు మూగబోయింది...కుంకుడు రసంతో నువ్వు శ్రద్ధగా కడిగి మందార నూనె రాసి పెంచిన నా వాలు జడ...చికిత్స వేడికి మాయం అయింది.


పెద్దమనసుతో అందరూ నాకు సేవలు సాంత్వన ఇస్తున్నా నేను ఎక్కువ కాలం ఉండను...దైవం నువ్వు పంచిన రక్తంలో బలం కూడా లాక్కోక ముందే...ఈ నాలుగు మాటలు రాస్తున్నా...నా పిల్లల్ని నన్ను ప్రేమించిన విధంగా ప్రేమించి...సంస్కారంతో పెంచుతావు ...నాకు తెలుసు...

కానీ...నిన్ను నువ్వు కోల్పోయింది చాలు...ఆరోగ్యం...మనశ్శాంతి చూసుకో. తలకు మించిన ప్రేమ చూపించక అంటాను కానీ...తల్లివి కదా...చెవిని పెట్టవు...


నిన్ను ఎంత ఉదాసీనంగా చూసినా...నేను ఇంటికొచ్చిన ప్రతీసారీ తిరిగి వెళుతుంటే నీ కళ్ళు చెమ్మగిల్లేవి. నేను ఎంత తోసి రాజన్నా నేను నిద్రపోయిన తర్వాత నా కాళ్ళ దగ్గర కునికిపాట్లు పడేదానివి. అవన్నీ నాకు తెలిసినా ఏదో నిర్లక్ష్యం...అందిన స్వర్గంలో అమృతం చవక అని ఒక కవి రాసినట్టు.


ఇన్ని రాయటంలో నా స్వార్థం ఉందమ్మా...మళ్లీ పుట్టి నీకు అమ్మని అవ్వాలని. చేసిన పాపం చెప్తే పోతుంది. ఒప్పుల కుప్పగా మళ్లీ వచ్చి...నువ్వు నాపై కురిపించిన ప్రేమ...నేను నీపై చూపించాలని...కన్నీళ్ళతో నీ కాళ్ళు కడిగే బలం...ఇప్పుడు నా కళ్ళు కోల్పోయాయి మరి...

ఇక ఉంటాను

నీ బంగారం.Rate this content
Log in

Similar telugu story from Drama