Kanthi Sekhar

Drama

4.7  

Kanthi Sekhar

Drama

మీ టూ

మీ టూ

4 mins
382


"వాణి ... వాకింగ్ కి వెళ్ళొస్తా. .." భర్త పిలుపుతో తులసి పూజ చేస్తున్నదల్లా ఆపి హాల్ లోకి వచ్చి ఆయన షూస్ వగైరా అందించి కాఫీ టీపాయ్ మీద పెట్టి మళ్ళీ పనిలో పడింది వాణి. పూలరంగడిలా ఈ వయసులో ఈయనకి ఇవేం బుద్ధులో. .. రోజు తిట్టుకుంటూనే ఉంటుంది. ఆయన ఫోన్ లో పార్క్ లో షార్ట్స్, టీ షర్ట్స్ వేసుకుని తిరిగే అన్ని వయసుల ఆడవాళ్ళ ఫోటోలు చూసినప్పుడల్లా. "అమ్మా. .. నేను రేపటి నుంచి పనికి రాను. .. సర్ చూపు మంచిగానిపిస్తాలే... బాసీన్లు కడిగినంత సేపు గాడనె మిర్రి చూస్తుంటడు . .." విసురుగా చెప్పేసి వెళ్ళిపోయింది లక్ష్మి. .. తన నెలవారీ జీతం కన్నా రెండు వందలు ఎక్కువ తీసుకుని కూడా. .. ఈమెకి ఇది కాకపోతే వేరే ఇల్లు. దానికున్న ధైర్యం నాకు లేకపోయింది. పరువు కి బానిసను. నాకు అలా కాదుగా. .. ఈ మనిషి పెళ్ళైన దగ్గర నుంచి అంతే. మొదట్లో తల్లికి తన బాధ చెప్పుకునేది. "మొగుడిని దారిలో పెట్టుకోటం చేతకాక నాకు చెప్పకు. నీ తర్వాత ఇద్దరు ఆడపిల్లలున్నారు. నీ సంసారం బాగుంటేనే వాళ్లకి మంచి సంబంధాలు వస్తాయి, " అని నూరిపోసేది. 

"చీర కొంగు దోపుకో సరిగ్గా... మీ అమ్మ వడ్డన కూడా నేర్పకుండా పంపిందా... " తాను పని చేసుకుంటుంటే కొందరు బంధువుల చూపులకి వాళ్ళని వాళ్ళ బుద్ధిని ఏమి అనలేక అత్తగారు ఆ దాష్టీకం తన మీద చూపించేది. తన తండ్రి మెతక మనిషి, పుట్టింట్లో గంపెడు సంసారం కావటం తో అన్నీ మౌనంగా భరించటం అలవాటు చేసుకుంది. "మొగుడిని కొంగున కట్టుకోవటం ఆడదాని చేతుల్లో ఉంటుంది" తల్లి మాటలు విని తన ప్రయత్నం తాను చెయ్యాలనుకున్నా వావివరసలు లేని అతని ప్రవర్తన తో అతని అహంకారపు వెకిలి చేష్టలతో ఆమె మనసు చచ్చిపోయేది ప్రతి రోజు. తాను నైటీ వేసుకుంటే కొరకొరా చూసేది అత్తగారు. కానీ తన భర్త పని మనుషులు లేదా బంధువుల వంక చొంగ కారుస్తూ చూసినా మగపిల్లాడి తల్లిని అనే గర్వము, చూసి చూడనట్టుండే నిర్లక్ష్యం ఆవిడలో స్పష్టంగా కనపడేవి వాణి కి.

పిల్లకి ఆ కరాటే క్లాస్ లు అవసరమా. ..అని మందలించేవాళ్ళు తల్లీకొడుకులు. అవేం చెవిని పెట్టకుండా తాను అనుకున్నది చేయగలిగింది, ఒక ప్రభుత్వ సంస్థ లో తన ఫామిలీ కౌన్సిలర్ ఉద్యోగంతో, సైకోలజీ చదువు ఇచ్చిన ధైర్యంతో . కూతురిని ధైర్యంగా సంస్కారంగా పెంచగలిగినా మొగుడి బుద్ధి ఆమెకి కొరకరాని కొయ్యగానే ఉండిపోయింది. ఎదుటి వాళ్ళకే ధైర్యం చెప్పగలను కానీ సమాజం కుటుంబం అనే సంకెళ్లను దాటి నేనేం చేయగలను అని నిర్లిప్తంగా ఉండిపోయేది. తన భర్త తనకి ఆర్ధికంగా లోటు చేయకపోయినా అతని పక్క చూపులు పెడబుద్దులు ఆమెకి సంసారం మీద జీవితం మీద తెలీకుండానే నిర్లిప్తత పెంచాయి. కూతురు కోసం ఇష్టం లేని కాపురాన్ని నెత్తిన వేసుకుంది. బయట వాళ్ళు వేధిస్తే కేసు లు పెట్టగలం కానీ కట్టుకున్న భర్తే మనసుకి ఇష్టం లేని నరకం రోజు చూపిస్తే ఎవరికేం చెప్పాలి. .. సమాజం, మహిళా సంఘాలు నాలుగు రోజులు హడావుడి చేసి మర్చిపోతారు. .. అల్లరి అయ్యేది తాను తన కూతురి జీవితాలే కదా. .. అని తిరగబడాలనుకున్న ప్రతి సారి వెనుకడుగు వేసేది. రెండేళ్లు పక్క సీట్ లో ఉండి , సీనియర్ ఉద్యోగి గా , తనకు మర్యాదగా పని నేర్పిన వ్యక్తి, ఒక రోజు అదోలా చూస్తూ మీకు పెళ్లయిపోయింది కానీ. .. అని వంకరగా మాట్లాడినా ఏమి చేసింది తాను. .. వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేయించుకోవటం తప్ప. నలుగురికి మంచి దారి చూపే తానే సమస్యకి భయపడితే. .. సామాన్యుల పరిస్థితి ఏమిటి. .. ఇలాంటి ఆలోచనలు వచ్చినా వెంటనే తుంచేసి యాంత్రిక జీవితంలో పడిపోయేది. 

కూతురి పెళ్లి అయి విదేశాలకు వెళ్ళాక తనకి ఒంటరి తనం మరింత పెరిగి క్షణం ఒక యుగంగా గడవటం మొదలయింది. ఇప్పుడు ప్రత్యేకంగా ఒంటరితనం పోగొట్టుకోవడానికి వ్యక్తిత్వ వికాసం క్లాస్లు చెప్పటం మొదలు పెట్టింది. అయినా తన పనిలో తన జీవితం లో తనకు సంతృప్తి లేదు. ఒక రోజు ఒక తండ్రి సుమారు ముప్పయ్యేళ్లు వయసున్న అబ్బాయిని కౌన్సిలింగ్ కోసం తీసుకొచ్చాడు. ఆ కేసు సారాంశం అతను తన కొలీగ్ ని వేధించటం తో ప్రేమించమని వెంట పడటం తో అతని పై ఫిర్యాదులు, ఫలితం విడాకులు, ఈ అబ్బాయి ఉద్యోగం ప్రయత్నాలు చెయ్యకుండా నిస్పృహ లో ఉండిపోవటం తో తల్లితండ్రులు నచ్చజెప్పి తీసుకొచ్చారు తన దగ్గరికి. ఒక వైపు ఏహ్యభావం కలుగుతున్నా అతనికి తన వృత్తి ధర్మంగా నాలుగు మంచి మాటలు చెప్పటం మొదలుపెట్టింది. అతని నుండి పెద్ద స్పందన లేదు ఒకటి రెండు సెషన్స్ అయినా. మంచిగా అతన్ని మారిస్తే అతన్ని అస్తమాను చూసే చికాకు తప్పుతుందని తన కౌన్సిలింగ్ ని మరింత లోతుగా చేయటం మొదలు పెట్టింది. ఒకటి రెండు సార్లు తండ్రితో వచ్చినా ఈసారి ఒక్కడే వచ్చాడు. కొంచెం బెరుకు తగ్గినట్టుంది అనుకుని మాములుగా లోకాభిరామాయణం మొదలు పెట్టింది. 

ఇదివరకు తను జర్నలిస్ట్ గా పని చేసేవాడినని, ఒక అసాంఘిక కార్యక్రమాలు జరిగే ఫార్మ్ హౌస్ గురించి రాసే క్రమంలో ఒక అమ్మాయి పరిచయం అయిందని, చాలా విషయాలు చర్చించుకోవటంతో వారి మధ్య పరిచయం సాన్నిహిత్యం పెరిగాయని, తన ప్రతి ఆర్టికల్ కు ప్రోత్సాహకర సమీక్షలు రాయటం, క్రమంగా ఆ అమ్మాయి వ్యక్తిగత విషయాలు కూడా చెప్పుకునేది అని, తాను స్నేహంగా చూసింది ఆ అమ్మాయి వేరేగా అనుకుంది అని , ఆఫీస్ లో నెమ్మదిగా తన గురించి చెడుగా అనుకోవటం మొదలై, వ్యవహారం భార్య దాకా వెళ్ళటం తో పరిస్థితి విడాకుల దాకా వెళ్లిందని ఉద్యోగానికి తానే రాజీనామా చేసి వచ్చేసానని చెప్పుకున్నాడు. కొన్ని సార్లు తను రాసే లైంగిక వేధింపుల కేసు లు, ఆడపిల్లల అక్రమ రవాణా, పని చేసే చోట ఆడవాళ్లపైన వేధింపులు వాటికి సంబంధించిన వార్తలు చివరికి నీరుగారిపోవటం, చాలా కేసుల తీర్పులు న్యాయం ఆలస్యం కావటం మీద అసంతృప్తి వెలిబుచ్చాడు. ఇతన్ని తాను తప్పుగా అనుకున్నాను అన్పించింది వాణి కి. వ్యక్తి మాటల్లో నిజాయితీ ఎంత అనేది అంచనా వేయటం ఆమె అనుభవం ఆమెకు అందించిన విద్య. 

తన భార్య తో కలవటం మీద అభిప్రాయం అడిగినప్పుడు నమ్మకం లేని బంధాలు దూరం కావటమే మంచిది అన్న అతని అభిప్రాయం విని ఆమెకు ఎక్కడో కలుక్కుమంది మనసులో. ఒక పిల్లవాడికి తీపి తినటం మానేయమని చెప్పే ముందు తానూ తీపి తినటం మానేసిన రామకృష్ణ పరమహంస కథ గుర్తుకు వచ్చింది ఆమెకు. అతనికి ఉద్యోగంలో తిరిగి చేరమని ప్రేరణ కలిగే మాటలు చెప్పి వేరే మానసిక వైద్యుడికి రెఫెర్ చేసి పంపేసింది వ్యక్తిగత కారణాలతో ఈ కేసు హేండిల్ చేయలేను అని. 

తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో సగం ఒక అనాథ శరణాలయానికి రాసి ఇచ్చేసి ఎప్పటికి మార్పు రాని భర్తకు దూరంగా సంస్థనే తన ఇల్లు అనుకుని జీవించటం మొదలుపెట్టింది...ఆ రచయిత లాంటి ఎందరో పిల్లల్ని తీర్చి దిద్దే పనిలో. .. మనస్ఫూర్తిగా. .. క్షణం తీరిక లేకుండా. .

లైంగిక వేధింపులు స్త్రీలకైనా పురుషులకైనా తీరని వేదనని మిగులుస్తాయి. మౌనంగా భరిస్తూ ఉండటం కంటే ధైర్యంగా ఎదిరించినపుడే కొన్ని అరాచకాలు అయినా అరికట్టబడతాయి. చాల వరకు వేధింపు కేసులలో తెలిసినవారే నేరస్థులు గా రుజువైతే. ..కొందరు స్వార్ధం కోసం తప్పుడు ఫిర్యాదులు చేస్తారు. మార్పు మన నుండి మొదలు అవ్వాలి. దానికి చేయాల్సిన అతి కష్టమైన పని, మౌనాన్ని భయాన్ని వదిలేయటం. 



Rate this content
Log in

Similar telugu story from Drama