నా ఇల్లు నా ఇష్టం
నా ఇల్లు నా ఇష్టం
అలారమ్ లో కోడి తెగ కూస్తోంది ఐదు అయిందని సూచనగా... పది నిముషాలు పడుకుంటా. అమ్మో... పది నిముషాలా.... పది గంటల పని ఆగిపోతుంది పడుకుంటే... ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారిని తలచుకుని దేవుడిని కూడా తలుచుకుని మంచం మీద నుంచి కాళ్ళు కింద పెట్టా. కస్సున తాకింది దుమ్ము. బంటు రీతి కొలువీయవయ్య రామ... (త్యాగరాయ కీర్తన...కొత్త బాలకృష్ణ సినిమా లోది కాదు ) అప్రయత్నంగా గొంతు దాటింది. అబ్బా.. మొదలెట్టావా...కాకి గోల... ఇరవైలో అరవైల పాటలు పనులు... ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవు కదా... నేను వెళ్ళిపోతే ఇంకేం పని నువ్వు బాగానే రెస్ట్ తీసుకుంటావ్. ఆ టైములో పాడుకోవచ్చుగా... గదమాయించారు పెళ్ళికి ముందు నాది కోకిల కంఠం అని వెంట పడి పెళ్లి చేసుకున్న శ్రీవారు. ఆఫీస్ టెన్షన్ లే మనకిది మాములేగా అనుకుని చీపురు అందుకున్నా వాకిలి ఊడవటానికి.
"మీ ఇంట్లో ఇలాగే చేస్తావా... మగాడు పడుకున్న గదిలోకి చీపురు పొద్దున్నే తీస్కెళ్లకూడదని తెలీదా..." వాకిలి, హాల్ ఊడ్చేసాక బెడ్ రూమ్ కి చీపురు పట్టుకెళ్తుంటే అత్తగారి మందలింపు. వంట గది ఆవిడ సామ్రాజ్యం. పెళ్ళై ఆరేళ్ళయింది కానీ నన్ను వంటిల్లు కడిగి శుభ్రం చేయనిచ్చింది చాలా తక్కువ. మా అత్తగారు మా మరిది గారి ఊరు వెళ్తే తప్ప ఆ అవకాశం నాకు రాదు. సరే అత్తమ్మా... మాట్లాడకుండా స్నానానికి వెళ్ళిపోయా. కాఫీ పని చూడాలన్నా మా ఇంట్లో స్నానాలు అవ్వాల్సిందే. లేకపోతే నేను మా అమ్మ ఇంట్లో ఎలా పెరిగానో ఒక దండకం అవుతుంది మరి. మాట పెళుసు కానీ మనిషి మంచావిడే... పిల్లలు లేరని ఎవరైనా నన్ను అంటే కస్సున లేస్తారు వాళ్ళ మీద... "అదేం ముసలిదైపోయిందా... మొన్నేగా పెళ్లయింది మా వాడికి..." అంటూ...
ఉద్యోగం చేసి వచ్చి చేసుకోలేక పని మనిషిని పెట్టుకుందాం అనుకుంటే..."మనింట్లో మనం చేసుకున్నట్టు పని వాళ్ళు చేస్తారా అమ్మాయి, ముగ్గురు మనుషులకి పని మనిషి ఎందుకట... ఆ మెషిన్ బట్టలుతుకుతుంది... నాలుగు గదులు చిమ్ముకుని రెండు గిన్నెలు కడగటానికి కూడా వేలకి వేలు పొయ్యాలా.. ఇద్దరాడాళ్ళం ఉన్నాముగా... " అనేస్తారు. చాదస్తం ఎక్కువే కానీ ఆవిడన్నదీ నిజమేగా.. ఆ పిల్ల రాకపోతే చేసుకోవటం చిరాకు పడటం కంటే ఇదే నయం అని అలవాటు పడిపోయా. స్నానం చేసాక పక్క సర్దటం, ఇల్లు ఊడవటం ఆవిడకి నచ్చదు. వంటలో కూరలు తరగటం తప్ప ఇంకేం చేయనివ్వదు. నా ఇల్లు కూడా ఇది, పెద్దావిడని ఇబ్బంది పెట్టద్దు అనుకుంటా అయినా నాకే అష్టోత్తరాలు అవుతాయి.బియ్యే చదివినా మొగుడికి బియ్యం ఏరి వండిపెట్టాలి అని మందలించి పనులు నేర్పేది మా నానమ్మ. అలా చదువు పనులు రెండూ ఇష్టాలు అయ్యాయి నాకు. కానీ మరీ ఇంత చాదస్తాలు లేవు. ప్రతి పనికి వెనుక శాస్త్రము కారణం చెప్పగలరు ఆవిడ. ఆవిడ ఏమంటే దానికి పిల్లిలా విని నా పని నేను చేసుకోవటం అలవాటు చేసుకున్నా. నలభై ఏళ్ళ క్రితమే ఆవిడ బియ్యే మరి... మా అమ్మ కూడా ఆవిడకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా నిన్నేం ఆరళ్ళు పెట్టే మనిషిలా లేదు చాదస్తం అంతే సర్దుకుపోవాలి అంటుంది. ఆరేళ్ళ మా సంసార జీవితం అలా సజావుగా(?) సాగిపోతోంది.
వాట్సాప్లో ఒక మెసేజ్ చూసి చిర్రెత్తుకొచ్చింది నాకు అంత పని హడావుడిలోనూ. ఒక తండ్రి అత్తగారి ఇంట్లో ఆరళ్ళు పడ్డ కూతురికి అత్తగారిని చంపటానికి స్లో పాయిజన్ ఇచ్చి ఒక నెల రోజులు ఆవిడతో ప్రేమగా ఉంటూ ఈ
మందు వాడమంటాడు. నెల రోజులలో వాళ్ళ అత్తగారు మంచిదే అని తెలుసుకున్న కోడలు తండ్రిని విరుగుడు అడిగితే... అది మందు కాదు... పటికబెల్లం పొడి అని... అత్తగారితో ప్రేమగా ఉండమని చెప్పి మందలించి పంపిస్తాడు. ప్రతి కథలోనూ కోడలిని అత్తకి శత్రువులా చూపించేవాళ్ళు ఇద్దరూ ఒకే మనిషి కోసం జీవితాంతం శత్రువులు అవుతారు అని ఎందుకు అర్ధం చేసుకోరో.... నమ్మి వచ్చిన అమ్మాయిని బాగా చూసుకోవాలని మగాళ్ళకి చెప్పరెందుకో...
సాగిపోతున్న నా ఆలోచనలకి మా వారి ఫోన్ కాల్ బ్రేక్ వేసింది. మా అమ్మకి షుగర్ డౌన్ అయి పడిపోయిందని ఆ ఫోన్ సారాంశం. ఆదరా బాదరాగా ఆఫీస్ లో లీవ్ చెప్పి ఊళ్ళోనే ఉన్న మా పుట్టింటికి వెళ్ళా. అమ్మ మామూలుగానే లేచి తిరుగుతోంది. వదిన ఇచ్చిన కాఫీ అందుకున్నా. చేదు కషాయంలా అన్పించింది. మా ఇంట్లో(?) తీపి తక్కువ వేస్తాం రమ్యా...వదిన మాటలు ఇంకా చేదుగా అనిపించాయి.
అన్నం తింటుంటే నా కన్నా ముందు భోజనం అయిపోయిందని నా ముందు నుంచే అన్నయ్య వదిన ప్లేట్స్ తీసి సింక్ లో వేయటం గదిలోకి వెళ్ళిపోవటం ఏంటోలా అన్పించింది. తొందరగా తినవే బాబు అని ఒక పక్క నన్ను రోజూ తిడుతున్నా నా కోసమే కబుర్లు చెపుతూ మెల్లగా తినే అత్తయ్య గుర్తొచ్చి మధ్యలోనే లేచి వచ్చేసా ఇంక. ప్రేమ కన్నా ద్వేషం కన్నా అలవాటు ప్రమాదం అంటారు :)
ఆ రాత్రి అక్కడే పడుకుంటా (వచ్చేస్తే బాగోదు కదా అనుకుంటూ ) అని మా వారికి ఫోన్ చేశా. పడుకున్నా కానీ ఆలోచనలతో అది కలత నిద్రే అయ్యింది. ఐదింటికే అలారమ్ లేకపోయినా మెలకువ వచ్చింది ఎందుకో... ఇల్లు వాకిలి పని పిల్ల వచ్చి తుడుస్తుందని ఎక్కడి చెత్త అక్కడే ఉండటం గమనించాను. చీపురు పట్టుకుని తుడుస్తుంటే అమ్మ లేచింది. కాఫీ తెస్తా అని వంటింట్లోకి వెళ్ళిపోయింది. మునుపటిలా నాకు కబుర్లు చెప్పలేదు. పెద్దతనంలే... పైగా బాలేదు అని సర్దుకున్నా. "మీ వదినకి సెలవు లేదు రా... మీ నాన్నగారు నన్ను చూసుకుంటారులే.. అయినా అస్తమానం ఏమి పడిపోనుగా ... నువ్వు ధైర్యంగా ఉండు. "కాఫీ అందిస్తూ అంది అమ్మ.
"స్నానం చేసి మా ఇంటికెళ్ళొస్తానమ్మా... "అమ్మకి మా ఇంటికెళ్ళొస్తా అని చెప్పటానికి ఈ సారి దిగులు రాలేదు ఎందుకో. కాలం అన్నీ మార్చేస్తుందంటే ఇదేనా అనుకున్నా... రెండు రోజులు నా దగ్గర అమ్మని ఉంచు అన్నయ్యా... అన్నాను ఉండబట్టలేక. "అక్కడ నేను ఉన్నా నువ్వు సెలవు పెట్టుకుని ఉండలేవు మీ అత్తగారితో చేయించుకున్నా బాగోదు...అంతగా ఓపిక లేనప్పుడు వస్తా లేరా... బాగానే ఉన్నాగా..." అమ్మ మాటలకి ఎందుకో దిగులు అనిపించలేదు. ఎవరి ఇల్లు ఎవరి స్వతంత్రం వాళ్ళదిలే... అనుకుని స్కూటీ స్టార్ట్ చేశా అందరికి వీడ్కోలు చెప్పి.
ఇంటికెళ్ళేసరికి గుమ్మం దగ్గర నా కోసమే కుర్చీ వేసుకుని కూర్చున్నారు అత్తమ్మ. అదేమిటే ఒక రోజుకే మా వాడి మీద బెంగా... మొహం పీక్కుపోయింది... మీ అమ్మగారు బాగున్నారా... అప్పుడే వచ్చేసావే...రెండు రోజులుండి చూస్కోవాల్సింది ఆవిడని...వాడు తొందరగా వెళ్లాలని ఇందాకే బయల్దేరాడు ఆఫీస్ కి. ఫ్లాస్క్ లో కాఫీ టేబుల్ మీద పెట్టా... తెచ్చుకో తాగుదాం... అధికారం లోనూ అభిమానం కనపడింది ఆవిడ గొంతులో. అప్పుడు అనిపించింది... నేను గమనించలేదు కానీ... "నేను పుట్టింట్లో యువరాణి కావచ్చు కానీ... మెట్టినింట్లో మహారాణి ని" అని.