పెళ్లిరోజు
పెళ్లిరోజు


ఎంతో సందడిగా భూమిక పెళ్ళి జరుగుతుంది. కొంచెం సేపట్లో పెళ్ళికొడుకు ఆమె మెళ్ళో పసుపుతాడు కడతాడనగా... "ఈ పెళ్లి ఆపండి" అంటూ...పెళ్ళికొడుకు తండ్రి గర్జించాడు గట్టిగా.
సందడిగా ఉన్న మండపం స్తబ్దుగా అయిపోయింది.
వెంకట్రావు పెళ్ళికొడుకు తండ్రి చేతులు పట్టుకున్నాడు. "దయచేసి నా కూతురు పెళ్ళాపకండి. దాని జీవితం నాశనం చేయకండి. మీకు అందాల్సిన మొత్తం కొన్నాళ్ళకైనా మీ చేతుల్లో పెడతాను"....అంటూ ఎంతగా అభ్యర్థిస్తున్నా.... అతని మనసు కరగలేదు.
పెళ్ళికొడుకు తండ్రి ఆజ్ఞతో...
పెళ్ళికొడుకుతో పాటూ...మగ పెళ్ళివారంతా లేచి నుంచున్నారు.
అదే సమయంలో ముహూర్తం కావడంతో... ఎక్కడినుంచి వచ్చాడో ఓ యువకుడొచ్చి అందరూ చూస్తుండగా...భూమిక మెళ్ళో మూడుముళ్లు వేసేసాడు. అతనే ఆకాష్.
ఆ హఠాత్పరిమాణానికి అంతా నివ్వెరపోయారు.
ఒకరితో పెళ్ళాగిపోయి... వేరొకరితో పెళ్లి జరిగిపోయింది. ఎవరూ ముక్కూ మొఖం తెలియని వ్యక్తి వచ్చి తాళి కట్టినందుకు సంతోషించాలో...విచారించాలో అర్థం కాలేదు పెద్దలందరికీ.
* * * * *
&n
bsp;ఆరోజు పీటల మీద పెళ్ళాగిపోకుండా ఎంతో ఆదర్శవంతంగా తనను పెళ్లి చేసుకుని...తన జీవితంలో అడుగుపెట్టిన తన భర్త ఆకాష్ తన దృష్టిలో మాంగళ్యాన్ని ప్రసాదించిన దేవుడు. ఎన్ని జన్మల పుణ్యఫలమో ఇలాంటి మనిషి నాకు భర్తగా రావడం. అందుకే ఎన్నోసార్లు తలుచుకుంటూనే ఉంటుంది తమ పెళ్లిరోజుని భూమిక.
ఆకాష్ కూడా పెళ్లిరోజుని మర్చిపోలేడు. తాను చేసిన పని తెలిస్తే...అల్లుడుగా వారింట్లో నా స్థానం ఏంటని గుర్తుతెచ్చుకుంటూనే ఉంటాడు భారంగా.
బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన వెంకట్రావు చేతిలోని క్యాష్ బాగ్ ని ఎంతో చాకచక్యంగా మోటార్ బైక్ మీద స్పీడ్ గా వెళ్తూ...కొట్టేసాడు ఆకాష్. ఆ బాగ్ లో ఐదు లక్షల రూపాయలతో పాటూ...బ్యాంక్ పాస్బుక్ ...అతని కూతురు పెళ్లి కార్డులు చూసి...ఎంతగా చలించిపోయాడో. ఎంతో అవసరమై మొదటిసారిగా ప్రయత్నించిన ఆ దోపిడీ సొమ్మును వాడుకోడానికి మనసు అంగీకరించలేదు. పాపం ఆ ముసలి ప్రాణి ఎంత కష్టపడితే తన కూతురి పెళ్లి కుదుర్చుకున్నాడో...? ఇప్పుడు ఈ డబ్బులేక ఏమవస్థలు పెడతారో ఏమో...? తానెంత పెద్ద తప్పు చేసాడో తనకు తెలిసొచ్చింది. ఆ నేరాన్ని భరించలేక తిరిగి అతనికి డబ్బు అందిచేయాలనే నిశ్చయానికొచ్చి... శుభలేఖలోని అడ్రసు ప్రకారం ఆ పెళ్లిమండపానికి వెళ్ళాడు. సరిగా అదే సమయానికి కట్నం కోసం పీటల మీద పెళ్లి ఆగిపోవడం చూసి... భూమికను పెళ్ళిచేసుకుంటే...ఆడబ్బు తన అవసరానికి వాడుకున్నా...వారి కుటుంబానికి కూడా న్యాయం చేసినవాడినే అవుతానని మనసుకు సర్ది చెప్పుకుని ...అసలు నిజాన్ని భార్యకు కూడా చెప్పకుండా తనలోనే ఇముడ్చుకోవాలనుకున్నాడు.