నువ్వు నేను ఓ గోమాత
నువ్వు నేను ఓ గోమాత
ఇదిగో సీతాలు. పెద్ద దాన్ని కాబట్టి చెబుతున్నాను.
శుక్రవారం వచ్చిందంటే పెద్ద వీధిలో వాళ్ళంతా నీ కాళ్ళకు పసుపు రాస్తారు.
ముఖాన కుంకుమ పెట్టి నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
బియ్యమో, పండో లేదా తీపి పదార్థాలు వాళ్ళ చేత్తో నీకు తినిపించి మ్రొక్కుతారు.
ఇదిగో సీతాలూ వింటున్నావా. లక్ష్మి కొమ్ములు ఎత్తి చూసింది.
సీతాలు వింటున్నా అన్నట్టు తల ఊపింది.
ఆ వీధిలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లే. చెత్త మొత్తం ఇళ్ళ మధ్యలో వేసి మాకేం తెలీదు అని చోద్యం చూసే వాళ్ళు ఎక్కువ.
మీ అమ్మ సావిత్రి కూడా ఆ ప్లాస్టిక్ కవర్లు తిని ఆరోగ్యం చెడిపోయి చనిపోయింది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్లాస్టిక్ కవర్లు తినకు.
ఆ మనుషులు మనల్ని గోమాత అని పూజిస్తారు. కానీ తొందరగా భూమిలో కలిసిపోని ప్లాస్టిక్ వాడొద్దు అంటే వినరు. ఆహారాన్ని ప్లాస్టిక్ కవర్లలో విదిరేస్తారు. అన్నీ కలిసిపోయి ఉంటాయి. మనమేమో ఆకలేసి ఆ ప్లాస్టిక్ కవర్లని కూడా వాటితో కలిసి తినేస్తున్నాం. లేని పోని వ్యాధులు తెచ్చుకుంటున్నాం.
జాగ్రత్త సుమా అంటూ ప్రేమగా తన నాలుకతో సీతాలు తల నిమిరింది.
సీతాలు కళ్ళలో అభిమానంతో లక్ష్మి వైపు చూసింది.
