పల్లె తల్లి
పల్లె తల్లి


చాన్రోజులు అయ్యింది ఊరికొచ్చి. పొద్దున్నే అట్టా తోట కాడికి పొయ్యి మాడి కాయలు (మామిడి కాయలు) చూసి నడుసుకుంటా వస్తాన.
పల్లె సూస్తా ఉంటే ఏయ్యో గ్యాపకాలు. అంతా పాతగానే అవుపడతాది. కానీ ఏందో కొత్త. కొత్తంటే ఎల్లాగంటే అమ్మ పాలు కాకుండా డబ్బా పాలు తాగే కొత్త.
వాకిండ్లేసిన ఇండ్లు. అద్దో సంక్రాంతి ఇద్దో ఉగాది
ఇంగెప్పుడు గుట్ట కింద తిన్నాల అని లెక్క వేసుకుంటూ ఆ కొన్ని దినాలకు వచ్చి పొయ్యే మడుసుల గ్యాపకాలు గురుతు సేసుకుంటున్న ముసలి పానాలు.
గంటకో రెండు గంటలకో పల్లె మొదుటి కాడ ఉండే రోడ్డు మీద ఆగే బస్సు కొట్టే హారన్ శబ్దాలు.
రోంచేపు రావి చెట్టు అరుక్కాడ కూసున్యా. పల్లెలో ఇంకా అందాలు వుండాయి అని అనుకుండే వాళ్ళ కోసం సర్దుబాటు చేసుకుంటున్న పల్లె తల్లి కనపడినాది.
ఏందిమ్మా ఇదీ అంటే ఎవురు ఇంటారుబ్బీ నా బాధలు ఈ రోజు పోతే మల్లా మొలకల పున్నానికే గదా నువ్వొచ్చేదైనా వొచ్చ
ే పొయ్యే ఓల్లకు నా బాధలు సెప్దునా. టవున్లో బాధలు పడి వొచ్చి నా ఒళ్ళో తల పెట్టుకునే ఓల్ల మనసుకు ఇంగా కట్టం పెడుదునా. అందుకే ఇట్టా కుశాలగున్నట్టే వుంటా అంది.
ఎంత కట్టంగా వున్యా ఎవురాన్నా ఇంటికి వస్తే సాలు. కాపీ అన్నా తాగున్నా. దోసెలేస్తా ఉండుయ్యో. ఈ మిక్చరీ అన్నా తినగుడదా అని మర్యాదలు చేసే మా అమ్మ జ్ఞప్తికి వొచ్చింది.
ఎన్ని రోజులుమ్మా ఇట్టా అన్యా నేను. పల్లె తల్లి మొగంలో ఏదో తెలీని ఇశ్వాసం.
మల్లా మడుసులు నాకాడికే వొచ్చే వరకూ అంది.
ఎంత నమ్మకమమ్మా నీకూ అంటే అమ్మను గదా బిడ్డల గురించి నాకు తెలవదా నాయినా అని పొలిమేర వైపు పొయ్యింది ఎవురో బస్సులో వొస్తాండ్రు అని.
గుట్ట మింద గుళ్ళో గంట టంగుమని మోగింది. ఏమో గుళ్ళో సివుడు తథాస్తు అంటాడేమో.
ఓబ్బా. ఏంది ఇంగా నిద్దర. లెయ్యి. పిల్లోలకి మాడికాయల తోట సూపిస్తానంటివే అని నా పెండ్లాం అనేతలికి ఈ లోకంలోకి వొచ్చినట్లయ్యింది.