M.V. SWAMY

Abstract

3  

M.V. SWAMY

Abstract

హోలీ... డోలీ

హోలీ... డోలీ

3 mins
11.7K


హోలీ.... డోలీ


       బిర్సా హోలీ ఆడటానికి మిత్రులు కోసం గూడెం మొత్తం తిరిగాడు.హోలీ ఆడటానికి ఎవరూ ముందుకు రాలేదు.పండగ రోజు సరదా సందడి లేకపోతే ఎలా !కనీసం రంగులు జల్లుకోడానికి కూడా ఈ గూడెం వాళ్ళకి ఆసక్తి లేదా! లేక రంగులు కొనుక్కోడానికి డబ్బులు లేవా! అన్న సందేహం బిర్సాకి వచ్చింది.అసలు హోలీ రంగులు అమ్మే దుకాణం ఈ గూడెంలో లేదేమో అన్న సందేహంతో గూడెంలోని దుకాణాలు వద్దకు వెళ్లి ఆరా తీసాడు. హోలీ పండుగ రంగులు అన్ని దుకాణాలులోనూ దొరుకుతున్నాయి కానీ గూడెంలో ఎవ్వరూ కొనడం లేదని తెలుసుకున్నాడు.


     బిర్సా గూడెంలో పుట్టినా నగరంలో ఉండి చదువుకుంటున్నాడు. బిర్సా తాతయ్య రైల్వేలో పనిచేస్తుండటం వల్ల బిర్సా తాతయ్య ఇంట్లో ఉండి ఇంగ్లీష్ మీడియం చదువులు చదువుతున్నాడు, తాతయ్య ఇంట్లోనే బిర్సా కుటుంబం ఉంటుంది. మూడు రోజులు స్కూల్ కి సెలవు పెట్టి పెద్దమ్మ ఇంటికి గూడెం వచ్చాడు బిర్సా. గిరిజన ప్రాంతంలో హోలీ సహజ రంగులతో సంప్రదాయబద్దంగా ఆడుతారని, దింసా నృత్యాలు చేస్తూ ఆనందంగా ఉంటారని ఊహించాడు కానీ అక్కడ అలా జరగడం లేదు.


        బిర్సా నిరాశతో ఇంటికి చేరాడు, ఇంట్లో పెద్దమ్మ కూడా కాస్తా విచారంగా కనిపిస్తుంది.'పెద్దమ్మా హోలీ పండుగ రోజు గూడెంలో ఆట పాటలు లేవు, పిల్లలు పెద్దలు అందరూ విచారంగా కనిపిస్తున్నారు ఎందుకు' అని అడిగాడు బిర్సా తన పెద్దమ్మని. పెద్దమ్మ బిర్సాని తన ముందు కూర్చోబెట్టుకొని అటుకుళ్లు బెల్లం పాలు కలిపిన పచ్చి పాయసం ఇచ్చి 'బిడ్డా ముందు ఈ పాయసం తాగి కుదుటపడు నీకు ఒక ఇషయం చెప్పాల'అని అంది.


       బిర్సా అటుకులు పాయసం తాగి పెద్దమ్మ చెప్పబోయే విషయం గురుంచి ఆసక్తిగా చూసాడు. 'ఏమీలేదు బిడ్డా వందేళ్లు క్రితం మైదానం ప్రాంతం నుండి ఒక పంతులు గారి కుటుంబం ఈ గూడెం వచ్చి ఇక్కడే స్థిర పడింది. ఆ కుటుంబమే ఇక్కడ చదువులు బడి నడిపింది. ఆ బడిలో చదువుకొనే ఈ గూడెంలో చానా మంది పెద్ద పెద్ద ఉద్యోగాలు పొందారు. మీ తాతయ్య కూడా అలాగే చదువుకొని ఉద్యోగం పొందాడు. పంతులు గారి కుటుంబం చదువు,నాగరికత చెప్పి వూరిని బాగు చెయ్యడమే కాదు, వైద్యం చేసి ఇక్కడ మూడ నమ్మకాలు పోగొట్టి జబ్బులు నయం చేస్తుండేది.కొన్నాళ్ళకు ఆ కుటుంబం నుండి అందరూ నగరానికి వలసపోయారు కానీ ఒక్క మనిషి మాత్రం ఇక్కడే మాతోనే ఉండిపోయాడు.అతనే శివయ్య ఇప్పుడు శివయ్య దగ్గర డబ్బులేదు, అతని గురుంచి బంధువులు పట్టించుకోరు, అతడు గూడెం వీడిపోడు అతని ఆరోగ్యం బాగా క్షిణించి పోయింది.అతనికి చావు ఈ రోజో రేపో అన్నట్లు ఉంది. అందుకే అతని మీద అందరూ దిగులుతో హోలీ పండగకు దూరంగా ఉన్నారు'అని చెప్పింది పెద్దమ్మ.


      బిర్సా వీధిలోకి వచ్చి శివయ్య ఇల్లు ఎక్కడుందో తెలుసుకొని వెళ్ళాడు, ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. కిటికీ నుండి బిర్సా చూసాడు. శివయ్య మట్టి కుండల్లో రంగులు కలుపుతున్నాడు. బిర్సా ఆశ్చర్యపోయాడు, బిర్సాని గమనించిన శివయ్య ఇంటి తలుపులు తీసి, 'బిడ్డా నువ్వు పట్టణం నుండి వచ్చినట్లు వున్నావు, ఈ గూడెం పిలకాయలతో హోలీ ఆడతావా!' అని అడిగాడు. ఇంతలో కొంతమంది గూడెం పిల్లలు అక్కడకి చేరారు. బిర్సా కుండలో రంగు నీళ్లు డోకెతో తీసి గూడెం పిల్లలపై జల్లాడు అంతే గూడెం పిల్లలకి శివయ్య సైగ చెయ్యగా ఆ పిల్లలు బిర్సాతో హోలీ ఆడారు. ఊర్లో పెద్దలు, యువతీయువకులు అక్కడకు చేరుకొని హోలీ సరదాగా ఆడారు. ఒక గంట తరువాత బిర్సా గూడెంకి దగ్గర్లో ఉన్న పెద్ద ఊరు వెళ్లి తాతయ్యకు ఫోన్ చేసాడు.


             రెండోరోజు బిర్సా గూడెం యువకులు సాయంతో ఒక డోలీలో శివయ్యను కూర్చోబెట్టి గూడెంకి మూడు కిలోమీటర్ల దూరంలో తాతయ్య ఏర్పాటు చేసిన అంబులెన్స్ లోకి శివయ్యను మార్చాడు.అంబులెన్స్ కొన్ని గంటల్లో నగరం చేరింది. బిర్సా తాతయ్యతో పాటు గూడెం నుండి నగరం వచ్చి ఉద్యోగాలు,ఉపాదులు పొందిన వారు ఆసుపత్రి దగ్గరకు వచ్చి శివయ్యను పలకరించి,అతన్ని అత్యవసర వార్డులో చేర్చారు.


           వారం రోజులు తరువాత శివయ్య పూర్తి ఆరోగ్యంతో గూడెం చేరాడు.అతనికి వయసుతో పాటు వచ్చిన నీరసం తప్ప జబ్బు ఏమీ లేదని వైద్యులు చెప్పారని తెలిసి గూడెంలో సంబరాలు జరిగాయి. అప్పుడు మరోసారి హోలీ ఆడారు గూడెంవారు.శివయ్య గురుంచి తెలుసుకొని అతని బంధువులు నగరం నుండి వచ్చి కొన్నాళ్ళు అక్కడే గూడెంలోనే ఉండి అతనికి సపర్యలు చేసి ధైర్యం చెప్పి వెళ్లారు.శివయ్య బిర్సాకి ధన్యవాదాలు చెప్పాడు,'నా హోలీకి...నీ డోలీతో బదులిచ్చావు సెహబాస్'అని మెచ్చుకున్నాడు. బిర్సా శివయ్యకు వినయంగా నమస్కరించి అతని ఆశీస్సులు తీసుకొని నగరానికి బయలుదేరాడు.


Rate this content
Log in

Similar telugu story from Abstract