M.V. SWAMY

Classics Inspirational

4.2  

M.V. SWAMY

Classics Inspirational

సంస్కారవంతులు

సంస్కారవంతులు

3 mins
366


సంస్కారవంతులు (కథ)

………………………………………………….

"లక్ష్మీ ఒక నెల రోజులు వరకూ పనిలోకి రాకు"అని పనిపిల్ల లక్ష్మికి ఫోన్ చేసి చెప్పింది సరోజమ్మ.

"ఏమమ్మగారూ...ఏమైంది! మీరేమైనా ఊరెలుతున్నారా!" అని అడిగింది పనిపిల్ల లక్ష్మి.

"లేదు లేదు ఊరెళ్ళడం లేదు,ఇంట్లోనే ఉంటాను కానీ నువ్వు రావద్దులే,నా పనులు నేనే చేసుకోగలను"అని అంది సరోజమ్మ.

"ముందు నాకీ విషయం చెప్పండి, నా పని మీకు నచ్చడం లేదా! నేను ఎక్కువ జీతం అడిగానా! లేదా ఈ మధ్య వారం నుండి మా తమ్ముడు పెళ్లి పనులు వల్ల సెలవు పెట్టి మీ ఇంటి పనిలోకి రాలేదనా! లేదా మీకు వేరే పని పిల్ల దొరికిందా! ఏదో ఒకటి చెప్పండి! నేను ఎందుకు పనిలోకి రాకూడదు"అని అడిగింది లక్ష్మి.

"నీకు నేను చెప్పింది అర్ధం కావడం లేదా! ఒక నెలరోజులు మాత్రమే రావద్దు అన్నాను, దాని అర్ధం తరువాత రావచ్చు అనే కదా! ఇంకా ఎక్కువ ప్రశ్నలు వేసి విసిగించకు కావాలంటే నువ్వు రాకపోయినా ఈ నెల జీతం ఇచ్చేస్తానులే"అంది సరోజమ్మ

"నాకు సూటిగా చెప్పండి మీకు ఏమైంది! నేను పనిలోకి రాకపోతే మీకు సాయం ఎవరు చేస్తారు, మీ పిల్లలందరూ వేరే దేశాల్లో వున్నారు, మీరా ఒక్కరే వుంటున్నారు, చుట్టం బంధువులు ఈ కరోనా కాలంలో రారు,నేనూ మీకు తోడు లేకపోతే ఎలా!" అని అంది లక్ష్మి.

"నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదే…నువ్వు రాకూడదంటే రాకూడదు, ఇంకా మారు మాటాడకు" అంటూ ఫోన్ కట్ చేసిసింది సరోజమ్మ.

ఈసారి పని పిల్ల లక్ష్మియే ఫోన్ చేసింది,"అమ్మగారూ ఫోన్ కట్ చెయ్యకండి, మీరు ఫోన్ కట్ చేస్తే నామీదొట్టు,అమ్మా! మీకు ఏమైంది! అసలు నాకు సెలవు వద్దు పెళ్లి పనులు మధ్యలోనే వచ్చి మీ ఇంట్లో పనిచేసేస్తానంటే, వద్దులే తమ్ముడు పెళ్లి కదా!సమయం కుటుంబంతో గడుపు అని మీరే చెప్పారు కదా!"అని అంది.

"అది కాదమ్మా! లక్ష్మీ...నాకు కోవిడ్ పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది,పెద్దగా ఇబ్బందులు లేవు కానీ ఇంట్లోనే ఉండి మందులు వాడుతూ జాగ్రత్తలు తీసుకోమని డాక్టర్లు చెప్పారు, మా పిల్లలు అమెరికా నుండే నాకు భోజనాలు, మందులు, ఇంకా నాకు కావల్సినవన్నీ ఆన్ లైన్ లోనే బుక్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు డాక్టర్లుతో మాట్లాడి, వీడియోలు ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించి ట్రీట్మెంట్ చేయిస్తున్నారు, ఇక నీ అవసరం ప్రస్తుతానికి లేదు కదా!"అని అంది సరోజమ్మ.

"అంతమాత్రాన నా అవసరం మీకు లేదా!" ఇలాంటప్పుడే ఒక తోడు మీకు ఉండాలి, నాలుగు సరదా మాటలాడి మీరు కరోనా గురుంచి మర్చిపోయేటట్లు చెయ్యాలి, నాకు మీ ఇంట్లో చెయ్యడానికి పనిలేకపోయినా నేను ఉదయం సాయింత్రం వస్తాను"అని అంది లక్ష్మి.

"చెప్పింది అర్ధం చేసుకో… నువ్వు పిల్లలతో వున్నావు ఇంట్లో పెద్దవాళ్ళు వున్నారు,నువ్వు ఇక్కడకు వచ్చి, ఈ జ్వరాన్ని మీ ఇంటికి మోసుకుపోతే వాళ్లకి ప్రమాదం కదా!అందుకే నిన్ను రావద్దన్నది, మరో ఉద్దేశ్యం కాదు"అంది సరోజమ్మ.

"సరే మా ఇంట్లో పెద్దవాళ్లకు,ఆ జ్వరం వస్తే నేను తప్పించుకొని పారిపోను కదా! నాకు మీరూ మా ఇంట్లో పెద్దవాళ్ళతో సమానం అందుకే మీకు కష్టం వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒంటరిగా వదలలేను"అంది లక్ష్మి.

"నువ్వు చెప్పిన మాట వినవు, నీ పట్టుదల నీదే! సరే నువ్వు వస్తే నా గదికి తలుపులు వేసేస్తాను, ఒకరి నొకరు చూసుకోకుండానే మాట్లాడుకుందాం"అంది సరోజమ్మ.

"అలాగయితే నేనెందుకు మీ ఇంటికి రావాలి ఫోన్లోనే మాట్లాడుకోవచ్చు కదా!"

"మరెలాగే… నువ్వు నా దగ్గర్లోకి రాకూడదు",అని అంది సరోజమ్మ.

"మీ దగ్గర,మీ ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఆ జ్వరం సోకకుండా ఎలా ఉండాలో నాకు తెలుసుగానీ, నేను మీ ఇంటికి వస్తాను, మీకు ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలో ఉంటాను, ఇంట్లో పనులు చేస్తాను, మీకు కనిపిస్తూనే ఉంటాను కులశా కబుర్లు చెబుతాను, త్వరగా మీ జ్వరం తగ్గేటట్లు చూస్తాను"అంది నవ్వుతూ లక్ష్మీ.

"సరే తల్లీ నీ ఇష్టం కానీ నీకూ ఒక పెద్ద కుటుంబం ఉందని దాన్ని సురక్షితంగా ఉంచవలసిన బాధ్యత నీపై ఉందని మాత్రం మర్చిపోకు"అని అంది సరోజమ్మ.

"సరేనమ్మా! సరిగ్గా అరగంట తరువాత మీ ఇంట్లో ఉంటా"అంటూ నవ్వుతూ ఫోన్ కట్ చేసింది లక్ష్మి.

"ఆర్ధిక స్థాయి ఏదైనా… లక్ష్మీ లాంటి కొంతమంది మనుషులు మంచి మానవ సంబంధాలకు ప్రతీకలు"అని మనసులోనే అనుకుంటూ...లక్ష్మి ఇంట్లోకి వస్తే తన నుండి లక్ష్మికి కరోనా వైరస్ సోకకుండా తాను తీసుకోవలసిన జాగ్రత్తలు తాను తీసుకోవడంలో నిమగ్నమయ్యింది సరోజమ్మ.

……………………………………………….


       ఎం వి స్వామి 9441571505



Rate this content
Log in

Similar telugu story from Classics