M.V. SWAMY

Children Stories

4  

M.V. SWAMY

Children Stories

ఆటలో అరటిపండు…!"(కథ)

ఆటలో అరటిపండు…!"(కథ)

3 mins
376


   "ఆటలో అరటిపండు…!"(కథ)

………………………………………………….


  ఒక వెన్నెల రాత్రి ఒక అడవిలోని మృగరాజుకి ఒక చక్కటి ఆలోచన వచ్చింది.వెంటనే అడవి జీవరాశి మొత్తాన్ని ఒక సుందర మైదానంలో సమావేశపరచి,"ఈ వెన్నెల వెలుగులో మనమందరమూ మన స్థాయిని, విభేదాలను శతృత్వాన్ని కాసేపు మరిచిపోయి చక్కగా సరదా ఆటలాడుకుందాం,హాయిగా నవ్వుకుందాం,ఈ ఆటల సందర్భంగా ఇక్కడ చెట్టు చేనులకు,మొక్కా మోడులకు,జీవరాశికి ఏ చిన్న అపకారమూ జరగకూడదు,ఇది నా విన్నపం,ఆటలో ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా,నా విన్నపానికి వ్యతిరేకంగా ప్రవర్తించినా నా ఆగ్రహానికి గురికావలసి వస్తుంది,నన్ను నమ్మి అందరూ ఏ భయమూ,బిడియమూ లేకుండా ఈ రాత్రంతా ఉత్సాహంగా ఆటపాటలతో గడపండి,ఇవి మనకు పండగ క్షణాలు అనుకోండి"అని అంది.

  మృగరాజే స్వయంగా ఆటపాటలకు అనుమతిస్తూ, హింసకు తావులేకుండా క్రీడాస్ఫూర్తితో సరదాగా కాలక్షేపం చెయ్యండని సూచనలు చెయ్యడం,ఆ ఆటపాటలు స్వయంగా అతని పర్యవేక్షణలోనే జరుగుతాయి అని ప్రకటించడంతో జంతువులు,పక్షులు,క్రిమికీటకాలు పెద్దా చిన్నా తేడాలేకుండా,కౄరమృగం,సాధుజంతువన్న బేధం లేకుండా సరదాగా ఆటపాటలు ప్రారంభించాయి.

   కొంతసమయం గడిచిపోయిన తరువాత ఆటపాటలకు కాస్తా విరామం ప్రకటించి,"ఆటపాటలతో మీరంతా బాగా అలసిపోయివున్నట్లు వుంది,అందుకే కాస్తా విరామం తీసుకొని నేనూ మన మిత్రులు కొందరు ఏర్పాటుచేసిన చిన్న విందును ఆరగించండి,పానీయాలు స్వీకరించండి"అంటూ ఆ ఆటస్థలంలోకి రకరకాల పండ్లు,కూరగాయలు,ఆకులు,దుంపలు, పండ్లరసాలు,మంచినీరు తెప్పించింది మృగరాజు.

   అంతలో ఒక కుందేలు వచ్చి"మృగరాజా! నామిత్రుడు,నా తోటి కుందేలు ఒకటి ఆటపాటలతో నాతో సరదా కాలక్షేపం చేస్తూ…కాస్తా కునుకు తియ్యడానికని ఈ హడావిడికి దూరంగా ఆ పొదల్లోకి వెళ్లి తిరిగి రాలేదు, చాలా సమయం క్రితమే వెళ్లిన ఆ కుందేలు ఈ ఇంకా తిరిగి రాకపోవడంతో నేను ఆందోళనగా చెంది,ఆ పొదల్లో దగ్గరకు వెళ్లి నా మిత్రుని గురుంచి చూడగా నా మిత్రుడు అక్కడ లేడు,నా మిత్రునికి ఏదో ప్రమాదం జరిగివుంటుందని నా అనుమానం,దయచేసి నా మిత్రుని ఆచూకీ గురుంచి ప్రయత్నం చెయ్యండి"అని కోరింది. వెంటనే మృగరాజు కొన్ని జంతువులను కుందేలు వెళ్లిన పొదల పరిసరాల వైపు పంపి దాని ఆచూకిని తెలుసుకోమంది.ఆ జంతువులు తిరిగి వచ్చి ఆ పరిసరాల్లో కుందేలు లేదని మృగరాజుతో చెప్పాయి. అక్కడున్న జీవరాశి ఆందోళనలో ఉండగా ఒక నక్క వచ్చి"ఆ కుందేలు ఆటలో అరటిపండు అయిపోయి వుంటుంది"అని అంది వెకిలిగా నవ్వుతూ.."అంటే మీ ఉద్దేశ్యం!"అని నక్కను ప్రశ్నించింది మృగరాజు. "ఏముంది!ఆటపాటల్లో మనం ఆదమరిచి ఉండగా ఇరుగుపొరుగు అడవుల్లోంచి ఏవో మృగాలు వచ్చి పొదల్లో మాటువేసి కుందేలును ఎత్తుకుపోయి వుంటాయి"అని అంది నక్క నిర్లక్ష్యంగా…మృగరాజు కాసేపు మౌనం వహించి...

    "మిత్రులులారా!ఆ కుందేలును వెదికి తెచ్చే బాధ్యతను,భరోసాను నాపై వదిలేసి మీరు మరలా మీమీ ఆటపాటల్లో నిమగ్నమవ్వండి"అని అంది.మృగరాజు సూచన ప్రకారం అక్కడ ఆటపాటలు తిరిగి మొదలుకాగా,కాసేపటికి తప్పిపోయిన కుందేలు ఆటస్థలంలో ప్రత్యక్షమయ్యింది."ఏమైంది మిత్రమా ఇంత సమయం ఎక్కడ వున్నావు,అసలు ఏమి జరిగింది!"అని తోటి జీవులు కుందేలును ప్రశ్నించగా…

    "నేను కునుకు తియ్యడానికి పొదల్లోకి వెళ్లిన వెంటనే ఒక మృగం వచ్చి నా నోట్లో ఆకులు కుక్కి నా కాళ్ళు కట్టేసి ఒక పాడుబడిన గుహలోకి మోసుకుపోయి అక్కడ పడేసి,'ఇప్పుడు నిన్ను చంపి తినడానికి నాకు సమయం లేదు,ఎందుకంటే మృగరాజు నిఘాలో మనం వున్నాం, పొరపాటున ఈ విషయాన్ని మృగరాజు పసిగడితే,నన్ను శిక్షిస్తుంది అందుకే రేపు నిన్ను చంపి నిదానంగా తింటాను' అని వెళ్ళిపోయింది,మరి కాసేపటికి ఒక పెద్ద జంతువు గుహలోకి వచ్చి నా కాళ్లకు వున్న కట్లు విప్పేసి,నా నోట్లో వున్న ఆకులు తీసేసి,'మిత్రమా నువ్వు నిశ్చింతగా పోయి నీ మిత్రుల ఆటపాటల్లో కలిసిపో'అని చెప్పింది,ఆ దట్టమైన పొదలు గుహల్లో చీకటిగా ఉండటంతో నన్ను బంధించిన మృగాన్ని,నన్ను విడిపించిన జంతువునూ నేను పోల్చుకోలేకపోయాను"అని అంది కుందేలు. "కుందేలును బంధించిన మృగం ఎవరు!విడిపించిన జంతువు ఏది!"అని అక్కడ చర్చ జరుగుతుండగా

    "ఏది ఏమైనా కుందేలు కథ సుఖాంతమైంది,మన కుందేలు మన వద్దకు సురక్షితంగా వచ్చేసింది,ఇక ఆ చర్చను వదిలేసి నిశ్చింతగా ఆడుకోండి"అంది చిన్నగా నవ్వుతూ మృగరాజు…అంతలో ఒక ఎలుగుబంటి వచ్చి "మృగరాజా! కొన్ని క్షణాల ముందు వరకూ ఉత్సాహంగా హస్య ఛలోక్తులు పలికిన మన మిత్రుడు నక్కకి ఆకస్మికంగా ఒంటినిండా గాయాలయ్యాయి,అడుగుతీసి అడుగువెయ్యడమే దానికి కష్టంగా వుంది,ఏమి జరిగింది! అని అడిగితే అది నోరు మెదపడం లేదు"అని అంది. "కుందేలు కథ సుఖాంతమయ్యిందని అనుకుంటుండగా, ఇంతలో ఈ నక్కకేమైంది!"అని మళ్ళీ అక్కడ చర్చ మొదలవ్వగా…"ఏముంది!ఈ నక్కే కదా!ఆటలో అరటిపండు సామెతను వెటకారంగా చెప్పింది,అలాగే ఈ నక్క వెటకారాలకు ఒళ్ళు మండి,ఇది ఒంటరిగా ఉన్నపుడు చూసి,ఏ మృగమో చీకటిలోకి తీసుకుపోయి చెంపలు వాయించి వుంటుంది,అంతే కదా మిత్రమా!"అని అంది మృగరాజు నక్క వైపు చూసి."ఖచ్చితంగా అంతే మృగరాజా!"అని ఒంటి నొప్పుల బాధతో కిర్రోమొర్రో అనుకుంటూ అక్కడనుండి నెమ్మదిగా వెళ్ళిపోయింది నక్క.

  అప్పుడర్ధమయ్యింది ఆ జీవరాశికి నక్కే కుందేలుని బంధించిందని,అది గ్రహించిన మృగరాజు నక్కకు నాలుగు పంజా దెబ్బలు వేసి కుందేలును విడిపించిందని, అయినా వాటి మధ్య మరి చర్చ జరగలేదు,మృగరాజుపై మరింత భరోసా పెరిగి తమ ఆటపాటల్లో మునిగిపోయాయి అవి.

…………………………………………………….

         మీగడ వీరభద్రస్వామి 


Rate this content
Log in