ప్రకృతి పర్యావరణం పరమేశ్వర రావు కుటుంబం
ప్రకృతి పర్యావరణం పరమేశ్వర రావు కుటుంబం
ప్రకృతి పరమేశ్వరరావు పర్యావరణ కుటుంబం(కథ)
………………………………………………….
అపార్ట్మెంట్ మొత్తం పక్షుల అరువులుతో దద్దరిల్లింది. ఉడతలు,తొండలులాంటి చిన్న చిన్న జీవులు హడావుడిగా అటూఇటూ తిరుగుతున్నాయి.అపార్ట్మెంట్ వాసులు ఇళ్లనుండి బయటకు వచ్చి"ఈ రోజు ఏమైంది ఈ మూగజీవాలకు కేవలం మన అపార్ట్మెంట్లోనే హడావడిని సృష్టిస్తున్నాయి"అని చర్చించుకొని పరిపరి విధాలుగా మాట్లాడుకున్నారు..
"టెర్రాస్ మీద ఏవైనా పక్షులు చనిపోయి ఉంటాయి" అని కొందరంటే,కోతి,కుక్కలాంటి జంతువేదైనా అపార్ట్మెంట్ పైన మేడమీద చనిపోయి ఉంటాది,అందుకే పక్షులు అలా అరుస్తున్నాయి"అని మరికొందరు అన్నారు."వాతావరణంలో హఠాత్తుగా ఏదైనా మార్పు వస్తే ఇలాగే ప్రవర్తిస్తాయి మాగజీవాలు"అని ఇంకొందరు అన్నారు."అలాగైతే మన అపార్ట్మెంటే దొరికిందా వీటికి,మిగతా అపార్టుమెంట్స్ వద్ద ఈ హడావిడి లేనట్లు వుందికదా!"అని అన్నారు చాలామంది."అదేమీ లేదు కరోనా కాలంలో వీటికి ఆహారం సరిగ్గా దొరికుతున్నట్లు లేదు,పైగా మనలాగే వీటికి పనీపాటు లేనట్లుంది కదా! అందుకే ఏ హడావడి"అని కొద్దీమంది నిర్లక్ష్యంగా అన్నారు.
"ఇక్కడ ఇంత జరుగుతున్నా…!మన వృక్షమిత్ర కం పక్షిమిత్ర కం జంతుమిత్రి టోటల్ గా పర్యావరణ మిత్ర కనిపించడేంటి!ఇంతకీ ఆయనెక్కడున్నాడు"అని వెటకారంగా జోక్స్ వేశారు అపార్ట్మెంట్ లోని కొంతమంది. "అవును ఆయనెక్కడ!"అంటూ పర్యావరణ మిత్ర అవార్ద్ గ్రహీత,ఆ అపార్ట్మెంట్ లో ఒక ఇంటి యజమాని ప్రకృతి పరమేశ్వరరావు గురుంచి ఆరా తీశారు అందరూ…
పరమేశ్వరరావు ఇంటికి వెళ్లి అతను గురుంచి అడగ్గా…"అతను విషయం మనందరికీ తెలిసిందే కదా!ఉదయమనగా మేడమీదకు వాకింగ్,వ్యాయామం, యోగా,మూగజీవాలకు త్రాగునీరు,తిండిగింజలు, ఆహారం అంటూ అపార్టుమెంట్లు టెర్రాస్ మీదకు వెళ్లిన ఆషామి పదిగంటలైనా ఇంటికి చేరలేదు"అని సమాధానం ఇచ్చింది ప్రకృతి పరమేశ్వరరావు భార్య.
ఉదయాన్నే చీకటితో పైకి వెళ్ళిన మనిషి ఇంతటైం అయినా ఇంకా పైనే ఉన్నాడంటే ఏదో అనుమానంగా వుందని, కొంతమంది అపార్ట్మెంట్ వాసులు టెర్రాస్ మీదకు వెళ్లారు. అక్కడ దృశ్యం చూసి వాళ్ళు అవాక్కయ్యారు.
పరమేశ్వరరావు అచేతనంగా పడిపోయి వున్నాడు, యోగా భంగిమ అని మొదట్లో అనుకున్నారు కానీ అనుమానం వచ్చి,అతని ముఖంపై కాస్తా నీళ్లు జల్లి అతన్ని మెళుకువలోకి తేడానికి ప్రయత్నం చేశారు. అతను చాలా ఇబ్బందిగా కళ్ళు తెరిచి"కాస్తా కళ్ళు తిరిగి పడిపోయాను,కాసేపు కూర్చుంటాను,పర్వాలేదు మీరు వెళ్లిపోండి"అని చాలా నీరసంగా మాట్లాడాడు.
అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న డాక్టర్ సుధకి ఎవరో విషయం చెప్పగా ఆమె పరమేశ్వరరావు వద్దకు వెళ్లి,అతని బి పి చెక్ చేశారు."సార్ కి ఒక్కసారిగా లో బి పి రావడం వల్ల కళ్లు తిరిగి పడిపోయారు,
ఇబ్బంది ఏమీ లేదు,ఇంట్లోకి తీసుకెళ్లండి,నేను సార్ ఇంటికి వెళ్లి మెడిసిన్ ఇచ్చి, తగు జాగ్రత్తలు చెబుతాను"అంది.
అంతవరకూ అరుపులు, కూతలతో హడావడి చేసిన ఆ పరిసర మూగజీవాలు, ప్రకృతి పరమేశ్వర రావు లేచి కూర్చున్న తరువాత శాంతించాయి, అతన్ని ఇంట్లోకి తీసుకెళ్లిన తరువాత మూగజీవాలు కూడా వాటి దైనందిన వ్యాపకాలు కోసం అన్నట్లు గుంపులు గుంపులుగా చెరో దిక్కుకు వెళ్లిపోయాయి.
సాయింత్రమే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అపార్ట్మెంట్ అసోషియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది, ఆ సమావేశంలో పరమేశ్వరరావుగారికి
ఘనంగా సన్మానం జరిగింది.ఆ మీటింగ్ లో మాట్లాడిన పలువురు, పరమేశ్వరరావుని అభినందించారు."నిజానికి అతని ఇంటి పేరు పరాశయం,కానీ అతను పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న సేవలను గుర్తించి జిల్లా కలెక్టర్ గారు అతన్ని ఘనంగా సన్మానించి,"ఇకపై ఇతన్ని ప్రకృతి పరమేశ్వరరావు అని పిలవడం సముచితం"అని అన్నారు అప్పట్నుంచి ఇతని పేరు ప్రకృతి పరమేశ్వరరావు అయ్యింది,మనం ఉదయం చూశాం,మూగజీవాలకూ ఇతనికి ఒక ఆత్మీయ సంబంధం ఏర్పడింది,అందుకే ఇతను కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే, అవి ఇతనికి అనుకోని ఆరోగ్య ప్రమాదం వచ్చిందని గ్రహించి, అవి ఇతనికి నేరుగా సాయం చెయ్యలేవు కాబట్టి,వాటికి తెలిసిన భాష, హడావడి ద్వారా మనకి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేశాయి,ఇదే ప్రకృతిలో సృష్టి గొప్పతనం"అని అన్నారు.
"అంతే కాదు నేను నాకు తెలిసిన పక్షి విజ్ఞాన శాస్త్రవేత్త,నా మిత్రుడు రవివర్మకు ఫోన్ చేసి, ఈ రోజు ఇక్కడ జరిగిన ఉదాంతాన్ని చెప్పాను,'మూగజీవాలు తమకు అత్యంత ప్రియమైనవారికి ప్రమాదం ఉందని గ్రహిస్తే ఇలాంటి సూచనలు చేస్తాయి, వాటికీ హృదయం వుంటుంది,విశ్వాసం ఉంటుంది, మీ పరమేశ్వర రావు ధన్యుడు వాటి అభిమానం పొందాడు'అని చెప్పాడు,అందుకే పరమేశ్వర రావు లాంటి ప్రకృతి ప్రేమికుడు మనలో ఉండటం మన లక్"అని అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహ మూర్తి అన్నాడు
"ఇకపై పరమేశ్వరరావు గురుంచి ఎవరూ హేళనగా మాట్లాడవద్దు, అందరమూ అతని చేస్తున్న మంచి పనులకు ఆర్ధికంగా, హార్ధికంగా సాయపడుదాం, అతన్ని అనుసరించి మనమూ పర్యావరణ పరిరక్షణకు మనవంతు ప్రయత్నాలు చేద్దాం, అంతేకాదు, పరమేశ్వర రావు దంపతులకు పిల్లలు లేరు,మిగతా కుటుంబ సభ్యులు దూరప్రాంతాల్లో వున్నారు కాబట్టి మనమే వాళ్లకు పిల్లలు, కుటుంబ సభ్యులులా వాళ్ళ బాగోగులు చూసుకుందాం"అని ఏకగ్రీవంగా ఆ సమావేశంలో తీర్మానం జరిగింది.ప్రకృతి పరమేశ్వరరావు దంపతులు అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులకు నమస్కారం చేసి"మీరు మాకు సాయం చేసినా చెయ్యక పోయినా … మూగజీవాలకు మాత్రం సాయపడండి, చెట్టు చేనులు పెంచండి పర్యావరణ పరిరక్షణకు కృషి చెయ్యండి"అని అందరికీ ధన్యవాదాలు తెల్పారు.
………………………………………………..
ఎం వి స్వామి...9441571505