సౌమ్యమే సర్వదా శ్రేయోదాయకం
సౌమ్యమే సర్వదా శ్రేయోదాయకం


సౌమ్యమే సర్వదా శ్రేయోదాయకం (కథ)
………………………………………………..
ఒక నగరంలో సుమన్,శేఖర్ అనే ఇద్దరు మిత్రులు వుండేవారు.ఇద్దరిలో సుమన్ శాంత స్వభావి,శేఖర్ కాస్తా కోపిష్టి.శేఖర్ కోపంలో ఏదైనా పొరపాటు చేసినా దాన్ని సరిదిద్ది అతనిలో మంచి మార్పు తేడానికి ప్రయత్నం చేసేవాడు సుమన్.
ఒక రోజు ఆట విడుపుగా ఇద్దరూ కలసి అరకు లోయవైపు షికారుకి కారులో వెళ్లారు.ఘాటీ రోడ్ ఎక్కుతున్నప్పుడు ఒక ముసలాయన ఒక డొక్కు సైకిల్ ను తొక్కుకుంటూ ఘాటీ దిగువకు వస్తున్నాడు,ఒక మలుపు దగ్గర ఆ సైకిల్ అదుపుతప్పి ఆ ముసలాయన ఘాటీ ఎక్కుతున్న సుమన్ శేఖర్ ల కారు పక్కనే పడిపోయాడు,ముసలాయనకు తృటిలో పెను ప్రమాదం తప్పింది కానీ చిన్న చిన్న గాయాలు అయ్యాయి,సైకిల్ మాత్రం కారు క్రింద పడి కొంత పాడైపోయింది.కారుపై కూడా చిన్న చిన్న గీతలు పడ్డాయి.
కారుని నడుపుతున్న శేఖర్ వెంటనే కారు దిగి ముసలాయన చెంప మీద ఒక దెబ్బవేసి దుర్భాశలాడాడు.పాపం ముసలాయన"నా వల్లే తప్పు జరిగింది,నా సైకిల్ అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శేఖర్ ని క్షమాపణ కోరాడు.సుమన్ ముసలాయనను ఓదార్చి,తనదగ్గర వున్న చేతి రుమాలుతో అతని గాయాలు శుభ్రం చేసి త్రాగడానికి నీరు ఇచ్చి,సైకిల్ బాగు చేయించుకోమని కాస్తా డబ్బులు కూడా ఇచ్చాడు.కారుకి కూడా నష్టపరిచిన ముసలాయనను ఓదార్చి సపర్యలు చేసి తిరిగి డబ్బులు ఇచ్చినందుకు సుమ
న్ పై మండిపడ్డాడు శేఖర్.
వాళ్ల అరకు ట్రిప్ ముగిసిన తరువాత తిరుగు ప్రయాణంలో శేఖర్ తన కారుని కాస్తా నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రయాణికులుతో నిదానంగా ఘాటీ పైకి వస్తున్న ఒక ఆర్ టీ సీ బస్సుని డీ కొట్టాడు.కారుకి చిన్న డామేజ్ అయ్యింది,శేఖర్,సుమన్ లకు కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి.బస్సు అద్దాలు కూడా బీటలువారాయి బస్సు ప్రయాణానికి కొంత జాప్యం జరిగింది,అయినా బస్సు సిబ్బంది,ప్రయాణికులు విసుగు చెందకుండా సుమన్ కి శేఖర్ కి సపర్యలు చేశారు.బస్సు డ్రైవర్ అప్పటికప్పుడు కారుకి మరమ్మతులు చేసి ప్రయాణానికి సిద్దం చేసాడు.
తిరిగి ప్రయాణం చేస్తూ శేఖర్ సుమన్ కి క్షమాపణ చెప్పాడు,నువ్వు ఆ సైకిల్ ముసలాయన పట్ల ప్రవర్తించిన తీరే సరైనది,నేనే అతనిపట్ల దురుసుగా ప్రవర్తించాను, ఇప్పుడు నా నిర్లక్ష్యం వల్లే మన కారు బస్సుని ఢీకొట్టింది, బస్సుకి,సిబ్బందికి,ప్రయాణికులకు ఇబ్బంది కలిగింది, నిజానికి వాళ్లే నన్ను దండించాలి కానీ వాళ్ళు అలా చెయ్యలేదు మానవీయ కోణంలో ఆలోచించి నన్ను క్షమించి మనకి సపర్యలు చేశారు,అందుకే ఇకపై నా దుందుడుకు తనం తగ్గించుకొని నీలా నిదానంగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాను"అన్నాడు. మిత్రునిలో మంచి మార్పుకు గట్టి పునాదులు పడినందుకు సుమన్ సంతోషించాడు.
………………………………………………………
ఎం వి స్వామి