ఎట్టాగయ్యా శివ శివా
ఎట్టాగయ్యా శివ శివా
రేయ్ మాధవా! మాధవా ఎక్కడున్నావ్. మాధవ తండ్రి అతణ్ణి వెతుక్కుంటూ అడవంతా కలియతిరుగుతున్నాడు.
సెలయేటి ఒడ్డు దగ్గర రావి చెట్టు. రావి చెట్టు కింద పెద్ద శివ లింగం. ఆ శివ లింగాన్ని గట్టిగా పట్టుకుని మాధవుడు కనిపించారు.
మాధవా! ఏంట్రా అమ్మ లేదని నాయిన్ని కూడా వదిలేస్తావా అని మాధవను తట్టి లేపుతున్నాడు.
మాధవ కళ్ళు తెరిచి అమ్మను వదిలిపెట్టి నేను రాను అని శివ లింగాన్ని మరింత గట్టిగా పట్టుకున్నాడు.
మాధవ తండ్రి ఇక తన వల్ల కాదని శివుడికి ఒక దణ్ణం పెట్టుకుని అడవికి బయట ఉన్న వాళ్ళ ఊరి వైపు బయలుదేరాడు.
ఏదో స్ఫురించినట్లు మాధవ తండ్రి వైపు నడిచాడు. నేనూ నీతో వస్తాను. రోజూ అమ్మకు అన్నం తీసుకు రావాలి అంటూ గబగబా నడుస్తున్నాడు.
అమ్మ లేదని చెప్పినా అర్థం చేసుకోని మాధవను చూసి బాధ పడాలో లేక శివుడినే తల్లి అని అనుకునే అతని భక్తికి ఆనందపడాలో అర్థం కాలేదు మాధవ తండ్రికి.
ఆ రావి చెట్టుకి మాత్రం మాధవ శివుణ్ణి గట్టిగా పట్టుకున్న తీరు చూసి మార్కండేయుడు గుర్తుకు వచ్చాడు.
