నేనూ, విశాఖ
నేనూ, విశాఖ
అసలెప్పుడూ అనుకోలేదు. విశాఖపట్నం వెళ్లి ఉద్యోగం చేస్తాను అని. 2021 ఏప్రిల్ లో విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చాను.
వచ్చిన వెంటనే RK బీచ్ చూశాను. రూం నుంచే సముద్రం కనిపిస్తుంటే ఎలా ఉంటుంది. ఇంతలో లాక్ డౌన్ వచ్చింది. రూం కి దగ్గరే చినవాల్తేరు కనక మహాలక్ష్మీ (దుర్గ) అమ్మవారి గుడి. పొద్దుటే గుడికి వెళ్ళి, వచ్చేటప్పుడు కూరగాయలు, టిఫిన్, సరుకులు తీసుకుని వచ్చి రూములో ఉండడం. ఇదే రొటీన్ ఇక.
మాస్టర్ చెఫ్ లాగా వంటలు వండడంలో ఆసక్తి ఎవరికైనా వస్తుంది మరి. ఎందుకంటే బయట హోటల్స్ లేవుగా. మధ్య మధ్యలో ఆఫీసు పని.
ఇక మెల్లిగా లాక్ డౌన్ ఆంక్షలు తగ్గాయి. సింహాచలం, అన్నవరం, సంపత్ వినాయకుడి గుడి, బురుజుపేట కనక మహాలక్ష్మీ అమ్మవారి గుడి, బెల్లం వినాయకుడి ఆలయం.. ఇలా చాలా ఆలయాలు వారానికి ఒకటి చుట్టేశాను. రోజూ పొద్దున్నే లేచి డాబా మీదకి వెళ్లి ఓ వైపు సముద్రం, మరో వైపు కైలాసగిరి చూస్తూ పాటలు వినడం ఓ అలవాటు చేసుకున్నాను.
ఇదే 2021 సెప్టెంబర్ లో నా తొలి తెలుగు నవల నాగనిధి అచ్చంగా తెలుగు ప్రచురణలు సంస్థ ద్వారా పబ్లిష్ అయ్యింది. ఇంగ్లీషు కవితల పుస్తకం డిసెంబర్ లో స్టోరీ మిర్రర్ వారు పబ్లిష్ చేశారు. నాన్ స్టాప్ నవంబర్ పోటీ విజేతగా నిలిచినందుకు స్టోరీ మిర్రర్ వారు కవితల పుస్తకం పబ్లిష్ చేశారు.
కొత్త స్థలంలా అనిపించలేదు విశాఖ. కానీ అరుదైన ఆనంద అనుభూతులను ఇచ్చింది. అవసరం అయినంత మేరకు మాట్లాడుతూ,మన పని మనం చేసుకుంటే చాలు. అది అర్థం చేసుకుని గౌరవించే మనుష్యులు ఇక్కడ దొరికినందుకు అలా అనిపించి ఉండొచ్చు.
ప్రయాణాలు చేయడం మనల్ని చాలా మారుస్తుంది. దూరమా, దగ్గరా అని కాదు. మనం వేసుకునే ప్రణాళిక, మనం పొందే అనుభూతులు, కలిసే మనుష్యులు, వారిచ్చే అనుభవాలు.. జీవితంలో కొత్త కోణం మనకు పరిచయం చేస్తాయి.
ఇంకా చాలా పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి. విశాఖకు దగ్గరగా. నాలో నాకు దగ్గరగా.
