ఈ వయసులో..
ఈ వయసులో..
ఏంటమ్మా డాడీ అలా డాన్స్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ అంతా చూడు. ఎలా నవ్వుతున్నారో, నా పరువు పోతోంది అన్నాడు రంజిత్.
రామ్మూర్తి ఇష్టంగా పెళ్లి ఫంక్షన్లో డాన్స్ చేస్తున్నాడు. అతని పక్కనే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా స్టెప్పులు వేస్తున్నారు.
రేయ్. ఇవే డాన్సులు ఆ టీవీషోల్లో వేస్తే రాత్రి మేలుకుని మరీ చూస్తావు. ఇప్పుడేమయ్యింది! ఆయన ఫేవరెట్ హీరో పాటకి డాన్స్ చేశాడు. అందులో తప్పేముంది అంది సుజిత కొడుకుకు సమాధానంగా.
సరే అమ్మా. కానీ ఈ వయసులో.. అదీ అందరూ చూస్తుండగా.. అని నసిగాడు రంజిత్.
ఇప్పుడేం చూశావురా.. ఆయన మా పెళ్లి కాకముందే జాతీయ స్థాయిలో సంప్రదాయ నృత్య రీతుల మీద ప్రదర్శన ఇచ్చారు. నేనూ ఆయన్ని అలాంటి వేదిక మీదే చూశాను.. అని చెబుతోంది సుజిత.
అబ్బా. ఇంక చాల్లేమ్మా. మీదే పెద్ద సాగరసంగమం సినిమా అన్నట్టు చెబుతావు అని విసుక్కున్నాడు రంజిత్.
నాట్యం, గానం ఇలా ఎలాంటి కళ అయినా భగవంతునిలో లీనమయ్యే ఒక త్రోవ చూపిస్తాయి. డాన్స్ చేస్తున్నంత సేపూ చూసి ఆనందించి తరువాత అవి చేసే వాళ్ళని మనకంటే తక్కువగా చూడడం మన సమాజం నేర్పిన ప్రవర్తన.. సుజిత ఎన్నో చెప్పడానికి ప్రయత్నించింది.
రంజిత్ ఇక అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు..
