Raja Ivaturi

Drama Tragedy

4.8  

Raja Ivaturi

Drama Tragedy

తెనాలి సూరమ్మ

తెనాలి సూరమ్మ

3 mins
397


అవ్వ గారు!ఆవిడ అసలు పేరు తెనాలి సూరమ్మ అట. 

ఆరోజులలోబాల్య వివాహానికి బలి అయిన ఒక పదేళ్ల బాలిక గా మా తాత గారి దగ్గరికి, ఊరికి పెద్ద గా ఏదో న్యాయం చేస్తాడని ఎవరో తీసుకు వచ్చారు. తాత ఆ పిల్లని తనే సాకుతానని నిర్ణయం తీసుకున్నాడు. మొదటి రోజు ఈ ఇంట్లో భోజనం చేసినపుడు అంతవరకూ పచ్చళ్ళతో కడుపు నింపుకున్న ఆ పిల్ల మొదటి సారి రెండు కూరలూ, పప్పూ, రోటి పచ్చడి, పులుసు, పెరుగులతో భోజనం చేసింది. 

ఆ రోజో మర్నాడో ఆవిడ వంటింటిని తన సామ్రాజ్యంగా చేసుకుంది. ఆ ఊళ్ళో ఆవిడ వండిన తిండి తినని వారెవరూ లేరు. పిల్లలు లేని ఆవిడకి పిల్లలంటే ఎంతో అభిమానం. మా అమ్మ, పిన్ని కూడా ఆవిడ వళ్ళో పెరిగారు. తర్వాత నేనూ మా తమ్ముళ్లూ మరెందరో. ఆవిడ చిలకా చిలకా అని రెండు వేళ్ళు ఆడిస్తుంటే ఇంకా మాటలు రాని నేను పడీపడీ నవ్వేవాడ్ని. ఎంత మందిని పెంచినా ఆవిడకి మొట్టమొదట వళ్లోకి తీసుకున్న మా పిన్ని (ఆవిడ భాషలో గౌరి భావతి మా అందరికీ గౌరి ప్రభావతి) అంటే ప్రాణం. 

కొన్నేళ్ల తర్వాత గ్రామంలో బాల వితంతువులకి కొన్ని సెంట్లు భూమి ఇచ్చి డబ్బులిస్తాం అంటూ ఎవరో ఆవిడ గురించి వచ్చి అడిగే వరకూ ఆవిడ పేరు తెనాలి సూరమ్మ అని తెలియదు. మా అందరికీ ఆవిడ అవ్వ గారే! ఆవిడని ఎక్కడెక్కడో వేలి ముద్రలు వెయ్యమని వాళ్ళు ఆరా తీస్తుంటే ఆ ఊరి కరణం "ఓరి చవట ల్లారా! దేవుడి లాంటి ఆయన నీడ లో ఆవిడకి ఇంత కంటే ఘనంగా వెళ్ళిపోతోంది. ఈ ఉపకారం ఇంకెవరికైనా చేస్తే వారికి ఉపయోగం" అని తేల్చేశారు. 

ఆవిడ అలాగే మా ఇంట్లో అరవై ఏళ్ళు ఉండిపోయారు. పిల్లలకి ఏమీ ఇవ్వకపోతే ఆవిడకి విపరీతమైన కోపం వచ్చేసేది. జ్వరం వచ్చిందండీ ఈ చిరు తిళ్ళు వద్దు అని కట్టడి చేస్తే బియ్యం బదులుగా జీళ్ళూ బిళ్ళలూ ఇంకా ఏవేవో చిరుతిళ్ళూ పిల్లలకోసం తెచ్చేసేది. అందరికీ ఆవిడంటే ప్రేమ కనుక ఎవరూ పరుషంగా మాటాడలేక కిరాణా కొట్టుల్లో ఆవిడకి ఏసరుకులూ ఇవ్వద్దని చెప్తే, ఇంకేమీ చేయలేని ఉక్రోషంతో శాప నార్థాలు పెట్టేది. 

"నాకు పొలం డబ్బులు వస్తాయి కదా! అప్పుడు నేను నా పిల్లలందరినీ నాతో తీసుకుపోతాను" అనేది. ఆ కోపం లోనే కొత్త కరణం దగ్గరికి వెళ్లి తన పింఛనూ ఎప్పుడు వస్తుందని ఆరా తీసేది. వాళ్ళు నవ్వుకుంటూ వస్తుందండీ మేము చెపుతాం అనేవారు. 

మేము కొంచెం పెద్దయ్యాక ఎప్పుడైనా మాకంటే చిన్న పిల్లలని ఏడిపించినపుడు కూడా "ఇలా అయితే నా డబ్బుల్లో నీకు ఒక్క పైసా కూడా ఇవ్వను" అనేది. 

కూతురికి కుదరని అనారోగ్యం వచ్చి మా పిన్ని రోజూ కష్ట పడుతోందని గ్రహించాక ఆవిడ ఈ ఇంటికొచ్చిన ఇన్నేళ్ల జీవితంలో మొదటి సారి ఏడిచింది. 

మరి అందుకో మరెందుకో ఒక రోజు ఉదయం నాలుగు గంటలకే మండాల్సిన పొయ్యి వెలగలేదు. ఎప్పుడూ ఓపిగ్గా తిరిగే అవ్వ గారు పడుకుని జ్వరంతో మూలుగుతూ మొదటి సారి కనిపించింది. వైద్యులు చూసి పెదవి విరిచారు. వయసు మీరిపోయిందనీ ఇంక ఆవిడ బతికే అవకాశం లేదని చెప్పేసారు. పల్లెల్లో కట్టుబాట్ల ప్రకారం ఆవిడని అరుగు మీదికి మార్చమంటే ఆవిడ చేతుల్లోనే పెరిగిన మావయ్య కోపం తో ఊగిపోయాడు. 

"తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకుంటాం తప్ప ఆవిడ ఇంట్లోంచి కదలదు" అని ఖచ్చితంగా చెప్పేసాడు. 

అవ్వగారు తిండి తినటం మానేశారు. రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో నిశ్శబ్దంతో కూడిన విషాదం. దాదాపు అరవై రోజులు తిండి తినకుండా మంచం మీదే ఉన్న అవ్వగారికి మరణం రావటం లేదు. వైద్యులు కూడా ఆశ్చర్య పోతున్నారు. మాట కూడా మాట్లాడలేని ఆవిడ ముఖంలో ఏదో ఎదురు చూపు కనిపిస్తోంది. ఆవిడ కెంతో ఇష్టమైన పిన్ని ని తీసుకోస్తే కనీసం చూడను కూడా చూడలేదు. ఆవిడ పెంచిన వారంతా వచ్చి వాళ్ళ పిల్లలనీ పెళ్లాలనీ మొగుళ్ళనీ చూపించారు. అయినా ఆవిడలో కదలిక లేదు. 

మరో రెండు వారాలు అలాగే గడిచాయి. 

ఇంతలో పొద్దున్న పదకొండు గంటలకి ఎవరో తలుపు కొట్టి "తెనాలి సూరమ్మ ఎవరండీ?" అని అడిగాడు. 

"మీరెవరు" అని నేనడిగే లోపలే "నేను వితంతు పింఛను పధకం అధికారిని. ఆవిడకి వంద సెంట్లు భూమీ ఇరవై వేల రూపాయల పింఛనూ మంజూరు అయ్యింది. ఆవిడ వేలి ముద్ర కావాలి" అన్నాడు. 

"ఈ పరిస్థితుల్లో ఎలా ...." అని మావయ్య చెప్పబోతుంటే అవ్వగారిలో కదలిక కనిపించింది.

బలహీనమయిన కంఠంతో "ఈ స్థలము డబ్బూ గౌరి భావతికి ఇచ్చెయ్యి నాయనా!" అని వేలిముద్ర కోసం చేతిని నెమ్మదిగా ఎత్తింది. 

ఆ అధికారి ఆవిడ వేలి ముద్ర తీసుకుని ఆవిడ వైపు చూసే సరికే ఆవిడ ప్రాణం పోయింది.

"దుర్మార్గుడా! నేను ఈ నాటకం వద్దంటూనే ఉన్నాను. నాద్వారా నువ్వే ఆవిడ ప్రాణం తీసావు" అన్నాడు అధికారి వేషం లో వచ్చిన నా స్నేహితుడు.

అప్పటికే విషయం అర్ధం చేసుకున్న మావయ్య అన్నాడు "పరవాలేదు బాబూ! ఆవిడ ప్రాణం పోయినా ఆవిడ ఆప్యాయత కి జీవం పోసావు."

కన్నీళ్లతో అందరూ తలాడించారు. 



Rate this content
Log in

Similar telugu story from Drama