Raja Ivaturi

Drama Tragedy Others

4  

Raja Ivaturi

Drama Tragedy Others

చేదు నిజం

చేదు నిజం

3 mins
255


విమానం లోనికి వెళ్ళటానికి సిద్ధం కమ్మని ప్రకటన వినగానే అంబలి కోసం వరుసలోకి దూసుకుపోయే నిరుపేదల్లా ప్రయాణీకులు తోసుకోవటం మొదలుపెట్టారు. విమానం వారిని వదిలి ఎక్కడికీ పోదని,  లోపల వారి స్తానం వారికే ఉంటుందని తెలిసినా కొన్ని నిముషాలు వేచి ఉండటానికి ఓపిక లేని వారు, లోనికి పోవటానికి వారి వంతు ఇంకా రాలేదని సహాయకులు వారిస్తున్నా వినకుండా ముందుకు చొచ్చుకుపోతున్నారు. నేను కూర్చోవాల్సిన స్తానం విమానం ప్రవేశించే దగ్గరే ఉంది కనుక నేను ఆఖరు బ్యాచ్ లో వెళ్లాలని నాకు తెలుసు. అక్కడే కూర్చుని తాపీగా వార్తా పత్రిక చదువుకుంటూ నాకున్న ఈ పాటి తెలివితేటలు మరెవరికైనా ఉన్నాయా అని పక్కకి చూస్తే నా లాగే మరొక వ్యక్తి కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉన్నాడు. 

అప్పుడే కళ్ళు తెరిచి నావైపు చూడగానే నేనూ అటే చూస్తున్నానని గ్రహించి పలకరింపుగా నవ్వాడు. 

"మిమ్మల్ని లండన్ లోనే చూసాను. హైదరాబాద్ కి వస్తున్నారని ఇప్పుడు తెలుస్తోంది" అన్నాడతను నా పక్కకి వచ్చి కూర్చుంటూ. 

"అవునండి. సెలవులకి ఇంటికి వెళ్తున్నాను. మీరు కూడా అంతేనా లేక ..."

"అబ్బే లేదండీ. నేను ఏకంగా ఇంటికి వెళ్తున్నాను." వెలిగిపోతున్న ముఖంతో చెప్పాడతను. 

"మీ ప్రాజెక్ట్ అయిపోయిందా?"

"ప్రాజెక్ట్ ఏమీ లేదండి. నేను గత కొన్నేళ్లుగా ఆ దేశానికి సంబంధించిన వ్యాపారం మొత్తం మా సంస్థ తరపున నిర్వహించాను. ఇప్పుడు కుటుంబంతో గడపటానికి మన దేశం వెళ్ళిపోతున్నాను" అన్నాడు. 

"మరి అక్కడ ఏం చేస్తారు? మీ వయసు చూస్తే చిన్నవారిలా ఉన్నారు? ఇంత మంచి స్థాయిలో పని చేసుకుని ఇంకా లండన్ లోనే సంపాదించచ్చు కదా!" అన్నాను ఆశ్చర్యంగా. 

"మాకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయేలా సంపాదించేశానండీ. ఇంక అక్కడే మరో ఉద్యోగంలో ఉంటూ తగినంత సమయం నా పెళ్ళాం పిల్లలతో గడుపుతాను. వాళ్ళు ఎదిగాక నేను వాళ్ళతో గడిపిందే తక్కువ. ఆ దేశంలో ఉద్యోగపరం గా నేను తిరుగుతూ ఉంటాను కనుకా, పిల్లల చదువులు మన దేశం లోనే బావుండటం వలనా అందరం అక్కడ కలిసి ఉండే అవకాశం లేదు" అన్నాడతను. పేరు శ్రీను. 

"చాలా చిత్రంగా ఉందే. కుప్పలుగా వస్తున్న డబ్బులు వదులుకుని ఇంటికి పోతున్నాడు. బహుశా ఇతను నిజం చెప్పటం లేదు. ఇతన్ని ఇతని యాజమాన్యమే ఇంటికి పంపించేస్తున్నారేమో" అనుకున్నాను. నా అనుభవాలు అల్లాంటివి మరి. 

మేము కూర్చునే చోటు కూడా పక్కపక్కనే కావటంతో మా సంభాషణ మరింత ముందుకు వెళ్ళింది. 

"మా మావగారికి గుండె జబ్బు. ఆ వైద్యానికి చాలా ఖర్చవుతుందని అప్పు చేసాం. మేము కొన్న ఇంటి మీద ౩౦ లక్షల అప్పు,  పిల్లల పై చదువులకి కూడబెట్టాల్సిన డబ్బులు అన్నీ లెక్క చూసుకుంటే రెండు కోట్ల వరకూ కావాలని తేలింది. ఈ పదేళ్ళూ నేను ఒక గదిలో బతికి ఏ అనవసరమైన ఖర్చూ లేకుండా దాచుకుంటే ఆ డబ్బులు సమకూరాయి. ఎప్పటికప్పుడు ఇంటికి పంపి ఎక్కడ ఖర్చు పెట్టాలో చెప్తూ వచ్చాను. ఇక నాకేమీ సమస్య లేదు. అక్కడ ఇల్లు గడవటానికి చేసే ఏ ఉద్యోగమైనా  అందుకోసం సరిపడే సమయం వెచ్చించాక మిగతా సమయమంతా హాయిగా నా పిల్లలతో గడుపుతాను. వాళ్ళ చదువుకి సాయం చేస్తాను. ఇంట్లో వంట చేస్తాను. నా పెళ్ళాన్ని సుఖంగా ఉంచుతాను" అని చెప్పుకుపోతున్నాడు.

ఇంత భోళా మనిషి నాకింత వరకూ తగల్లేదు. చాలా ఆసక్తికరమైన నిర్ణయం. నేను నా జన్మలో తీసుకోలేనిది. అదృష్టవంతుడు. కానీ అతను నిజమే చెప్తున్నాడని నమ్మకం అప్పటికి కలిగింది. 

తన విషయాలతో ఊదరగొట్టాక, మర్యాదకి అతను నా గురించి అడిగితే అంతే మర్యాదతో నేనూ చెప్పాను "ఒకప్పుడు నాకు ఇల్లు గడవటానికి నెలకి పది వేలు సరిపోయేదండి. ఈ రోజు కూడా నెలకి ఏభయి వేలతో మా ఊళ్ళో ఎంతో సుఖంగా బతకచ్చు. కానీ సంపాదిస్తున్న కొద్దీ మా పెళ్ళానికీ పిల్లలకీ కొత్త జీవిత విధానం అలవాటు చేసేశాక పాత జీవితానికి వెళ్లలేక ఇలా దేశాలు తిరిగి సంపాదించక తప్పలేదు. పైగా ఇదంతా నా భార్య కూడా సంపాదిస్తున్న తర్వాత. అంత లా అవసరాలు పెరిగిపోయాయి." అన్నాను. 

అతను మర్యాదస్తుడు కనుక నా విషయం గురించి మరేమీ అనకుండా వేరే సంభాషణ కొనసాగించాడు. 

హైదరాబాద్ లో దిగాక ఇద్దరం మా చరవాణి అంకెలు పంచుకున్నాం. 

***

తెల్లవాడిచ్చిన నెల రోజుల బలవంతపు సెలవులు గడిపి మళ్ళీ కొత్త సంవత్సరంలో తిరుగు ప్రయాణానికి సిద్దమయ్యాను. ఇలా వెళ్ళటం అలవాటే కనుక మా వాళ్లంతా ఇంటి దగ్గరే ఇంగ్లీష్ లో వీడ్కోలిచ్చేశారు. నేను కూడా ముందే చేసుకున్న ఏర్పాట్ల వలన నేరుగా తనిఖీ కేంద్రంలో లాంఛనాలు పూర్తి చేసుకుని విమానం కోసం వేచి ఉండే చోట తీరిగ్గా కూర్చున్నాను.  

ఎప్పటిలాగే ఏదో కొంప మునిగినట్టు విమానం ఎక్కటానికి హడావుడి పడుతున్న నా సోదరులని చూసి స్ఫూర్తి పొందే దుర్గుణంతో నా చుట్టుపక్కల చూస్తుంటే అనుకోకుండా మళ్ళీ శీను కనిపించాడు. అతని చిత్రమైన జీవిత విధానం గుర్తుండటం వలన అతన్ని చూడగానే వెంటనే గుర్తు పట్టాను. 

"నమస్తే శ్రీను గారూ! మళ్ళీ మిమ్మల్ని చూడగలగటం వలన చాలా సంతోషంగా ఉంది" అన్నాను.

అతను కూడా "అవునండి" అంటూ నన్ను చూసి నవ్వాడు గానీ ఇంతకుముందు అతని నవ్వులో నాకు కనిపించిన బలం గానీ స్వచ్ఛత గానీ లేదు. 

" నా విషయం మీకు తెలిసినదే కదా! మళ్ళీ లండన్ వెళ్తున్నాను. మీరిక్కడికి వెళ్తున్నారు ? " అన్నాను.

అతను తల దించుకుని "నేను కూడా అక్కడికే నండీ" అన్నాడు. 

నేను ఆశ్చర్యపోయి అయినా వెంటనే సద్దుకున్నాను. ఎంతో మంది ఇతనిలాగే పెద్దపెద్ద మాటలు చెప్పి మనసు మార్చుకోవటం చూసాను కనుక ఆ విషయం రెట్టించి అతన్ని ఇబ్బంది పెట్టదలచుకోలేదు. 

"మంచిదండీ. మీలాంటి తెలిసిన మనిషి తో ప్రయాణం చేస్తే దూరం తెలియదు" అన్నాను. 

అతను పొడిగా నవ్వి ఊరుకున్నాడు. 

కానీ నిశ్శబ్దంగా ఉండటం అతని తరహా కాదు కనుక విమానంలో మేము కూర్చున్న కొంచెం సేపటికి నోరు విప్పాడు. 

"ఖడేరావు గారూ! ఆరోజు ఎంతో ఉత్సాహంగా ఇంటికి వెళ్లిన నాకు నా ఇల్లు ఉన్న చోటే ఒక పెద్ద బంగాళా కనిపించి ఆశ్చర్యపోయాను." అంటూ తన కథ ప్రారంభించాడు. 

"నా ఇల్లెక్కడ అని అయోమయంగా ఇంటికి వచ్చిన నన్ను నా కొడుకు చూసి అరె "డాడీ"వచ్చాడు. సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటూ ఇంట్లోకి పరుగెత్తాడు. వెంటనే భార్యా కూతురూ వచ్చి ఆనందంగా నన్ను ఇంట్లోకి తీసుకెళ్లారు. 

ఇంకా అయోమయంలోనే ఉన్న నావైపు నవ్వుతూ చూసి "ఇది మనిల్లే. మనం ముందు కొన్నది పడగొట్టి ఈ మధ్యే కట్టించాం" అంది. 

ఒక్క క్షణం గుండె ఆగి మళ్ళీ కొట్టుకోవటం మొదలెట్టాక "అదేమిటి? అంత మంచి ఇల్లు కట్టుకున్నాక అది పడకొట్టి మళ్ళీ కట్టడమెందుకు?" అన్నాను.

"అదేం మంచి ఇల్లండీ. లోపలికొచ్చి చూడండి. ఒక్క వంటింటి డిజైన్ కే రెండు లక్షలు ఇచ్చి సౌకర్యంగా చేయించాం. మేడమీద తోట, ఈత కొలను చూస్తే అప్పుడు ఈ ఇంటికీ మన పాత ఇంటికీ తేడా అర్ధమవుతుంది" అందామె.

"మరి దీనికి డబ్బు?" అడిగాను

"ఆ చిట్ ఫండ్ అన్నయ్య గారున్నారుగా! ఆయనే సాయం చేశారు. ఇలా పడగొట్టి కట్టమని చెప్పింది కూడా ఆయనే" అని వివరించింది నా భార్య కాంతం. 

ఇంతలో "స్కూల్ కి వెళ్తున్నా డాడీ" అంటూ వచ్చారు పిల్లలు. వాళ్ళ బట్టలు చూసి "ఇదేమిటి? కేంద్రీయ విద్యాలయం కి ఈ బట్టలతో వెళ్తున్నారేమిటి?" అన్నాను. 

"హయ్యో మీకు తెలియదు కదా డియర్! ఆ పాత చింతకాయ పచ్చటి బళ్ళో చదివితే వీళ్ళ భవిష్యత్తు ఏం కాను ? అందుకని వాళ్ళని ఇంటర్నేషనల్ స్కూల్ కి మార్చేసాం. చూసారుగా ఇద్దరూ ఇంగిలీషు దంచేస్తున్నారు" అంది. 

నాకు నోట మాట రాలేదు. 

నేనా స్థితిలోనే ఉండగా  తను ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్లి పది నిముషాల తర్వాత తయారై వచ్చింది. వంటి మీద ఒక వడ్డాణం రకరకాల నగలు. అప్పటివరకూ గమనించలేదు. ఆవిడ జుట్టు కూడా అద్భుతమైన ప్రయోగాలతో పూర్తిగా మారిపోయింది. 

"ఎలా ఉన్నాను?" అని ఆమె అడుగుతుంటే ఒకదానితర్వాత ఒకటిగా కలుగుతున్న సంభ్రమాశ్చర్యాలతో నా దగ్గర సమాధానం లేదు. 

కొంచెం కుదుటపడ్డాక అడిగాను "వీటన్నిటికీ డబ్బులెంతయ్యాయి కాంతం. ఎక్కడినుంచి వచ్చాయి?" 

"కొన్ని చిట్ ఫండ్ అన్నగారు 24 రూపాయల వడ్డీకి సద్దుపాటు చేశారు. నగలు సోమేశం ఇచ్చాడు. వాయిదాల మీద డబ్బులివ్వమని చెప్పాడు. ఇంకా ....."

"కాంతం నేను పంపిన డబ్బులు ఎంత మిగిలాయి? మీ నాన్న వైద్యం ఎలా నడుస్తోంది? "

మొదటిసారి విసుక్కుని "అన్నీ అవుతున్నాయండీ. మీరు పంపిన  డబ్బులు అన్నీ సరిగ్గానే ఉపయోగించామని చెప్పా కదా. "

"మరి ఈ కొత్త అప్పులు ఎలా కాంతం?" అని అడిగాను. 

వెంటనే ఆమె నవ్వేసి "అదేమిటండీ. మీరు ఇంకా సంపాదిస్తారు కదా! ఎంతలో తీరిపోతాయి ?" అంది. 

విచారంగా చెప్తూ ఆగాడు శ్రీను. 

"ఆమె ముఖంలో వెలుగులు, ఇందాక బడికి వెళ్తూ తళతళలాడే బట్టలతో మా పిల్లల ముఖాల్లో మెరుపులు చూసాక మరేమీ చెప్పలేకపోయానండీ. 

నేనింకా సంపాదించటం, అదీ వీళ్ళు కోరుకున్నట్టు బతకటానికి సంపాదించటం అనేది నేనిలా మళ్ళీ విదేశానికి వెళ్తేనే సాధ్యమని తెలిసినా వారికి ఈ ఏర్పాటే కావాలి మరి. అందుకే మళ్ళీ సీట్ బెల్ట్ బిగించుకున్నాను" అంటూ ప్రయత్న పూర్వకంగా నవ్వాడతను. 

అతని నవ్వులో ఇప్పుడు జీవం ఎందుకు లేదో అర్ధమయింది. 



Rate this content
Log in

Similar telugu story from Drama