Raja Ivaturi

Drama Tragedy Inspirational

4.8  

Raja Ivaturi

Drama Tragedy Inspirational

సేవలో వినోదం - సేవే వినోదం

సేవలో వినోదం - సేవే వినోదం

17 mins
508


రైలు చాలా నెమ్మదిగా పోతోంది. కానీ అదేమంత సమస్య కాదు. ఆ రాత్రంతా రైల్లో అందరం జల్సా గా గడపాలనే పథకం ముందే వేసుకున్నాం కనుక రైలు కదిలి మా టికెట్ చెకింగ్ అయిపోయిన మరో అయిదు నిముషాలకి మెల్లిగా మా సంచుల్లోంచి కావలసిన వస్తువులు బైటికి తీయటం మొదలు పెట్టాం.

మేమందరం నరసింహాచలం ( పేరు కల్పితం) లోయల్లో ఉండే ఒక చిన్న కుగ్రామం ఎలుకల పాలెం (పేరు కల్పితం) కి వైద్య సహాయం కోసం వెళ్తున్నాం. వర్షాల్లో కొండ చరియలు కూలి వరదల్లో చెట్లు కూడా కూలి అక్కడంతా అతలాకుతలమైపోయింది. దెబ్బలు తిన్నవాళ్ళతో పాటు , కొత్తరోగాలతో బాధపడుతున్న ఆ జనాల్లో ఇప్పటికే వందమంది పైగా మరణించారు. అక్కడ నెల రోజులు ఉండి ఆ చుట్టుపక్కల గ్రామాల వారికి వైద్యం చేసి తిరిగి రావాలి.

ఈ గుంపులో ఉన్న అందరూ రకరకాల వయసులతోనూ, అనుభవాల తోనూ నిండిన వైద్యులే. నేను తప్ప.

నేను గుర్నాథం గారు తెచ్చుకున్న సహాయకుడిని. ఆయన నన్నుతన మందలో చేర్చుకున్నపుడు ఈ టూర్ లో నా పాత్ర ఏమని చెప్పి పైవాళ్ళ అనుమతి తెచ్చుకున్నాడో నాకు తెలియదు గానీ వచ్చిన తర్వాత వైద్యం తప్ప మరి ఎటువంటి సాయమైనా నేను సులువుగా చేసేస్తుండటం వలన గానీ ఎవరికీ నా గురించి వంక పెట్టే అవకాశం దొరకలేదు.

గుర్నాథం ఎప్పుడు ఏంకావాలంటాడో ఎవరూ ఊహించలేరు. కానీ అతను అడిగినది వెంటనే ఏర్పాటు చెయ్యకపోతే ఆగ్రహోదగ్రుడవుతాడు. మొదట్లో అలాగే బాగా తిట్లు తిన్న నేను అతను అడిగిన ప్రతి విషయం గుర్తుంచుకుని మరోసారి అడిగేసరికీ సిద్ధంగా ఉండేలా ముందే ఏర్పాటు చేసుకుని ఉండేవాడిని. అదేదో సినిమాలో బ్రహ్మానందం ఒక బద్దకరత్న యజమాని కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నట్టే నేను కూడా గుర్నాథం అడిగిన ప్రతీదానికీ ఎప్పుడూ రెడీ గా ఉండేసరికి అందరూ ఆశ్చర్యపోయేవారు. కానీ గుర్నాథం ఒక్కసారి కూడా నన్ను మెచ్చుకోలేదు. అతని నుంచి తిట్లు లేకపోవటమే బ్రహ్మాండమంత మెచ్చుకోలు అని సరిపెట్టుకునేవాడిని.

ఈ డాక్టర్లు ఎక్కువ మంది కుఱ్ఱవాళ్లే. వాళ్ళల్లో కొంత మందికి కొత్తగా పెళ్ళయితే చాలా మందికి ఇంకా కాలేదు. రాత్రంతా ప్రయాణం కనుక ఆ కుర్ర వైద్యులంతా ప్రయాణం ఎంజాయ్ చెయ్యటానికి "కావలసిన సరంజామా" తో పాటు వచ్చారు.

"ఒరేయ్ జాగ్రత్త! కొరకంచు గాడు చూసాడంటే కొంపలు మునుగుతాయి." అన్నాడు కన్నబాబు.

"వాడితో ఎప్పుడూ ఉండేదే కదా! అయినా ఇంకో పావుగంటలో ఆ మహానుభావుడు పడుకుంటాడులే. పద్ధతీ పాడూ అంటుంటాడు కదా" అన్నాడు జగన్నాథ్.

"అవును పద్దతి పద్దతే. " అని వెనకనుంచి వినపడితే అటు తిరిగి కొయ్యబారిపోయాడు జగన్నాథం. వెనకాల గుర్నాథం నిలబడి ఉన్నాడు.

"మనం రేపు 5 గంటలకి స్టేషన్ కి చేసుకుంటామన్నమాట. అక్కడనుంచి బళ్ళు తీసుకుని గ్రామానికి వెళ్ళటానికి కనీసం మరో గంట పడుతుంది. అక్కడ కి వెళ్లి మన స్నానాలు చేసుకుని ఫలహారం చేసిన తర్వాత నుంచి పనిలోకి దిగాలన్న మాట. అన్న మాటేమిటంటే మనం విహార యాత్రకి వెళ్ళటం లేదు. ప్రజలకి వైద్యం చెయ్యటానికి వెళ్తున్నాం. ఇప్పుడు రాత్రంతా మీరు నిద్ర పోకపోతే రేపు సరిగ్గా పనెలా చేస్తాం?" అని చెప్పి వెళ్ళిపోతూ ఆగి "మరో విషయం. మనకి రైల్లో రెండే పవర్ కనెక్షన్ లున్నాయి. ఒకరి తర్వాత ఒకరు అందరూ మొబైల్ ఫోన్ లు ఛార్జ్ చేసేసుకోండి. అక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండదన్న మాట. అయినా ఛార్జ్ చేసుకుని ఉంచుకోవటం మనకి చాలా అవసరమన్న మాట" అని చెప్పి వెళ్ళిపోయాడు.

"అదన్న మాట" గుర్నాథం గొంతు అభినయిస్తూ అన్నాడు సలీం ("అదన్న మాట" అన్నది గుర్నాథం ఊత పదమని అందరూ వాళ్లలో వాళ్ళు జోకులేసుకుంటుంటారు. కొందరు పుస్తకంలో అతను రోజుకి ఎన్నిసార్లు ఆ మాట అన్నాడో లెక్కేసుకుంటుంటారు.). అందరూ ఘొల్లుమని నవ్వేశారు. జగన్నాథం మాత్రం తేరుకోవటానికి ఎంతో సమయం తీసుకున్నాడు.

"నువ్వేం కంగారుపడకు జగన్నాథం! వాడు మొరిగే కుక్క మాత్రమే. ఎవరికీ అపకారం చేసే దమ్ము లేదు. మనం లేకపోతే వాడొక్కడూ ఒక్క పని కూడా చేసుకోలేడు" అన్నాడు సీతారాం.

వాళ్లంతా నా యజమాని గురించి మాట్లాడుకుంటున్నా నేను అక్కడే ఉన్నానన్న విషయం ఎవడూ పట్టించుకోలేదు.

నేను గురునాథానికి ఎంతో సన్నిహితంగా పనిచేస్తున్నా ఈ మాటలన్నీ నేను అతనికి చెప్పనని వారందరి నమ్మకం. నేను వాళ్ళ నమ్మకం పాడు చెయ్యలేదు.

ఇంతలో నీలాద్రి వీళ్ళు కూర్చున్న చోటికి వచ్చాడు. నీలాద్రి, గుర్నాథం తో సమానమైన అనుభవం ఉన్నవాడు. కొన్ని కారణాల వలన గుర్నాథం ఒక మెట్టు పైకి ఎదిగిపోవటంతో అతని బృందంలో పని చేస్తున్నాడు. నీలాద్రి పద్దతి గుర్నాథం పద్దతికి పూర్తి విరుద్ధం. పని ఎప్పుడూ ఉండేదే కనుక కొంత వినోదం కూడా ఉండాలి అంటాడు. నైపుణ్యంలో గురునాథానికి ఏమాత్రం తీసిపోడని అందరూ అనుకుంటుంటుంటారు.

''ఏమిటీ అందరూ ఆముదాలు తాగినట్టు కూర్చున్నారు? గుర్నాథం వచ్చి వెళ్లాడా?"అని అడిగాడు నీలాద్రి.

"మీరు సరిగ్గా ఊహించారు సార్! మన మొగుడు పది గంటలకే పడుకోమంటున్నాడు" అన్నాడు ఏసుపాదం.

"అలా వాడు అనకపోతే ఆశ్చర్యపోవాలి. పదింపావుకి లేవండి. వాడప్పటికి ఖచ్చితంగా పడుకుంటాడు" అన్నాడు నీలాద్రి నవ్వుతూ. అందరూ ఊపిరి తీసుకున్నారు.

ఒక్కొక్కడూ వాళ్ళ వాళ్ళ మొబైల్ ఫోన్ లు ఛార్జ్ చేసుకుంటూ పదింపావు ఎప్పుడవుతుందో అని వెయిట్ చేస్తుంటే మళ్ళీ గుర్నాథం వచ్చాడు.

అందరూ తేలు కుట్టిన దొంగల్లా నిశ్శబ్దంగా అతని వైపు చూస్తుంటే గుర్నాథం ముఖంలో ఏభావం లేకుండా బెర్తు మీద కాలు పెట్టి నుంచుని లైట్లు ఆపేసి ఎందుకో అని మేము ఆలోచించే లోపల అక్కడ బల్బులన్నీ విప్పేసాడు.

నిర్ఘాంతపోయి చూస్తున్న మాతో "టీసీ కి కూడా విషయం చెప్పాను. మీరు పడుకోండి. రేప్పొద్దున్నే మళ్ళీ బల్బులు బిగిస్తాను" అని చెప్పి గుర్నాథం ఆ బల్బులతో పాటు తన బెర్త్ దగ్గరికి వెళ్ళిపోయాడు.

అక్కడున్న వైద్యులందరి ముఖాల్లోనూ ఒక్క నెత్తురు చుక్క కూడా లేదు.

అందరికంటే ముందు తేరుకున్న నీలాద్రి "మావాడు ఊహించిన దానికన్నా అఖండుడు !" అన్నాడు. "ఇంకేం చేస్తాం? పడుకోండి" అన్నాడు.

అందరం నీరసంగా పడుకున్నాం.

***

ఆయిదు గంటలకి గుర్నాథం అందరినీ నిద్ర లేపేసాడు.

అసలే రాత్రి సరిగ్గా గడపలేకపోయామనే ఉక్రోషంతో ఉన్న మాకు మరింత వళ్ళు మండేలా "మీరంతా దంత ధావనాలూ ఇంకా కొన్నిపనులూ ఇక్కడే చేసేసుకుంటే అక్కడ కేవలం స్నానమొకటీ చేసి పనిలో పడచ్చు" అన్నాడు గుర్నాథం.

మేమంతా కోపం అణుచుకుని చూస్తుంటే నిన్న రాత్రి విప్పేసిన బల్బులు మళ్ళీ బిగించి గుర్నాథం వెళ్ళిపోయాడు.

"వీడికి వీడి సోంబేరి పని తప్ప మరో ద్యాస ఉండదా? పైగా మనమెవరం పని చేయనట్టూ వాడే పని చేసేవాడిలా ఈ నీతులేమిటి ?" అని విసుక్కున్నాడు ఏసుపాదం .

"వాళ్ళావిడ అందుకే వదిలేసి పోయింది" అన్నాడు సలీం కసిగా.

"వీడు మెంటలోడు గురూ! ఎవరైనా కొంచెం నవ్వుతూ కనబడినా కొంచెం విశ్రాంతిగా కనిపించినా తట్టుకోలేడు. మనం కంప్లైంట్ ఇవ్వాలి" అన్నాడు కన్నబాబు.

"కంప్లైంట్ ఇవ్వలేదని ఎందుకనుకుంటున్నారు? ఆరు నెలల క్రితం అది కూడా జరిగింది"అన్నాడు ఏసు పాదం.

"నాకున్న ప్రత్యేకమైన హోదాతో ఇచ్చిన కంప్లైంట్ కి అతని ఉద్యోగం పోవాలి. కానీ అటువంటిదేమీ జరగలేదు. పైగా వాడి బాస్ శోభనరావు నన్ను బతిమాలి కంప్లైంట్ వెనక్కి తీయించుకున్నాడు" చెప్పాడు యేసుపాదం.

"దానికొక కారణముంది. మీరేమీ కంగారు పడకండి మీకొక మంచి వార్త చెప్తాను. గుర్నాథం ఈ క్యాంపు అయ్యాక ఉద్యోగం మానేస్తున్నానని పై అధికారులకి చెప్పేసాడు. "అన్నాడు అంతవరకూ నిశ్శబ్దంగా ఉన్న మనోహర్.

"నిజమా? " అన్నాడు కన్నబాబు.

"అవును. అందుకే నీలాద్రి గారు గుర్నాథంతో కలిసి పనిచేస్తున్నాడు. వచ్చే క్యాంపు నుంచి ఆయనే మన బాస్" చెప్పాడు మనోహర్.

"ఎంత మంచి వార్త చెప్పావురా. అందుకేనా నువ్వొక్కడివీ నిర్వికారంగా ఉన్నావు?" అన్నాడు సలీం. అందరూ నవ్వేశారు.

రైలు నెమ్మదిగా నరసింహపాలెంస్టేషన్ లో ఆగింది. నేను గబగబా వెళ్లి గుర్నాథం సామాను దింపటానికి వెళ్ళేసరికే అతను కొన్ని సామాన్లు తీసుకుని దిగుతున్నాడు. అందరం వేగంగా దిగిన మరో సెకనులో రైలు నెమ్మదిగా కదిలిపోయింది.

గుర్నాథం అప్పటికే స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్లి ఏదో చర్చిస్తున్నాడు. నేను అతని పక్కనే నించుని ఆజ్ఞ కోసం ఎదురుచూస్తుంటే "ఖడేరావ్ ! నువ్వు సైకిల్ తీసుకుని ముందే మన ఎలుకల పాలెం క్యాంపు కి వెళ్లి అందరికీ టిఫిన్లు చేయించు. ఇక్కడినుంచి గుర్రబ్బళ్ళు తప్ప వెళ్లవు కనుక మేము సామాన్లతో వాటిలో వెళ్తాము. వెళ్లేముందు అందరి సామాన్లూ బళ్ల కింద సంచుల్లో సద్దించు" అన్నాడు.

గుర్నాథం చెప్పాడు కాబోలు స్టేషన్ మాస్టర్ అన్ని బళ్ళలోనూ మెత్తటి గడ్డి పరిపిస్తున్నాడు. వేరే బళ్ళలో స్థలం లేక గుర్నాథం ఎక్కే బండిలో మిగతా సామాను ఎక్కించేసారు. గుర్నాథం బండివాడి పక్కనే మెత్తటి కుషన్ తో చేసిన బల్ల మీద కూర్చున్నాడు. బళ్ళు కదులుతుంటే నేనూ సైకిల్ మీద వేగంగా బయలుదేరాను.

"కోసి తినే ముందు గొర్రెలని బలిసిపోయేలా బాగా మేపుతారు. మనచేత చాకిరీ చేయించటానికి గడ్డి పరిపించి మరీ తీసుకెళ్తున్నాడు" అంది సీమ.

"వాడి మొహం! మనందరికీ గడ్డి పరిపించి వీడు చక్కటి స్పాంజి సీట్ మీద చేరాడు. మనలో ఒకడిగా బతకటం వీడికి ఎంత కష్టమో. నీలాద్రి చూడు అందరితో ఎలా కలిసిపోతాడో" అని సలీం అంటున్నాడు.

గుర్నాథం కొరకంచు అనే విషయం నేను కూడా ఏకీభవిస్తాను గానీ వీళ్ళు అన్నింటికీ తిట్టుకోవటం సరైన పని కాదని పించింది. వెన్నులో సమస్య వలనా మఠం వేసుకుని కూర్చోలేడు కనకే గుర్నాథం వేరే ఏర్పాటు చేసుకున్నాడు తప్ప వీళ్ళనుకున్నట్టు తానొక్కడూ ప్రత్యేకంగా ఉండాలని కాదు అని నాకు తెలుసు. కానీ వాళ్ళకా విషయం చెప్పటం వలన ఫలితం ఉండదు.

నేను ముందే పాలెం వెళ్లి ఏర్పాట్లు చేసిన గంట తర్వాత అందరూ వచ్చేసారు.

స్నానాలు చేసి టిఫిన్ తినగానే గుర్నాథం అందరినీ పిలిచి "ఇప్పటినుంచి ప్రతి నిముషమూ మనకి విలువైనదే. రోగాలు చెప్పిరావు కనుక మనం ఎప్పుడైనా పని చేయటానికి సిద్ధంగా ఉండండి. నేనూ మనోహర్, సీతారాం , అపర్ణ ఊళ్లోకి వెళ్లి మేమొచ్చిన విషయం చెప్పి అక్కడే చేయగలిగిన చికిత్సలు చేసి వస్తాం. ఇక్కడ నీలాద్రి తో పాటు మీరు సిద్ధంగా ఉండండి. కుదిరినంత విశ్రాంతి తీసుకోండి. మన క్యాంపు దాటి దూరంగా వెళ్ళకండి. ఇక్కడ మొబైల్ సరిగ్గా పనిచేయవు"అన్నాడు.

అతను వెళ్ళగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మాతో వచ్చిన వైద్యుల్లో సీమ, కరుణ, అపర్ణ ఆడవైద్యులు కూడా ఉన్నారు. ఇక్కడ మిగిలిన ఇద్దరు అమ్మాయిలనీ ఆకర్షించే ప్రయత్నంలో అందరూ పోటీ పడుతుంటే నా భాద్యత గా "మనందరం మాటాడుకుంటూనే వైద్యానికి అంతా సిద్ధం చేసేసుకుందాం సార్" అన్నాను.

"వీడొక గూఢచారి. దౌర్భాగ్యం గాడికి చెప్పినా చెప్తాడు" నవ్వుతూనే కన్నబాబు తన కసి వెళ్లగక్కి "పదండి. అక్కడే కబుర్లు చెప్పకుందాం. నాయనా ఖడేరావ్ ! మాకు మరో టీ చెప్పు" అని లోపలి కి వెళ్లారు.

"ఈ దౌర్భాగ్యం దెబ్బకి వాడి భార్య పారిపోయింది. ఎప్పుడైనా వాళ్ళు కలుసున్నపుడల్లా ఆవిడ ముఖంలో ఉద్వేగం చూస్తే వీడు పెట్టిన బాధ ఇంకా మరిచిపోలేదనిపిస్తుంది"అన్నాడు జగన్నాథ్.

"వాడితో మాటాడి వెళ్తున్నపుడల్లా ఆవిడ ఏడుస్తూనే వెళ్తుంది. వీడేమో ఏమీ పట్టనట్టు ముక్తసరిగా మాటాడి విడిపోతుంటాడు. అలాంటి వాడు పెళ్లి ఎందుకు చేసుకున్నాడో" అన్నాడు సలీం.

"ఆవిడ బాగానే పాఠం చెప్పింది రా. వీడు ఆవిడకి వేరే వాడితో పెళ్లి చేయించి, చాలా డబ్బులు ఇచ్చి ఉన్న ఇల్లు కూడా రాసేసి ఎలాగో పోలీస్ కేసుల్లోంచి తప్పించుకున్నాడు." చెప్పాడు కన్నబాబు.

"అయినా వాడి ధోరణిలో మార్పు లేదు. పైగా వీడి తిక్క పెరిగింది. కుదిరితే రోజుకి ఇరవై అయిదు గంటలు చెయ్యమని దేవుడితో గొడవ పెట్టుకుని మరీ మనని హింసిస్తాడు" అన్నాడు సలీం.

గుర్నాథం అదోరకమైన మనిషి. మొదటి నుంచి పని పని అని తనసిబ్బందికి నరకం చూపించేవాడు. మొదట ఇంత ఉదృతం లేదు గానీ ఈ మధ్యనే అతను పని పేరుతొ మరింత చిత్ర హింసలు పెడుతున్నాడు. అతని భార్య వదిలి వెళ్ళటమూ ఇతని హింసలు ఎక్కువటం ఒకేసారి జరగం వలన వాళ్ళు విడిపోవటమూ అంతకు ముందే వాళ్ళకేవో గొడవలుండటమూ ఇప్పటి ప్రవర్తన కి కారణం అనిపిస్తుంది.

ఏదైనా వీళ్లంతా అతని వ్యక్తిగత విషయాలు కూడా చర్చించటం నాకు నచ్చలేదు.

మొదట్లో గుర్నాథానికి ఎంతో మంది చెప్పి చూసారు.

"నువ్వొక్కడివే అంతా చెయ్యక్కరలేదు గుర్నాథం! నీదొకరమైన పిచ్చి! వేరేవాళ్లు కూడా పని చేస్తున్నారు కానీ వాళ్ళిలా అందరినీ హింస పెట్టటం లేదు. కొంచెం విశ్రాంతిగా ఉండు. మీ సిబ్బందికి కూడా కొంచెం విశ్రాంతి ఇవ్వు" అని ఎవరైనా చెప్తే " మేమెప్పుడూ మారుమూల ప్రాంతాల్లోనే పనిచేస్తున్నాం. అటువంటిచోట్ల ఇంకోళ్ళెవరున్నారు? నేను చేయగలిగినదే చేస్తున్నాను చేయిస్తున్నానన్న మాట .పైగా ఇలాంటి చోట్ల నా సిబ్బందికి వేరే పనేమీ లేనప్పుడు డ్యూటీ చెయ్యచ్చు గా. రేపనేది లేనట్టు పని చేస్తే కొన్ని ఎక్కువ ప్రాణాలు నిలుస్తాయి." అని ఆదర్శం రంగు కలిపి సమాధానమిచ్చేవాడు.

వెనక అందరూ నవ్వుకున్నారనీ అంతకన్నా తన పని రాక్షసత్వం వలన చెప్పలేని బూతులు తిట్టుకుంటున్నారనీ అతనికి తెలుసు. కంప్యూటర్ లో అతని లాగిన్ ని మెంటల్ గుర్నాథం అనీ ఇంకేవో పేర్లతో మార్చేసేవారు. అతని ఊతపదం అన్నమాట ని లెక్కెట్టి బోర్డు మీద రాస్తూ ఉండేవారు. కానీ అతనిలో ఏ మార్పూ లేదు. అవన్నీ చెరిపేసి మళ్ళీ ఏభావం లేని ముఖంతో పని ప్రారంభిస్తాడు.

అతనికేదో పైనుంచి దన్ను ఉందనుకుంటా. అతని మీద యేసుపాదం లాంటి వాడూ, సీమ లాంటి అమ్మాయీ వారి వారి హక్కులని కూడా దృష్టికి తెస్తూ ఫిర్యాదు చేసినా పై అధికారులు వాళ్ళని బతిమాలి ఫిర్యాదు వాపసు తీయించుకున్నారు. ఇన్ని కష్టాలలో మనోహర్ చెప్పిన ఒక్క వార్త అందరికీ చాలా ఉత్సాహాన్నిచ్చింది. అప్పుడే కొంతమంది నాలుకలు తడి చేసుకుని నీలాద్రిని ఇప్పటినుంచే కాకా పట్టటం ప్రారంభించారు.

మూలశంక గుర్నాథం కి ఈ కాకా వ్యవహారం కూడా పనికి రాలేదు. మొదట్లో సీమా, ఇంకో పది మంది ఆడపిల్లలు వాలెంటైన్ డే రోజు అతని గదిలోకి వెళ్లి గులాబీ పువ్వులు ఇస్తే అసలు ఆ రోజు వేరే మగాడికి పువ్వులు ఇచ్చి మీరు ఏం తెలియజేస్తున్నారు అని వాళ్ళని మందలించి ఇటువంటివి వేరే వాళ్ళ దగ్గర కూడా చెయ్యద్దని చెప్పి పంపించేశాడు. సీమ తర్వాత అతని మీద రకరకాల ఫిర్యాదులు చేసి ఎలాగో ఒకలాగా అతన్ని దెబ్బతీయాలని ప్రయత్నించింది. అతనో మెంటలోడని పెళ్ళాం వదిలేసిందనీ మిగతా వాళ్ళు చెప్పాక ఆమె శాంతించింది. ఆ తర్వాత ఆడ గానీ మగ గానీ మరెవరూ అతన్ని ప్రసన్నం చేసుకునే ధైర్యం చెయ్యలేదు.

గుర్నాదానికి వ్యతిరేకంగా నీలాద్రి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అందరూ అతన్ని ఇష్టపడతారు. అఅతనెప్పుడు అధికారం తీసుకుంటాడా అని ఎదురు చూస్తారు.

నేనిలా ఆలోచిస్తూ పనిచేసుకుంటుంటే నెమ్మదిగా రోగస్తులు రావటం మొదలయ్యింది.

ఆ ఊరు ఒక లోయలో ఉంది. వర్షాలకు కొండ చరియలు విరిగి ఒక పక్క వరదల వలనా మరో పక్క పై నుంచి పడిన రాళ్ల తో కలిగే గాయాల వలనా అక్కడి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాళ్ళు విరిగిన వాళ్ళు వరద నీళ్ల వలన వచ్చిన రోగాలు వచ్చిన వాళ్ళు, ఇది కాక వేగంగా వ్యాపిస్తున్న ఒక తెలియని రోగం వచ్చిన వాళ్లతో ఆ ఊరు నిండిపోయింది.

నాకేమీ వైద్యం తెలియకపోయినా ఇన్నాళ్లూ వారితో పనిచేసిన అనుభవంతో వైద్యులకు సాయం చేస్తున్నాను. చీకటి పడే వరకూ ఊపిరి తీసుకోలేని విధంగా పని చేసాక జనం రావటం ఆగింది. అప్పటికి గుర్నాథం తన వాళ్లతో వచ్చి చేరాడు.

అందరం విశ్రాంతిగా ఉండగా గుర్నాథం వచ్చి "అందరూ భోజనాలు చేసేయండి. కొండచెరియలతో పాటు గేట్లు విరిగి నీళ్లతో పాటు జారిన ఆ ఇనప ముక్కలు కొంత మందికి గుచ్చుకుని చాలా బాధ పడుతున్నారు. నేను కొంతమందితో ఊళ్లోకి వెళ్తాను. ఇక్కడికి కూడా ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు కనుక మీరు వీలయినంత విశ్రాంతి తీసుకుని వారికి సహాయపడటానికి ప్రయత్నించండి" అన్నాడు.

సీతారాం కొంచెం ధైర్యం చేసి "సార్ మేమంతా తుక్కు తుక్కు అయిపోయాం." అన్నాడు.

గుర్నాథం ఒక్క క్షణం ఆలోచిస్తూ "అవును చాలా అలసటగా ఉంది. మీరందుకే బాగా విశ్రాంతి తీసుకోండి. ఎవరైనా వస్తేనే కదా మనం పని చెయ్యాల్సింది. మీరిక్కడి నుంచి అరమైలు కన్నా ఎక్కువ దూరం ఎక్కడికీ వెళ్ళకండి" అంటూ వెళ్ళిపోయాడు.

ఇంతలో అతని వెనకే పరుగు లాంటి నడకతో వెళ్లి కరుణ అంది. "గుర్నాథం గారూ! శనివారం మా నాన్నా అమ్మా తమ్ముడూ నన్ను చూడటానికి వస్తారు. వాళ్లతో కొంచెం సేపు గడుపుతా సర్"అంది.

గుర్నాథం ఏభావం లేని ముఖంతో "వాళ్ళు ఎప్పుడొస్తారు?" అని అడిగాడు.

"మా ఊరు నుంచి పొద్దున్న ఆరు గంటలకి బైలు దేరి వస్తారండీ. ఇక్కడికేమీ వాహనం రాదు కనుక ఆరు మైళ్ళు ఆగుతూ ఆగుతూ నడిచి వస్తారు" అంది కరుణ.

"ఆ లెక్కన మధ్యాహ్నం ఏ మూడు గంటలకో చేరతారు. అలా వస్తే నీతో ఎంతసేపు గడుపుతారు? మళ్ళీ ఇంటికి కూడా అలాగే పోవాలి. పైగా ప్రమాదాలు కూడా ఉన్నాయి కదా! రావద్దని చెప్పు"అన్నాడు గుర్నాథం.

"వాళ్ళకి ఫోన్ కలవటం లేదు సర్" అంది కరుణ బిక్క మొహంతో.

విషయం అర్ధమయినట్టు నిట్టూర్చి "సరే! నువ్వు నీ పని చేసుకుంటూ ఉండు. వాళ్ళు వచ్చినప్పుడు కాసేపు మాట్లాడి అప్పటికి ఏమీ పని లేకపోతే ఇంకొంచెం సేపు గడుపు"అని చెప్పి మరేం మాటాడటానికి లేకుండా వెళ్ళిపోయాడు.

కరుణ కళ్ళలో నీళ్లు కారిపోయాయి.

"వాళ్ళు వస్తే కాస్త మంచి భోజనం పెట్టాలనుకున్నాను. మన క్యాంపు మొత్తం చూపిద్దామనుకున్నాను." దిగులు గా అంది మా వైపు చూస్తూ.

ఆమెకి సాయం చేసే పరిస్థితిలో లేకపోవటంతో అందరూ మౌనంగా ఉన్నారు.

"వీడీ గొడ్డు చాకిరీ చేసినందుకు ఒక్క రూపాయి ఎక్కువివ్వరు. వాడికి ప్రమోషన్ కూడా పదేళ్ల నుంచి లేదు. పెళ్ళాం లేదు కుటుంబం లేదు. అయినా మనని మాత్రం ఇలా చులకన చేస్తూ ఉంటాడు. ఏం బతుకు వీడిది" అంది సీమ. అవకాశం దొరికినప్పుడల్లా గుర్నాధాన్ని తిట్టే అవకాశం పోగొట్టుకోదు.

అందరూ నిట్టూర్చారు.

శని వారం తన వారు వస్తే ఎలాంటి అవమానాలు జరుగుతాయో అదంతా ఎలా సంభాళించాలి అని ఆదుర్దా తో కరుణ కూడా నిట్టూర్చింది.

"నువ్వు కంగారు పడకు. అప్పటికి ఏదో చేద్దాంలే"అన్నాడు కన్నబాబు.


అదృష్ష్టవశాత్తూ మరెవరూ పేషెంట్ లు రాకపోవటంతో ఆరోజు అందరికీ కొంత విశ్రాంతి కలిగింది. అందరూ భోజనాలకి కూర్చున్నారు

హఠాత్తుగా ఏదో ఆలోచన తట్టినట్టు "ఒరేయ్ మూల శంక గాడు ఇంకా రాలేదు. వాడి భోజనం కూడా తినెయ్యండి. వాడికి తెలిసొస్తుంది" అని కన్నబాబు అన్నాడు.

"ఛా తప్పురా" అన్నాడు సీతారాం. కానీ ఆ మాట కేవలం నాలుక చివర నుంచి అన్నాడు కనుక అతని మాట ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి పదకొండు గంటలకి వచ్చిన గుర్నాథం తనకేమీ మిగలలేదని గ్రహించి తటపటాయిస్తూనే నన్ను నిద్ర లేపాడు.

నాతో పాటు లేచిన మనోహర్ నవ్వాపుకుంటూ అందరికీ ఆకలి వేసి తినేశారనీ కేవలం కొంచెం అన్నం మిగిలిందని చెప్పాడు.

గుర్నాథం నిట్టూర్చి ఎవరినీ నిందించ కుండా అక్కడ గిన్నెలో మిగిలిన అన్నం ఉత్తిగా తినటం ప్రారంభించాడు.

"అయ్యో. మరీ ఉట్టి అన్నం ఎలా తింటారు? వంటవాడిని లేపుతానండీ" అని నేనంటూంటే "వద్దు వద్దు ఎవరినీ లేపకు. అందరికీ పొద్దున్నుంచీ పనుంటుంది. ఆమాటకొస్తే రాత్రి కూడా ఎవరైనా వస్తే వారిని వదిలేయలేము కదా!" అన్నాడు గుర్నాథం.

అతను కేవలం తెల్లన్నం తింటున్నాడని మనోహర్ అతని వైపు అదోరకంగా చూస్తూ "వీడిని కోయటం కష్టమే" అని గొణుక్కుంటుంటే "ఇప్పుడు తినకుండా పడుకుంటే రేపు పని చేయటానికి శక్తి ఉండాలి కదా!" అన్నాడు గుర్నాథం.

తన మాటలు అతనికి వినిపించాయేమో అని ఉలిక్కిపడిన మనోహర్ తోనూ నాతోనూ "మీరు పడుకోండి. నేను కూడా తినేసి పడుకుంటాను" అన్నాడు గుర్నాథం.

మేము నోరు మూసుకుని పడుకున్నాం.

మేము మొదటిరోజు చేసిన పనుల వలన నమ్మకమో మరేమో గానీ మర్నాటి నుంచి మా క్యాంపు కి విపరీతంగా జనాలు వచ్చారు. నాలుగయిదు రోజులు నుంచి మాకెవరికీ ఊపిరాడటం లేదు. మేము పనుల్లో ఉండగానే నీలాద్రి ఒక్కొక్కరి దగ్గరికీ వచ్చి చెప్తున్నాడు.

"రేపు ఆదివారం. మనమెవ్వరం పని చెయ్యం. ఇక్కడికి దగ్గరలోనే ఒక జలపాతం ఉంది. అక్కడ రోజంతా గడిపితే వచ్చే వారం మళ్ళీ ఇలాగే పని చేసుకోవచ్చు. మనందరికీ కొంచెమయినా మార్పు కావాలి. " అన్నాడు.

అతను చెప్పిన వెంటనే ప్రతివాడి మనసులోనూ వచ్చే ప్రశ్నఅతనే ఊహించి "దౌర్భాగ్యం గురించి కంగారు పడకండి. ఆదివారం సెలవు. మనని పని చేయమని చెప్పే హక్కు ఎవడికీ లేదు" అన్నాడతను.

అయినా అందరికి కొంచెం బెరుకు గానే ఉంది.

ఇంతలో అక్కడ ఒక గుర్రబ్బండి ఆగింది. ఆ బండిలోంచి నడి వయసు దంపతులు వారితో ఇద్దరు కుర్రాళ్ళూ దిగారు. వీళ్లేమీ రోగిష్టి వాళ్ళలా లేరే...పైగా వీళ్ళు గుర్రబ్బండి మీద వచ్చే మొహాలు కావే అని యేసుపాదం గొణుక్కుంటుంటే "అయ్యా!" అని అరుస్తూ కరుణ వాళ్ళ దగ్గరికి పరుగు పరుగున వెళ్ళింది.

"అరే బుల్లెమ్మా ఏమిటీ తెల్ల కోటు? అబ్బో మన పిల్ల డాటరయిపోయినాది" అంటున్నాడా పెద్దాయన.

"మీరెలా వచ్చారయ్యా" అని కరుణ అడుగుతుంటే "పెద్దాయన బండి పంపించాడు కాదమ్మా" అంది పెద్దావిడ.

"అవునక్కా! మేము ఊరి శివార్ల దగ్గర కొస్తే ఈ బండబ్బాయి మమ్మల్ని వివరం అడిగి తన బండిలో తీసుకొచ్చాడు. ఎవరో సూరనారాణమని బండి ఏర్పాటు చేసాడట" చెప్పాడు ఒక కుర్రాడు. కొంచెం చదువుకుంటున్నట్టున్నాడు. వాడి భాష మెరుగ్గా ఉంది.

సూరనారణం అంటే గుర్నాథం అని నేను కళ్ళతోనే చెప్తుంటే నావైపు కృతజ్ఞత గా చూసింది కరుణ.

"బండి లో వచ్చారు కనుక ఒక రెండు మూడు గంటల ముందే వచ్చారు. మీ అమ్మాయితో మాటాడుకోండి. భోజనం పంపిస్తాను" అని చెప్పాను.

"అబ్బో మన బుల్లెమ్మ చాలా ఎదిగిపోయింది. జటకా బండి , ఈ కోటు, మందీ మార్బలం ..."అని వాళ్ళు మాటాడుకుంటుంటే కరుణ ఆనందం తో ఉక్కిరిబిక్కరై పోయింది.

"కరుణా. మీ కుర్చీలో గుర్నాథం గారు కూర్చున్నాడు. మీరు పేషెంట్ ల కోసం కంగారు పడకుండా తీరిగ్గా వీళ్ళతో గడపండి. మీకు భోజనం ఉలవ చారు, చేపల కూరా చింతకాయ పచ్చడి, మిఠాయి మీ దగ్గరకే వస్తాయి" అని నేనే ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నట్టు గర్వంగా చెప్పాను.

"ఇవన్నీ మావాళ్లకి చాలా ఇష్టమైన వంటకాలు. మీకెలా తెలిసింది ..." అని కరుణ అడుగుతుంటే "మీ మూల శంక గారే చేయించి తెమ్మని చెప్పారు" అన్నాను నవ్వుతూ.

కరుణ కళ్ళలో కనీ కనపడకుండా నీటి తెర కనిపించింది.

నేను వచ్చేసరికి ఆ కుటుంబం సరదాగా క్యాంపు లో తిరుగుతున్నారు. కరుణ ఎక్కడ లేని గాంభీర్యం తెచ్చుకుని వాళ్లకి అన్నీ వివరిస్తుంటే నేను భోజనం అక్కడ సద్ది వెళ్ళిపోయాను. రెండు గంటల తర్వాత వాళ్ళు బండి మీద వెళ్లి పోయారు.

కరుణ సంతోషం పట్టలేక గుర్నాథం దగ్గరికి వెళ్లి "చాలా థాంక్స్ సార్ .... " అని ఉద్వేగంగా ఏదో చెప్పబోతుంటే గుర్నాథం ఇబ్బందిగా "ఊ ఊ . వాళ్లతో మాటాడేసుకున్నావు కదా! నువ్వు నా ప్లేస్ లో కూర్చో నేను భోజనం చేసి వస్తాను" అని గబగబా వెళ్ళిపోయాడు.

నేనక్కడే చూసి నవ్వుతూ "ఆయన సంగతి తెలుసు కదా! ఈ కృతజ్ఞతలు ప్రకటించటం వగైరాలు చేయకు. అయన ఇదంతా కూడా తన పద్దతిలో చేసేసాడంతే" అన్నాను.

"కొరకంచు గాడిలో ఈ యాంగిల్ కూడా ఉందిరోయ్" అని కన్నబాబు, మిగతా వాళ్ళు నవ్వుతుంటే వాళ్లతో కరుణ గొంతు కలపకపోవటం గమనించాను.

మర్నాడు పొద్దున్నే నీలాద్రి హడావుడి ప్రారంభమయ్యింది.

అతను పొద్దున్నే అయిదు గంటలకి అందరినీ నిద్ర లేపేసాడు.

ఈ హడావుడంతా చూసి ఏమిటని అడిగాడు గుర్నాథం.

"గుర్నాథం గారూ ! ఆదివారం! ఈరోజుకి మమ్మల్ని వదిలెయ్యాయాలండీ. పిల్లలు అలసిపోయారు. వాళ్లందరినీ ఇక్కడ అయిదు మైళ్ళ దూరంలో ఉన్న జలపాతం దగ్గరికి తీసుకుపోతున్నాను"అన్నాడు నీలాద్రి యుద్ధం చేసే గొంతుతో.

గుర్నాథం ఒక్క క్షణం నిస్చేస్తుడై "రోగాలకు ఆదివారమని ఉండదు కదా! అలసిపోయిన వాళ్ళని ఎప్పుడూ విశ్రాంతి తీసుకోమనే చెప్తున్నాను కానీ మరీ ఎక్కడికో వెళ్ళిపోతే కష్టమన్నమాట. ఈ దగ్గరలోనే తిరుగుతుంటే అవసరానికి వచ్చెయ్యచ్చు. మరీ దూరంలో ఫోన్లు కూడా సరిగా పనిచెయ్యవట" అన్నాడు.

"రోగాలకు ఆదివారాలు లేవు గానీ మనుషులకి ఉంటాయి. ఈ వాతావరణంలో విశ్రాంతి ఎక్కడుంటుంది? " అన్నాడు నీలాద్రి.

గుర్నాథం ఇంకేదో చెప్పేలోపల "ఇన్ని వాదనలు అనవసరం. మేము ఆదివారం పని చెయ్యం. ఏ న్యాయమూ ఆ విషయాన్ని తోసిపుచ్చలేదు" అనేసాడు నీలాద్రి కరుకుగా.

గురునాథానికి కూడా కోపం వచ్చింది.

"నాతో కొంత మంది ఉండితీరాలి. నిన్ననే గ్రామస్తులు చాలారోజుల తర్వాత పనుల కోసం బైటికెళ్ళినపుడు మళ్ళీ కొండ చరియలు విరిగి పడ్డాయట. ఖచ్చితంగా కొంత మంది గాయపడి ఉంటారు" అన్నాడు.

"మీతో ఎవరైనా ఉండాలనుకుంటే వాళ్ళు ఉంటారు. మీరు మాత్రం బలవంతపెట్ట కూడదు. " అన్నాడు నీలాద్రి.

కొంచెం సేపు భయంకరమైన నిశ్శబ్దం తాండవించింది.

గుర్నాథం ఈ క్యాంపు తర్వాత నుంచి పని మానేస్తున్నాడు కనుక, నీలాద్రి తమ కాబోయే నాయకుడని తెలుసు కనుక వైద్యులు ఒక్కొక్కరూ అతని వైపు నడవటం ప్రారంభించారు. నేను మాత్రం మరో దారి లేదు కనుక గుర్నాథం దగ్గరే ఉండిపోయాను.

గుర్నాథం నిర్లిప్తంగా చూస్తుంటే ఎవరూ ఊహించని విధంగా కరుణ తన సామానుతో గుర్నాథం పక్కకి వచ్చి నించుంది. మరింత ఆశ్చర్య కరంగా మనోహర్, యేసుపాదం కూడా గుర్నాథం పక్కకి వచ్చారు.

నీలాద్రి కొంచెం దెబ్బతిన్నట్టు కనపడినా వెంటనే సద్దుకుని వాళ్ళవైపు జాలిగా చూస్తూ "మీరేమీ భయపడనక్కరలేదు. మనమేమీ సమ్మె చేయటం లేదు. ఆదివారం కొంచెం ఎక్కువ విశ్రాంతి తీసుకుంటున్నాం" అన్నాడు.

"నిజమే సార్! కానీ గుర్నాథం గారిని ఒక్కరినీ వదిలి వెళ్ళటం కూడా సమంజసం కాదనిపిస్తోంది" అన్నాడు యేసుపాదం.

"సరే తర్వాత మీరు బాధ పడినా ప్రయోజనం లేదు. మేము అంతా సద్దుకుని వెళ్ళేలోపల మనసు మారితే మీరు కూడా రావచ్చు"అన్నాడు నీలాద్రి.

గుర్నాథం అప్పుడు నోరు తెరిచి "ఒక అరగంట ఆగి అందరూ ఫోన్లు ఛార్జ్ చేసుకుని వెళ్ళండి. అవసరమైతే కాల్ చేయటానికి ఉంటాయి." అన్నాడు.

"మంచి సలహా. మొబైల్ ఛార్జ్ చేసుకోవటమైతే జరుగుతుంది. కానీ ఈరోజు మీరు కాల్ చేసి రమ్మన్నా మేము రాకపోవచ్చు" అన్నాడు. మళ్ళీ వస్తామని అవకాశం ఇవ్వటం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు.

తన వైపు కేవలం ముగ్గురు వైద్యులతో గుర్నాథం స్థిరంగా నిలబడగా మిగతా అందరూ నీలాద్రితో వెళ్లిపోయారు.

"నువ్వు రావేమో అనుకున్నాను" అన్నాడు నీలాద్రి సీతారాం తో.

సీతారాం నవ్వి "ఎందుకలా అనుకున్నారు? ఆ మాట కొస్తే అపర్ణ కూడా గురునాథానికి ప్రియ శిష్యురాలు. ఆవిడ కూడా వచ్చేసింది కదా!" అన్నాడు.

"అది సరే. యేసుపాదం, కరుణ అటు వెళ్లిపోయారేం?"

"కరుణకి నిన్న మనవాడు చేసిన సాయం కదిలించిందనుకుంటా." నాటకీయంగా అన్నాడు జగన్నాథ్.

"యేసుపాదం సంగతి తెలీదు. పోనీలెండి . కొంతమంది అటు ఉండటం వలనే ఎక్కువ ఘర్షణ లేకుండా మనం బైటికి రాగలిగాం"

వారు జలపాతం చేరేసరికి అక్కడ అందమైన దృశ్యాలు చూసి అందరూ ముగ్దులయిపోయారు. కొన్నిరోజుల ముందే ప్రజలని భయబ్రాంతులని చేసిన ప్రకృతి ఒక వైపు కొండలు మరో వైపు లోయలతో వాటి మధ్య స్వచ్ఛంగా ప్రవహించే నీళ్లతో ఎంతో రమణీయంగా ఉంది.

"పదండి మనం నీళ్లలో దిగుదాం" అన్నాడు నీలాద్రి.

"అమ్మో నాకు భయం" అంది అపర్ణ.

"పరవాలేదు రావే" అంది సీమ.

కుర్రాళ్లంతా అప్పటికే నీళ్లలో మునిగారు. కాసేపు మొహమాటాలు అయ్యాక అందరూ నీళ్లలో దిగి నీళ్ల చల్లదనాన్నీ స్వచ్ఛతనీ ఆస్వాదించసాగారు. వారం రోజుల శ్రమ అంతా కరిగిపోతుంటే అందరూ కేరింతలు కొడుతూ వయసు భేదాలు గానీ హోదాల అంతరాలు గానీ మరిచిపోయిస్నేహితులవుతున్నారు. నీలాద్రి కి ఉన్న మంచి లక్షణాలు బెరుకుని పోగొట్టటం.

ఇక్కడ గుర్నాథంతో ఆగిపోయిన యేసుపాదం, కరుణ, మనోహర్ లతో గుర్నాథం "బాధ పడకండి. రోగులు వచ్చేవరకూ ఒక చోట కూర్చుందాం రండి. అక్కడ కూడా ఎంతో రమణీయంగా ఉంటుంది." అంటూ దారి తీసాడు.

క్యాంపు కి ఒక ఫర్లాంగు దూరం లో ఉన్న మైదానం అంచు ని చేరాక తను తెచ్చిన గుడ్డ కుర్చీలు విప్పి అందరినీ కూర్చోమన్నాడు. నాతో "ఖడే రావ్ ! వెళ్లి కాఫీ ఒక ఫ్లాస్క్ లో వేసుకుని బహదూర్ ని పకోడీలు చెయ్యమని చెప్పు. రోగులు ఎవరొచ్చినా ఇక్కడికి వచ్చి మనకు చెప్పమను" అన్నాడు.

నేను కాఫీ తీసుకుని వచ్చి కూర్చునేసరికి అక్కడ కనపడిన దృశ్యం చూసేసరికి మతి పోయింది.

కొండలని రాసుకుంటూ మేఘాలు ఒక పొగలాగా కమ్ముకుంటుంటే మరోవైపు ఉదయిస్తున్న సూర్యుడు ఎర్రగా పైకి వస్తున్నాడు.

"మనం ప్రకృతి అందాలు ఆస్వాదించాలంటే ఎక్కడైనా కుదురుతుంది" మొదటి సారి మనసు విప్పి చెప్పాడు గుర్నాథం.

"ఆ మేఘాల వేగం చూడండి. అంటే అక్కడ గాలి అంత ఉధృతంగా ఉందన్న మాట. కానీ ఈ కొండలు ఆ ఉధృతాన్ని ఆపుతున్నాయి. ఆ కొండల మీది ఎత్తైన చెట్లు కూడా ఆపుతున్నాయన్న మాట. అది భగవంతుడి మాయ. కానీ మనిషి ఆ చెట్లు కొట్టేస్తాడు. కొండలని తవ్వేస్తాడు. అప్పుడు ప్రకృతి చేసే భీభత్సాన్ని ఆక్ట్ అఫ్ గాడ్ అని చెప్పి చేతులు దులుపుకుంటాడన్న మాట. అలా కాకుండా మనం ప్రకృతిని హింసించకుండా ఎప్పటికప్పుడు కాపాడుకుంటే ప్రకృతి మనలని కాపాడుతుంది" అని కొనసాగించాడు.

గుర్నాథం ఉపన్యాస ధోరణిలో మాటాడుతున్నా ఆ వివరణ మాకెంతో బావుంది. అతను ఇలా మాటాడటం ఈ ఐదేళ్లలో ఎప్పుడూ వినలేదు. కొరకంచు లా ఉండే అతనిలో మాకు తెలియని కోణం ఏదో ఉందా అనిపించింది.

మరి కొన్ని గంటల్లో అందరికీ బెరుకు పోయింది. అందరం మాములుగా మాటాడుకుంటుంటే పన్నెండు గంటలకి బహదూర్ వచ్చి ఎవరో రోగులు వచ్చారని చెప్పాడు. అందరం చాలా సంతృప్తిగా వెనక్కి నడిచాం.

మేము వెళ్తున్నపుడు కరుణ తటపటాయిస్తూనే అడిగింది "సార్! మీరేమనుకోకపోతే ఒక ప్రశ్న అడుగుతాను. మీ వివాహం ఎందుకు విఫలమయ్యింది సార్"

ఆమె అంత చొరవ తీసుకుని అడుగుతుందని ఊహించని గుర్నాథం ఆశ్చర్యంగా తలెత్తితే "క్షమించండి సర్! నేను కొంచెం హద్దులు దాటాను. మీకు ఇష్టమైతేనే చెప్పండి. అందరూ మిమ్మల్ని రకరకాలుగా అనుకుంటున్నారని అడిగాను" అంది.

గుర్నాథం గొంతు సరి చేసుకుని "మన వెనక మాట్లాడటం కన్నా నేరుగా అడగటం ఎప్పుడూ మంచిదే. పోతే ఇటువంటి విషయాలు చాలా వ్యక్తిగతం. ఒక్క విషయం మాత్రం చెప్తాను. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె కి ఎంత మంచి జరగగలదో అంతా జరిగింది" అన్నాడు.

అతనింకేమీ చెప్పటం ఇష్టపడటం లేదని గ్రహించిన కరుణ మరేమీ మాటాడకుండా ముందుకు నడిచింది.

క్యాంపు కి వచ్చేసరికి గుర్నాథం అనుకున్నట్టే గాయాలతో చాలామంది వచ్చారు. సాయంత్రం వరకూ పని చేస్తుండగా దాదాపు చీకటి పడే ముందు వచ్చిన కొంతమందిని పరీక్షిస్తున్న గుర్నాధం ముఖంలో మొదటి సారి కొంచెం ఆదుర్దా కనిపించింది.

ఇద్దరికి ఇప్పుడే సర్జరీ లాంటిది చెయ్యాలి అన్నాడు. కరుణతో ఏదో వైద్య భాషలో చెప్పి ఏర్పాట్లు చేయమన్నాడు. మిగిలిన వారికి కట్లు కట్టి మందులిచ్చి హడావుడిగా లోపలికి వచ్చేసరికి కరుణ నా సాయంతో అంతా సిద్ధం చేసింది. అక్కడ సీతారాం గానీ జగన్నాథ్ గానీ ఉంది ఉంటె కొంచెం మెరుగయ్యేది. ఇప్పుడున్న వారెవరూ సర్జరీ స్వయంగా చెయ్యలేరు.

గురునాథానికి ఇది ఒక సవాల్. సిబ్బందికి ఈ విషయం చెప్పి ఇద్దరు రోగులకీ పక్కపక్కనే ట్రీట్మెంట్ చేయ్యసాగాడు.

ఉన్న సమస్యలకి తోడుగా వర్షం హోరున ప్రారంభమయ్యింది. చీకటి పడుతుండటంతో అక్కడ వెలుగు సరిగా లేకపోవటం, పైగా కరెంటు ఎప్పుడయినా పోతుందేమో అని గుర్నాథం ఇంకా కంగారు పడుతున్నాడు, మేము మా మొబైల్ ఫోన్ల లైట్ కూడా కలిపి పరిస్థితిని కొంచెం మెరుగ్గా చేయాలని ప్రయత్నిస్తున్నాము.

ఇంతలో ఫోన్ మోగింది. అక్కడున్న పరిస్థితి దృష్టిలో పెట్టుకుని మేమెవ్వరం ఫోన్ తీయలేదు. మోగి మోగి ఆగిపోయిన రెండు సెకన్లలోనే ఫోన్ మళ్ళీ మోగింది. మేమింకా సంశయిస్తుంటే "ఖడే రావ్ ! ఫోన్ తియ్యి" అన్నాడు గుర్నాథం పని చేస్తూనే. సర్జరీ చేస్తూ అలా మాటాడకూడదని తెలిసినా అతను చెప్తే విషయం అర్ధం చేసుకుని ఫోన్ అందుకున్నాను.

అటునుంచి "హలో"అని సీమ గొంతు వినిపించింది. ఆ గొంతులో ఆదుర్దా ధ్వనించగానే ఫోన్ ను స్పీకర్ మోడ్ లో పెట్టి "చెప్పమ్మా"అన్నాను.

"ఒకసారి గుర్నాథం గారికి ఇవ్వండి అర్జెంటు" అంది సీమ

నేనొక క్షణం తటపటాయించి "ఆయన చాలా ముఖ్యమైన పనిలో ఉన్నారమ్మా. ఒకటి రెండు గంటలలో ఫోన్ చెయ్యి. మీరెక్కడున్నారు?" అన్నాను.

"మేమెక్కడున్నామో తెలియటం లేదు. విపరీతమైన వర్షం. నీలాద్రి గారికి పెద్ద గాయమయింది. మాకెవ్వరికీ ఏం చెయ్యాలో తెలియటం లేదు." మేము ఫోన్ పెట్టేస్తామేమో అనే ఆదుర్దా తో గబగబా చెప్పింది సీమ.

నేను ధైర్యం చేసి గుర్నాథం దగ్గరికి ఫోన్ తీసుకు వచ్చి "ఏదో ప్రమాదం జరిగినట్టుంది సర్" అన్నాను.

గుర్నాథం ఎంతో నెమ్మదిగా మాటాడుతూ "సీతారాం జగన్నాథ్ ఉన్నారా? వాళ్ళ సాయం తీసుకుని ముందు ఫస్ట్ ఎయిడ్ చెయ్యండి." అన్నాడు.

"గుర్నాథం గారూ! మీకర్ధం కావటం లేదు నీళ్లలో కొట్టుకొచ్చిన ఇనప ముక్క ఆయన కాలిలో లోతుగా గుచ్చుకుపోయింది. మాకెవరికీ ఇది ఎలా చెయ్యాలో తెలీదు. మీరే చెప్పాలి సర్" అంది.

"నేనిప్పుడు రెండు సర్జరీలు చేస్తున్నాను. మీకు ఎలా సాయం చేయాలో అర్ధం కావటం లేదు."అన్నాడు.

"వాళ్ళకి కూడా ఏంచెయ్యాలో తెలియటం లేదు సర్. మీరే ఫోన్ లో మాకు దారి చూపించాలి" అంది సీమ.

నాకు అర్ధం కానీ వైద్య భాషలో అదేదో "చెక్" చేశారా ? అని అడిగాడు గుర్నాథం.

అదెలా చెయ్యాలో కూడా ఆమెకి గానీ అక్కడున్న వారికి గానీ తెలియదు.

గుర్నాథం ఫోన్ నా చేత నోటికి దగ్గరగా అమర్చుకుని ఒక పక్క ఇద్దరికీ శస్త్ర చికిత్స చేస్తూ ఆమెకి సూచనలు ఇచ్చాడు.

సీమ ఒక్కొక్క సూచనా పాటించి సంక్లిష్టమైన భాషలో అతనికి వివరిస్తుంటే గుర్నాథం ముఖంలో రంగులు మారాయి.

అయినా ఏభావం చూపించకుండా అతను సీమకి ఏవో సూచనలు ఇచ్చాడు. తన సూచనలు పాటించాక వాళ్ళని ఎలాగో ఒకలాగా సూర్యోదయం లోపల ఇక్కడికి చేరమని చెప్పాడు.

తర్వాత కరుణతో ఉదయం చేయవలసిన పనులు ఇంగ్లీష్ లో మెడికల్ పదాలతో చెప్తుంటే నాకు యాంప్యుటేట్ అనే పదమొక్కటే కొంచెం తెలిసినట్టు అనిపించింది. అతను చెప్పిందంతా నోట్ చేసుకుని కరుణ మిగిలిన వారితో పాటు గురునాథానికి సహాయం కొనసాగించింది.

రెండున్నర గంటల తర్వాత ఒక రోగి బతికాడు. మరొకడు చనిపోయాడు.

ఒకడు బతికినందుకు సంతోషించాలో మరొకడు చనిపోయినందుకు బాధ పడాలో అని మేము నిశ్శబ్దంగా ఉంటే గుర్నాథం మాత్రం నిర్లిప్తంగా "ఈరోజుకి మన పని పూర్తి అయ్యింది. మీరందరూ భోజనాలు చేసి విశ్రాంతిగా పడుకోండి" అన్నాడు.

అతను కరుణతో పాటు మర్నాడు చేయవలసిన ఏర్పాట్లలో ఉంటే మేము అన్యమనస్కంగా భోజనాలు పూర్తి చేసాం. భోజనం చేస్తున్నంత సేపూ ఎవరమూ మాటాడుకోలేదు. ఆంప్యుటేట్ అంటే శరీరభాగాన్ని కోసేయటం అని నాకు చూచాయగా తెలుసు.

పని పూర్తి చేసుకుని కరుణా గుర్నాథం కూడా భోజనాలు చేస్తుంటే నీలాద్రికి ఏమయ్యింది లేదా ఏమవబోతుంది అనే ఉత్కంఠతో ఆ విషయం తెలిసిన కరుణ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ నిద్రపోలేక పోయాం.

కరుణ మా దగ్గరికి రాగానే అందరూ లోగొంతుకలతో ఏం జరిగిందని ఆమెని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే గుర్నాథం మా దగ్గరికి వచ్చాడు.

"ఫ్రెండ్స్! మనం మన కర్తవ్యం చేయగలం తప్ప ఫలితాన్ని శాసించలేం. ఒకరు మన చేతుల్లో బతికారు, మరొకరిని భగవంతుడు తీసుకుపోయాడు. మనమిప్పుడు చేయగలిగినది ఏమీ లేదు కనుక ఏవీ మనసులో పెట్టుకోకుండా పడుకోండి." అన్నాడు.

సమాధానం లేని మరో ప్రశ్నకి జవాబు కోసం మేము ఎదురుచూస్తున్నామనీ ఆ సమాధానం దొరికితే తప్ప మేము పడుకోమనీ అర్ధమయ్యింది కాబోలు అతను ఒక సారి నిట్టూర్చి "మన స్నేహితుడు నీలాద్రి తన కాలు పోగొట్టుకుంటున్నాడు. మనమేమీ ఆపలేము. దాని గురించి ఆలోచించి నిద్ర పాడుచేసుకోకుండా మీరింక దయచేసి పడుకోండి. చక్కటి నిద్రలో సత్తువ కూడదీసుకుని మళ్ళీ రేపటికి సిద్ధం కండి. ఎందరో మన కోసం మన వైద్యం కోసం ఎదురు చూస్తూ వస్తారు. వారికి మనం తప్ప సాయం చేయలేం. మనమే సరిగ్గా ఆరోగ్యంగా లేకపోతే వారికి న్యాయం చెయ్యలేం. అందుకే ప్రశాంతంగా పడుకోండి" అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఇలాంటి మాటలు అతను ఎన్నో సార్లు చెప్పినా ఈసారి మాకు ఎంతో బాగా అర్ధమయ్యాయి.

***

మర్నాడు పొద్దున్న గుర్నాధం నిద్ర లేవలేదు. అతను మరణించాడని అతన్ని పరీక్షించిన యేసుపాదం నిర్దారించాడు.

ఒకేరోజు వినోదం కోసం ఒకరు కాలు పోగొట్టుకున్నారు. వికాశం పేరు చెప్పి రేపు లేదన్నట్టు పని చేసిన రెండో వారూ అదేరోజు ప్రాణం వదిలారు.

మా క్యాంపు అర్ధాంతరంగా ముగిసినా గుర్నాథం ఆఖరి చూపు కోసం అక్కడికి పోటెత్తినట్టు వచ్చిన అధికారుల ద్వారా తెలిసిందేమిటంటే గుర్నాదానికి తన చావు ముందే తెలుసనీ అందుకే భార్య కి విడాకులిచ్చాడనీ. రేపన్నది లేకుండా పని చేసినది కూడా అందుకేననీ. మేమందరం పిలుచుకున్న మూలశంక, కొరకంచు, దౌర్భాగ్యపు గుర్నాథం ఇక లేడు. మరి అటువంటి వాడు రాడు.


Rate this content
Log in

Similar telugu story from Drama