Raja Ivaturi

Children Stories Tragedy Inspirational

4.7  

Raja Ivaturi

Children Stories Tragedy Inspirational

దిద్దుకోలేని తప్పు

దిద్దుకోలేని తప్పు

5 mins
1.2K


మన అందరి జీవితాల్లో ఒక కమ్మటి బాల్యం ఉంటుంది. మరి అటువంటి చక్కనిదే అయిన నాబాల్యంలో కూడా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నా కూతురికి చిన్నపుడు రోజూ కథలు చెప్పవలసిన పరిస్థితిలో నా బాల్యంలో జరిగిన విషయాలే ఎందుకు చెప్పకూడదు అనుకున్నాను. మరి ఆ కథలలో నా తమ్ముడు బుల్లినాన్న నా అన్నయ్య పెదనాన్న కూడా ఉంటారు. నాపేరు చిన్ననాన్న. మరి నా తల్లి నా కూతురికి బామ్మ కనుక కథలన్నీ నా కూతురి వైపు పాత్రల నుంచి నడుస్తాయి. మరి నా మొదటి కథ ఇది మరి. రక్తి కట్టించటానికి ఇందులో కొంత కల్పితం కూడా ఉంటుంది. 

ఒక రోజు పొద్దున్నే బామ్మ ఒక నీళ్ల కుండీలో నీళ్లు నింపి ఇంటి ముందు పెడుతుంటే చూసి బుల్లి నాన్న అడిగాడు. 'ఎందుకమ్మా ఈ నీళ్లు?'

బామ్మ వెంటనే వాడికేసి చూసి 'ఎండా కాలం వస్తోంది కదురా ? పక్షులూ జంతువులూ దాహంతో అలమటిస్తాయి. అవి నీలాగా నాలాగా అడిగి నీళ్లు తీసుకోవు కదా? అందుకని నీళ్లు బైట పెడుతున్నాను. వాటికి ఎప్పుడు దాహమైతే అప్పుడు తాగుతాయి. ' అంది. 

బుల్లి నాన్న కి ఎంతో చిత్రం గా అనిపించింది. 

'అయితే పక్షులు ఈ నీటిని తాగటానికి తప్పకుండా వస్తాయా?' అని అడిగాడు కుతూహలంగా . 

'ఎందుకు రావు? దాహం వేసినప్పుడు వస్తాయి మనం వాటిని భయపెట్టకుండా దూరంగా ఉంటె హాయిగా నీళ్లు తాగుతాయి' అంది బామ్మ. 

బుల్లి నాన్నకి పక్షులంటే ఎంతో ఇష్టం. బామ్మ చెప్పిన మాటలు వినగానే ఎంతో ఊహించుకున్నాడు. పాల పిట్టలూ, పంచ రంగుల చిలకలూ, బుల్లి బుల్లి పిచ్చుకలూ ఈ కుండీ దగ్గరికొచ్చి నీళ్లు తాగితే చూడటానికి ఎంత బావుంటుంది? అందులో ఒక పక్షిని నేను పెంచుకుంటాను అనుకున్నాడు. 

బుల్లి నాన్న ఇలాగే ఆలోచిస్తుంటే వాడి మనసులో ఏముందో ఊహించిన బామ్మ చెప్పింది. 'వాటిని ఊరికే బెదరగొట్టకు. మనింట్లోకి ఒకసారి ఇలాగే గోరింక వచ్చేస్తే నాన్న జాగ్రత్తగా దానిని బైట వదిలేశారు. అది హాయిగా ఎగిరిపోయింది. '

బుల్లి నాన్న ఆశ్చర్యపోయి తర్వాత నిరాశగా అడిగాడు 'అదేమిటమ్మా! ఇంచక్కా ఆ గోరింక ని ఉంచేసుకుంటే ఎంత బాగుండేదో కదా! ఎందుకు వదిలేశావు?" . 

"మనకి బావుంటుందేమో గానీ వాటికి బావుండాలి కదురా! అవి ఇంచక్కా ఎక్కడ కావాలంటే అక్కడికి ఎగిరి కావలసిన గింజలు తిని హాయిగా ఉంటాయి. పైగా మనం మంచివాళ్ళమనీ ఏమీ చెయ్యమనీ వాటికి తెలీదు కదా. అందుకని భయపడిపోతాయి' అని చెప్పి బామ్మ ఇంట్లోకి వెళ్ళింది. 

బుల్లి నాన్న కి పక్షులంటే చాలా ఇష్టం కదా. చాలా చిన్నప్పుడు ఇంకా కొత్త కొత్తగా మాటాడటం నేర్చుకున్నప్పుడే కాకులు కనపడితే కాకాయిలు కాకాయిలు అంటూ చప్పట్లు కొట్టి గెంతులు వేసేవాడు. ఆ బుల్లి బుల్లి నవ్వులు చూడటానికి బాబాయిలూ అత్తయ్యలూ కాకి కనపడితే చాలు "ఒరేయ్ కాకాయిలురా" అంటూ పిలిచేవారు. కాకి నల్లగా కొంచెం పెద్దగా ఉండి కర్ణ కఠోరంగా కావ్ కావ్ మని అరిస్తే మరి పిచిక బుల్లిగా బుజ్జిగా ఉండి కీచుకు కీచుకు మని అరుస్తుంది. బుల్లి నాన్నకి కోయిల కూడా తెలుసు. కానీ ఇప్పటి వరకూ చూడలేక పోయాడు. కోయిల కూ కూ అని పాట పాడినట్టు కూసినప్పుడు కిటికీ ఎక్కి ఆ శబ్దం వస్తున్న వైపు చూస్తూనే ఉంటాడు కోయిల కనపడుతుందేమో అని. కానీ ఆ కోయిల ఎక్కడో గుబురు చెట్ల మధ్యలో కూర్చుని కూస్తూనే ఉంటుంది తప్ప పైకి ఎగరటం మాత్రం జరగలేదు. అందుకే ఎప్పుడూ కోయిలని చూడలేకపోయాడు. గోరింకలు మాత్రం బాగానే కనపడతాయి కానీ అవి పాడవు. 

గంట తర్వాత బామ్మ బట్టలు ఆరేయటానికి వరండా లోకి వచ్చేసరికి బుల్లి నాన్న అక్కడే ఒక గట్టు మీద కూర్చుని కనపడితే ఆశ్చర్యపోయింది. 'ఇదేమిట్రా ? సెలవుల్లో నీమిత్రులతో ఆడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావ్?' అని అడిగింది. 

'పక్షులొస్తాయని చూస్తున్నానమ్మా' అన్నాడు బుల్లి నాన్న. వచ్చిన పక్షులు నీళ్లు తాగి వెళ్లే వరకూ అన్నింటినీ చూడాలి. 

'ఓరి భగవంతుడా ! నువ్విక్కడ కాపలా కూర్చునే సరికి వచ్ఛే పక్షులూ జంతువులూ భయపడి రావటం లేదు కాబోలు. వాటిని వాటి మానాన్న వదిలెయ్యరా. నిన్నిక్కడ చూస్తే అవి రావు ' అంది 

'నేను వాటినేమీ చేయనమ్మా ఊరికే చూస్తాను' అన్నాడు బుల్లి నాన్న. 

'ఇందాకే చెప్పాను కదురా ? నువ్వు కేవలం చూస్తావనీ వాటినేమీ చేయవనే విషయం వాటికేం తెలుస్తుంది? నిన్ను చూడగానే పారిపోతాయి. వెంటనే లోపలి రా. బైటికి అలా వీధిలోకి పోయి ఆడుకో' అంది బామ్మ. 

బుల్లి నాన్న లోపలికి వచ్చేసాడు గానీ ఆడుకోవటానికి వీధిలోకి వెళ్ళలేదు. కిటికీ దగ్గర కొంచెం దాగినట్టుగా కూర్చుని నీళ్ల కుండీ వైపే చూస్తూ కూర్చున్నాడు. ఆటలకన్నా ఎట్టి పరిస్థితి లోనూ ఆ పక్షులని చూడటం ముఖ్యమనిపించింది వాడికి. 

రెండు గంటలయినా ఒక్క పక్షి కూడా రాలేదు. 

మళ్ళీ బామ్మ మధ్య గది కి వచ్చి 'నీకు బుద్ధి రాదురా. అన్నిపనులూ మానుకుని ఇక్కడే ఉంటే ఎలా? నేను కూరలు తెచ్చుకోవటానికి వెళ్తున్నా. జాగ్రత్త గా ఇంట్లో ఉండు' అని చెప్పి వెళ్ళింది.

బుల్లి నాన్న వెళ్లి తలుపేసుకుని మళ్ళీ మధ్య గది కిటికీ గట్టు మీద కూర్చున్నాడు. ఇంతలో చిన నాన్న మధ్య గదిలోకి వచ్చి కిటికీ దగ్గరే కళ్లప్పజెప్పి బైటికి చూస్తున్న బుల్లి నాన్న ని చూసి "ఏం చేస్తున్నావు రా?" అని అడిగాడు.

బుల్లి నాన్న ఎంతో ఉత్సాహంగా అంతా చెప్పాడు. సాంతం విన్నాక చిననాన్న కళ్ళు మెరిసాయి.

'అవునురా మనం ఒక పిట్టని పెంచుకుందాం. ఒక దుప్పటి తీసుకుని దానిమీద వేసి లోపలికి తెచ్చుకుందాం. తర్వాత అది ఇంచక్కా మన దగ్గరే ఉంటుంది. చక్కగా పాటలు పాడుతుంది. దానికి మనం గింజలూ అన్నమూ పెట్టి పెంచుకుందాం ' అన్నాడు.

'అమ్మ వద్దంది కదురా' అనబోయాడు కానీ బుల్లి నాన్న కి కూడా ఒక పిట్టని పెంచుకోవాలనే కోరిక ఉంది కనుక ఇంకేమీ చెప్పకుండా చిన్న నాన్నని అనుసరించాడు. చిన్న నాన్న తనని వద్దనకుండా తనలాగే ఆలోచించడం బుల్లినాన్నకి సంతోషంగానే అనిపించింది.

ఇద్దరూ లోపలికి వచ్చి ఒక పలచటి దుప్పటి తీసుకుని మధ్య గదిలోకి వస్తుంటే బోలెడన్ని కాకుల అరుపులు వినిపించాయి. వాళ్ళు పరుగెత్తుకుని వరండా దగ్గరికి వఛ్చి చూస్తే ఎన్నో కాకులు కావ్ కావ్ మని అరుస్తూ కుండీ చుట్టూ ఎగురుతున్నాయి. కొన్ని చెట్ల కొమ్మల మీదా పిట్టగోడ మీదా గట్ల మీదా కూర్చుని అరుస్తున్నాయి. అప్పుడు చూసాడు బుల్లి నాన్న. కుండీ లో నీళ్లలో ఒక పిచ్చుక మునిగి తేలుతూ రెక్కలు గబగబా ఆడిస్తూ వేగంగా కదుల్తోంది. 

అయ్యో అంటూ బుల్లి నాన్నా చిననాన్నా పరుగెత్తుకుని బైటికి వచ్చారు. కాకులన్నీ కారు కారు మని అరుస్తుంటే కొడుతున్నట్టు బెదిరిస్తూ వాటిని తరిమేశారు. అప్పుడు నీళ్లలో తడిసిన పిచుక దగ్గరికి చిన్నాన్న ఒక కర్ర పెడితే ఆ కర్ర మీదుగా ఆ పక్షి కుండీ లోంచి బైటికి వచ్చింది.

'ఒరేయ్ దీన్ని పట్టుకోవాలి. దుప్పటి తీసుకురా' అని అరిచాడు చిననాన్న. అప్పటికి రెక్కలు ఆడించి వంటి మీద చేరిన నీళ్లు విదిలించుకుంటున్న ఆ పిచుక ఆ అరుపులకి గబుక్కున ఎగరబోయి వంటి మీద నీళ్ల బరువుకి కుండీ పక్కన వాలింది. చిననాన్న బైట నుంచి అడ్డుగా నిలబడితే గుమ్మం నుంచి బుల్లి నాన్న వస్తున్నాడు. ప్రాణభయంతో పిచుక ఎగిరి గుమ్మం మీదికి వెళ్లి మళ్ళీ శక్తి చాలక గడప మీద వాలింది. 

పట్టుకో అని ఇద్దరూ ఇంట్లోకి వస్తుంటే చిన్న చిన్న గా గెంతుతూ పిచుక ఇంట్లోకి వచ్చింది. 

'ఒరేయ్ తలుపులు వేసేయ్' అని చిననాన్న అరుస్తూ లోపలికి వచ్చేసాడు.

ఈ లోపల బుల్లి నాన్న గుమ్మం తలుపు కిటికీ తలుపులూ మూసేసాడు. అప్పటికి వంటి మీద నీళ్లు కారి శరీరం తేలికయి కొంచెం ఎగరగలిగిన పిచుక గాల్లోకి లేచింది గానీ బైటికి దారి లేక అటూ ఇటూ ఎగురుతుంటే ఇద్దరూ దాన్ని పట్టుకోవటానికి పరుగెడుతున్నారు. బుల్లి నాన్న చేతికందిన దిండు విసిరితే చిన నాన్న తువ్వాలు తో పిచుక ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. బైటికి వెళ్ళటానికి దారి తెలియక పారిపోవటానికి ఎంత ప్రయత్నించినా ఆ బుల్లి పిచుక ఎటు పోవాలో తెలీక సతమతమవుతోంది. వేగంగా ఎగురుతూ కిటికీ అద్దం అడ్డంగా ఉందని గుర్తించకపోవటంతో ఆ అద్దాన్ని కొట్టుకుని కింద పడిపోయింది ఆ పిచుక. పిచుక నేల మీద పడగానే చిననాన్న దాని దగ్గరికెళ్లి నీరసం గా నిస్సహాయంగా నేల మీద ఉన్న పిచుక మళ్ళీ ఎగిరే లోపల మృదువుగా ఒక చేత్తో పట్టుకున్నాడు. 

చేతికి చిక్కిన పిచుకకి నెప్పి కలగ కుండా రెండు చేతులతో నెమ్మదిగా ఆ పిట్టని చేతుల్లోకి తీసుకుంటుంటే భలే అంటూ బుల్లి నాన్న చిననాన్న ని చేరి ఆ పిచుకని ఎంతో ఉత్సాహంతో దగ్గరి నుంచి చూస్తూ 'ఒరేయ్ ఒక సారి నేను కూడా పట్టుకుంటా' అన్నాడు. 

'ఉండరా దానికి కొంచెం వేడి కావాలి మన కుంపటి దగ్గరికి తీసుకెళ్తే వెచ్చగా ఉంటుంది' అంటూ ఆ పిచుక వైపు చూసి మాట్లాడటం ఆపేసాడు చిన్న నాన్న. 

చిన్న నాన్న ఎందుకు మాటాడటం లేదో అని బుల్లి నాన్న వాడి చేతుల్లో ఉన్న పిట్ట వైపు చూసాడు. 

చిన నాన్న చేతిలో ఉన్న పిచుక గబగబా వణుకుతూ ఇంకా ఇంకా ముడుచుకుపోతోంది. ఆ వణుకు చలికి కాదనీ చిన్న నాన్నా బుల్లి నాన్నా అనే ఇద్దరు రాక్షసుల చేతిలో పడ్డానని పిచుక చెందుతున్న భయానికని వారికి తెలియలేదు. వడివడిగా గుండె కొట్టుకున్నచప్పుడు చిన్న నాన్న చేతుల్లోకి తెలుస్తుంటే ఆ బుల్లి పిచుక మెడ పక్కకి వాల్చేస్తోంది. దాని కళ్ళు నెమ్మదిగా మూసుకుపోతున్నాయి. వాళ్లిద్దరూ చూస్తుండగానే ఆ మూగ జీవి కళ్ళు పూర్తిగా మూసుకుపోయాయి. చిన నాన్న చేతికి ఆ పిచుక శరీరం గట్టిగా తగిలింది. అంత వరకూ చిలిపిగా కిచకిచలాడుతూ ఆనందంగా ఎగురుతూ స్వేచ్ఛగా జీవించిన ఆ పక్షి లో చలనం ఆగిపోయింది. 

బుల్లి నాన్నా చిననాన్నా ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు. వారేమీ మాట్లాడుకోక పోయినా ఆ చూపుల భావం ఒక్కటే. 

ఈ దిద్దుకోలేని తప్పు జీవితం లో మళ్ళీ ఎప్పుడూ చేయను అని. 


Rate this content
Log in