Raja Ivaturi

Drama Romance Inspirational

4.8  

Raja Ivaturi

Drama Romance Inspirational

అసలైన త్యాగం

అసలైన త్యాగం

3 mins
488


ఆసుపత్రి నుంచి వచ్చినప్పటినుంచి రమ మనసు మనసులో లేదు. వైద్యురాలు శుభవార్త లా చెప్పిన విషయం ఆమెకి చాలా చేదుగా అనిపించింది. 

వారం క్రితం ఆమెకి నలతగా ఉందని గమనించిన దిలీప్ ఎప్పటిలాగే భార్య ఆరోగ్యం కోసం కొంచెం ఎక్కువే కంగారు పడి ఆమెని ఆసుపత్రికి తీసుకుపోయాడు. 

అక్కడి వైద్యురాలు, ఒకప్పుడు దిలీప్ తో చదువుకున్న సుమతి ఏవో పరీక్షలు చేయించమంది. 

ఆ పరీక్షలు ఏమిటో అర్ధం చేసుకున్నప్పుడే రమ మనసులో ఆందోళన మొదలయ్యింది. 

దిలీప్ కి ఆ పరీక్షల వివరాలేమీ తెలియవు గానీ మర్నాడు ఆమెని తీసుకెళ్ళటానికి సెలవు పెట్టాడు.

"అనవసరంగా సెలవులెందుకు వ్యర్థం చేసుకుంటారు? దగ్గిరే కదా! నేను మనింటావిడని తోడు తీసుకుని వెళ్ళొచ్చేస్తాను" అంది. 

"ఆవిడ ఖచ్చితంగా వస్తుందా? అలా అయితేనే నేను సెలవు రద్దు చేసుకుంటాను" అన్నాడు దిలీప్. 

"అనవసరంగా కంగారు పడకండి. అసలే చాలా పని ఉంటోంది మీకు" అని అతన్ని వప్పించి తను మాత్రం వంటరిగానే పరీక్షలు చేయించుకోవటానికి వెళ్ళింది. ఇంటావిడని తీసుకెళ్తే ఆ తర్వాత పత్రికలకి వార్తలివ్వక్కరలేదు. 

ఆ తర్వాత కూడా దిలీప్ ని రానివ్వకుండా తనే రిపోర్ట్ తీసుకుని మళ్ళీ వంటరిగా సుమతి దగ్గరికి వెళ్ళింది. 

సుమతి ఆమెని మళ్ళీ పరీక్ష చేసి రిపోర్ట్ కూడా చూసి "రమా! శుభవార్త ! నువ్వు తల్లివి కాబోతున్నావు. రెండో నెల. ఇంత త్వరగా తెలియటం అదృష్టం. మాకు మిఠాయి ఎప్పుడు?" అంది. 

ఇంత మంచి విషయం చెప్పాక సుమతి అనుకున్న స్పందన రమ ముఖం లో కనిపించకపోతే కొద్దిగా నిరాశ చెందుతూ "మిఠాయి అని ఊరికే అన్నాను. ఇక్కడ నియమాల ప్రకారం ఎంత చిన్న కానుకలయినా మేమేమీ తీసుకోకూడదు" అంది సుమతి. 

"అబ్బే అదేమీ కాదు సుమతీ. మాకిప్పటికే ఇద్దరు పిల్లలు. ఇక వద్దని అనుకున్నాం. జాగ్రత్తగానే ఉన్నాం.  కానీ ఇప్పుడిలా అయ్యింది" అని సమాధానమిచ్చింది రమ. 

"అరెరే. ఇంక పిల్లలు వద్దనుకున్నారా?" అంది సుమతి. 

"మీరే వెంటనే గర్భం తీసెయ్యండి. ఇంకా రెండు నెలలే కనుక శస్త్ర చికిత్స అవసరం ఉండదేమో!" అంది రమ కంగారుగా. 

"మరి మీ భర్తకి చెప్పాలేమో! " అంది సుమతి కొంచెం సంశయిస్తూ. 

"అవసరం లేదు. మేము పరస్పర అంగీకారం తోనే వద్దనుకున్నాం కనుక అతనికి అభ్యంతరం ఉండదు. దయచేసి వెంటనే పని మొదలు పెట్టండి." అని తొందర చేసింది రమ. 

సుమతి కొంచెం సేపు మౌనంగా ఉండి "సరే! చేసేద్దాం. మా ఆస్పత్రి పద్దతులేమిటో తెలుసుకుంటాను. అబార్షన్ కి భర్త అనుమతి తప్పని సరి కాకపోతే పని మరింత సులువుగా అయిపోతుంది. రేపు ఎక్కువ సేపు ఉండేలా రా." అంది. 

సరేనని వచ్చేసింది రమ. కానీ మనసు కుదురుగా లేదు. ఒకవేళ ఆసుపత్రి నియమాల ప్రకారం భర్తకి చెప్పకుండా వైద్యం కుదరందంటే ఎలా ???  అనుకుని ఆందోళన చెందుతోంది. 

దిలీప్, రమ పెళ్లి చేసుకుని ఆరేళ్ళయింది. ఎటువంటి కలతలూ లేవు. ఆర్ధిక ఇబ్బందులూ లేవు. కొన్ని నెలల క్రితమే ఇద్దరూ మాటాడుకుని ఇక పిల్లలు చాలు అనుకున్నాక తను ఆపరేషన్ చేయించుకుంటానంది.

"అయ్యో! నీకు జరిగేది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. మగవాళ్ళకి చేసేది సులువుగా అయిపోతుంది. నేనే చేయించుకుంటాను" అని దిలీప్ వైద్య కేంద్రానికి వెళ్లి మూడు నాలుగు గంటల తర్వాత స్కూటర్ మీద ఇంచక్కా ఇంటికి వచ్చేసాడు. 

"చూసావా? నేను చేయించుకుంటే ఇలా అయిపొయింది. నీకయితే ఎన్నో రోజులు కష్టపడాల్సి వచ్చేది" అన్నాడు. 

"ఇంత త్వరగా ఎలా అయిపొయింది! అసలు చేయించుకున్నారా?" అంది రమ నవ్వుతూ. 

దిలీప్ కూడా నవ్వేశాడు. 

ఇప్పుడదంతా గుర్తొస్తే ఆరోజు దిలీప్ ని ఒప్పించి తనే ఆపరేషన్ చేయించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అనుకుంది రమ. 

దిలీప్ ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేస్తుంటాడు. రెండు నెలల క్రితం అలాగే అతను ఊరు వదిలి వెళ్ళినపుడు పిల్లలు కూడా సెలవులకి తాతగారి ఊరు వెళ్ళటం వలన తను వంటరిగా ఉంది. ఆ సమయంలో దిలీప్ స్నేహితుడు కుమార్ ఇంటికి వచ్చాడు. 

అతను వచ్చిన సమయం రాత్రి పదకొండు గంటలకి కావటం వలన అతన్ని అక్కడే పడుకోమనక తప్పలేదు. అతను కొంచెం మాటకారి కావటం వల్లనో ఎక్కువ చొరవ తీసుకునే గుణం ఉండటం వలనో తప్పు జరిగిపోయింది. తర్వాత ఎంతో పశ్చాత్తాప పడి ఈ మద్యే ఆ చేదు సంఘటనని మరిచిపోతున్నా మనస్సాక్షి తనని క్షోభ పెడుతూనే ఉంది. ఒక బలహీన క్షణంలో జరిగిన తప్పు అని మరిచిపోవాలనుకుంది. కానీ ఆ ఒక్క తప్పు ఇప్పుడిలా తనని వెంటాడుతుందనుకోలేదు. 

 "దేవుడా! ఈ ఆపద లోంచి రక్షించు. నేనెప్పుడూ భర్తని మోసం చెయ్యలేదు. వేరే వారి మీద మోజు పడలేదు. నా భర్తే నా ప్రాణం. అనుకోకుండా జరిగిన ఈ తప్పు వలన మా జీవితాల్లో సంక్షోభం కలగకుండా కాపాడు. మళ్ళీ ఇటువంటి తప్పు నా జీవితంలో జరగకుండా జాగ్రత్త పడతాను. " అని కళ్ళు మూసుకుని ఆమె ప్రార్థిస్తుంటే "తథాస్తు" అని వినిపించింది. 

ఉలిక్కిపడి కళ్ళు తెరిస్తే చిరునవ్వు నవ్వుతూ దిలీప్ కనిపించాడు. పిచ్చి ఆలోచనలతో తలుపు కూడా మూయటం మరిచిపోయిందన్న మాట. 

"ఏమిటీ అంత దీక్ష గా ప్రార్థిస్తున్నావు ? ఎందుకయినా నేను తథాస్తు చెప్పానులే" అన్నాడు. 

ముఖంలో నవ్వు తెచ్చుకుని "త్వరగా వచ్చేసారే" అంది. 

"అదే ఈఉద్యోగంలో ఉన్న సమస్య. ఇప్పుడు ఇలా త్వరగా వచ్చే అవకాశం దొరుకుతుంది. ఒక్కొక్కప్పుడు రోజుకి 24 గంటలు కూడా చాలవు" అంటూ కాళ్ళు చేతులు కడుక్కోవటానికి వెళ్ళాడు దిలీప్.

అతను ఏవేవో సరదా కబుర్లు చెబుతున్నా ఏవో ఆలోచనలతో అతని ప్రేమమయమైన సాంగత్యాన్ని ఆస్వాదించలేకపోతోంది. అలాగే రోజు గడిచిపోయింది. 

పడక గదిలో దిలీప్ ఏదో ఆలోచిస్తూ పడుకుంటే 'ఇదే మంచిది' అనుకుని అతన్ని మాటాడించకుండా తను మంచం రెండో వైపు కి వాలింది. 

కొంత నిశ్శబ్దం తర్వాత హఠాత్తుగా దిలీప్ నోరు విప్పాడు. 

"నీకు తెలియకుండా నేనొక తప్పు చేసాను రమా!" అన్నాడు. 

ఏ ఉపోద్ఘాతం లేకుండా అతను చెప్పిన మాటలు విని రమ ఉలిక్కిపడింది. 

"నన్ను క్షమిస్తానంటేనే చెప్తాను" అన్నాడు. 

రమ మనసులో రకరకాల భావాలు మెదిలాయి. కుదిరితే తను కూడా చేసిన తప్పు చెప్పుకుని మనసులో భారం దించుకోవాలనే భావం కూడ ఉంది. 

"నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వెళ్ళినపుడు వైద్యులు ఒకపక్క ఆపరేషన్ కోసం అన్నీ సిద్ధం చేసుకుంటూ మద్య లో ఏవో ఏర్పాటు కోసం ఒక క్షణం బైటికి వెళ్లారు. ఆ క్షణం లో హఠాత్తుగా నాకు ఆపరేషన్ లో ఏమి జరుగుతుందో అని చాలా భయం వేసింది. మరి తట్టుకోలేక మంచం దిగి వెనక నుంచి సిబ్బంది పిలుస్తున్నా ఆగకుండా పరుగెత్తుకుని బైటకి వచ్చి స్కూటర్ ఎక్కేసాను" అన్నాడు . 

అనుకోని ఈ నిజం విని మనసులో కదులుతున్న రకరకాల భావాలు అణుచుకుంటూ రమ అతని మాటలు వింటుంటే 

"ఆ రోజు నేను అంత తొందరగా ఇంటికి రావటానికి కారణం అదే" అన్నాడు దిలీప్. 

"మీరు చెప్పేది నిజమా?" అంది సంశయంతో. 

"నిజం రమా! నిన్ను మోసం చేశాను. అప్పటినుంచి నీ రుతుక్రమం ప్రకారం సంసారం చేస్తూ మనకి పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నాను" అన్నాడు దిలీప్. 

అనుకోకుండా తన సమస్యకి పరిష్కారం లభించిందని ఒక క్షణం నమ్మలేకపోయింది రమ.  తన కాపురానికి ప్రమాదం లేదని తెలియగానే హఠాత్తుగా పెద్ద భారం మనసు లోంచి తొలగిపోయి "భగవంతుడా! పరిష్కారం కోసం మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే నువ్విలాంటి మాయలు చేస్తావన్నమాట" అనుకుంది.

వెంటనే మళ్ళీ అనుకుంది.  "లేదు. లేదు. నేను నిజం చెప్పేస్తే మంచిది. ఆయన అంత నిజాయితీ గా ఉంటే నేను కూడా అంత నిజాయితీ గా ఉండాలి" 

"నన్ను క్షమించగలవా రమా! నేనెంత జాగ్రత్త పడినా ఎప్పుడైనా జరిగిన తప్పు వలన మనకి పిల్లలు పుట్టే పరిస్థితి వస్తే వారిని ఈ లోకంలోకి రాకుండా ఆపేద్దామా! లేక కందామా?" అన్నాడు.

రమ నోటివెంట మాట లేదు. 

"నా మనసులో ఇదే బెంగ ప్రతిరోజూ ఉంది రమా! పిండాన్ని చంపినా అది హత్యే కదా! అందుకని నా పొరబాటు వలన నీకు భవిష్యత్తులో గర్భం వస్తే దయ చేసి కాదనకు" అన్నాడు దిలీప్. 

రమ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె మనసులో భారం దిగిపోయింది. 

"మనకి ఆర్ధికంగా ఇబ్బంది లేనపుడు ఇంకొక బిడ్డని పెంచుకోవచ్చండి" అంది. 

"అంటే నీకేం కోపం లేనట్టే కదా! హమ్మయ్య. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది." అంటూ ఉత్సాహంగా లేచాడు దిలీప్.

"మనం ఈ మాట మీదే ఉందాం. బిడ్డ పుడితే పెంచుకుందాం. కానీ ఒక విషయం ...." అన్నాడు మళ్ళీ.

"ఏమిటది?" అడిగింది రమ మళ్ళీ కలిగిన సంశయంతో. 

" ఆ బిడ్డ ని మనం ఒకప్పుడు వద్దనుకున్నట్టు ఏమాత్రం తెలియకుండా పెంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు తాలూకు జ్ఞాపకాలు ఆ బిడ్డ ని బాధించకూడదు. సరేనా ? " అన్నాడు. 

రమ కన్నీళ్లు ఆపుకుంటూ "అలాగే" అంది. 


Rate this content
Log in

Similar telugu story from Drama