Raja Ivaturi

Drama Tragedy Inspirational

4  

Raja Ivaturi

Drama Tragedy Inspirational

మారిన విలువలు

మారిన విలువలు

6 mins
413


మారిన విలువలు


"మోహన్ ! ఈ రోజు ఇందూరి సుబ్బారావు గారింట్లో సత్యనారాయణ వ్రతం ఉందని గుర్తుందా?" అని అడిగింది సుమ. అలవాటు లేని పట్టు చీర, నడుం పడిపోయేలా వంటినిండా ఒక కిలో నగలూ, ముఖం మీద కొట్టొచ్చినట్టు కనిపించే రకరకాల రంగులతో వీధినాటకాల నటుల్నిగుర్తు చేస్తూ పండగ కోసం తయారుగా ఉంది సుమ. 

ఈ దేశానికి వచ్చాక రుమాలు గుడ్డ తో బట్టలు కుట్టించుకుని కూడా తిరగ గలిగే సౌకర్యం ఉన్నా విదేశాలకి వెళ్ళగానే పొంగి పొరలే దైవ భక్తి, గుండె నిండుగా దేశ భక్తి పెంచుకున్న ఎంతో మంది మా లాంటి వాళ్ళు ఎవరికో జవాబు చెప్పుకోవాలన్నట్టు ప్రతి పండగా వైభవంగా జరుపుతూ ఆ కాసిని రోజులూ ఇలా ఎకరం మేరకి నేసిన చీరలూ కిలోల లెక్కన నగలూ వేసుకుని సిద్దమయిపోతున్నారు. మగవారు కూడా పైజామా కుర్తాలూ అందులో ఉత్సాహవంతులు ధోతీలు కూడా ధరించి బొట్టు విభూది లతో వెలిగిపోతారు. ఏది ఏమైనా ఈ కార్యక్రమం జరిగిన అరగంట లోపు వందల ఫోటోలు ముఖ పుస్తకాలలో (ఫేస్బుక్ అని తెలుగులో అంటారట) అందరికీ చేరిపోతాయి. ఒక్కొక్క ఫోటో కి వందల వ్యాఖ్యానాలు, నమో నమః, శివోహం అంటూ కొంత మంది వారి భక్తినీ జ్ఞానాన్నీ వ్యాఖ్యలలో ప్రకటించటం కూడా ఎప్పుడూ జరిగే పద్దతే. 

నేనయితే ఒక తాడు భుజానికి చుట్టుకుని మెడలో ఒక శివలింగాన్ని ధరించి ఇప్పటికే ప్రజలని మోసం చేస్తున్నాను కనుక మరి కొత్త నాటకాలు ప్రయత్నించక పోయినా ఈ రోజు కి మాత్రం వేషం తప్పదని తెల్లటి సంప్రదాయపు (???) దుస్తులు వేసుకుని సుమతో బైలు దేరాను. 

మేము అక్కడికి చేరేసరికి ఇంద్ర ధనుసుని తలదన్నే విధంగా మహిళా మణులు రకరకాలు రంగుల దుస్తులలో, లేని హడావుడితో తెగ తిరిగేస్తున్నారు. మగవారు అలవాటు లేని బట్టలతో స్వేచ్ఛగా కదలలేక ఇబ్బందిగా ఒక చోటే నించుని గంభీరంగా సంభాషణలు జరుపుతున్నారు. 

నేనిలా వారందరి అసహజమైన వేషాలనీ విన్యాసాల నీ చూసి పరవసిస్తుంటే "నమస్కారం మోహన్ గారూ!" అంటూ పలకరించాడు ఒక విచిత్ర వేషధారి. 

అటువంటి కలయికలలో ఎప్పుడూ ఇలాంటి గుర్తు లేని సుబ్రమణ్యాలని చూసినపుడు ఉండే అయోమయంతో నేను సమాధానం కోసం తడుముకుంటుంటే నేను కొంచెం తేరుకునేలా "మరిచిపోయారా? నేను శివరాం ని" అన్నాడు ఆ వేషగాడు. 

"అయ్యో మీరు తెలియకపోవటమేమిటి? ఇలాంటి పండగలలోనే నాలుగైదు సార్లు కలిసాం కదా!" అన్నాను కొంచెం ఉత్సాహంగా. 

"అవునండి. మనం చాలా సార్లు కలుసుకున్నాం గానీ ఈ సారి నుంచి ఇక మనం కలుసుకోక పోవచ్చు." అన్నాడతను గంభీరంగా. 

ఈ మాట నాకు కొత్త కాదు. ఎప్పుడు కలిసినా ఇతను ఈ మాట చెప్పకుండా ఉండడు. ఏమీ తెలియనట్టు నేను ప్రశ్నించటం కూడా కొత్త కాదు కనుక ఐదో సారి ఇదే ప్రశ్న అడిగాను. 

"అదేమిటండి. వేరే చోట ఉద్యోగానికి వెళ్ళుతున్నారా?"

"లేదండీ. ఏకంగా నా మాతృదేశానికి వెళ్ళిపోతాను. ఎప్పటికైనా అదే నా జన్మ భూమి" అన్నాడు శివరాం కించిత్తు గర్వంతో పైకి చూస్తూ . 

ఒక్క డైలాగూ మారకుండా ఇదే విధంగా కలుసుకున్నపుడల్లా మాటాడుకోవటం నాకు చాలా చిత్రం గా అనిపించింది. కొంచెం నవ్వు కూడా వచ్చింది. 

ఇంతలో "శివరాం గారూ మీకు శుభాకాంక్షలు." అని పలకరించాడు శ్రీధర్. 

ఏమిటి విషయమని నేను ప్రశ్నార్థకంగా చూస్తుంటే "నీకు తెలీదా? శివరాం గారు మరొక ఇల్లు కొన్నారు" అన్నాడు శ్రీధర్.

ఒక్కసారి తత్తరపడిన శివరాం "అవునండీ. ఈ మధ్యనే కొంచెం కొనగలిగే ధరకి ఒక ఇల్లు ఉంటే పిల్లల బడికి దగ్గర కదా అని కొన్నాను. గృహ ప్రవేశానికి మీకు ఆహ్వానం పంపిస్తాను" అన్నాడు. 

అతను ఇంత చక్కగా చెప్పినా నేను ఇంకా అదే అయోమయం తో అతని వైపు చూస్తుంటే "ఇవేవీ నేను నా దేశానికి వెళ్లకుండా ఆపవు లెండి" అన్నాడు. 

"మరే..... " 

"మీరొకసారి అనుకున్నాక ఎలా మార్చుకుంటారు లెండి" అన్నాను నా మాటలో చాలా నిజాయితీ ధ్వనిస్తూ. 

అయినా ఏదో వెటకారం వినపడిందేమో "వస్తానండీ" అంటూ శివరాం వేరే చోటికి వడివడిగా వెళ్ళాడు. 

"ఏమిట్రా విశేషాలు? అలా గుండ్రాయిలా నుంచున్నావేమిటి?" అన్నాడు శ్రీధర్ - మా డీల్ మాస్టర్. మార్కెట్ లో ప్రతి వస్తువుకీ బ్రహ్మాండమైన డీల్ బేరం చేస్తాడు. తీరా వాడు ఎప్పుడూ కొన్నది లేదు గానీ మేము వాడు ఊహించిన ఆ డీల్స్ బాగా వాడుకున్నాం. 

"ఏమీ లేదురా ఏమైనా మంచి డీల్ చెప్పు" అన్నా. 

నేను ఊహించినట్టే "ఇండియా వెళ్ళటానికి మంచి డీల్ దొరికిందిరా. ఒక్కొక్కరికీ 900 డాలర్లు. చాలా ప్లాన్ చేసి మొన్ననే బుక్ చేశా" అన్నాడు వాడు గర్వంగా. 

"ఓరినీ ఇంత తొందరగానా?" అన్నాను. 

"అందుకే అంత మంచి ధరలో మొత్తం కుటుంబం వెళ్తున్నాం" అన్నాడు వాడు.

"అమ్మ బాగుందా?" మాట తప్పిస్తూ అడిగాను. ఆవిడ పని మనిషిగా ఇంటింటిలో అంట్లు తోమి వీడిని పట్టుదలగా చదివించింది. వీడు కూడా చాలా తెలివైన వాడు కావటంతో మంచి మార్కులతో వచ్చే ఉపకార వేతనాల్ని సంపాదించుకుంటూ చదువుకున్నాడు. నేను వాడి ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఆవిడ చక్కటి మజ్జిగ లో ఉప్పూ కరివేపాకు వేసి ఇస్తే ఎంతో ఇష్టంగా తాగేవాడిని. 

"అమ్మ బాగానే ఉందిరా. ఆ మధ్య కొంచెం అనారోగ్యం చేసిందిట. ఈ సారి వెళ్ళినపుడు ఏకంగా ఇక్కడికి తీసుకొచ్చేస్తాను" అన్నాడు. 

శివరాం దగ్గర ఉండే మొహమాటం ఇక్కడ నాకు లేదు కనుక "ఎప్పుడూ చెప్తావు కానీ అమ్మని తీసుకురావుగా" అన్నాను.

"అదేం లేదురా. ఆవిడ రానని మారం చేస్తుంది. ఈ సారి వప్పుకోను" అన్నాడు శ్రీధర్. 

"ఆవిడ ఇక్కడికి రావాలనుకోవటంలో నా స్వార్ధం ఉందిరా. అమ్మ చేతి మజ్జిగ తాగచ్చు కదా రోజూ!" అన్నాను నవ్వుతూ.

వాడు కూడా నవ్వేసి "మా ఆవిడని రెసిపీ తెలుసుకుని చెయ్యమంటాను రా" అన్నాడు వాడు.

"ఎవరు చేసినా అమ్మ చేసినప్పటి రుచి ఉండదు కదా!" అన్నాను. 

నెమ్మదిగా అందరినీ పలకరించి బిర్యానీ, బజ్జీలు (పండగ అంతా సాంప్రదాయ బద్దంగా జరపాలని అనుకున్నా ఎందుకో గానీ భోజనాలకి గారెలూ పులిహోర చెయ్యరు) తిని ఇళ్లకు వెళ్లాం. 

క్రీస్తు జన్మదినం సందర్భంగా బలవంతపు సెలవులు తీసుకుని అందరం మన దేశానికి వెళ్లే ప్రయత్నాలలో ఉండగా శ్రీధర్ ఒకసారి ఇంటికి వచ్చాడు. దగ్గిరలోనే ఏదో పని మీద వచ్చి నన్ను కూడా చూడచ్చు కదా అని ఇంటికి వచ్చాడు.

ట!

మాటల్లోనే "ఒరేయ్ నీ దగ్గర ఒక పెద్ద పెట్టె ఉండేది కదా! అది ప్రయాణానికి కావాలిరా. మాది మొన్ననే విరిగిపోయింది" అన్నాడు. 

 ఆ పెట్టి అటక మీంచి దించి శుభ్రం చేసే పని మా అబ్బాయికి అప్పజెప్పి మేము మాటలలో పడ్డాం. 

ఇంతలోనే వాడికి ఫోన్ వచ్చింది. ఒకరితో సంభాషణలో ఉన్నపుడు వేరే వారితో మాటాడటం మర్యాద కాదని వాడు ఫోన్ తీయకుండా పక్కకి పెట్టేసిన మరో నిముషంలో నా ఫోన్ మోగింది. 

అది శ్రీధర్ గాడి పక్కింటి వాళ్లేనని తెలిసి నేను మాటాడుతుంటే "శ్రీధర్ని వెంటనే కలిసి విషయం చెప్తారా? వాడి తల్లి ఆరోగ్యం విషమించింది. వాడి పోన్ మాకు అందటం లేదు" అన్నాడు ఆయన. 

 "నేను చెప్తా లెండి" అని చెప్పి శ్రీధర్ తో "ఒరేయ్ మీ ఇంటి పక్క వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. అమ్మకి అస్సలు బావులేదంట " అన్నాను. 

వాడి ముఖం లో భావాలు వెంటనే మారిపోయాయి. ఒక్కసారిగా శక్తి సన్నగిల్లి కూర్చుండిపోయాడు. ఇంతలో వాడికివ్వటం కోసం శుభ్రం చేసిన పెట్టె తీసుకుని మా అబ్బాయి వచ్చాడు. 

"ఒరేయ్. నువ్వు వెంటనే బైలు దేరితే మంచిది" అన్నాను. 

సమాధానం చెప్పని, వాడి మానసిక పరిస్థితి అర్ధం చేసుకుని "నువ్వు ప్రయాణం ఏర్పాట్లు కోసం కంగా పడకు. నేను ఈ రోజుకే బుక్ చేస్తాను. నువ్వు ఇంటికెళ్లి సామాను సద్దుకో" అన్నాను. 

"ఒక్క క్షణం. నేనొక సారి అమ్మతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. నువ్వు తొందర పడకు" అని చెప్పి మా పెద్ద పెట్టెతో ఇంటికి వెళ్ళాడు శ్రీధర్. 

వాడి తల్లితో నాకు కూడా ఉన్న బంధం వలన ఆవిడ అనారోగ్యం గురించి తెల్సి మనసు పాడయిపోయింది. 

మనం కూడా త్వరగా వెళ్ళటం అవుతుందేమో అని సుమ తో మాటాడి వాళ్ళ యాజమాన్యం తో కూడా ఇప్పటినుంచే సెలవు తీసుకోవటం కోసం మాటాడమన్నాను. ఈ పరిస్థితిలో నేను శ్రీధర్ కి తోడుగా ఉండటం అవసరమనిపించింది. 

మర్నాడు మేము టికెట్ తేదీలు మార్చుకునే ప్రయత్నంతో ఎయిర్లైన్ ఆఫీస్ కి వెళ్లి కారు పార్క్ చేస్తుంటే అక్కడే శ్రీధర్ కనిపించాడు. 

"ఏరా. ఏమైనా తేల్చుకున్నావా? మేం కూడా మా ప్రయాణం ముందుకు మార్చుకుంటున్నాం" అన్నాను.

శ్రీధర్ ఆశ్చర్యపోయి "నేను నిర్ణయం తీసుకుని చెప్తానన్నా కదురా! ఎందుకు తొందర పడి పోతున్నావు?" అన్నాడు. 

"వెళ్ళటం అయితే తప్పదు కదా!"

"నేను ఇంటికి కాల్ చేసాను. అమ్మ స్పృహలో లేదు ట. ఇప్పుడు పరిగెత్తి కెళ్లి అక్కడ ఆవిడతో మాటాడలేక ఊరికే కూర్చుని ఏం చేస్తాం ? నా టికెట్ ధర మార్చకుండా ముందు తారీకులకి మారుస్తారేమో అని ఎయిర్లైన్ వారిని అడుగుతున్నాను. నువ్వు దయచేసి కొత్త ప్లాన్ వెయ్యకు" అన్నాడు. 

ఇంకేం మాటాడలేక మేము నిశ్శబ్దంగా వచ్చేసాము. 

మరో రెండు రోజులు గడిచాక ఆగలేక మళ్ళీ వాడికి కాల్ చేసాను. 

"ఒరేయ్! అసలే అమ్మ గురించి బెంగతో నాకు బుర్ర పని చెయ్యటం లేదు. దయచేసి నన్ను వదిలేయ్ రా. ఇంకో రెండు రోజులు ఆగితే నేను బుక్ చేసుకున్న రోజుకే ప్రయాణం చెయ్యచ్చు. ఇక్కడే సెయింట్ పీటర్ బర్గ్ గుళ్లో ఆవిడ పేరు మీద అర్చన చెయ్యమని చెప్పాను. ఇక్కడ నుంచి చెయ్యగలిగింది ఇంతేగా. ఆవిడకి ఇంకా స్పృహ రాలేదు" అని ఫోన్ పెట్టేసాడు వాడు. 

మర్నాడు నాకే కాల్ వచ్చింది. అమ్మ ఇక లేదు. వికలమయిన మనసుతో వెంటనే భార్యా పిల్లల్తో వాడి ఇంటికి వెళ్లాను. 

సగం బరువు తగ్గిన మనిషిలా దీనంగా కూర్చుని ఉన్నాడు శ్రీధర్. వాడి పరిస్థితి అర్ధం చేసుకోగలను. తండ్రి చనిపోయినా కేవలం తన రెక్కల కష్టంతోనే ఇల్లు గడపాల్సిన పరిస్థితిలో కూడా ఆవిడ వాడిని చదివించింది. వాడు కొంచెం ఎదిగాక వాడిని కూడా పనిలో పెట్టి కొంచెం ఊపిరి పీల్చుకొనే అవకాశం ఉన్నా కూడా పళ్ళబిగువున పని చేస్తూ వాడిని చదివించిందావిడ. ఎవరూ కాని నన్నే ఎంతో ప్రేమగా పలకరించే అమ్మకి వాడంటే ఎంత ప్రేమ ఉంటుంది. అటువంటి అమ్మ లేదని తెలిసాక వాడెంత బాధ పడతాడో ఊహించగలను. 

"ఒరేయ్. జరిగింది చాలా దురదృష్టం. నిన్ను మరిచిపొమ్మనీ, ఈ బాధ ని తట్టుకోమనీ పిచ్చి మాటలు చెప్పను. ఈ బాధ నువ్వు పడవలసిందే. పద! మనం ఈ రోజు వెళ్ళాలి" అన్నాను. 

విచారంతో కుంగిపోయిన శ్రీధర్ నెమ్మదిగా తలెత్తాడు. 

"ఇప్పుడు వెళ్లి ఎవరితో మాటాడాలి రా. ఆవిడ వెళ్లిపోయింది" అన్నాడు కన్నీళ్లతో. 

ఒక్కసారి నిర్ఘాంతపోయి "నువ్వొక్కడివే కొడుకువు కదురా. కర్మ ఎవరు చేస్తారురా? పైగా ఆఖరు చూపుకి వెళ్ళాలి కదా!" అన్నాను. 

"మా చిన్నాన్న కొడుకు కర్మ చేస్తాడురా. నేను మాటాడాను" అన్నాడు వాడు దుఃఖాన్ని అణుచుకుంటూ. 

"........"

"అమ్మ ఆఖరు ప్రయాణం మొత్తం నాకు ఆన్లైన్ లో ఒక్క నిముషం కూడ తప్పిపోకుండా చూపించాలని విష్ణు స్టూడియో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను. నా ప్రయాణం కూడా రద్దు చేసుకుంటున్నాను. లాజికల్ గా ఆలోచిస్తే ఇప్పుడు వెళ్లటంలో ఏ మాత్రం అర్ధం లేదు" విచారంగా చెప్పాడు. 

నేను కూడా అర్ధం చేసుకున్నట్టు తలాడించాను. "నిజమేరా లాజికల్ గా ఆలోచిస్తే అదే సరైనది"

వాడిని పరామర్శించటానికి వచ్చిన వాళ్ళల్లో ఉన్న శివరాం అప్పుడే మావైపు వచ్చాడు. 

అతను ఏదో చెప్పే లోపల "శివరాం గారూ ! మీ మాటల ప్రభావంతో నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈ వారం మా కుటుంబం భారత దేశానికి వెళ్తున్నాము కదా! మళ్ళీ వెనక్కి రావటం లేదు" అన్నాను. 

శివరాం నిర్ఘాంత పోయి "అయ్యబాబోయ్ ఇంత గట్టిగా నిర్ణయించేసుకున్నారా? ఏమిటా బలమైన కారణం ?" అని అడిగాడు. 

నేను నవ్వి "చెప్పాను కదా! కారణం మీరేనండీ." అన్నాను. 

శ్రీధర్ కి జరిగిన దురదృష్టం నాకు కూడా కలిగే లోపల నేను మా అమ్మ దగ్గరే చివరివరకూ ఉండాలనీ ఈ దేశంలో వీరి మధ్య మరికొన్నాళ్ళుంటే ఎప్పడికీ ఇక్కడే ఉండిపోయే ప్రమాదం ఉందనే అవగాహన కలగటం వలన ఇప్పుడే శాశ్వతం గా స్వదేశానికి వెళ్ళిపోతున్నానని వారికి వివరించలేదు.

ఎందుకంటే వీళ్ళకి ఆ కారణం అంత "లాజికల్" గా అనిపించక పోవచ్చు. 


Rate this content
Log in

Similar telugu story from Drama