Raja Ivaturi

Drama Inspirational

4.7  

Raja Ivaturi

Drama Inspirational

నిజమైన ఆనందం

నిజమైన ఆనందం

3 mins
624


చిన్నప్పుడు మనలో చాలామంది లాగానే మేము కూడా ఒక దిగువ మధ్య తరగతికి చెందిన వాళ్ళం. ఇల్లంతా పేదరికం తాండవించేది. ఇల్లు గడవాలంటే నాన్నకి రెండు ఉద్యోగాలు చెయ్యటం తప్పని సరి. ప్రతి రోజూ పొద్దున్న మొదటి ఉద్యోగం ప్రభుత్వ కార్యాలయంలో చేసి సాయంత్రం ఒక్క పది నిముషాలు ఆరుబయట చుట్ట పీల్చుకుని మళ్ళీ వీధి చివర కిరాణా కొట్టులో లెక్కలు చూసే రెండో ఉద్యోగానికి వెళ్లి పోయేవాడు మా నాన్న. 

నేను పదవ తరగతికి వచ్చేసరికి ప్రభుత్వ పాఠశాల లో సరైన బోధన లేకపోవటంతో ట్యూషన్ తప్పని సరి అయ్యింది. మాకు లెక్కలు చెప్పవలసిన గురువు గారు ఎప్పుడూ బడికి వచ్చేవారు కాదు. అందువలన అంత వరకూ ఎలాగో కష్టపడి చదువుకున్న నాకు లెక్కల సమస్య మొదలయింది. నా తోటి విద్యార్థుల లో దాదాపు అందరూ ట్యూషన్ లో చేరి పోయారు.నేను తప్ప. 

రెండు ఉద్యోగాలు చేసి వళ్ళు హూనం చేసుకుని కూడా బొటాబొటీ గా ఇల్లు నడిపిస్తున్న నాన్న పరిస్థితి నాకు తెలుసు కనుక ఆయనకి ఈ కొత్త భారం మోపటానికి మొహమాట పడి అప్పటికే ట్యూషన్ కి వెళ్తున్న మిత్రుల సహాయం తో ఎలాగో నెట్టుకొచ్చేవాడిని. నాకు అర్ధం కాని లెక్కలు వారి సహాయంతో చేసుకునే వాడిని.

పదవతరగతి పరీక్షలలో ఫలితాలని బట్టి మా భవిషత్తు ఆధారపడి ఉన్న ఆ పరిస్థితుల్లో ఈ లెక్కల సమస్య నా ఆందోళన ని మరింత పెంచింది. ఎంత సాయం చేసినా మిత్రులకి కూడా వారి చదువు వారు చదువుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో వారి నుంచి వచ్చే సాయం అప్పుడప్పుడు సమయానికి దొరికేది కాదు.

నేను ఇలా పోరాడుతూ నాన్న తో విషయం చెప్పకపోయినా మా స్నేహితుల మధ్య రోజూ జరిగే సంభాషణలు విని ఒక రోజు నాన్న ఏమిటి విషయమని అడిగారు.

ఇప్పటికే బొటా బొటీ గా గడుపుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయ కూడదనే నియమం ఉన్ననాన్నకి (ఆ మాట కొస్తే నాన్న అడిగినా అప్పు ఇచ్చే వారెవరూ లేరు) ఇంకో పాతిక రూపాయలు ఏర్పాటు చేయటం ఏ మాత్రం సాధ్యం కాదనే విషయం నాకు తెలుసు. ఇప్పుడు నేను నా సమస్య గురించి వివరించినా తీరా ఈ విషయం తెలిసాక నాకు సాయం చేయలేక ఆయన కుమిలిపోతాడని నాలో నేనే మధనపడుతూ నెమ్మదిగా విషయం చెప్పాను.

నే వివరిస్తున్నంత సేపూ నన్ను ఒక్కసారి కూడా ఆపకుండా విషయం అంతా విన్న నాన్న ఆ తర్వాత ఆలోచిస్తూ కొంచెం సేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత ఏదో తట్టినట్టు నిండుగా నవ్వి "రేపటి నుంచి ట్యూషన్ కి వెళ్ళు" అన్నాడు.

ఇంత భారం భరించటం తనకి కుదరదనో నన్ను సద్దుకుపొమ్మనో చెప్తాడని ఊహిస్తున్న నేను నాన్న జవాబు కి ఆశ్చర్యపోయి "ఎలా నాన్నా? నెలకి పాతిక రూపాయలు ఎలా అమరుస్తావు?" అని అడిగాను. వందల్లో జీతాలొచ్చే ఆ రోజులతో ఇరవై అయిదు రూపాయలు చిన్న మొత్తం కాదు. 

నాన్న మళ్ళీ గట్టిగా నవ్వి "చిన్న పిల్లలు ఇవన్నీ అడగకూడదు. మీ గురువుగారికి డబ్బులు నెలాఖరు నుంచి ఇస్తానని చెప్పు" అన్నాడు. మా గురువు గారు మంచి వారు కనుక నెలాఖరు ఏర్పాటుకి ఆయన వెంటనే వప్పుకున్నారు.

కానీ నా అనుమానం అలాగే ఉండిపోయింది. 'అప్పు చేస్తావా? చేసినా నెలనెలా ఇంత డబ్బు అప్పు ఎవరు ఇస్తారు?' అని నేనడిగినప్పుడల్లా నాన్న చిరునవ్వే సమాధానమయ్యింది.

కొన్ని రోజుల తర్వాత సమాధానం నాకే దొరికింది.

ప్రతిరోజూ సాయంత్రం మొదటి ఉద్యోగం నుంచి వచ్చాక నాన్న రోడ్డు మీదున్న మా చిన్న ఇంటి బైట తుప్పు పట్టిన ఇనప కుర్చీలో కూర్చుని ఎంతో విశ్రాంతిగా ఒక చుట్ట కాల్చేవాడు. దాదాపు పది నిముషాలు ఆ చుట్టని ఆస్వాదిస్తూ తాగాక  రెండో ఉద్యోగానికి వెళ్ళేవాడు. ఆ దృశ్యం నాకు గత నెల రోజులనుంచీ కనబడటం లేదనీ నాన్న తన జీవితమనే సంకుల సమరంలో ప్రతిరోజూ తనకంటూ కేటాయించుకున్న ఆ పది నిముషాలలో కొంతయినా ఉపశమనం కలిగించే ఆ చుట్ట ఈ మధ్య మాయమయ్యిందనీ నేను నాన్నకి కలిగించిన అదనపు బరువుని భరించటానికి, ఆయన మానుకున్న ఆ అలవాటు  ఉపయోగపడిందనీ తెలిసింది.

అప్పుడే నిర్ణయించుకున్నాను. చాలా మంది నడిచే బాటలో పదవ తరగతి తర్వాత ఇంటర్ లో చేరటానికి బదులుగా నేను పాలిటెక్నిక్ కళాశాలలో చేరిపోయాను. మా చదువుల గురించి తెలియని నాన్న అది కూడా మంచిదే అనుకున్నాడు. మూడేళ్లు దీక్షగా చదివి చదువు పూర్తవుతూ ఉండ గానే ఉద్యోగం తెచ్చుకున్నాను.

నా మొట్ట మొదటి జీతంతో నాన్నకిష్టమైన చుట్టల పొట్లాలతో పాటు మంచి పడక కుర్చీ కొని ఇంటికి తీసుకెళ్ళాను. నాన్నని నేనే ఇంటి బైటికి తీసువచ్చి ఆ కుర్చీలో కూర్చో బెట్టి చుట్టలూ అగ్గిపెట్టె చేతికిచ్చి నాకు ఉద్యోగం వచ్చిందని చెప్తూ ఆయన పాదాలకి నమస్కారం చేసాను. 

ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ చూస్తున్న నాన్నతో "నాన్నా! ఈ రోజు నుంచి నీ రెండో ఉద్యోగం మానేసి సాయంత్రాలు హాయిగా విశ్రాంతి తీసుకో. భగవంతుడి దయ వలన నాకు ఉద్యోగం దొరికింది. ఇంకొన్ని నెలలలో మీరు అసలు ఉద్యోగమే మానెయ్యచ్చు" అన్నాను. 

జరిగిన విషయమంతా మళ్ళీ మళ్ళీ నా దగ్గరనుంచి విని కొడుకు ప్రయోజకుడయ్యాడనే చెప్పలేని సంతోషంతో కించిత్తు గర్వంతో నాన్న ఆరోజు గడిపిన ఆ సాయంత్రం నేనెప్పటికీ మరిచిపోలేను. ఆ తర్వాత ఎన్నో అటువంటి సాయంత్రాలు నా జీవితంలో ఎంతో మధురమైన అనుభూతిగా ఇప్పటికీ ఉన్నాయి.

ఆ తర్వాత నేను ఉద్యోగం చేస్తూనే నాయజమాన్యం అనుమతితో వారి సహకారంతో ఇంజనీరింగ్ చదివి పట్టభద్రుడినయ్యాను. నా ఉద్యోగం లో ఎంతో ఉన్నతమైన స్థాయికి చేరాను. ఎన్నో పురస్కారాలు పొందాను. 

కానీ తలి దండ్రుల ముఖాలలో వెలుగు నింపినప్పటి ఆనందానికి ఇవేవీ సాటి లేనివి.


Rate this content
Log in

Similar telugu story from Drama