Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

Raja Ivaturi

Comedy Romance Inspirational

4  

Raja Ivaturi

Comedy Romance Inspirational

అద్భుత కాపురం

అద్భుత కాపురం

4 mins
362


అద్భుత కాపురం

"సుమా! ఇవి ఆవాలా మెంతులా?" అంటూ వంటింట్లోంచి గదిలోకి వచ్చాడు శివాజీ. ముందు గదిలో సుమా స్నేహితురాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు.

"అబ్బా ఎన్ని సార్లు చెప్పినా నీ బుర్రలోకి వెళ్ళదు కదా! ఇవి మిరియాలు! ఇంకా నయం. వాడే ముందే అడిగావు" అంటూ అతనితో బాటు వంటింట్లోకి వెళ్లి ఆవాలు చూపించి వచ్చింది సుమ.

ఆమె స్నేహితులంతా ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. 

వాళ్ళ నవ్వు నడుస్తుండగానే శివాజీ మళ్ళీ వచ్చి అందరికీ కాఫీలు అందించాడు. 

అతను వెంటనే వస్తాడని ఊహించని మిత్రులు ఉలిక్కిపడి ఏమీ జరగనట్టు కాఫీలు అందుకున్నారు. 

శివాజీ "అద్భుత కాఫీలు తాగండి" అని వినయంగా లోపలికి వెళ్తుంటే "నీకెప్పటికి తెలుస్తుంది? అద్భుతమైన కాఫీ అనాలి" అంది సుమ. శివాజీ అపరాధభావంతో నాలుక కరుచుకుని వంటింటి లోకి వెళ్ళాడు. 

"మీ వారు కాఫీ సూపర్ గా చేస్తారే. అనకూడదు గానీ మీ ఇంటికి వచ్చినప్పుడల్లా కాఫీ ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తాం" అంది రోషిణి. 

"నా నెత్తి! మిరియాలు చూపించి ఇవి ఆవాలా అంటాడు. సెనగపప్పుకీ కందిపప్పుకూ తేడా తెలియదు. ఒక్క పని రాదు. ఏదో దగ్గరుండి చెప్పి చేయించుకుంటున్నాను" అంది సుమ. 

"అసలా శ్రమ మాత్రం ఎందుకు పడాలి? ఇన్నాళ్ళయ్యాకా నేర్చుకోలేడా? ప్రతి పనికీ మళ్ళీ నువ్వు వెనక వెనక వెళ్లి వివరించటం మానెయ్" అంది కనకదుర్గ. 

"అసలు ఇది లేకపోతే అతను లేనేలేడే. ఏ పనైనా ఇదే తలుచుకోవాలి. అతను ముద్ద పప్పు లా ఓ పక్కన నుంచుంటాడు" అంది లలిత. 

"సరేలే. అసలు కబుర్లు ఆపి ఈ గొడవ ఏమిటి?" అంది శారద. 

ఇంతలో శివాజీ మళ్ళీ వచ్చి "వంట ఇప్పుడే అయ్యిందండీ. సరిగ్గా పన్నెండున్నర కి అనుకున్నాను. అనుకున్నట్టే పూర్తయ్యింది." అని తన గడియారం చూసి నవ్వుతూ చెప్పాడు. 

"గొప్పే లే. ఇక నువ్వు గదిలోకి వెళ్ళు. మేము ప్రశాంతంగా వడ్డించుకుంటాం" అంది సుమ. 

శివాజీ మౌనంగా వెళ్లిపోతుంటే "అన్నయ్యా నీది చాలా మేలిరకం గడియారం లా ఉంది. ఎంతకి కొన్నావు ?" అంది శారద. 

"సుమ కే తెలుసండి. అన్నీ తనే కొంటుంది" అని చెప్పి శివాజీ వెళ్ళిపోయాడు. 

శివాజీ పూర్తిగా గదిలోకి వెళ్లేవరకూ ఆగి "నిజంగా మొద్దావతారమేనే. అన్నీ నువ్వే కొంటావని ఎంత సిగ్గు లేకుండా చెప్తున్నాడో! ఈయన గారి లోదుస్తులు కూడా నువ్వే కొంటావా?" అంది లలిత . 

"అతనికేమీ తెలియవు గా. ఆ పనీ నాదే." అంది సుమ నిస్పృహతో కొంత గర్వంతో.

"పెళ్ళైన కొత్తలోనే హైదరాబాద్ లో ఎవరింటికో వెళ్ళాం. ఇతను వాళ్ళ ఇల్లు గుర్తుపట్టలేక మేము తిరిగి తిరిగి వెళ్లేసరికి కార్యక్రమం పూర్తయ్యింది. అప్పుడే అర్ధమయింది నా భవిష్యత్తు ఎలా ఉండబోతోందో" అంది మళ్ళీ. 

"నీకు మళ్ళీ చెప్తున్నాను. ఇటువంటి అసమర్దుడిని భరిస్తూ బతకక్కరలేదు. నాలుగు రోజులు అతన్ని ఇంట్లో వదిలేసి మా దగ్గరికి వచ్చెయ్. అప్పుడు తెలుస్తుంది మనిషి కి" అంది కనకదుర్గ కసిగా. 

"చాల్లేండర్రా. మనకి మంచి కాఫీ ఇచ్చాడు. ఘుమఘుమలాడే వంట చేసాడు. మనమిలా హాయిగా గడుపుకునేలా అన్నీ ఏర్పాటు చేసాడు. మనకు అది చాలు కదా!" అని సద్దేసింది శారద. 

అందరూ మళ్ళీ కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. సాయంత్రం పకోడీలు కూడా వారి దగ్గరికే వేడి వేడిగా వచ్చాయి. పకోడీలు అద్భుతం గా వచ్చాయి గానీ అంతకుముందు ఎప్పటిలాగే సెనగ పిండి ఎలా ఉంటుందో శివాజీకి చూపించటానికి ఒక సారీ ఉల్లిపాయలు చిన్నకత్తితో ఎలా కోయాలో చెప్పటానికి ఒక సారీ సుమ వంటింట్లోకి వెళ్ళవలసి వచ్చింది. 

కనక దుర్గ, లలిత జాలిగా చూడటం తప్ప ఏమీ మాటాడలేదు. 

ఏడు గంటలకి అందరూ సెలవు తీసుకుంటుంటే "సుమా! మా చెల్లెలి పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి." అంది శిల్ప .

"వస్తాం లేవే. శివాజీ కి కుదురుతుందో లేదో కనుక్కుని ...." అని సుమ అంటుంటే దుర్గ అందుకుని "నీకెప్పుడు బుద్దొస్తుందే! అతనికి కుదిరేదేమిటి? రెండ్రోజులు తనని సద్దుకోమని చెప్పి బయలుదేరు." అంది కోపంగా. 

"లేదు లేదు. నేను వదిలేస్తే ఇల్లంతా అస్తవ్యస్తం అవుతుంది. ఏమీ చెయ్యలేక తిండి మానేసి కూర్చుంటాడు. అయినా రమేష్ (శిల్ప భర్త) తనకి కూడా బాల్య మిత్రుడే కదా! ఖచ్చితంగా పెళ్ళికి వచ్చేలా వీలు చేసుకుంటాడులే" అని సుమ చెప్పింది. 

అందరూ నిష్క్రమించారు. 

***

"అద్భుత పెళ్లి" అన్నాడు శివాజీ.

సెలవులో ఉన్నాడు కనుక మంచి ఉత్సాహంగా ఉన్నాడు. ఆపకుండా అతను వదులుతున్న చమత్కారాలు విని మిత్రులంతా నవ్వుతున్నారు. 

"అద్భుత పెళ్లి కాదు. అద్భుతమైన పెళ్లి అనాలి" అంది అక్కడే ఉన్న సుమ శివాజీ డొక్కలో పొడుస్తూ. శివాజీ ఉలిక్కిపడి తప్పు చేస్తూ దొరికిపోయిన చిన్న పిల్లాడిలా తల దించుకున్నాడు. 

అతని మిత్రులంతా ఈ వైఖరిని చిత్రంగా చూస్తుంటే "రాత్రంతా ఎటు పోయినా ముహూర్తం టైం కి మాత్రం ఎక్కడో అయోమయంగా కూర్చోకుండా ఒక గంట ముందే మంటపం దగ్గరకి వచ్చి అక్కడే పెళ్లయ్యేదాకా ఉండు" అని ఆజ్ఞ ఇచ్చి తన పట్టుచీర రెపరెపలాడించుకుంటూ సుమ వెళ్ళింది. 

స్ఫూర్తి ఇక ఉండబట్టలేక "ఒరేయ్ ఏమిట్రా నీ పరిస్థితి? ఇంట్లో కూడా ఇలాగేనా ?" అన్నాడు. 

శివాజీ నవ్వేసి "ఇక్కడే ఇలా ఉంటే ఇంట్లో ఇంకోలా ఎలా ఉంటుంది?" అన్నాడు.

"ఎలా భరిస్తున్నావు రా"

"భరించటమేమిటి? అలవాటయిపోయింది" భళ్ళుమని నవ్వేసాడు శివాజీ. మిగతావారు కూడా నవ్వారు. 

"ఒరేయ్ నువ్వేమీ పనికిమాలిన వాడివి కాదు కదా! గొప్ప శాస్త్రవేత్తవి. ఎన్నో గొప్ప గొప్ప పురస్కారాలు అందుకున్నావు. తరచుగా నీ అద్భుతమైన పరిశోధనల గురించి టీవీ లో వార్తలు కూడా వస్తుంటాయి. అయినా నిన్నలా దద్దమ్మ లా చూస్తుందేమిటి నీ ధర్మ పత్ని ?"

"ఒరేయ్ ఇంటి దగ్గరకొస్తే ఐనిస్టయిన్ అయినా అప్పారావయినా ఒకటే పరిస్థితి. ఆ విషయం పక్కన పెట్టి ఇక్కడనుంచి నిశ్శబ్డంగా పదండి. తెల్లవారు ఝామున కదా ముహూర్తం. ఈ లోపల మన గదిలోకి పోయి పూజా కార్యక్రమం మొదలెడదాం" అన్నాడు శివాజీ. 

"మరి ఇందుకు మీ ఇంటి యజమాని వప్పుకుంటుందా?" వెటకారంగా అన్నాడు చలం. 

"ఆవిడకి తెలియాలి కదా!అయినా పరోక్షంగా ఎటుపోయినా పరవాలేదని చెప్పిందిగా! పొద్దున్న మూడు గంటలకల్లా మంచి పేస్ట్ తో పళ్ళు తోముకుని కొత్త బట్టలతో మంటపం దగ్గరికి వెళ్తాం" అన్నాడు రమేష్. 

అందరూ నవ్వుతూ రమేష్ ధర్మమా అని వారికి కేటాయించిన ప్రత్యేకమైన గదికి వెళ్లారు. అక్కడున్న వారందరూ పెట్టమారి మొగుళ్లే గానీ చలం ఒక్కడే ఇంట్లో పైచేయి గా ఉంటున్నాడని పేరు. ఎంతవరకూ నిజమో వాడికీ దేవుడికీ తప్ప తెలియదు. 

వాడి భార్య శారద వీళ్ళకి "పూజ" సామాను తో పాటు కొన్ని వంటకాలు (బజ్జీలు, పకోడీలు లాంటివి) వండి పెట్టటానికి వచ్చింది. 

శివాజీ లేచి "చెల్లెమ్మా. నేను ఆడుతూ పాడుతూ వండేస్తానులే గానీ మీరు పెళ్లి కూతురు దగ్గరే ఉండండి. మా కార్యక్రమం విషయం మాత్రం జాగ్రత్తగా దాచండి" అన్నాడు. 

శారద నవ్వుతూ "సరే అన్నయ్యా. నువ్వు వండేస్తానంటే సరే గానీ నువ్వు ఎప్పటిలా ఒకదానికొకటి పొరబడకుండా ఇదిగో ఈ వస్తువులు ఒక్కొక్కటీ ఏమిటో రాసి పెడతాను" అని చూపించబోయింది.

ఆమెని వారిస్తూ "చెల్లెమ్మా. మాములుగా అయితే పర్లేదు గానీ ఇప్పడు అట్టే సమయం లేదు. నేను ఇవన్నీ చూసుకుంటానులే" అన్నాడు శివాజీ. 

"కానీ వంట చేసేటపుడు ఏది ఏమిటో తెలియక కొంచెం తికమకపడుతుంటావు కదా అని ....."

"అదేమీ లేదండీ. ఇది సెనగపిండి. ఇవి ఆవాలు. ఇది వాము, ఇది చింతపండు గుజ్జు. ఇది వంట సోడా.. వంట సోడాని బజ్జీలలో ఎక్కువ వెయ్యకూడదు ....." అని శివాజీ ఒక్కొక్క వస్తువు పేరూ చెప్పుకుపోతుంటే శారద నోరు తెరుచుకుని చూస్తోంది. 

వెంటనే తను చేస్తున్న తప్పు అర్ధమయ్యి నాలుక కరుచుకున్న శివాజీ "చెల్లెమ్మా! ఇదంతా ఎక్కడా అనకు. నా కాపురం కూలిపోతుంది" అన్నాడు. 

మొత్తం అర్ధమయిపోయింది అన్నట్టు తల ఊపి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ శారద అక్కడనుంచి వెళ్ళిపోయింది. 

పార్టీ రంజుగా జరిగిపోయింది.

ఆ తర్వాత "అద్భుత పెళ్లి" కూడా ఘనంగా జరిగిపోయింది.

*** కథలో నిగూఢంగా ధ్వనించే విషయం ప్రత్యేకంగా వివరించటం అవసరం లేదని నాకుఅనిపించినా కొంత మంది చదువరుల అభిప్రాయాలననుసరించి కథ కి కొంచెం వివరణ ఇస్తున్నాను. భార్యా భర్తల మధ్య అవగాహన పెంచుకునే ప్రక్రియలో కొన్ని అజ్ఞానపు పనులు తోటివారికి సంతోషం కలిగించేటపుడు పదేపదే ఆ తప్పులు కావాలనే చేసి వారిని సంతోషపెట్టడం వివాహ బంధాన్ని బలపరుచుకోవటంలో సాయం చేస్తుంది. శివాజీ చేసిన పని అదే. ఇది నేను స్వయంగా చూసిన కొన్ని అనుభవాల సారాంశం. గతంలో ఇంచుమించు గా ఇటువంటి కథలు కొన్ని వచ్చాయి. అంతా నా భార్య ఇష్టమేనండి అంటూ భార్య చేత గయ్యాళి పనులు చేయించిన భర్త కథ (ఇంద్రగంటి జానకి బాల గారి కథ ), భర్త నెమ్మదితనాన్ని గొప్పతనంగా చూపించి నెగ్గుకొచ్చిన ధనలక్ష్మి కథ (కవన శర్మ గారి ధనలక్ష్మి ), అదే ధోరణిలో ఇంటిని నడిపించిన రాణి (నేనే వ్రాసిన మరో కథ ఆడది అబలా ?) కథలు స్త్రీల వైపు నుంచి ఇదే అంశంలో వచ్చిన కొన్ని కథలు. ఈ సారి సరదా గా పురుషుల వైపు నుంచి ఈ కథ వ్రాసాను. 


Rate this content
Log in

More telugu story from Raja Ivaturi

Similar telugu story from Comedy