శుంఠకాయలు!(కధ)
శుంఠకాయలు!(కధ)
సాహిత్యంలో రెండు బిరుదులు 'సాహిత్య ప్రపూర్ణ','కవితా శిరోమణి' లను తెచ్చుకుని,తెలుగు పాఠాలు చెప్పుకుంటూ, నాలుగు సభలు,నాలుగు కవితల్తో వర్ధిల్లుతున్నాడు చిదానందం
కొడుకు కైలాశం చదువు పూర్తయ్యి,ఉద్యోగం లేక రాక ఖాళీగా తిరుగుతున్నాడు.కథలు, కవితలు రాసి పత్రికలు వేయకపోతే,ఆన్లైన్ పత్రికల్లో ముద్రిస్తాడు.
తరుచూ తండ్రీ కొడుకులు గొడవలు పడ్తుంటారు. ఆరోజు కూడా౼
"నా టాలెంట్ని కావాలనే బాలేదంటున్నావ్"చిరాగ్గా ముఖం పెట్టి అన్నాడు కైలాశం.
"నేర్చుకుని చావు ముందు,తర్వాత అఘోరిద్దువు గాని"చిదానందం అన్నాడు.
"బిరుదుల్ని చూసే నీకు ఇదంతా,తల్చుకుంటే ఎవరికైనా వస్తాయ్!'మాటల్తో ఎగురుతున్నాడు కైలాశం.
"అంత తెలివుంటే ఇంకేం!చూపించవోయ్"గట్టిగా కసిరాడు చిదానందం.
ఈ గొడవకి ఇంట్లో సామాన్లు అటూ ఇటూ పెడ్తూ,పెద్ద శబ్దాలు చేస్తూ"చూద్దాం అయితే!"అన్నాడు కైలాశం.
ఇద్దరికీ పడదు,పచ్చ గడ్డివేస్తే భగ్గుమంటుంది. రోజూ మాటల యుద్ధంలో ఎవరూ గెలవలేక,ఒకళ్ళు బైటకి వెళ్ళిపోతుంటారు.
కైలాశం సాహిత్యంలోకి అన్ని వస్తువుల్ని చొప్పించేసి, ర
ోజూ శ్రోతల్ని వెతుక్కుంటాడు.
ఓరోజు ఊర్లో జరుగుతున్న సాహిత్య సభకు చిదానందం ని కూడా ఆహ్వానించారు.సభ గొప్పగా ఏర్పాటైంది.కైలాశం కవిత్వం గురించి,అతని బిరుదుల గురించి సభలో గొప్పగా చెప్తున్నారు.
సభలోకి ప్రవేశించిన చిదానందం క్షణకాలం స్తబ్దుగా అయిపోయి,ఆశ్చర్యపోయాడు.కైలాశంకి సన్మానం,ఇక్కడికి వచ్చేవరకూ తనకి తెలీకుండా మేనేజ్ చేశాడని అర్ధమైంది.బిరుదులు వీడికి సాధ్యమయ్యే పని కాదది.కొంతసేపయ్యాక తేరుకుని,గబగబా వేదిక పైకి దారి తీశాడు. ఆయన్ని పైకి వెళ్ళనిచ్చారు.
ఆయన పైకెళ్లి మైకు తీసుకుని, వీడు నా కొడుకే అయినా, కవిత్వం రాయడం రాదు,ఈ బిరుదులు బోగస్"అన్నాడు కోపంగా.
"ఓస్!నువ్వు కొన్న దగ్గరే నేనూ కొన్నాను.నావి బోగస్ అయితే,నీవి బోగస్ కాదేటి!"కైలాశం అన్నాడు.
సభంతా ఘొల్లుమని నవ్వింది!
విద్వేషంతో ఒకళ్ళది ఒకళ్ళు చెప్పుకుని ఇద్దరూ జీరోకి వచ్చేశారు.