STORYMIRROR

Gayatri Tokachichu

Comedy

4  

Gayatri Tokachichu

Comedy

తారుమారు(హాస్యకథ )

తారుమారు(హాస్యకథ )

2 mins
363


"ఇప్పటికి అరడజను సంబంధాలు వెనక్కు వెళ్లి పోయాయి'. మీ వాడికి పెళ్లెప్పుడూ?'అని అడిగే వాళ్లకు జవాబు చెప్పలేక ఛస్తున్నా!ఈ సారయినా అమ్మాయికి నచ్చేట్లుగా మాట్లాడు. కాస్త వినయంగా ఆ అమ్మాయి అడిగిన వాటికి జవాబులు చెప్పు. పోయిన సారి' మీ జీతమెంత?'అంటే నీళ్లు నమిలావట!ఈ సారి కాస్త ముందుగానే ప్రిపేరు అవ్వు!"


తల్లి మాటలకు అసలే కంగారుగా ఉన్న ఉపేంద్రకు ఇంకా కంగారెక్కువయింది.

అసలే రోజులు మారిపోతున్నాయి.మగపిల్లలకు అంత సులభంగా పెళ్లిళ్ళు కావటం లేదు. ఆడపిల్లలు ఉద్యోగాల్లో, సంపాదనలో మగవాళ్ళతో పోటాపోటీగా ముందుకు దూసుకుపోతున్నారు. వాళ్ళ కుండే కోరికల జాబితా చూస్తే మగవాళ్ళకు తలతిరిగి పోతుంది. ఇంతకు ముందులా ఆడపిల్లలు తలవంచుకొని కూర్చోవటం లేదు.


వరుడి అలవాట్లేమిటి? బ్యాంకు బాలెన్స్ ఎంత? ఏమన్నా ఆస్తులు కొన్నాడా? ఫ్రెండ్స్ ఎలా వుంటారు? ఇంటి పనులు చకచకా చేయగలడా? వంట ఎలా చేస్తాడు? ఇత్యాది విషయాలు మాట్లాడుతున్నారు. పెళ్లయ్యాక ఏ మాత్రం తేడా వచ్చినా విడాకుల మంత్రం ఉండనే వుంది.


ఉపేంద్రను అరడజను మంది అమ్మాయిలు వద్దన్నారు. ఇది ఏడో సంబంధం.

ఉపేంద్ర తండ్రి రమేష్ ఇంజనీరు. తల్లి సరళ గృహిణి. వారికి ఉపేంద్ర ఒక్కడే కొడుకు.

కొడుక్కు సంబంధాలు వచ్చినట్లే వచ్చి పోతున్నాయి. దాంతో ఉపేంద్ర పెళ్లి గురించి తల్లి తండ్రుల కిద్దరికీ బెంగ పట్టుకొంది.



పెళ్లి చూపుల రోజు రానే వచ్చింది. ఈ మధ్య కొద్దిగా బట్టతల వస్తోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కాబట్టి కొంచెం బొజ్జపెరిగింది. అయినా పెళ్లి కోసం కష్టపడి రోజూ వాకింగ్, యోగా చేసి కాస్త తగ్గించినా కొంచెం నడివయసు వాళ్ళ లాగానే వుంది రూపం.


అనుకున్న టైమ్ కి అమ్మాయి వైపు వాళ్ళు వరుడి ఇంటికి వచ్చారు. మర్యాదలు కుశల ప్రశ్నలు అయ్యాక అమ్మాయిని,అబ్బాయిని విడిగా మాట్లాడుకోమన్నారు పెద్ద వాళ్ళు.


అమ్మాయి పేరు రష్మి. చూడ్డానికి బాగానే వుంది. కొద్దిగా బొద్దుగా వున్నాకూడా ఆకర్షణీయంగా వుంది. ముదురు నీలం రంగు పంజాబీ డ్రెస్ వేసుకుంది కాబట్టి లావు కనిపించటం లేదు.

ఉద్యోగం, జీతం, అలవాట్లు, హాబీల గురించి మాట్లాడుకొన్నారు. ఇంటర్వూ కాస్త బాగానే అయినట్లనిపించింది ఉపేంద్రకు. అమ్మాయి మొహం చూస్తే కాస్త తృప్తిగా ఉందేమో అనిపించింది.


తిరిగి ఇంటికి వచ్చారు. అమ్మాయికి పెట్టే నగలు, చీరల లిస్ట్ పెళ్లి వాళ్లకు పంపించాడు రమేష్. మొత్తానికి ఈ పెళ్లి సంబంధం కుదురుతుందని నమ్మకంగా వుంది సరళకు. ఆమె వెయ్యి దేవుళ్ళకు మొక్కుకుంటున్నది.


రెండు రోజుల తర్వాత ఆడపెళ్లి వాళ్ళ వైపు నుండి ఫోన్ వచ్చింది రమేష్ కు.


"అన్నీ తమకు నచ్చాయని, పెళ్లి కొడుకు విషయంలో ఎటువంటి అసంతృప్తి లేదనీ,కన్యాశుల్కం అవసరం లేదని,అయితే అబ్బాయిని పెళ్లయ్యాక అత్తగారింటికి పంపేటప్పుడు సారె మాత్రం ఘనంగా పెట్టాలని లేకపోతే తమకు బంధువుల్లో అవమానంగా ఉంటుందని, అబ్బాయి ఇంటి పేరు వెంటనే మార్చుకునే ఏర్పాట్లు చేసుకోవాలని లేకపోతే అమ్మాయితో పాటు విదేశాలకు వెళ్లాలంటే ప్రాబ్లం వస్తుందని. మంచి రోజు చూచి ముహూర్తం పెట్టుకుందామని."


విషయం వినగానే ఎగిరి గంతేశారు రమేష్, సరళ.

ఉపేంద్రను అభినందించారు.


"ఒరేయ్!పెళ్లయ్యాక కాస్త వినయ విధేయలతో జాగ్రత్తగా మసలుకో!మన ఇంటికి మంచి పేరు తేవాలి. ఫలానా వాళ్ళ అబ్బాయి మంచి వాడు అని. ఏదో మా భారం తీరిపొతే కృష్ణా రామా అని ఒక మూల పడిఉంటాము."


తల్లి మాటలకు బుద్దిగా తలూపాడు ఉపేంద్ర.


కాలం మారింది మరి!


******************************


Rate this content
Log in

Similar telugu story from Comedy